వామ్మో రివర్స్ వాకింగ్ వల్ల ఇన్ని ప్రయోజనాలా?
posted on Apr 2, 2025 9:30AM

వాకింగ్ అనేది చాలామంది దినచర్యలో భాగం. వాకింగ్ వల్ల శరీరం చాలా వరకు ఫిట్ గా ఉంటుంది. పైగా వాకింగ్ కు ఎలాంటి వ్యాయామ పరికరాలు అవసరం లేదు. అయితే వాకింగ్ కంటే రివర్స్ వాకింగ్ చాలా బెటర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు, ఫిట్‌నెస్ నిపుణులు. ఫిట్‌గా ఉండటానికి కేవలం నేరుగా నడవడం సరిపోదని, ఎప్పుడైనా 15 నిమిషాలు వెనుకకు నడవడానికి ప్రయత్నించి చూస్తే అందులో కలిగే మార్పు మాములుగా ఉండదని అంటున్నారు. ఈ రివర్స్ వాకింగ్ శరీరాన్ని ఫిట్‌గా ఉంచడమే కాకుండా మానసిక ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ప్రతిరోజూ వాకింగ్ చేస్తుంటే ఇప్పుడు దాన్ని రివర్స్ వాకింగ్ మోడ్ లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందండోయ్.. వెనుకకు నడవడం వల్ల కండరాలు కష్టపడి పనిచేస్తాయి. శరీర సమతుల్యతను మెరుగుపడుతుంది. ఇంకా దీంతో కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే..
శరీర బాలెన్స్..
రివర్స్ గా నడవడం వల్ల శరీరం తనను తాను సమతుల్యం చేసుకోవడానికి కష్టపడి పనిచేస్తుంది. ఇది సమతుల్య శక్తిని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా తరచుగా తడబడుతూ ఉంటే బ్యాక్ వాక్ దానిని తొలగించడంలో సహాయపడుతుంది.
మోకాళ్లు, నడుము నొప్పి తగ్గుతాయి..
మోకాళ్లు లేదా నడుము నొప్పి ఉంటే, వెనుకకు నడవడం సర్వరోగ నివారిణిగా పనిచేస్తుంది. ఇది మోకాళ్లు, వెన్నెముకపై ఒత్తిడిని తగ్గిస్తుంది, వాటిని బలంగా చేస్తుంది. ఆర్థరైటిస్ లేదా వెన్నునొప్పితో బాధపడే చాలా మందికి దీని నుండి చాలా ఉపశమనం లభిస్తుంది.
బరువు తగ్గించడంలో సహాయపడుతుంది..
బరువు తగ్గాలని అనుకునేవారు వెనుకకు నడవడం గేమ్ ఛేంజర్‌గా సహాయపడుతుంది. ఇది సాధారణ నడక కంటే ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది, ఇది వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
మెదడు శక్తి..
వెనుకకు నడవడం వల్ల మెదడు మరింత చురుగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇది శరీర బాలెన్స్ ను కాపాడుకోవడానికి కష్టపడి పనిచేస్తుంది. ఇది జ్ఞాపకశక్తిని పదును పెట్టడమే కాకుండా ఏకాగ్రతను కూడా పెంచుతుంది.
కండరాలను బలంగా ఉంచుతుంది..
ఇది కాళ్ళు, తొడలు, నడుము కండరాలను బలపరుస్తుంది. గంటల తరబడి కుర్చీపై కూర్చుని పనిచేసే వారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...