అబ్రహం లింకన్ వ్యక్తిత్వాన్ని తెలిపే అద్భుత సంఘటన..

అబ్రహామ్ లింకన్ అమెరికా అధ్యక్షునిగా ఎన్నిక కాగానే అమెరికాలోని కోటీశ్వరులు, ప్రముఖులు, అతిగౌరవనీయ కుటుంబాలకు చెందిన వేల మంది లోలోన అతలాకుతలమై పోయారు. ఎందుకంటే లింకన్ తండ్రి వడ్రంగి పనితో పాటు చెప్పులు కుట్టి జీవించాడు. అలాంటి హీనమైన వృత్తి చేసినవాడి కొడుకు తమ దేశానికి అధ్యక్షుడా! అతని హయాంలో తాము జీవించాలా! అది తమకు తలవంపులు అన్నది వారి బాధ.


అమెరికా 'సెనేట్'లో అందరూ ప్రముఖ వ్యాపారవేత్తలూ, అత్యంత ధనవంతులూనూ! లింకన్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత, సెనేట్ను ఉద్దేశించి తన తొలి ఉపన్యాసాన్ని ప్రారంభించాడు. ప్రసంగం ప్రారంభమైన కొద్దిసేపటికి, ఎంతో గర్విష్టి అయిన ఓ కోటీశ్వరుడు లేచి, తన బూట్లను అందరికీ కనిపించే విధంగా చేతితో పట్టుకుని, వాటిని గాలిలో ఊపుతూ, బిగ్గరగా అరుస్తూ లింకన్ ప్రసంగానికి అడ్డు తగిలాడు. "మిస్టర్ లింకన్! నువ్వేదో అనుకోకుండా అధ్యక్షుడవయ్యావు గానీ, నీ తండ్రి చెప్పులు కుట్టేవాడు. ఆ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకు! మీ నాన్న మా కుటుంబంలో ప్రతి ఒక్కరికీ చెప్పులూ, బూట్లు కుట్టేవాడనేది వాస్తవం! ఇదిగో! నేనిప్పుడు చూపిస్తున్న బూట్లు ఒకప్పుడు మీ నాన్న కుట్టినవే!" అని అరిచాడు అతడు.


అతడి మాటలు విని సెనేట్లో ఉన్న వారంతా ఘల్లున నవ్వారు. అలా నవ్వడం ద్వారా తాము కూడా ఆ కోటిశ్వరుడితో పాటు లింకన్ ను దారుణంగా అవమానించగలిగామని సంతోషించారు.


లింకన్ కొన్ని క్షణాలు తన ప్రసంగాన్ని ఆపి, మౌనంగా నిలబడి పోయాడు. అతని కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. భావోద్వేగాన్ని అణచుకుని, ప్రశాంత స్వరంలో తన ఉపన్యాసాన్ని ఇలా పునఃప్రారంభించాడు:


"ఈ సమయంలో నా తండ్రిని నాకు జ్ఞాపకం తెచ్చినందుకు మీకు నేనెంతైనా కృతజ్ఞుణ్ణి. నా తండ్రి చెప్పులు కుట్టడంలో చాలా నేర్పరి. ఏ రంగంలో చూపించినా ప్రతిభ అనేది గొప్పదే. నేను అధ్యక్షుడిగా, నా తండ్రి తన వృత్తిలో చూపించినంతటి ప్రతిభను చూపించడానికి ప్రయత్నిస్తాను!" అన్నాడు.


ఒక్క క్షణం ఆగి, తన గంభీర స్వరంతో, "ఇంతకు ముందు ఈ పెద్ద మనిషి చెప్పినట్లే మా తండ్రి వారి కుటుంబంలోని అందరికీ చెప్పులు కుట్టాడు. వీళ్ళ కుటుంబంలో వాళ్ళకే కాదు ఇంకా చాలామంది శ్రీమంతుల కుటుంబాలలోని వాళ్ళకు పాదరక్షలు కుట్టాడు. మా నాన్న చెప్పులు కుట్టడం లోని నేర్పును తన వారసత్వంగా నాకు కూడా కొంత ప్రసాదించాడు. ఆయన కుట్టిన చెప్పులు మీకు సరిగ్గా సరిపోక పోయినా, బిగుతుగా ఉన్నా, మీ కాళ్ళకు నొప్పి కలిగిస్తున్నా. నాకు ఇవ్వండి. నేను వాటన్నింటినీ చక్కగా సరిచేసి మళ్ళీ మీకు ఇస్తాను. నేను ఆ తండ్రి కొడుకును. ఇప్పుడే కాదు, ఎప్పుడూ చెప్పులు కుట్టడానికి సిగ్గుపడను" అంటూ ముగించాడు.


సభ అంతా నిశ్శబ్దంతో నిండి పోయింది. అంతా నిశ్చేష్ఠులయ్యారు. లింకన్ లాంటి మేరునగధీరుణ్ణి అవమానించడం అతి కష్టమని సెనేటర్లందరికీ అప్పటికి అర్ధం. అయింది.


                                           *నిశ్శబ్ద.

Related Segment News