ఏటీఎమ్‌లో 17 ల‌క్ష‌లు లూటీ.. యూట్యూబ్ చూసి దోపిడీ?

ఏటీఎమ్ చోరీ. ఈ మ‌ధ్య చాలా రేర్‌గా వినిపిస్తోందీ మాట‌. ఒక‌ప్పుడు ఏటీఎమ్‌లు కొల్ల‌గొట్టే కేసులు బాగా జ‌రిగేవి. కానీ, చాలా వ‌ర‌కూ విఫ‌ల‌మ‌య్యేవి. ప‌క‌డ్బందీ సిస్ట‌మ్ ఉండ‌టంతో.. ఏటీఎమ్‌ను దోచుకోవ‌డం అంత ఈజీ కాద‌ని దొంగ‌ల‌కు తెలిసిపోయింది. అందుకే, ఏటీఎమ్‌ను కాకుండా.. అందులో డ‌బ్బులు పెట్టే ముందు లూటీల‌కు పాల్ప‌డుతున్నారు. కానీ, లేటెస్ట్‌గా క‌డ‌ప‌లో క‌రుడుగ‌ట్టిన దొంగ‌లు ఏకంగా ఏటీఎంనే దోచుకున్నారు. మిష‌న్ బ‌ద్ద‌లుకొట్టి మ‌రీ.. అందులోని న‌గ‌దు ఎత్తుకెళ్లారు. ఇంత‌కీ, ఎంతో స్ట్రాంగ్‌గా ఉండే ఏటీఎమ్ మిష‌న్‌ను ఎలా ప‌గ‌ల‌గొట్టారు? యూట్యూబ్ వీడియోస్ చూసే ఆ ప‌ని చేశారా? అనే డౌట్‌. ఇంత‌కీ ఆ దొంగ‌త‌నం ఎలా జ‌రిగిందంటే.....

కడప శివారు కేఎస్‌ఆర్‌ఎమ్‌ ఇంజినీరింగ్‌ కళాశాల సమీపంలోని ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీ జరిగింది. దుండగులు ఏటీఎంలోని రూ.17 లక్షల నగదును అపహరించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఐదుగురు దొంగ‌లు ఏటీఎం రూమ్‌లోని ఎంట్రీ ఇచ్చారు. సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టారు. ఏటీఎం మిషన్‌ను గ్యాస్‌ కట్టర్‌తో కట్‌ చేసి.. అందులోని 17 ల‌క్ష‌ల‌తో ఉడాయించారు. 

ఉదయం ఏటీఎం చోరీని గుర్తించిన బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు స్పాట్‌ను పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. ఏటీఎంలోని క్యాష్‌ను ఏమాత్రం డ్యామేజ్ జ‌ర‌క్కుండా.. గ్యాస్ క‌ట్ట‌ర్‌ల‌తో అంత జాగ్ర‌త్త‌గా క‌ట్ చేశారంటే.. వాళ్లెవ‌రో ప‌క్కా ప్రొఫెష‌న‌ల్ క్రిమిన‌ల్స్ అయి ఉంటార‌ని భావిస్తున్నారు. అయితే, ఇంజినీరింగ్ కాలేజ్ ప‌క్క‌నే ఉన్న ఏటీఎంలో చోరీ జ‌ర‌గ‌డం.. ఆ ఏటీఎంను కొల్ల‌గొట్టిన విధానం చూస్తుంటే.. యూట్యూబ్ వీడియోస్ చూసో.. ఏ హాలీవుడ్ సినిమానో ఫాలో అయ్యో.. ఈ ఏటీఎంను లూటీ చేశార‌ని అంటున్నారు. బీటెక్ స్టూడెంట్సే ఈ దోపిడీ చేసుంటారా? అనే అనుమాన‌మూ వ్య‌క్తం చేస్తున్నారు. పోలీస్ విచార‌ణ‌లోనే ఆ వివ‌రాలు తెలియాలి.