ఏపీలో కరోనా శరవేగం.. 

ఏపీలో కరోనా వేగం పెరుగుతుంది. కరోనా తీవ్రత రోజురోజుకూ ఉధృతంగా మారుతోంది. గతంలో పది వేలకు పైగా కేసులు వెలుగుచూడగా, సెకండ్ వేవ్‌లో 20 వేలకు పైగా కొత్త కేసులు రోజువారీగా నమోదవు తున్నాయి. దీనికి తోడు ప్రతీరోజు మరణాలు కూడా హాఫ్ సెంచరీ దాటుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం నెహ్రూనగర్‌లో తీవ్ర విషాదం నెలకొంది. కేవలం 10 రోజుల్లో 18 మంది మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది.

మృతులంతా వాంతులు, వీరేచనాలు, గుండెపోటు వంటి లక్షణాలతో మరణించినట్లు సమాచారం. ఈ మరణాలకు కరోనా కారణమా, కలుషిత నీరు కారణమా అనే అనుమానాలు కలుగుతున్నాయి. వరుస మరణాలకు గల కారణాలంటే తేల్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రతిఒక్కరూ కరోనా టెస్టు చేయించుకోవాలని సర్పంచ్ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు.

జగన్ పై సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి మండిపడ్డారు..  

ఏపీలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులతో పాటు, మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లాలోని కదిరిలో 24 గంటల్లో కరోనాతో 8 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క కదిరి ప్రాంతంలో 24 గంటల్లోనే ఇంత మంది మరణించడం చాలా బాధాకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు  రామకృష్ణ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇందులో పలు అంశాలను ప్రస్తావించడంతో పాటు.. ప్రభుత్వంపై ప్రశ్నలు, విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆక్సిజన్ అందక రోగులు మరణిస్తున్నా.. సీఎం జగన్ మోహన్ రెడ్డికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్రమంతటా మృత్యు ఘంటికలు మోగుతున్నా.. జగన్ ప్రభుత్వం అత్యంత కర్కశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu