కృష్ణమోహన్ కోసం రామంగదిసర్ది, పక్క పరిచింది సరోజ. భోంచేశాక అతనికి గది చూపించడానికి వచ్చిన సరోజతో ఏకాంతం దొరగ్గానే-చప్పున చేయి చాచి ఆమె చేయి పట్టుకుని "సరోజా! ఎందుకొచ్చేశావు?" సూటిగా అడిగాడు. అతని చొరవకి ఆమె తడబడి వణికింది. "ముందు మీరెందుకు వచ్చారసలు అది చెప్పండి" అంది బింకంగా కోపం నటిస్తూ.
    "నీ-కోసం. చెప్పకుండా చెయ్యకుండా దేవిగారు పరుగెత్తి వస్తే నీ వెంట రాకేం చెయ్యమంటావు. అసలు ఎందుకలా పారిపోయి వచ్చావు" చేయి కదలకుండా మరింత గట్టిగా బిగించాడు.
    "నేనేం పారిపోయి రాలేదు. మా మామయ్యని అత్తయ్యని చూడాలని వచ్చాను అంతే" అంది దర్పంగా సరోజ.
    "అదే అయితే ఆమాట చెప్పొచ్చుగా" లాలనగా అన్నాడు.
    "ఎందుకు చెప్పాలి. మీ పర్మిషన్ లేనిదే నేనేం చెయ్యకూడదా" సరోజ మరింత బింకంగా అంది.
    "చెయ్యకూడదు" కొంటెగా అన్నాడు కృష్ణ మోహన్ ఆమె కళ్ళలోకి చూస్తూ.
    "అవునవును, మీరు, నించోమంటే నించుని, కూర్చో మంటే కూర్చోడానికి మీ నౌకర్ని కాను మీయిష్టం వచ్చిన నిందలన్నీ వేస్తూంటే సహించి పడుండాల్సిన అవసరం నాకేం లేదు. అందుకే వచ్చేశాను. నా ఖర్మానికి నన్ను వదలకుండా యిక్కడికి కూడా ఎందుకు వచ్చారు. ఇంకా అవమానించడానికి ఏం మిగిలిందని" పౌరుషంగా అంది. ఆ మాటలకి ఆ చూపులకి భయపడినట్లు అలాగే కళ్ళలోకి చూస్తూ నవ్వాడు "ఎలాగో వెనకాలే వస్తానని తెలిసే అంత ధైర్యంగా వచ్చావుకదూ"చిలిపిగా అన్నాడు. ఆ మాటకి సరోజ మొహం ఎర్రబడింది. ఏదో అనాలని అనలేక తడబడింది. చటుక్కున చెయ్యిపట్టి ముందుకు లాక్కున్నాడు. సరోజ కోపంగా "ఏమిటిది....ఏమిటి మీ ఉద్దేశం. విడవండి" అంది తీక్షణంగా.
    "సరోజా....నేనెందుకొచ్చానో తెలియదా....తెలిసి కూడా ఎందుకిలా మాట్లాడుతున్నావు. యింకా కోపమేనా, ఆరోజు పార్కులో నిన్ను అలా అన్నాననేమో నీ కోపం...అలా అనకపోతే నిజం బయటికి వచ్చేదా, నిజం బయటికి రాకపోతేనీవునావు దక్కుతావా చెప్పు-నిన్ను ప్రభాకరాన్ని పార్కుకి వచ్చి ఎందుకు వుండమన్నానో కూడా ఆమాత్రం అర్ధం చేసుకోకుండా అలిగి పారిపోయివస్తావా. నీవు పారిపోతే నిన్ను పట్టుకోలేనను కున్నావా. చెప్పు, యింకా కోపమేనా నామీద. యింట్లో అమ్మ ఎంత గాభరాపడుతుందో తెలుసా నిన్ను తీసుకురాకుండా యింటికి రావద్దంది అమ్మ."
    సరోజకి ఒకపక్క ఆశ్చర్యం, అనుమానం, ఆనందం చుట్టుముట్టాయి. కృష్ణమోహన్ మాటలకి అర్ధం బోధపడగానే ఆమెమనసు ఒక్కక్షణం లయతప్పింది. నమ్మలేనట్టు చూసింది.
    "సరోజా-ఏ ముహూర్తాన నీవు నా ఇంట్లో అడుగు పెట్టావో కాని నిన్ను వదులుకోలేక పోయాను సరోజా-నిన్ను శాశ్వితంగా ఎలా వుంచుకోవాలో తెలియక నేనెంత మధనపడ్డానో నీ కర్ధంకాదు. గీత కథ ఈవిధంగా మలుపు తిరగకపోతే ఈ జీవితంలో నేనెంతో పోగొట్టుకునేవాడిని" సరోజని దగ్గిరకి లాక్కుని గుండెలకదుముకుంటూ పారవశ్యంగా అన్నాడు, సరోజకి కలలావుంది. కృష్ణమోహన్ మాటలు వింటూంటే తను కలలోకూడా ఆశించనిది జరిగితే ఎంతటి దిగ్భ్రమ కలుగుతుందో అలా వుంది ఆమె స్థితి-కృష్ణమోహన్ గుండెలలో మొహం దాచుకున్న సరోజ ఏం మాట్లాడాలో అర్ధంకాని దానిలా అతని కౌగిలినించి తప్పించు కోవాలనికూడా తట్టనట్టువుండిపోయింది.
    "సరోజా....మాట్లాడు సరోజా....నమ్మలేక పోతున్నావా-నీకేకాదు నాకూ నమ్మశక్యం కానిదిగానే కనిపిస్తూంది. యింక ఈ జన్మకి నిన్ను పొందే అవకాశం లేదనుకున్నాను. కాని నే నదృష్టవంతుడిని..." ఆమె మొహం పై కెత్తి కళ్ళలోకి చూస్తూ ప్రేమగా అన్నాడు.
    "గీత....మరి గీత- ఏమయింది- ఏమంది-" ఆరాటంగా ప్రశ్నించింది.
    "అనేందుకు ఏముంది? ఆమె ఎవరికీ చెందిందో వారు స్వీకరించారు ఆమెని. గీత ఎంత మారిందో తెలుసా - ఐశ్వర్యం, అంతస్తు అన్నీ విడిచి ప్రభాకర్ తో వెళ్ళి పోయింది" అంతా చెప్పాడు.
    "నిజంగా-" సంతోషంగా అంది సరోజ. "ప్రభాకరం నిజంగా చాలామంచివాడు. అతను కాబట్టి గీతకి ద్రోహం చెయ్యకుండా మళ్ళీ ఆమెని అంగీకరించాడు." ఆనందంగా అంది.
    "అయితే నేనేనా చెడ్డవాడిని. నీకోసం యింత కష్టపడి వెతుక్కుంటూ వస్తే కృతజ్ఞతలయినా చెప్పవేం..." అలిగినట్టు అన్నాడు.
    "ఉహు మీకు, కృతజ్ఞతలు చెప్పాలనిపించడంలేదు. కృతజ్ఞతలు పైవాళ్ళకి చెపుతారు. మీరు నాకు పరాయివా రనిపించడంలేదు. చూసిన ముందుక్షణంనుంచీ మా బావే మీరుగా నా మనసులో నిలిచిపోయారు. అందుకే మీ యింట్లో వుంటూ గీతని, మిమ్మల్ని చూస్తూ నే ననుభవించిన బాధ మీ కర్ధంకాదు. ఇప్పుడు మిమ్మల్ని పొందడం నా హక్కుగా మాత్రమే అనిపిస్తుంది. నా వస్తువేదో కొద్ది రోజులు అన్యాక్రాంతమై తిరిగి నాకు లభించినట్లు మాత్రమే అనిపిస్తూంది." అతని గుండెల్లో వదిగిపోతూ తనకు తాను అనుకున్నట్టుంది సరోజ. కృష్ణమోహన్ తృప్తిగా ఆమెను మరింతగా హత్తుకున్నాడు.
    
