ఉపోద్ఘాతం

“భీషగ్ధ్రవ్యాణ్యుపస్థాతారోగీ పాదచతుష్టయం...”

వైద్యుడు, ఔషధ ద్రవ్యాలు, పరిచారకుడు, రోగి ఇవి నాలుగు చికిత్సకు

నాలుగు పాదాలు. వీటిని 'పాద చతుష్టయం' అంటారు.

చికిత్స నిష్ఫలం కాకుండా ఉండాలంటే ఇతర అంశాలతో పాటు రోగికి నాలుగు గునాలుండాలి. అవి జ్ఞాపకశక్తి, సూచనలను పాటించే తత్వం, భయపడకుండా ఉండటం, తాను అనుభవిస్తున్న లక్షణాలను అర్థమయ్యేలా వివరించగలగడం

                                                                     చరకి సంహిత సూత్రస్థానం

                                                                    నిర్దేశచతుష్కం, అధ్యాయం - 9

 

శరీరంలో ఏదైనా ఒక చోట నొప్పిగా అనిపించడం, సూదులు గుచ్చినట్లుండటం, కళ్లు కనపడకపోవడం, శరీరం కంపించడం, కండరాల్లో పట్టు తగ్గిపోవడం... ఇటువంటివన్నీ వివిధ రకాల లక్షణాలు. ఈ లక్షణాలు గడ్డలు, కంతుల రూపంలో వ్యక్తమవ్వచ్చు. లేదా, పచ్చ కామెర్లలాగా వివిధ రంగుల్లో కనిపించవచ్చు, ఈ లక్షణాలను మనం చూడవచ్చు, స్పర్శించవచ్చు. లేదా ఆఘ్రాణించవచ్చు. ఇవి శరీరంలో కేవలం ఒక భాగానికే పరిమితం కావచ్చు. లేదా, సర్వ శరీరగతంగా వ్యాపించవచ్చు.

 

ప్రతి మనిషిలోనూ ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని తేలికపాటివైతే మరికొన్ని ప్రమాదభరితమైనవి. అయితే, వీటినెలా తెలుసుకోవాలి? లేదా, వీటిని ఏ విధంగా అన్వయించుకోవాలి? ఉదాహరణకు, తలనొప్పి మొదలైన తరువాత అసాధారణ స్థితికి చేరుకోవడానికి ఎంతకాలం పడుతుంది? గ్యాస్ వల్ల ఏర్పడిన ఛాతినొప్పికి, గుండెకు రక్తసరఫరా తగ్గటం వల్ల ఏర్పడిన ఛాతినొప్పికి మధ్య భేదాన్ని ఎలా గుర్తించడం? రొమ్ములో ఏర్పడిన గడ్డ ప్రమాదభరితంగా ఎప్పుడు మారుతుంది? ఏ అర్థరాత్రో మీ బాబు హఠాత్తుగా ఉలిక్కిపడి లేచి, జ్వర తీవ్రతతో గుక్కతిప్పుకోకుండా ఏడుస్తుంటే, దానికి కారణాన్ని ఎలా తెలుసుకోవాలి? ఎపెండిసైటిస్ వ్యాధి వల్ల ఎదుస్తున్నాడేమోననే అనుమానం వస్తే దానిని ప్రాథమికంగా ఎలా గుర్తించాలి? ఇటువంటి లక్షణాలకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని ఈ పుస్తకం అందిస్తుంది.

 

ఆయుర్వేద సిద్ధాంతాలు, చికిత్సలు

వ్యాధుల సాధ్యాసాధ్యతలను చికిత్సతో ప్రభావితం చేయవచ్చుననేది ఆయుర్వేద దృక్పథం. చిన్న సమస్యే కదా అని జలుబును అశ్ర్రద్ధ చేస్తే ఆస్త్మాలోకి మారవచ్చు. దీనికి భిన్నంగా, జీవితాంతం బాధించే ఉబ్బసం వంటి వ్యాధులను తగిన చికిత్సలు, చర్యలతో పూర్తగా నియంత్రించవచ్చు. వైద్య శాస్త్రంలో సాధ్యాసాధ్యతలనేవి సందర్భోచితంగా మారే స్థితిగతులేతప్ప, నియమాలు ఎంత మాత్రం కాదు. ట్రీట్మెంట్ లేదనుకుని ఆశ వదిలేసుకున్న వ్యక్తులెందరికో ఆయుర్వేద వైద్యవిధానంతో స్వస్థత చేకూరింది.

