చంద్రబాబుకి ఇల్లు ఇవ్వలేను...షాకిచ్చిన టీడీపీ నేత !
posted on Jul 4, 2019 5:56PM

గత ప్రభుత్వం కట్టిన ప్రజావేదిక కూల్చివేతతో అక్రమ కట్టడాల కూల్చివేత మొదలు పెట్టిన ఏపీ ప్రభుత్వం అక్రమ నిర్మాణాలకు చెక్ పెట్టే పనిలో ఉంది. కృష్ణా నది కరకట్టపై ఉన్న అక్రమ భవనాలను సైతం ఏరివేసేందుకు రంగంలోకి దిగింది. అక్రమంగా నిర్మించిన అన్ని కరకట్ట దగ్గరున్న భవనాలకు నోటీసులు పంపింది. ఇదే జాబితాలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం ఉంటున్న ఇల్లు కూడా ఉన్న విషయం తెలిసిందే. నోటీసులు రావడంతో.. చంద్రబాబు ఇళ్లు ఖాళీ చేస్తారనే ప్రచారం సాగుతోంది.
టీడీపీ అధినేత కోసం విజయవాడలో ఇల్లు వెతికే పనిలో ఉన్నారట టీడీపీ నేతలు. ఈ క్రమంలోనే పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత అయిన ఒక టీడీపీ నేత ఇల్లు బాగా నచ్చిందట. ఆయన కూడా చంద్రబాబుకి ఇల్లు ఇవ్వడం అంటే ఎగిరిగంతేసి తన ఇంటిని ఇచ్చేందుకు ఓకే చెబుతారని నేతలు భావించారు. కానీ సదరు పారిశ్రామికవేత్త మాత్రం ఇంటిని అడిగేందుకు వెళ్ళిన టీడీపీ నేతలకు పెద్ద షాక్ ఇస్తూ తన ఇంటిని ఇచ్చేది లేదని కుండబద్దలు కొట్టేశారట. చంద్రబాబు కోసం నివాసాలు వెతికే పనిలో ఉన్న నేతలు విజయవాడలో భవనాలను పరిశీలించారు.
ఈ క్రమంలో విజయవాడ గురునానక్ నగర్ కాలనీలో ఉండే పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్ ఇంటిని నేతలు చూశారట. ఈ ఇల్లు చంద్రబాబు కుటుంబానికి అనువుగా ఉంటుందని ఈ ఇంటిని ఫైనల్ చేద్దామని నేతలు భావించారట. అదీ కాక పుట్టగుంట కూడా ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్‌కు బంధువు కావడం ఇక ఫైనల్ చేయడమే అని అనుకున్నారట. ఇక ఇంటి యజమాని సతీష్‌ను సంప్రదించగా తాను ఇష్టపడి కట్టుకున్న ఇంటిని చంద్రబాబుకు ఇవ్వలేనని, అది ఇప్పుడు తాను నివాసం ఉంటున్న ఇల్లు అని దానిని ఖాళీ చేసి ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నట్టు సమాచారం.
బాబుకు ఇల్లు ఇద్దమానుకున్నా వాస్తు, భద్రతా కారణాలతో దానికి మార్పులు చేర్పులు చేస్తారని, అందుకే తన తన ఇంటిని ఇవ్వలేనని తేల్చి చెప్పారట. దీంతో సతీష్ చెప్పిన సమాధానం టీడీపీ నేతలకు షాక్ ఇచ్చినట్టయ్యింది. సతీష్ ఇంటి వ్యవహారం తెలుగు దేశం పార్టీలోనూ హాట్‌టాపిక్ గా మారింది. పారిశ్రామికవేత్తగా ఉన్న పుట్టగుంట సతీష్ టీడీపీ ఆవిర్భావం నుండీ టీడీపీలోనే ఉన్నారు. ఎన్నికల్లో పోటీచేసేందుకు గన్నవరం టికెట్ ఆశించినా దొరకలేదు. తర్వాత దివంగత సీఎం వైఎస్ ఆత్మ కేవీపీతో ఉన్న పరిచయాలతో కాంగ్రెస్‌లో చేరారు. తర్వాత మళ్లీ టీడీపీ నుంచి టికెట్ ఇస్తామని హామీ రావడంతో తిరిగి సొంత గూటికి వచ్చారు. కానీ మళ్లీ టికెట్ దక్కకపోవడంతో నిరాశే మిగిలింది. అందుకే ఆయన ఇల్లు ఇవ్వడానికి అంతగా సుముఖత చూపడం లేదని అంటున్నారు.