సాయిబాబాకు సుప్రీంలో చుక్కెదురు
posted on Apr 19, 2023 3:08PM
మావోయిస్టులతో సంబంధాలు ఉన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు సుప్రీంలో చుక్కెదురైంది. బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం సాయిబాబా నిర్దోషిగా తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే సుప్రీం ఇచ్చిన ఉత్తర్వుల్లో బాంబే హైకోర్టు తీర్పును కొట్టివేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ అభికల్ప్ ప్రతాప్ సింగ్, సాయిబాబా తరపున సీనియర్ న్యాయవాది ఆర్ బసంత్ సుప్రీం కోర్టులో వాదించారు.
2014లో అరెస్టయిన సాయిబాబా ఎనిమిదేళ్లకు పైగా జైల్లో ఉన్నారు. గత ఏడాది అక్టోబర్ 14న బొంబాయి హైకోర్టు సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించింది. జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది.
సాయిబాబాతో పాటు జీవిత ఖైదు పడిన మహేశ్ కరీమాన్ టిర్కీ, పాండు పోరా నరోటే, హేమ్ కేశవదత్త మిశ్రా , ప్రశాంత్ సాంగ్లికర్ , విజయ్ తిర్కీలను బాంబే హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తదుపరి విచారణ డిసెంబర్ 8న ఉంటుందని సుప్రీం పేర్కొంది. బాంబే హైకోర్టు తీర్పును మహరాష్ట్ర సర్కారు సుప్రీంలో సవాల్ చేసింది.
2014లో జీఎన్ సాయిబాబా నక్సల్స్ తో సంబంధాలు ఉన్న ఆరోపణల మీద అరెస్టయ్యాడు. ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన రామ్ లాల్ ఆనంద్ కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పని చేశారు. జవహార్ లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయ విద్యార్థి హేమ మిశ్రా అరెస్ట్ తర్వాత జీఎన్ సాయిబాబా మావోలతో సంబంధాలు బయట పడ్డాయి.