 

ఆయుర్వేద మనేది ఆయుష్షును లేదా జీవితాన్ని గూర్చి వివరించే శాస్త్రం. ఆరోగ్యావగాహనకు, వైద్యపరమైన చైతన్యానికీ అవసరమైన ఎన్నో మార్గదర్శక సూత్రాలు ఇందులో ఉన్నాయి, ఆయుర్వేదం నిస్సందేహంగా ప్రపంచంలో అత్యంత సనాతనమైన, పరిపూర్ణమైన, శాస్త్రీయమైన వైద్య విధానం.

 

మనిషి శరీరం వ్యాధి గ్రస్తమడమంటే, ఒక మహాసౌధం బీటలువారడం లాంటిది, దానికి మరమ్మత్తులు చేయడం కంటే, అసలు బీటలు వారకుండా చూసుకోవడమే మంచిదంటుంది ఆయుర్వేదం. అందుకే ఆయుర్వేదంలో చికిత్సకు ఎంత ప్రాముఖ్యత ఉందో నివారణకు అంతే ప్రాధాన్యత ఉంది. నిద్ర, ఆహారం, బ్రహ్మచర్యం అనే మూడు స్తంభాల మీద మనిషి శరీరం నిలబడుతుంది. వీటిల్లో ఏ ఒక్కటి బలహీనపడినా శరీరం కుప్పకూలి పోతుంది. ఈ కారణంచేతనే శరీరానికి 'త్రిస్తూణ' అని మరో పేరును సూచిస్తుంది ఆయుర్వేదం.

 

ఒకప్పుడు మన దేశంలో ఉజ్వలంగా వెలిసిన ఆయుర్వేదం మొగలాయిల దండయాత్రలు, బ్రిటీష్ పాలకుల నిరాదరణలతో ప్రాచుర్యాన్ని కోల్పోయింది. అయినప్పటికీ ఉనికిని మాత్రం నష్టపోలేదు. పటిష్టమైన ఆయుర్వేదపు ప్రమాణాలు దీనికి కారణం. ఉదాహరణకు, “ఆముదం విరేచనకారి" అంటే ఎప్పటికీ అది విరేచనకారిగానే పని చేస్తుంది. కొంత కాలానికి డ్రగ్ టాలరెన్స్ పెరిగి పని చేయకపోవడమేనే సమస్యరాదు.

 

మనకు ఏ వ్యాధి లేనంత మాత్రాన పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు కాదు. వైద్య పరీక్షలకు అందని రుగ్మతలు ఎన్నో ఉన్నాయి. వైద్యులు పరీక్షించి అనారోగ్యం ఏదీ లేదన్నప్పటికీ అవ్యక్తమైన బాధతో నిద్రలేని రాత్రులు గడిపేవారు ఎంతో మంది ఉన్నారు. ఆయుర్వేదం సరిగ్గా ఈ విషయం మీద దృష్టి కేంద్రీకరించింది. “ప్రసన్నాత్మేంద్రియం మనః స్వస్థ ఉత్యభిదీయతే" అంటూ, ఆత్మ, ఇంద్రియాలు, మనసు ఈ మూడు సమస్థితిలో, ఆరోగ్యంగా ఉన్నప్పుడే దానిని స్వాస్థ్యం అంటారని చెప్పింది. దీనికి మరింత వివరణ ఇస్తూ 'నెయ్యి, గిన్నె - ఇవి ఒకదాని వల్ల మరొకటి వేడెక్కుతాయి. అలాగే మనోకాయాలు రెండు ఒక దాని ప్రభావం చేత మరోటి వ్యాధిగ్రస్తమవుతాయి. సంపూర్ణరోగ్యం పొందాలంటే మనసు, శరీరం ఈ రెంటికి చికిత్స జరగాలి. అయితే, శరీర లక్షణాలను తెలుసుకోవడానికి సాధనాలున్నాయికాని మనసును తెలుసుకోవడానికి లేవు. అలాంటి సందర్భాల్లో వైద్యుడు తన జ్ఞానమనే జ్యోతితో రోగి ఆత్మలోకి ప్రవేశించాలి. అప్పుడు సరైన వ్యాధినిర్ణయం సాధ్యమవుతుంది.” అంటుంది ఆయుర్వేదం.

