కమల్ హాసన్ 'విశ్వరూపం', అందరిపై కేసులు పెడతా: జయలలిత
posted on Jan 31, 2013 1:42PM
ప్రముఖ హీరో కమల్ నటించిన 'విశ్వరూపం' సినిమాను నిషేధించలేదని, శాంతిభద్రతల దృష్ట్యా సినిమాను నిలిపివేశామని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పేర్కొన్నారు. విశ్వరూపం సినిమాపై తమిళనాడు ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలను ఆమె ఖండించారు. ఇంటలిజెన్స్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని, వాస్తవాలు తెలుసుకోకుండా ప్రభుత్వంపై ఆరోపణలు చేశారని మండిపడ్డారు. విశ్వరూపం వివాదంపై మీడియా అతిగా స్పందించిందని జయ మండిపడ్డారు.
జయ టీవీతో తనకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు లేవన్నారు. తనపై ఆరోపణలు చేసినవారిపై కోర్టుకెళ్తానని జయ హెచ్చరించారు. ఈ సినిమాపై 25 ముస్లిం సంస్థలు ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చాయని, ఆందోళనలకు దిగుతామని హెచ్చరించినట్లు జయ చెప్పారు.
కమల్ ప్రధానిని ఎంపిక చేయలేరని తనకు తెలుసన్నారు. కమల్‌తో తనకు వ్యక్తిగత కక్షలు లేవన్నారు. ఆయన అన్ని తెలిసిన పెద్దమనిషి అని, బాధ్యతాయుత పౌరుడిగా వ్యవహరించాలని సూచించారు. ఈ సినిమా కోసం కమల్ రిస్క్ తీసుకున్నారని, ఆయన రిస్క్ తీసుకుంటే ప్రభుత్వం ఎలా బాధ్యత వహిస్తుందని జయలలిత ప్రశ్నించారు.