కట్టు తప్పుతున్న బీజేపీ క్యాడర్!

 

 

 

కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న భారతీయ జనతాపార్టీ క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన పార్టీ. పార్టీ అగ్ర నాయకత్వం ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని పైనుంచి కింది వరకు అన్ని శ్రేణుల్లోని నాయకులు క్రమశిక్షణ తప్పకుండా పాటిస్తారు. అయితే కాంగ్రెస్‌ని వ్యతిరేకించీ వ్యతిరేకించీ బీజేపీ కార్యకర్తలు కొన్ని కాంగ్రెస్ లక్షణాలను పుణికిపుచ్చుకున్నట్టు వున్నారు. అది కూడా ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోని కార్యకర్తలు. తెలుగుదేశంతో భారతీయ జనతాపార్టీ అగ్ర నాయకత్వం ఎన్నిక పొత్తు కుదుర్చుకుంటే తెలంగాణలో వున్న స్థానిక నాయకత్వం మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది.

 

కొంతమంది ధర్నాలు గట్రాలు చేస్తే, మరికొందరు తమ పార్టీ పదవులకు రాజీనామాలు చేశారు. తెలుగుదేశంతో పొత్తు తమకు రాజకీయంగా లాభం చేకూరుస్తుందని బీజేపీ అగ్ర నాయకత్వం భావిస్తూ వుంటే, తెలంగాణ బీజేపీలోని ఒక వర్గం మాత్రం దాన్ని వ్యతిరేకిస్తూ, అగ్ర నాయకత్వం నిర్ణయాన్నే ప్రశ్నిస్తోంది. ఈ వర్గం వెనుక వున్నది బీజేపీ తెలంగాణ ప్రాంత అధ్యక్షుడు కిషన్ రెడ్డే అన్నది బహిరంగ రహస్యమేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

తెలుగుదేశంతో బీజేపీకి పొత్తు కుదిరితే రాష్ట్రంలో పార్టీ అగ్రనాయకత్వం దృష్టిలో తనకు ప్రాధాన్యం తగ్గిపోతుందన్న ఇన్ఫీరియార్టీ కిషన్ రెడ్డిలో మొదటి నుంచీ కనిపిస్తోంది. అందువల్లే తెదేపాతో పొత్తును కొంతమంది కార్యకర్తలు వ్యతిరేకించేలా కిషన్‌రెడ్డి కీ ఇచ్చి వదిలారన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. అయితే బీజేపీ కార్యకర్తల నుంచి ఎదురైన ప్రతిఘటనను, క్రమశిక్షణా రాహిత్యాన్ని బీజేపీ అగ్ర నాయకత్వం చాలా సీరియస్‌గా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పాలలను అంతం చేయడానికి, మోడీని ప్రధానమంత్రిని చేయడానికి బీజేపీ అగ్ర నాయకత్వ నానా తంటాలూ పడుతూ వుంటే జనంలో పార్టీ చులకన అయ్యేలా కట్టు తప్పి వ్యవహరిస్తున్న వారి మీద తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ అగ్ర నాయకత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం.