ఉపోద్ఘాతం పార్ట్ - 2
ఆయుర్వేద చికిత్సలు ఏ సందర్భల్లో తీసుకోవచ్చు?
ఆయుర్వేదం పరిపూర్ణమైన వైద్యవిధానం. ఆయుర్వేద విధానమైన 'హెల్త్ మేనేజ్ మెంట్' పైన దృష్టిసారిస్తే పరిపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఆయుర్వేదం వ్యాధి లక్షణాలద్వారా వ్యాధిని నిర్ధారించి జీవన విధానంలో సమగ్రమైన మార్పులను సూచించడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.
అల్లోపతి వైద్య విధానంలో వ్యాధిని పూర్తిగా తగ్గించడం అసాధ్యమని నిర్ధారించుకున్న ఆస్తమా, గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులకు మన భారతీయ వైద్యం నమ్మకమైన పరిష్కారాలను ప్రతిపాదిస్తుంది. అనువంశికంగా వస్తున్న అనేకానేక ప్రాచీన భారతీయ వైద్య విధానాలు ఆధునిక పరిశోధనల్లో నిగ్గుతేలి ప్రపంచాన్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తున్నాయి. సాధారణంగా ఎక్కువమంది ఆయుర్వేదాన్ని మాత్రమే పరిష్కారంగా ఎంచుకుంటున్న కొన్ని ఆరోగ్యసమస్యల్ని ఇక్కడ పరిశీలిద్దాం.
చర్మవ్యాధులు: తెల్లమచ్చలు (విటిలిగో/ ల్యూకోడెర్మా), సోరియాసిస్, మధుమేహ వ్రణాలు, ఎలర్జీ, సిబ్బెం, శోభి, గజ్జి, తామర (రింగ్ వర్మ్) మొదలైన చర్మ వ్యాధులకు ఆయుర్వేదంలో మంచి చికిత్సలు ఉన్నాయి. అల్లోపతి విధానం వల్ల అంత తేలికగా లొంగని ఎన్నో మొండి చర్మ వ్యాధులకు ఆయుర్వేదంలో పరిష్కారం లభిస్తుంది. సోరియాసిస్, ఎగ్జిమా, తెల్లమచ్చలచికిత్సల కోసం అనేక మంది ఆయుర్వేదాన్ని ఆశ్రయిస్తున్నారు.
కీళ్ళు, కండరాలు, ఎముకల వ్యాధులు: మోకాళ్ళ నొప్పి, నడుము నొప్పి, మెడ నొప్పి, జాయింట్ల వాపు, గౌట్, స్పాండిలైటిస్, ఆస్టియో- ఆర్ర్తెటిస్, రుమాటాయిడ్ - ఆర్ర్తెటిస్, సయాటికా, మస్క్యులర్ డిస్ట్రఫీ మొదలైన వాటికి ఆయుర్వేదంలో మంచి చికిత్సలున్నాయని అందరికీ తెలుసు. ఆయుర్వేదంలో ఈ వ్యాధులన్నిటికి కౌన్సిలింగ్, గైడెన్స్, పంచకర్మలతో కూడిన ప్రత్యేక చికిత్సలు చేయడం జరుగుతుంది.
నరాల వ్యాధులు: పక్షవాతం, కంపవాతం (పార్కిన్ సోనిజం), మూర్చలు, నరాల బలహీనతలు, శరీరం మోద్దుబారటం వంటి వ్యాధుల చికిత్సకు ఆయుర్వేదం పెట్టింది పేరు. వీటి కోసం శమన చికిత్సలు, శోధన చికిత్సలు ఈ రెండు చేయాల్సి ఉంటుంది.
కాన్సర్: అన్ని రకాల క్యాన్సర్లు అసాధ్యాలు కావు. క్యాన్సర్ వచ్చినంత మాత్రాన అది మరణ శాసనం కాదు. ఇటీవలి కాలంలో క్యాన్సర్ పైన పనిచేసే అనేక రకాల మూలికలను శాస్త్రజ్ఞులు అధ్యయనం చేసి, వాటి పనితీరును ధృవీకరించారు. క్యాన్సర్ మందులతో పాటు, ఆయుర్వేద పంచకర్మ చికిత్సలు తీసుకుంటే వ్యాధిని తట్టుకునే శక్తి శరీరానికి వస్తుంది.
