తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు.. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే బిల్లు?

తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ స్థానాల పెంపు ప్రక్రియకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది.   ఎనిమిదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ,  తెలంగాణ రాష్ట్రాలు   అసెంబ్లీ సీట్లను పెంచాలని కేంద్రాన్ని కోరుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. రాష్ట్ర విభజన చట్టంలోని హామీల ప్రకారం ఏపీలో ఉన్న స్థానాలను 175 నుంచి 225కి. అలాగే తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ  నియోజకవర్గాల సంఖ్యను 153 పెంచే ప్రక్రియను కేంద్రం ఆరంభించింది.

ఇప్పటికే నియోజకవర్గాల సంఖ్య పెంపునకు పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టేందుకు అనువుగా అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్ పంపాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కేంద్ర న్యాయ శాఖ కోరింది. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వీలైనంత త్వరగా  నివేదిక అందితే.. వర్షాకాల సమావేశాల్లోనే పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశ పెట్టే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ విషయంపై తెలుగు రాష్ట్రాల నుంచి ఇంత వరకూ స్పందన లేదు.

ఇలా ఉండగా తెలుగు రాష్ట్రాలలో నియోజకవర్గాల పునర్విభనజపై గత ఏడాది ఆగస్టులో లోక్ సభ వేదికగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నకు కేంద్రం 2031 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని సమాధానమిచ్చింది. దీంతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ నియోజకర్గాల పునర్విభజనపై వస్తున్న సమాచారంలో నిజమెంత అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  

గతేడాది లోక్ సభలో కేంద్రమే 2031 వరకు పెంపు లేదని స్పష్టం చేసిన నేపథ్యంలో నియోజకవర్గాల పెంపుకు సంబంధించి ఇంత హడావిడిగా కసరత్తు మొదలుపెట్టిందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఐతే కాశ్మీర్ లో ఇటీవలే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టిన కేంద్రం తెలంగాణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గాల పెంపుపై కసరత్తు చేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.