కర్ణాటక నుంచి నిర్మలా సీతారామన్ నామినేషన్..
posted on May 30, 2016 2:43PM

రాజ్యసభ సభ్యురాలిగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పదవికాలం కూడా పూర్తవుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఏపీ కోటా నుండి రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న నిర్మలా సీతారామన్ ఈసారి కర్ణాటక నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పార్టీ ఆదేశాల మేరకే తాను కర్ణాటక నుండి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేస్తున్నానని.. తనను ఏపీ నుండి కొనసాగించకపోవడానికి గల కారణాలు ఏంటో తనకు తెలియవని.. పార్టీ నిర్ణయాన్ని శిరసాహించడమే తన కర్తవ్యమని స్పష్టం చేశారు. ఈరోజు కర్ణాటక వెళ్లి రేపు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆమె తెలిపారు.
కాగా ఏపీ కోటానుండి రాజ్యసభకు నాలుగు సీట్లు ఉండగా.. అందులో మూడు టీడీపీకి దక్కనున్నాయి. ఇక బీజేపీ-టీడీపీ మిత్రపక్షం కాబట్టి అందులో బీజేపీకి ఒక స్థానం దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈసారి కూడా ఏపీ నుండి నిర్మలా సీతారామన్నే రాజ్యసభకు పంపించాలని చూశారు. కానీ పరిస్థితులు అనుకూలించక ఆమెను కర్ణాటక నుండి రాజ్యసభకు పంపిస్తున్నారు. మరోవైపు ఏపీ నుండి రాజ్యసభకు పంపే అభ్యర్ధులపై చర్చ జరుగుతుంది. ఈ రోజు సాయంత్రంలోపు అభ్యర్ధులు ఎవరో తెలిసిపోయే అవకాశం ఉంది.