స్త్రీల వ్యాధులు: వైట్ డిశ్చార్జి, తల్లిపాలు తగినన్ని తయారవ్వకపోవడం, రుతుస్రావ సంబంధ సమస్యలు, కాళ్ళు గుంజటం, నడుము నొప్పి, గర్భాశయ దోషాలు మొదలైన వాటికి ప్రమాదకరమైన హార్మోన్లతో గాని, శాస్త్ర చికిత్సలతో గాని పని లేకుండా, ఆయుర్వేద చికిత్సలు తీసుకొని ప్రయోజనం పొందవచ్చు.
శ్వాసకోశ వ్యాధులు: ఆస్తమా, ఎలర్జీ, సైనసైటిస్, ఈసినోఫీలియా, దగ్గు మొదలైనవి తరచూ తిరగబెడుతూ ఇబ్బంది పెడుతుంటాయి. ఒక దానిని అణచివేస్తే సమస్య మరో కోణం నుంచి తిరగబెడుతుంది. దీనికి పరిష్కారం ఒక్కతే - వ్యాధి నిరోధక శక్తిని పెంచడం, దీనికి కూడా ఆయుర్వేద రసాయన చికిత్సలు తోడ్పడుతాయి.
జీర్ణాశయ వ్యాధులు: ఎసిడిటి, పెప్టిక్ అల్సర్, ఆకలి తగ్గిపోవటం, ఆజీర్తి చేస్తుండటం, గ్యాస్ అధికమోతాదులో తయారవుతుండటం, కడుపు ఉబ్బరింపు, అమీబియాసిన్. అల్సరేటివ్ కొలైటిస్, ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్, పైల్స్, మలబద్దకం తదితర జీర్ణకోశ వ్యాధులకు ఆయుర్వేదంలో తిరుగులేని చికిత్సలున్నాయి. 'వందల వ్యాధులు వచ్చిన, వందల దోషాలు ప్రకోపించినా జీర్ణ వ్యవస్థను కనుక కాపాడగలిగితే సదరు వ్యక్తికిగాని, అతని ఆరోగ్యానికిగాని ఎటువంటి ప్రమాదము ఉండదు' అని ఆయుర్వేదం అభయహస్తమిస్తుంది.
మూత్రసంబంధ వ్యాధులు: మూత్ర మార్గంలో రాళ్ళు. ప్రొస్టేట్ గ్రంధి వాపు మొదలైన వాటికి ఇతర వైద్య విధానాలలో ప్రభావవంతమైన మందులు లేవన్న విషయం తెలిసిందే. అయితే, ఆయుర్వేదంలో ఇటువంటి వ్యాధులను తగ్గించటానికి చక్కని మందులు ఉన్నాయి. సరైన ఫలితం కోసం వీటిని నిలకడగా కొన్ని నెలల పాటు వాడాల్సి ఉంటుంది.
కంటి సంబంధ వ్యాధులు: తలనొప్పి, మైగ్రేన్, దృష్టిలోపాలకు ఆయుర్వేదంలో అంజనం, ఆశ్చ్యోతనం, తర్పణం వంటి ప్రత్యేక చికిత్సలున్నాయి. మైగ్రేన్ తలనొప్పిగా యోగా, మెడిటేషన్, ఔషధాలు, ఉపకర్మలతో కూడిన ప్రత్యేక చికిత్సా విధానాన్ని అవలంభించాల్సి ఉంటుంది.