 

ఆయుర్వేదం పంచమహాభూత సిద్దాంతాన్ని ఆధారం చేసుకుని నడుస్తుంది. ఈ ప్రపంచంలో ప్రతిదీ - జీవిగాని, నిర్జివి గాని పంచభూతాలతోనే నిర్మితమవుతుందనేది సిద్ధాంతం. దీనినే సామాన్య విశేష సిద్ధాంతమంటారు. ఆయుర్వేదచికిత్సా సూత్రాల్లో ఇదే కీలకమైనది. యావత్ సృష్టి మన శరీరంలో ప్రతిఫలిస్తుంది కాబట్టి, శరీరం, పరిసరాలు ఒక దాని వల్ల మరోటి ప్రభావితమవుతాయి. అంటే, ఆరోగ్యానికి గాని, అనారోగ్యానికి గాని మూలం శరీరానికి, బాహ్యప్రపంచానికి మధ్యనుండే సమన్వయమే. ఈ కోణం నుంచి చూడగలిగితే ఎటువంటి వ్యాధికైనా చికిత్స చేయవచ్చు.

 

ప్రపంచంలో ఔషధంగాని ద్రవ్యము, అయోగ్యుడైన మనిషీ లేడంటుంది ఆయుర్వేదం. చాలా మంది అనుకుంటున్నట్లు ఆయుర్వేదంలో కేవలం మూలికలు మాత్రమే ఉండవు. దీనిలో వృక్షసంబంధ పదార్థాలనుం జంతు సంబంధ ద్రవ్యాలను, ఖనిజాలను, లవణాలను, లోహాలను వీటన్నిటినీ ఔషధాలుగా వాడతారు. ఒకోసారి కొన్ని రకాల వ్యాధులకు మందులతో పని లేకుండా అద్రవ్యభూత చికిత్సలు కూడా చేస్తారు. నేచురోపతి నుంచి రేకీ వరకు ఎన్నో రకాల వైద్య విధానాల దృక్పథాలు ఆయుర్వేదంలో అంతర్లీనంగా కనిపిస్తాయి. ఇది అనేక వైద్యవిధానాలకు మాతృక.

 

ఆరోగ్యానికి సంబంధించి ఆయుర్వేదం ఆసక్తికరమైన సిద్ధాంతాలను చెబుతుంది. సరైన ఆరోగ్యమంటే శరీర క్రియాధర్మాలకు తోడ్పడే వాతపిత్త కఫాలనే మూడు దోషాలు; శరీర నిర్మాణంలోను, కొన్ని రకాల ప్రత్యేక పనుల్లోనూ సహాయపడే రసరక్త మాంసాది ఏడు ధాతువులు; శారీరక క్రియా ధర్మాలలో వ్యర్ధ పదార్థాలుగా వెలువడే మలమూత్ర స్వేదాలనే మూడు మలాలు; ఐదు జ్ఞానేంద్రియాలు; ఆత్మ; మనసు ఇవన్నీ సక్రమంగా వాటివాటి కార్యకలాపాలను చేస్తుండాలి. అంతే కాకుండా అంతరాగ్ని లేదా ఆకలి అనేది నిర్దేశిత ప్రమాణంలో ఉండాలి. (ఆకలిని పరిరక్షిస్తే అనేక దోషాలు ప్రకోపించినప్పటికి, వందలాది వ్యాధులు దాడిచేసినప్పటికీ ప్రాణహాని జరగదని అంటుంది శాస్త్రం.)