                                     *    *    *
    
    "అమ్మా ఇదిగో సరోజని తీసుకు వచ్చాను చూడు."
    సరస్వతమ్మ ఆరాటంగా గుమ్మంలోకి ఎదురువెళ్ళి "సరోజ వచ్చావా అమ్మా, నీవు లేని యీ ఇల్లు వారం రోజులలో ఎలా అయిపోయిందో తెలుసా. ఇంకెప్పుడూ విడిచి వెళ్ళకమ్మా" సరోజ చేయి పట్టుకు దగ్గిరికి లాక్కుని ఆర్ద్రంగా అంది ఆమె.
    "ఇంకెక్కడికి వెళ్ళకుండా ఎప్పుడూ యిక్కడ వుండే ఏర్పాటుచేసి తీసుకొచ్చానమ్మా" కృష్ణమోహన్ కొంటెగా అన్నాడు. సరస్వతమ్మ అర్ధంకానట్టు చూసింది, సరోజ సిగ్గుగా తలదించుకుంది.
    "అవునమ్మా కూతురుగా అయితే ఎప్పుడైతే వెళ్ళక తప్పదని కోడలిగా తీసుకొచ్చాను, ఇంకెక్కడికెడ్తుంది" నవ్వుతూ అన్నాడు.
    సరస్వతమ్మ సంభ్రమాశ్చర్యానందాలతో అదేమిటి-అదేమిటి అనిమాత్రం అనగలిగింది.
    "అది అంతే- చెపుతాపద అమ్మా లోనికి" అన్నాడు కృష్ణమోహన్ తల్లి భుజంచుట్టూ ఓ చెయ్యి, సరోజ భుజం చుట్టూ ఓ చెయ్యివేసి ఇద్దరినీ లోపలికి నడిపిస్తూ.
    
                                      -: సమాప్తం :-