కాలేయ సంబంధ వ్యాధులు: కామెర్లు, జలోదరం (ఎసైటిస్), లివర్ సిరోసిన్, గాల్ బ్లాడర్ స్టోన్స్ వంటి వాటికి ఎంతోమంది - ఇతర వైద్య విధానాలకు చెందినా డాక్టర్లు సైతం - ఆయుర్వేద మందుల పైనే ఆధారపడుతుంటాయి. ఈ నేపథ్యంలో, దురదృష్టవశాత్తు, కొంతమంది నకిలీ వైద్యులు తయారై మూలికా వైద్యం పేరిట అశాస్త్రీయమైన మందులను ఇస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
సౌందర్య సమస్యలు: మొటిమలు ఎక్కువగా కనపడటం, మొహంలో వయసుకు మించి ముడతలు ఏర్పడటం, మొహం మీద గాట్లుగాని, గుంటలుగాని, మచ్చలుగాని ఏర్పడటం, చర్మం బిరుసుగా తయారవ్వటం, స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడటం, కళ్ళ క్రింద నల్లటి వలయాలు కనిపించడం, ఎండలోని అల్ట్రావయొలెట్ కిరణాల వల్ల చర్మం బిరుసుగా తయారవ్వటం, చర్మంగాని, వక్షోజాలుగాని బిగువుగా కోల్పోయి సాగిల పడటం, వెంట్రుకలు చిట్లిపోయి రాలిపోతుండటం, చుండ్రు కంట్రోల్ కాకుండా చిరాకును కలిగిస్తుండటం.... ఈ రకమైల ఎన్నో సమస్యలకు ఆయుర్వేదవిధానంలో నమ్మకమైన చికిత్సలున్నాయి. ఏ మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవడం వీటి ప్రత్యేకత. అయితే, వ్యక్తిగత ప్రకృతిని బట్టి మందులు మారుతుంటాయి కాబట్టి సరైన వైద్య పర్యవేక్షణలో, క్వాలిఫైడ్ వైద్యుని సలహాతో వీటిని తీసుకువడం అవసరం.
మానసిక సమస్యలు: డిప్రెషన్, యాంగ్జయిటీ న్యూరోసిస్, నిద్రపట్టక పోవడం, ఎల్లప్పుడూ మగతగా అనిపిస్తుండటం, దురలవాట్లకు బానిసవ్వడం, అర్థం లేని భయాందోళనలకు, భ్రాంతులకు లోనవ్వడం, చేసిన పనినే పదేపదే చేస్తుండటం ఇవన్నీ రుగ్మతలే. సరైన ఆయుర్వేద చికిత్సలతో వీటిని తగ్గించుకోవచ్చు.
వీటి కోసమే కాకుండా స్థూలకాయాన్ని తగ్గించుకోవటానికి, సన్నగా ఉండే వారు లావుగా తయారుకావడానికి, ఎత్తు పెరగడానికి, మధుమేహాన్ని నియంత్రించుకోవటానికి బి.పి. ని కంట్రోల్ చేసుకోవడానికి, రాలే జుట్టును అరికట్టడానికి, జ్ఞాపకశక్తిని వృద్ధి పరచుకోవడానికి, రక్తాల్పతను వృద్ధి పరచుకోవడానికి ఆయుర్వేద చికిత్సలను తీసుకోవచ్చు. ఎంత ప్రయత్నించినప్పటికీ లావు కాలేక నిరాశతో కొట్టుమిట్టాడుతున్న వారికి 'బృంహణ చికిత్స' అనేదాన్ని చేస్తే వెంటనే ప్రయోజనం కనిపిస్తుంది. సంతాన వైఫల్యం లోనూ, దాంపత్య సమస్యలలోనూ సూచించే ఆయుర్వేద రసాయన వాజీకరణ చికిత్సలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విషయం తెలిసిందే.
లక్షణాలు వ్యాధులకు హెచ్చరికలు:
వ్యాధి లక్షణాలనేవి శరీరాపశృతిని తెలుపుతాయి.వీటిని ఆయుర్వేదంలో 'పూర్వరూపాలు' అంటారు. వీటి మీద కనీసావగాహన ఉంటే అనేక రకాలైన వ్యాధులను ప్రారంభంలోనే గుర్తించి నివారించుకోవచ్చు. అంటే, ఇవి వార్నింగ్ సిగ్నల్స్ గా పని చేస్తాయన్న మాట. ఈ లక్షణాలే లేకపోతే - చాపకింద నీరులాగా - వ్యాధి చుట్టుముడుతున్న సంగతి మనకు తెలియదు. చివరి వరకు ఆరోగ్యంగానే ఉన్నామనుకుంటాం. హఠాత్తుగా వ్యాధి ఉగ్రరూపం దాల్చి అమాంతం కబళించి వేస్తుంది. నిజం చెప్పాలంటే లక్షణాలు అనేవి వ్యాదులనుండి మనల్ని మనం కాపాడుకునేలా చేసే సూచికలు తప్పితే మరోటి కాదు.
