బేబీ వాకర్లు వద్దు
posted on Feb 4, 2017 11:32AM

పిల్లల మీద ప్రేమతో వారికి ఎప్పటికప్పుడు అన్నిఅమర్చాలనుకుంటారు తల్లితండ్రులు. అయితే అవి వారికి మేలు చేస్తాయా లేదా అన్నది ఆలోచించరు. ఉదాహరణకి పిల్లలు తప్పటడుగులు వేస్తుంటే చాలు, వారికి నడక బాగా రావాలంటూ వారికి బేబీ వాకర్లు కొంటాం. దీంతో పిల్లలు కూడా హాయిగా ఇల్లంతా తిరుగుతుంటారూ.అయితే ఇవి పిల్లలకి మంచి చేయ్యకపోగా నష్టం కలిగిస్తాయి అంటున్నారు ఐర్లాండ్ పరిశోధకులు. బేబీ వాకర్ల వల్ల చిన్నారుల్లో పెరుగుదల, అభివృద్ధి కొంత ఆలస్యం అవుతుందని వీరు చేసిన పరిశోధనల్లో స్పష్టం అయిందట . ఈ పరిశోధనలో భాగంగా 190 మంది ఆరోగ్యవంతులైన శిశువులను పరిశోధించారుట. అలాగే తల్లిదండ్రుల ద్వారా పిల్లల ఎదుగుదలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించారట...
పిల్లలు బోర్లపడటం, వారంతట వారే కూర్చోవటం, పాకటం, నడవటం వంటి పనులు ఏఏ వయసులో చేశారనే వివరాలను రికార్డు చేశారు పరిశోధకులు. ఈ సమాచారాన్నంతటిని పరిశీలిస్తే బేబీ వాకర్లు ఉపయోగించిన చిన్నారులు మిగతావారికంటే లేచి నిలబడటం , నడవటం వంటివి కొంత ఆలస్యంగా మొదలు పెట్టటాన్ని గుర్తించారు. బేబీ వాకర్ అలవాటైన పిల్లలు దానిమీద ఎక్కువగా ఆధారపడుతున్నారని ఫలితంగా నడక ,పాకడం, నిలబడటం వంటి దశలన్నిచిన్నారుల్లో ఆలస్యంగా జరుగుతున్నట్లు తేలింది. కాబట్టి తప్పనిసరైతే తప్ప వాకర్లు వాడొద్దని సూచిస్తున్నారు..
....రమ