తెలంగాణలో 721 మంది రైతుల ఆత్మహత్య
posted on Jan 24, 2015 12:05PM

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 721 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పంటలకు నీరందక, నీరు అందించడానికి కరెంటు లేక, పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లభించక, రుణమాఫీ జరగక మనోవేదనకు గురై ఈ రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. 721 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నప్పటికీ వారి కుటుంబాలను ఆదుకోవాలని, కనీసం పరామర్శించాలని కూడా ముఖ్యమంత్రికి కేసీఆర్‌కి అనిపించకపోవడం బాధాకరమని పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల రుణమాఫీ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం వేసిన నాగిరెడ్డి కమిటీ ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యల విషయంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఒక్కసారి కూడా ఎందుకు సమీక్షించలేదని ఆయన నిలదీశారు.