ఉదాహరణకు, నొప్పి అనే లక్షణం వల్లనే మనం చిన్నప్పటి నుంచి మంటలకు దూరంగా ఉండటం నేర్చుకున్నాము. లెప్రసీ వంటి నరాలకు సంబంధించిన వ్యాధుల్లో స్పర్శా గ్రహణం కోల్పోవటం వల్ల కాళ్లు చేతులకు దెబ్బలను తగిలించుకోవడం, ఇన్ఫెక్షన్లు సోకుతున్నా గ్రహించలేకపోవటం కొంతమందిలో చూస్తుంటాం. కాబట్టి మనల్ని మనం వ్యాధులనుంచి, ప్రమాదాలనుంచి రక్షించుకోవాలంటే ఈ లక్షణాలుండాల్సిందే.
లక్షణాలు అంతగా కనిపించక రక్తపోటు, గ్లాకోమా, మధుమేహం, వంటి వ్యాధుల్లో ఎం జరుగుతుందో మీకు తెలిసిందే; హైబీపీ వల్ల గుండెజబ్బులే కాకుండా కిడ్నీ జబ్బులు, గ్లాకోమా వల్ల శాశ్వత అంధత్వము, మధుమేహం వల్ల కీలక అంతర్గత అవయవాల పనితీరు దెబ్బతినడాలు జరుగుతాయి. అయితే, అదృష్టవశాత్తు ఈ విషయం అన్ని సందర్భాలకు, అన్ని వ్యాధులకు వర్తించదు. శారీరక, మానసిక వ్యాధుల్లో దాదాపు ప్రతిదీ ఏదో ఒక లక్షణాన్ని ప్రదర్శిస్తుంది. గమనించగలిగే నేర్పు ఉండాలంటే, ఇది వ్యాధి నిర్ధారణకు, ముందు జాగ్రత్త చర్యలకు సహాయ పడుతుంది.
లక్షణాలను ఆధారం చేసుకొని తొంబై శాతం వ్యాధులను గుర్తించవచ్చు, వ్యాధి నిర్ధారణలో ల్యాబ్ టెస్టులు, ఇన్వెస్టిగేషన్ల పాత్ర పదిశాతం మాత్రమే. ఈ పుస్తకం లక్షణాలాధారంగా వ్యాధులను గుర్తించడమెలాగో చెబుతుంది. ఏ లక్షణం ప్రమాదభరితమైనదో, ఏది కాదో వివరిస్తుంది. ఎప్పుడు గృహ చికిత్సలు ప్రయత్నించవచ్చో, ఏ సందర్భాల్లో డాక్టరు సలహా అవసరమో స్పష్టం చేస్తుంది.
నా వైద్యవృత్తిలో అనేక సంవత్సరాలుగా వివిధ వ్యక్తులను, రకరకాల మనస్తత్వాలను చూస్తున్నాను. చాలా మందిలో ఒక సామాన్య లక్షణం నాకు కనిపించేది, ఆ లక్షణం మరేమిటో కాదు - ఆందోళన.
కణితి తయారైతే క్యాన్సరనీ, దగ్గు వస్తుంటే క్షయ అనీ, మూత్రం పసుపు పచ్చగా వస్తుంటే కామెర్లనీ.... ఇలా ప్రతి దాని గురించి ఆందోళనకు గురయ్యేవారు. వార్తాపత్రికలు, టీవీ, రేడియో కార్యక్రమాలు, సభలు, సమావేశాలు ఇవన్నీ వ్యాధులు, వాటి లక్షణాలను గూర్చిన పూర్తి అవగాహనను కలిగించడంలో విఫలమై (స్థలాభావం, సమయాభావాలవల్ల) భయాందోళనను మరింత పెంచుతున్నాయే తప్ప తగ్గించలేకపోతున్నాయి. ఉదాహరణకు, హైపటైటిస్ - బి వల్ల నిజంగా జరిగే నష్టం మాట దేవుడెరుగుగాని, డానికి సంబంధించిన భయాన్ని ఆధారం చేసుకొని కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుంది.