 

ఆయుర్వేదం శారీరక రుగ్మతలను వ్యాధుల రూపేణా కాకుండా, వ్యక్తిగతంగా, మనుషుల ప్రకృతిని ఆధారం చేసుకొని విశ్లేషిస్తుంది. వాత ప్రకృతి గలవారికి కీళ్ళనొప్పులు ఎక్కువగా రావడానికి, పైత్యశరీర తత్వమున్న వారికి చర్మవ్యాధులు, తలనొప్పులు తరచుగా బాధించడానికి, కఫతత్వం ఉన్నవారికి జలుబు, దగ్గులవంటివి ఇబ్బంది పెట్టడానికి కారణం ఆయావ్యక్తుల వ్యక్తిగత ప్రకృతే! అంటే, ఒకే వ్యాధి విభిన్న వ్యక్తుల్లో విభిన్నంగా బాధిస్తుందన్నమాట. ఆయుర్వేదం ఫలానా వ్యాధికి మందు అని కాకుండా ఫలానా వ్యక్తికీ ఫలానా మందు అని చెబుతుంది.

 

ఆయుర్వేదంలో శాస్త్ర చికిత్సలుండవని కొందరు భావిస్తుంటారు. అయితే, ఇందులో శల్య చికిత్స కూడా ప్రధానమైనదే. ప్రపంచంలో మొట్టమొదటి సర్జన్ ఆయుర్వేదాచార్యుడు సుశ్రుతుడు కావడం గమనార్హం. ప్లాస్టిక్ సర్జరీ గురించి, క్యాటరాక్ట్ శస్త్ర చికిత్స గురించి చరిత్రలో మొట్టమొదటిసారి సుశ్రుత సంహిత పేర్కొంది.

 

ఆయుర్వేదంలో వైద్య సమాచారం మొత్తం ఎనిమిది విభాగాల్లో అమరి ఉంటుంది. అందుకే దీన్ని అష్టాంగ ఆయుర్వేదమంటారు. కాయ చికిత్స (ట్రీట్ మెంట్ ఆఫ్ జనరల్ డిసీజెస్), బాల చికిత్స (పీడియాట్రిక్స్), గ్రహ చికిత్స (సైకియాట్రి), ఊర్ధ్వంగ చికిత్స (ట్రీట్ మెంట్ ఆఫ్ డిసీజెస్ ఆఫ్ హెడ్ అండ్ నెక్), శల్య చికిత్స (సర్జరీ), దంష్ట్ర చికిత్స (టాక్సికాలజీ), రసాయన చికిత్స (జేరియాట్రిక్స్ అండ్ రిజువనేషన్), వాజీకరణ చికిత్స (సెక్సాలజి)- ఈ ఎనిమిది ఆయుర్వేదపు ప్రధాన శాఖలు.

 

పూర్వ కాలం, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో దీర్ఘవ్యాధికి గురైన మనుషులను పాశవికంగా, ఊరిబయట గుహల్లో మరణించేవరకు బంధించిఉంచే ఆచారం ఉండేది. అలాంటి రోజుల్లో సైతం ఆయుర్వేదం హస్పటాలిటీని (కుటీ ప్రావేశికం) ప్రోత్సహించింది. దీనార్థులకు మానవత్వంతో చికిత్స చేయాలని హితవు చెప్పింది.

 

పంచకర్మలు: పేరుకు తగ్గట్లు ఈ చికిత్సలు అయిదు రకాలుగా ఉంటాయి. మూలికల ద్వారా వంటికి కలిగించటాన్ని'పమనం' అంటారు. ఔషధాన్ని ప్రయోగించి ఎప్పటినుంచో కడుపులలో పేరుకొని ఉన్న మలాన్నంతా బయటకు తేవటాన్ని 'విరేచనం' అంటారు. అలాగే, కశాయాలతో చేసే ఎనిమా లాంటి పద్ధతిని 'కాషాయవస్తి' అని, ఔషధసిద్ధతైలాలతో చేసే దానిని 'తైలవస్తి' అని అంటారు. ఇక చివరి పధ్ధతి 'నస్యకర్మ', దీనిలో ముక్కును మార్గంగా చేసుకొని ఔషధాలను ప్రయోగించడం జరుగుతుంది.

