అబ్దుల్ కలామ్ ఆశయానికి బీజం వేసిన ఉపాధ్యాయుడు.. సంఘటన ఇవే..
posted on Oct 28, 2023 2:03PM
రామేశ్వరం పాఠశాలలో అబ్దుల్ కలామ్ అయిదో తరగతి చదువుతున్నప్పుడు శ్రీశివసుబ్రహ్మణ్య అయ్యర్ ఉపాధ్యాయుడిగా పాఠాలు చెప్పేవారు. తన దగ్గర చదువుకునే విద్యార్థులను అమితంగా ప్రేమించే ఉపాధ్యాయుల్లో ఆయన ఒకరు. ఆయన ఒక రోజు పక్షులు ఎలా ఎగురుతాయో తరగతి విద్యార్థులకు పాఠం చెప్పారు. నల్లబల్ల మీద ఒక పక్షి బొమ్మ గీసి దాని తల, తోక, రెక్కలు, శరీర నిర్మాణాన్ని వివరంగా చిత్రించారు. పక్షులు తమ రెక్కల్ని అల్లార్చడం ద్వారా ఎలా ఎగరగలుగుతాయో, ఆ ప్రయత్నంలో తమ తోక ద్వారా ఎలా దిశలు మార్చుకోగలుగుతాయో చూపించారు. దాదాపు అరగంట పాటు విహంగాల విహారం గురించి చక్కగా వివరించారు. పాఠం ముగించాక అర్థమైందా? అని అందరినీ అడిగారు. అబ్దుల్ కలామ్ ఎలాంటి సంకోచం లేకుండా నాకు అర్థం కాలేదని అన్నారు. ఆ మాటే చాలామంది విద్యార్థులు చెప్పారు. వారి సమాధానానికి ఆ మాస్టారు ఏమీ నిరుత్సాహపడలేదు, సహనాన్ని కోల్పోలేదు.
సాయంకాలం పిల్లలందరినీ సముద్రతీరానికి తీసుకువెళ్ళారు. అప్పుడు అయ్యర్గారు ఆకాశంలో గుంపులు, గుంపులుగా ఎగురుతున్న పక్షుల్ని చూపించారు. ఆ అద్భుతమైన పక్షి సమూహాలను చూసి విద్యార్థులంతా విభ్రాంతులమయ్యారు. ఉపాధ్యాయుడు ఆ పక్షుల్ని చూపిస్తూ, అవి అలా ఎగురుతున్నప్పుడు తమ రెక్కల్ని ఎలా అల్లారుస్తున్నాయో గమనించమన్నారు. అవి తాము కోరుకున్న దిశకు తిరగడానికి తమ తోకల్ని ఎలా వాడుకుంటున్నాయో పరిశీలించమన్నారు.
అప్పుడాయన 'పక్షిని నడిపిస్తున్న ఆ యంత్రం ఎక్కడుంది? దానికి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది?" అని విద్యార్థులను అడిగారు. చివరకు జవాబు కూడా ఆయనే చెప్పారు. పక్షిని నడిపిస్తున్న శక్తి దాని ప్రాణశక్తేనని, దాని ఇచ్ఛాశక్తే దాని చోదకశక్తి అని వివరించారు. అంత గహనమైన భావనల్ని ఆయన విద్యార్థుల కళ్ళెదుట కనపడుతున్న దృష్టాంతంలో సులభంగా, సరళంగా బోధపరిచారు.
ఆ రోజు తెలుసుకున్నది కేవలం ఒక పక్షి ఎలా ఎగురుతున్నదన్న అంశంతో అబ్దుల్ కలాం ఆగిపోలేదు. ఆ రోజు వారు చెప్పిన ఆ పాఠం ఆయనలో విశిష్ట అనుభూతిని జాగృతం చేసింది. భవిష్యత్తులో చదువుకోబోయే చదువు ఆకాశయాన వ్యవస్థలకు సంబంధించి ఉండాలని అప్పుడే తీర్మానించుకున్నారు. ఒక సాయంకాలం పాఠశాల ముగిసిన తరువాత ఆయన మనస్సులోని మాటను మాస్టారు ముందుంచాను. అప్పుడాయన చాలా ఓపిగ్గా అబ్దుల్ కలామ్ భవిష్య ప్రణాళిక ఎలా ఉండాలో చెప్పుకొచ్చారు. మొదట హైస్కూలు, కళాశాల చదువులు పూర్తిచేయాల్సి ఉంటుందనీ, ఆ తరువాత ఇంజనీరింగ్లో ఆకాశయాన వ్యవస్థల గురించి చదువు కొనసాగించాలనీ చెప్పారు. ఆ మొత్తం క్రమంలో అబ్దుల్ కలామ్ కష్టపడి చదువుకోగలిగితే భవిష్యత్తులో ఆకాశయాన విజ్ఞానానికి సంబంధించి ఎంతో కొంత సాధించగలవని కూడా ఆయన చెప్పారు.
ఆ ఉపాధ్యాయుడి సలహా ప్రకారం అబ్దుల్ కలామ్ కళాశాలకు వెళ్ళినప్పుడు భౌతికశాస్త్రాన్ని ఎంచుకున్నారు. అలాగే మద్రాసు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరినప్పుడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ను ఎంచుకున్నారు. ఉపాధ్యాయుడు పక్షులు ఎలా ఎగురుతాయో వివరించడానికి చూపిన దృష్టాంతం, చదువు కోసం ఆయన చేసిన సూచనలు అబ్దుల్ కలామ్ జీవితానికి ఒక గమ్యాన్నీ, లక్ష్యాన్నీ ప్రసాదించాయి. అబ్దుల్ కలామ్ జీవితంలో అదొక గొప్ప మలుపు. కాలగమనంలో ఆయనొక రాకెట్ ఇంజనీరుగా, అంతరిక్ష శాస్త్రవేత్తగా, సాంకేతిక నిపుణుడిగా రూపుదిద్దుకోవడానికి ఆ సంఘటనే నాంది పలికింది. ఈ విషయాన్ని స్వయానా అబ్దుల్ కలామ్ చెప్పారు.
*నిశ్శబ్ద.