శ్రీవారి అక్షింతలను అసహ్యంగా దులుపేస్తావా! ఎందుకీ దొంగభక్తి జగన్ రెడ్డి ?
posted on Oct 13, 2021 5:52PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనపై టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. వేదపండితులు తలపై వేసిన అంక్షితలను జగన్ అసహ్యంగా దులుపుకున్నారని, పవిత్రమైన ప్రసాదాన్ని వాసన చూశారని లోకేశ్ ఆరోపించారు. వెంకటేశ్వరస్వామిపై ఎందుకీ దొంగభక్తి జగన్ రెడ్డి గారూ? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భక్తి ఉంటే భార్య ఎందుకు రాదు? అంటూ ప్రశ్నించారు.
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఆయన అర్ధాంగిపైనా లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు. మీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు ఏడుకొండలవాడికి సేవ చేసే అవకాశం దొరికితే, ఆ స్వామి వారికే అపచారం తలపెట్టే పనులు మంచిది కాదు అంటూ వైవీ సుబ్బారెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు."జగన్ మీ దేవుడే కావొచ్చు... ఆయన ఫొటోను మీ ఇళ్లలో పెట్టి పూజలు చేసుకోండి... దేవుడిగా కొలుచుకోండి.... వీలైతే పాదపూజ చేసుకోండి. కొండపై గోవింద నామాల బదులు జగన్ నామస్మరణ మహాపరాధం" అని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామి, అమ్మవార్లకు పదేపదే అపచారాలు తలపెడుతూ, జగన్ రెడ్డిని రక్షించే గోవిందుడు అంటూ టీటీడీ చైర్మన్ అర్ధాంగి అపచారపు నామస్మరణ చేయడం స్వామివారికి తీరని కళంకం అని నారా లోకేష్ ఫైరయ్యారు.