 

ఈ పంచకర్మలు చేసేముందు శరీరాన్ని చికిత్సకు సన్నద్ధం చేయడం కోసం 'స్నేహ స్వేదాలు' అనే పూర్వకర్మలను చేయాల్సి ఉంటుంది. ఇవి కణాంతర్గత మలినాలను వదులుగా చేసి జీర్ణాశయం వైపు మరల్చడానికి తోడ్పడతాయి. అలాగే, పంచ కర్మల తర్వాత శరీరాన్ని బలోపేతం చేయడం కోసం 'పశ్చాత్ కర్మలు' తోడ్పడతాయి. పూర్వకర్మలను 'ప్రీ ఆపరేటివ్ పద్దతి' గానే ప్రధాన పంచ కర్మలను ' ఆపరేటివ్ పధ్ధతి' గాను, పాశ్చాత్ కర్మలను 'పోస్ట్ ఆపరేటివ్ పద్దతి' గాను అర్థం చేసుకోవచ్చు. (ఈ మధ్య కొన్ని కేరళ సెంటర్లు వివిధ రకాలైన మసాజ్ లను పంచకర్మలుగా ప్రచారం చేస్తున్నాయి. ఇది దురదృష్టకరం. మసాజ్ అనేది పూర్వ కర్మలలో ఒక భాగం మాత్రమే, దీనిని మాత్రమే చేసి, ప్రధాన కర్మలైన పంచకర్మలను చేయకపోతే శరీరంలో 'దోషాలు' మరింత వృద్ధి చెంది వ్యాధిని తీవ్రతరం చేసే ప్రమాదం ఉంది.)

పంచ కర్మ చికిత్సలు శరీరంలో పనిచేసే విధానం చాలా ఆసక్తికరంగా వుంటుంది. ఒక వ్యక్తి ఏదన్నా ఒక విష పదార్ధం తిన్నాడనుకుందాం. అది అమాశయం నుంచి మరింత లోనికి వెళ్ళకుండా వెంటనే వాంతి అయిపొయింది. అమాశయాన్ని దాటుకొని పేగుల్లోకి ప్రవేశించినా అక్కడ ఎక్కువ సేపు ఉండటం ప్రమాదం కాబట్టి శ్లేష్మంతో కలిసి పలుచగా తయారై, విరేచనం రూపంలో బయటకు వచ్చేస్తుంది. కొద్దో గొప్పో విష పదార్ధం శరీరంలోకి విలీనమైనా, అది చమట ద్వారాగాని, శ్వాస ద్వారాగాని బయటకు విసర్జితమైపోతుంది. వాంతి, విరేచనం, స్వేదం... ఇవన్నీ రక్షక వ్యవస్థలు. హాని కరమైన అంశాల నుంచి మన శరీరాన్ని కాపాడటానికి తోడ్పడే సహజ ప్రక్రియలు, ఆయుర్వేదం ఈ విసర్జన క్రియలను చికిత్సా విధానాలుగా మలచుకుంది, వీటినే పంచకర్మలని అంటారు. ఇవి వ్యాధుల లక్షణాల మీద కాకుండా కారణాల మీద పనిచేసి వాటిని సమూలంగా తుడిచి పెడతాయి. ఈ కారణం చేత వీటిని 'శోధన కర్మలు' అని కూడా అంటారు.

