భూ కబ్జాదారుడు మన జగన్.. నోరు జారిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

మనసులో బాగా తొలుస్తున్న విషయం ఎంత దాచాలనుకున్నా దాచలేం. ఏదో సందర్భంలో అది బయటకు వచ్చేస్తుంది. కాదూ కూడదూ బయటకు చెప్పడానికి వీల్లేదు అని గట్టిగా అనుకుని బింకంగా నిలబడదామన్నా టంగ్ స్లిప్ అని ఒకటుంటుంది. మన ప్రమేయం లేకుండానే ఆ మాట బయటకు వచ్చేస్తుంది.

ఏపీ డెప్యూటీ సీఎం నారాయణ స్వామికి కూడా అలాగే అయ్యింది. ముఖ్యమంత్రి జగన్ విషయంలో ఆయన టంగ్ స్లిప్ అయ్యింది. అదీ అక్కడా ఇక్కడా కాదు తిరుపతి వేదికగా జరిగిన వైసీపీ ప్లీనరీ వేదికపైనే ఆయన నోరు జారారు. ఏకంగా ముఖ్యమంత్రి జగన్ ను భూ కబ్జాదారుడిగా అభివర్ణించారు. ఆయన మాట్లాడే మాటలన్నీ అబద్ధాలనీ, అన్యాయమనీ చెప్పేశారు. అంతేనా ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలనీ, మేల్కొని నిర్ణయం తీసుకోవాలనీ పిలుపు నిచ్చారు. జగన్ పై నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో  ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది.

ఇందుకు సంబంధించిన వీడియోను తెలుగుదేశం వారు సమాజిక మాధ్యమంలో పోస్టు చేసి నిజం నిప్పు లాంటిది.. ఎక్కువ సేపు నోట్లో దాచుకోలేరంటూ ఓ కామెంట్ పెట్టారు. అంతే కాకుండా ఆ వీడియోకు జగన్ పని అయిపోయిందన్న హ్యాష్ టాగ్ కూడా జత చేశారు. ఎవరైనా ఒక సారి నోరుజారుతారు. ఒక పార్టీకి చెందిన వారే పదే పదే టంగ్ స్లిప్ అవుతున్నారంటే.. అది నిజంగా టంగ్ స్లిప్పేనా అన్న అనుమానాలు వ్యక్తం కావడం సహజం. వైసీపీ నేతలలో అసంతృప్తి భగ్గు మంటోందనడానికి ఇటీవల చాలా ఉదాహరణలే కనిపిస్తున్నాయి.

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, సొంత పార్టీ నేతలే తనపై కక్షకట్టి కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సొంత పార్టీ నాయకులు ప్రతిపక్షాల కంటే ఎక్కువగా తనను టార్గెట్ చేస్తున్నాయని, బాలినేని వాపోతున్నారు. బాలినేని ఈ సంచలన వ్యాఖ్యలు చేసిన వెంటనే ఆయన గొంతుకు మరో గొంతు తోడైంది, బాలినేని శ్రీనివాసరెడ్డి తరహాలోనే తనకూ ఇంటి పోరు  తీవ్రంగా ఉందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

జిల్లాకు చెందిన వైసీపీ ముఖ్యనేతలు  తన నియోజకవర్గ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు.   కాగా బయటకు వస్తున్న అసమ్మతి స్వరాలల కంటే, బయట పడకుండా కుతకుత ఉడుకుతున్న అసమ్మతి నేతలు ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటారని, పార్టీ నాయకులే అంటున్నారు. ఇక తాజాగా డిప్యూటీ స్పీకర్ నారాయణ స్వామి నోరు జారిన వ్యాఖ్యలతో వైసీపీలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అని తేటతెల్లమౌతున్నదని పరిశీలకులు అంటున్నారు.