ఇదంతా చూసిన తరువాత నాకు ఒక నిశ్చితాభిప్రాయం కలిగింది. ఈ దేశంలో చాలా మంది వ్యాధుల వల్ల కాకుండా, వ్యాధుల గురించిన ఆలోచనలతో భయాందోళనలకు గురవుతున్నారు.
దీనికి నావంతు ప్రయత్నంగా ఏదైనా చేయాలని అనిపించింది. ఫలితమే ఈ పుస్తకం. ఈ పుస్తకం ప్రత్యేకత లక్షణాల ఆధారంగా వ్యాధిని గుర్తించడం. సామాన్యుడు తనను ఏ లక్షణం బాధిస్తుందో చెప్పగలుగుతాడు గాని, తనని ఏ వ్యాధి బాధిస్తుందో చెప్పలేకపోవచ్చు. ఉదాహరణకు, తలనొప్పి అని చెప్పగలుగుతాడుగాని, మైగ్రేన్ అనో, క్లష్టర్ తలనొప్పి అనో కాదు. కడుపునొప్పి అని చెప్పగలుగుతాడు గాని, గాల్ స్టోన్స్ అనో, ఎపెండిసైటిస్ అనో కాదు. దురదృష్టవశాత్తు ప్రస్తుతం వివిధ మాధ్యమాల్లో మనకు లభిస్తున్న వైద్య సమాచారం వ్యాధుల పేర్లతో ఉంటోంది గాని, లక్షణాలాధారంగా కాదు.
నిజం చెప్పాలంటే ఇలా పాఠకులకు తెలియని, సంబంధం లేని వ్యాధులను చెప్పడం హేతుబద్ధం కాకపొతే ప్రమాదకరం కూడాను. హేతుబద్ధం ఎందుకు కాదంటే బ్రెస్ట్ క్యాన్సర్ లో గడ్డాలు తయారవుతాయని చదివిన పాఠకురాలు ఏ చిన్న గడ్డ కనిపించినా అది క్యాన్సరేనని హడాలిపోయే అవకాశం ఉంది కనుక. ప్రమాదకరం ఎందుకంటే పాఠకురాలికి నిజంగా బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నప్పటికీ, వ్యాసంలో వివరించిన రీతిగా లేకపోతే తనకు ఆ వ్యాధి లేదేమోనని అశ్రద్ధ చేసే అవకాశం ఉంది కనుక. సామాన్యుడికి దృష్టిలో ఉంచుకొని రాసే వ్యాసాల్లో వ్యాధి సమగ్ర స్వరూపాన్ని వివరించడం సాధ్యం కానందున ఈ సమస్య వస్తుంది. అందుకే ఈ పుస్తకంలో వ్యాధులకు కాకుండా లక్షణాలకు ప్రాధాన్యత కనిపిస్తుంది.
ఈ పుస్తకం ఎవరికైనా, ఏ విధంగానైనా ఉపయోగపడితే ఆ గొప్పతనం నాది కాదు స్వలాభాపేక్ష లేకుండా భావితరాలకు ఆయుర్వేదాన్ని అందించిన చరక సుశృతాది మహర్షులది. ఏ విషయంలోనైనా స్పష్టత లోపించిందని మీరు భావిస్తే దయుంచి నాకు తేలియజేయండి. తదుపరి ముద్రణలో డానికి మరింత వివరణ ఇస్తాను.
ఆయుర్వేదంలో వ్యాధి నిర్ధారణకు ద్వివిధ పరీక్షా పద్ధతిని ఎక్కువగా అనుసరిస్తారు. దీనిని సుశృతుడు ప్రవేశ పెట్టాడు. ప్రశ్న పరీక్ష, పంచేద్రియ పరీక్షలను ద్వివిధ పరీక్షా పద్ధతులంటారు. వీటిల్లో, మొదటిది, ముఖ్యమైనది ప్రశ్న పరీక్ష. కేవలం ప్రశ్నించడం ద్వారానే వ్యాధి నిర్ధారణకు అవసరమైన హెచ్చు సమాచారాన్ని రాబట్టవచ్చు. అందుకే ఈ పుస్తకంలో ప్రతి అధ్యాయం ప్రశ్నలతో మొదలవుతుంది.