 

పంచకర్మల వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఆరోగ్యవంతులు స్వాస్థ్వాన్ని కాపాడుకోవడం కోసం, రుతు చర్యలో భాగంగా వీటిని తీసుకోవచ్చు, సంవత్సరం పొడవునా ఋతువులు మారుతుంటాయి. వాటికి అనుగుణంగా శరీరంలో దోషాలు కూడా పెరిగిపోతుంటాయి. ప్రకోపించిన దోషాలను ఎప్పటికప్పుడు బయటకు పంపించకపోతే లోలోపలే పెరిగిపోతుంటాయి. ప్రకోపించిన దోషాలను ఎప్పటికప్పుడు బయటకు పంపించకపోతే లోలోపలే పెరిగిపోయి వ్యాధులను కలిగిస్తాయి. అందుకే వర్షాకాలంలో వాతాన్ని తగ్గించడం కోసం 'వస్తికర్మ'ను, చలికాలంలో కఫాన్ని తగ్గించడం కోసం 'వమన కర్మ'ను ఎండాకాలంలో పిత్తాన్ని తగ్గించడం కోసం 'విరోచన కర్మను' ప్రతివారు తీసుకోవాలని శాస్త్రం చెబుతుంది.మురికి గుడ్డకు రంగు వేస్తె ఎలా అయితే రంగు అంటుకోదో అలాగే, మలినాలతో కూడిన శరీరంపై ఔషధాల ప్రభావం అంతగా ఉండదని శాస్త్రం చెబుతుంది. దీనికి పరిష్కారంగా పంచకర్మలు చేస్తే శరీరం శుద్ధమై, ఆహారాన్ని, ఔషధాలను చక్కగా స్వీకరిస్తుంది. నేటి కాలంలో పెరిగిపోతున్న ఆటో ఇమ్యూన్ వ్యాధులకు, డీజనరేటివ్ డిజార్డర్స్ కి పంచకర్మలు చక్కని పరిష్కారాలు.

 

శిరోధార: మానసిక వత్తిడి ఎదురైనప్పుడు చాలా మందికి నుదురు ప్రాంతంలో చమట పడుతుంది. కొంతమంది టెన్షన్ తగ్గించుకోవడానికి గాని, ఆలోచనలకు పదునుపెట్టుకోవడానికి గాని నుదురు రుద్దుకుంటారు. దీనిని బట్టి నుదురు అనేది టెన్షన్ ని బయట పడేసేందుకు తోడ్పడే ముఖ్యమైన ప్రదేశమని మనకు అర్థమవుతుంది. ఆయుర్వేద 'ధారా చికిత్స'తో ఈ ప్రదేశాన్ని శక్తివంతం చేయవచ్చు. ఈ చికిత్స నిద్రలేమికి అద్భుతంగా పని చేస్తుంది. అలాగే మైగ్రేన్, సోరియాసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్స్ వంటి సైకోసొమాటిక్ వ్యాధుల్లో అత్యంత ఉపయోగకారి.

 

హెర్బల్ ఆయిల్ మసాజ్: చర్మం మనిషి అంగ ప్రత్యాంగాలన్నింటిలో పెద్దది. దీనిని అలవోకగా స్పృశిస్తే చాలు, ఎన్నెన్నో జీవరసాయనాలు శరీరంతర్గతంగా విడుదలవుతాయి. ఆయుర్వేదం ఈ విషయానికి ప్రాముఖ్యతనిచ్చి చికిత్సా విధానంగా రూపొందించింది. దీనిని 'ఉద్వార్తనం' అంటారు. ఇది పూర్వకర్మలో ఒక భాగం. ఈ చికిత్సా పద్ధతిలో మొదట ఔషధ తైలాలను శరీరానికి పూసి కండరాల అమరికకు అనుగుణంగా వ్యాధి తీవ్రతను బట్టి నిర్ణీతమైన ఒత్తిడిని ప్రయోగిస్తూ శరీరానికి మర్థన చేయడం జరుగుతుంది, దీనివల్ల రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది, నాడీ వ్యవస్థ చైతన్య మవుతుంది. శరీరపు కాంతి ఇనుమడిస్తుంది. కండరాలు మంచి ఆకృతిని పొందుతాయి. ఈ ట్రీట్ మెంట్ అద్భుతమైన రిలాక్సేషన్ ని ఇస్తుంది.

