పంతం నెగ్గించుకొన్న స్పీకర్ నాదెండ్ల
posted on Apr 25, 2013 11:18AM
రాష్ట్ర బడ్జెట్ లో ఆర్ధిక మంత్రి ఆనం రామినారాయణ రెడ్డి ప్రతిపాదించిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రభుత్వానికి వాటిపై తగిన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు సభాపతి నాదెండ్ల మనోహర్ నిన్న కాంగ్రెస్, తెదేపాలతో కూడిన 12 సభా స్థాయి సంఘాలకు అధ్యక్షులను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసారు. ఈ విషయంలో ఆయనతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా విభేదించినప్పటికీ, ఆయన పార్లమెంటు సంప్రదాయాలను పాటిస్తూ తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలని కూడా స్థాయి సంఘాలకు అధ్యక్షులుగా నియమించారు.
ప్రతిపక్షాలకు ఈ బాధ్యతలు అప్పగించడం ఎంతమాత్రం ఇష్టపడని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేవలం అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులకే ఆ బాధ్యతలు అప్పగించాలని గట్టిగా పట్టుబట్టారు. అదేవిధంగా సభాపతిని సంప్రదించకుండా ఆయన పరిధిలో ఉండే స్థాయి సంఘాల సమావేశ తేదీలను కూడా ప్రకటించడంతో వారిరువురి మద్య ఈ విషయంలో బేధాభిప్రాయాలు మరింత పెరిగాయి. చివరికి, మధ్యే మార్గంగా నాదెండ్ల మనోహర్ మెజార్టీ స్థాయి సంఘాలకు కాంగ్రెస్ వారిని, ముఖ్యమయిన ౩ సంఘాలకు తెదేపా నేతలను అధ్యక్షులుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసి, ఒకవైపు పట్టువిడుపులు ప్రదర్శిస్తూనే మరో పక్క తన పంతం కూడా నెగ్గించుకొన్నారు. తద్వారా ఆయన ఒక సరి కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టి అందరి ప్రశంసలు అందుకొంటున్నారు.