శశికళ నెత్తిన మరో పిడుగు.. ‘అమ్మకానికి ఎమ్మెల్యేలు’
posted on Jun 14, 2017 1:19PM
.jpg)
తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. బెయిల్ పై శశికళ బయటకు రావడంతో తమిళ పాలిటిక్స్ మరోసారి వార్తల్లో నిలిచాయి. శశికళ బయటకు వచ్చింది కదా.. ఆమె ఎలాంటి వ్యూహాలు రచిస్తుందో అని ఎదురుచూస్తున్న తరుణంలో మరో పిడుగు ఆమె నెత్తిమీద పడింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో బల పరీక్ష కోసం ఎమ్మెల్యేలకు లంచం ఇవ్వాలని చూపినట్టు తాజాగా స్టింగ్ ఆపరేషన్ లో బయటపడింది. దీంతో ఇది పెద్ద సంచలనంగా మారింది.
ఇప్పుడు ఈ వ్యవహారంపై తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు ఉద్రిక్తంగా మారాయి. ఈరోజు తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో డీఎంకే నేతలు అధికార అన్నాడీఎంకే పార్టీపై అవినీతి ఆరోపణలు చేశారు. ‘అమ్మకానికి ఎమ్మెల్యేలు’ అని రాసి ఉన్న ప్లకార్టులు పట్టుకుని నినాదాలు చేశారు. బలపరీక్ష కోసం ఎమ్మెల్యేలకు లంచం ఇవ్వడంపై మీడియాలో ప్రసారమవుతున్న స్టింగ్ ఆపరేషన్ గురించి అన్నాడీఎంకే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో స్పీకర్ వారిని బయటకు పంపాలని స్పీకర్ ఆదేశించారు. దీంతో శాసనసభ ప్రతిపక్ష నేత స్టాలిన్ సహా డీఎంకే ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎదుట ధర్నా చేపట్టారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి స్టాలిన్ సహా డీఎంకే నేతలను అదుపులోకి తీసుకున్నారు.