వైద్యసలహా పొందాల్సి వస్తే....
ఈ పుస్తకం మీ ఆరోగ్యానికి సంబంధించి సమగ్రమైన అవగాహనను కలిగించినప్పటికి మందులు వాడేటప్పుడు వైద్యసలహా తీసుకోవడం తప్పనిసరి.
వైద్యసలహా కోసం వెల్లబోయే ముందు మీరు సంప్రదించబోయే డాక్టర్ కు సరైన క్వాలిఫికేషన్లు ఉన్నాయో లేదో ఆరా తీయండి, క్వాలిఫికేషన్లు ఉన్నప్పటికీ మీ ఆరోగ్య సమస్య మీద ఆ డాక్టరుకు పూర్తిస్థాయిలో అవగాహనా ఉందో లేదో తెలుసుకోండి.
డాక్టర్ వద్దకు వెళ్లబోయే ముందు సమస్యలన్నిటిని ఒక కాగితం మీద రాసుకోవాలి. ఎక్కువ బాధ కలిగించే సమస్యను ముంచు రాసి, తక్కువ ప్రాధాన్యత గల సమస్యలను తరువాత రాయాలి. అలాగే ఎంత కాలం నుంచి ఆయా బాధలు కొనసాగుతున్నాయో కూడా నోట్ చేయాలి.
ఆయుర్వేదం ఆహార చికిత్సకు, విహార చికిత్సకు, వ్యవహార చికిత్సకు ప్రాధాన్యతనిస్తుంది. ఔషధాలు చివరి స్థానాన్ని మాత్రమే ఆక్రమిస్తాయి. మీకు పూర్తి స్థాయి చికిత్స జరగాలంటే ముందు మీరు ఏ రకమైన ఆహారం తీసుకుంటున్నారో తెలపాలి. మీరు రొటీన్ గా తీసుకునే ఆహారాన్ని, రోజువారి కార్యక్రమాన్ని ఒక డైరీలో కనీసం వారం రోజుల పాటు నోట్ చేసుకొని తీసుకువెళ్లాలి.
మీ మెడికల్ రికార్డునంతా వెంటనుంచుకోవాలి. ఎక్స్ రేలు, ల్యాబ్ రిపోర్టులు అన్నీ పరిశీలనకు అవసరమవుతాయి. మెడికల్ రికార్డులనన్నిటిని తేదీల ప్రకారం వరుస క్రమంలో అమర్చుకుంటే, పరిశీలించడం సులభమవుతుంది.
మీకు ఇంతకు ముందు ఏదైనా మందులతో ఎలర్జీ వచ్చి ఉంటే ఆ విషయం చెప్పడం మర్చిపోకూడదు. అలాగే, ఇతర వైద్య విధానాలకు చెందిన మందులేమన్నా వాడుతుంటే, వాటిని గురించి కూడా చెప్పాలి.
మీ సమస్యను యథాతథంగా చెప్పాలి. చిన్న ప్రాబ్లమ్ ని పెద్దది చేసి చెప్పిన, పెద్ద సమస్యనుతక్కువ చేసి చెప్పిన, మీకు సరైన చికిత్స అందకపోవచ్చు. అలాగే, సంబంధం ఉన్నా లేకపోయినా ప్రతి సమస్యను తెలియపరచాలి. వ్యాధి నిర్ణయానికి ఇది తోడ్పడుతుంది.
చివరిగా ఒక్కమాట, సకల మానవజాడ్యాలకు ప్రకృతి రాసిన ప్రిస్క్రిప్షనే ఆయుర్వేదం! దానిని పరిపూర్ణంగా ఉపయోగించుకుని సంపూర్ణారోగ్యం పొందండి.
శత జీవ శరదోవర్ధమానః
శతం హేమన్తాన్చతమ్ వసంతాన్
“వంద శరత్తులు, వంద హేమంతాలు,
వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి" -అథర్వ వేదం