 

హెర్బల్ స్టీం బాత్: ఇది స్వేద కర్మలో ఒక పద్దతి. నీటి ఆవిరికి స్థూలకాయం, రక్తపు పోటు, చర్మవ్యాధులు మొదలైన వాటిని తగ్గించే నైజం ఉందన్న సంగతి తెలిసిందే. ఈ చికిత్సా విధానంలో కేవలం నీళ్ళనే కాకుండా శక్తివంతమైన మూలికలను సైతం వాడటం జరుగుతుంది.

 

కాయసేకం: ఔషధ తైలాలకు సూక్ష్మత్వం అనే గుణం ఉంటుంది. ఈ గుణం చేత అవి శరీరంలోకి తేలికగా ప్రవేశించగలుగుతాయి. కాయసేకం అనే ఈ చికిత్సా పద్ధతిలో గోరువెచ్చగా ఉన్న తైలాలను కొంత ఎత్తునుంచి పిండుతూ ప్రయోగించడం జరుగుతుంది. ఎత్తునుంచి సుఖోష్ణంగా పడటం వల్ల ఈ తైలాలు శరీరంలోకి తేలికగా చొచ్చుకు వెళతాయి. పక్షవాతం, నరాల జబ్బులు, కీళ్ళనొప్పులు మొదలైన వాటిల్లో ఈ చికిత్సా విధానం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చు.

 

పిండ స్వేదం: ఎండిపోయి బిరుసుగా తయారైన కర్రముక్కను మామూలుగా వంచితే విరిగిపోతుంది. దానికే నూనె రాసి వేడి సెగను చూపిస్తే తేలికగా వంకర తిరుగుతుంది. సరిగ్గా ఇదే మాదిరిగా, వాత ప్రకోపంతో బిగదీసుకుపోయిన శరీరంలో స్నేహస్వేదాల ద్వారా కదలికలను తీసుకురావచ్చునంటుంది ఆయుర్వేదం. “పిండస్వేదం' అనే ఈ చికిత్సా ప్రక్రియలో శరీరానికి ఔషధయుక్త తైలాలను రాసి ఓషధులు, వివిధ ధాన్యాలతో తయారు చేసిన మూటలతో మర్దన చేయడం జరుగుతుంది.

 

క్షార సూత్రం: ఈ చికిత్సా ప్రక్రియలో ఔషధ క్షారాలతో తయారుచేసిన దారాన్ని ప్రయోగించడం జరుగుతుంది. ఆర్శమొలలు (పైల్స్), భగందరం (ఫిస్త్యులా) వంటి వ్యాధులలో ఈ చికిత్సా పద్దతి అత్యుత్తమమైనది. వ్యాధి పునరావృతం కాకుండా ఉండటం, హాస్పిటల్ లో రోజుల తరబడి ఉండాల్సిన అవసరం లేకపోవడం, నొప్పి ఉండక పోవడం, కాంప్లికేషన్లు తక్కువగా ఉండటం అనే అంశాల కారణంగా ఎక్కువ మంది క్షారసూత్ర విధానానికి ప్రాముఖ్యతనిస్తున్నారు.

 

ఇవే కాకుండా, రక్త మోక్షణం (సంచితమైన రక్తాన్ని, మలిన రక్తాన్ని బయటకు తీయడం), జలౌకావచరణం (జలగలను ప్రయోగించి రక్తపు గడ్డలను కరిగించడం), భగ్నచికిత్సలు (విరిగిన ఎముకలను పైపూత మందులతోనూ, ప్రత్యేక ప్రక్రియలతోనూ తిరిగి అతికించడం), మర్మ చికిత్సలు (నాడుల కేంద్రాలను ప్రభావితం చేసి తగిన చికిసా ఫలితాలను పొందటం), అగ్ని కర్మ (ఉష్ణ తప్త శలాకలను ప్రయోగించి అవసరమైన చికిత్సా ఫలితాలను పొందటం) వంటి ప్రత్యేక ఆయుర్వేద చికిత్సలు అనేకం ఉన్నాయి. వీటి సమిష్టి ప్రయోగంతో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు.