వృషణాలలో నొప్పి

 

1. వృషణాల పైన దెబ్బ తగిలిందా?

వృషణాలకు దెబ్బ తగలడం / గాయమవడం

2. వృషణాలపైన నీలిరంగులో సిరలు కనిపిస్తున్నాయా?

సిరలు ఉబ్బతం (వేరికోస్ వీనస్ / వేరికోసీల్)

3. నొప్పి వృషణాల పైనగాని, కిందగాని ఎక్కువగా కేంద్రీకృతమై ఉందా?

వృషణాల పై నుండే బొడిపె వంటి భాగంలో వాపు (ఎపిడిడిమైటిస్)

4. గజ్జలో గాని, వృషణంలోగాని కంతి మాదిరి పెరుగుదల కనిపిస్తుందా?

గజ్జలో గిలక (ఇంగ్వైనల్ హెర్నియా)

5. వృషణాలలో నొప్పితో పాటు చెంపలు వాచాయా?

గవద బిళ్ళలు (మంప్స్)

6. ఆకారణంగా నొప్పి వచ్చిందా?

వృషణాలు మెలికపడటం (టార్షన్)

7. లైంగికంగా ఉద్రేకపడిన తరువాత వృషణాలలో అసౌకర్యము, నొప్పి కలుగుతాయా?

శుక్రవేగావరోధం

8. మూత్రవిసర్జన చేస్తున్నప్పుడు మూత్రంలో రక్తం కనపడుతుందా?

మూత్రపిండాల్లో రాళ్ళు (కిడ్నీ స్టోన్స్)

 

వృషణాలనేవి మగవారిలో వీర్యకణాలను ఉత్పత్తి చేస్తాయి. శుక్రకణాలు ఉత్పత్తి సక్రమంగా జరగాలంటే ఉష్ణోగ్రత శారీరక ఉష్ణోగ్రత కన్నా రెండు డిగ్రీలు తక్కువ ఉండాలి. ఇందుకోసమే వృషణాలు శరీరానికి వెలుపల, కొంచెందిగువన వేలాడుతూ ఉంటాయి. అయితే ఈ అమరిక వల్ల ఒక ఇబ్బంది కూడా ఉంది. సరైన రక్షణ లేనందుణ వృషణాలకు తేలికగా దెబ్బలు తగలవచ్చు. వృషణాలలో ఉండే నిర్మాణాల్లో హెచ్చు సంఖ్యలో నరాలు వ్యాపించి ఉండటం వల్ల ఏ కొంచెం అసౌకర్యంగాని, ఒత్తిడిగాని కలిగినా, అది తీవ్రమైన నొప్పిగా రూపుదిద్దుకుంటుంది. కొన్ని సందర్భాలలో నొప్పితో పాటు వాపుగాని, మూత్రంతో పాటు రక్తం పడటంగాని, జ్వరం గాని, మూత్రంలోమంటగాని ఉండవచ్చు. ఒకవేళ వృషణాలలో నొప్పి లేకుండా కేవలం కంతిమాదిరి పెరుగుదల మాత్రమే ఉంటే, ముందు అది క్యాన్సర్ సంబంధమైన పెరుగుదల కాదని నిర్ధారించడం చాలా అవసరం. అదృష్టవశాత్తు వృషణాలకు సంబందించిన క్యాన్సర్ చాలా తక్కువ శాతం మంది మగవారిలో కనిపిస్తుంది. 'హైడ్రోసిల్' అనే వృషణాలకు సంబంధించిన వ్యాధిలో నొప్పి పెద్దగా ఉండకపోయినప్పటికి చేతితో తాకినప్పుడు గట్టిగా కాకుండా, మృదువుగా, నీతితో నిండిన రబ్బరు బెలూన్ గాలా స్థిరంగా అనిపిస్తుంది. వృషణాలలో నొప్పి ఉన్నప్పుడు దానికి దారి తీసే అనేక రకాలైన కారణాల గురించి ఆలోచించాల్సి ఉంటుంది.

1. వృషణాలకు దెబ్బ తగలడం / గాయమవడం:

వృషణాలు ఒక ముఖ్యమైన మర్మస్థానం. రోజు వారి పనులను చేసుకునేటప్పుడు గాని, ఆటలు ఆడేటప్పుడు గాని, వ్యాయామం చేసేటప్పుడు గాని వృషణాలకు తేలికగా దెబ్బ తగిలే అవకాశం ఉంది. అలా కనుక జరిగితే ఎర్రగా కమలటం, వాపు జనించడాలు ఉంటాయి. సరైన అండర్ వేర్ ధరించడంతోపాటు వేడి కాపడం వంటి ఉపచారాలతో కొద్ది రోజులలోనే ఈ తరహా నొప్పి ఉపశమిస్తుంది. కొంతమందికి వేసెక్టమీ చేయించుకున్న తరువాత కూడా ఇలాంటి వాపు ఏర్పడుతుంది.

సూచనలు: దెబ్బల వలన వృషణాల నొప్పి, వాపులు ఉన్నట్లయితే కొద్ది రోజుల్లోనే సరైన విశ్రాంతితో నొప్పి, వాపు తగ్గిపోతాయి. నొప్పి తగ్గకుండా ఇబ్బంది పెడుతున్నట్లయితే, కాంచనార గుగ్గులు అనే మందును పూటకు రెండు మాత్రలు చొప్పున మూడు మూడు పూటలా తీసుకుంటూ పైపూతగా మహానారాయణ తైలాన్ని వాడుకోవాలి. వృషణాలలో నొప్పి ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మసాజ్ చేయకూడదు.

2. సిరలు ఉబ్బటం (వేరికోస్ వీన్స్ / వేరికోసీల్):

ఒకోసారి కాలిలో వుండే సిరల మాదిరిగా వృషణాలలో ఉండే సిరలు కూడా ఉబ్బిపోయి "వేరికోసీల్'గా మారే అవకాశం ఉంది. వేరికోసిల్ అనేది చూడటానికి 'ఒక పలుచని సంచిలో కట్టి వుంచిన నీలం రంగు పురుగుల సముదాయం' లాగా వృషణకోశాల అగ్రభాగంలో కనిపిస్తుంది. చేతితో తాకితే విపరీతమైన నొప్పి ఉంటుంది. ఈ స్థితితో ఇబ్బందిపడుతున్నప్పుడు , సరైన సపోర్ట్ ఉండే విధంగా అండర్ వేర్ ధరించడం ముఖ్యం. అవసరానుసారం శస్త్ర చికిత్స చేస్తే ఉపయుక్తం.

ఔషధాలు: వృద్ధివాదికవటి, అభాయారిష్టం, అర్శకుఠార రసం, బోలపర్పటి, గుడూచిసత్వం, కుటజావలేహ్యం, లవణభాస్కర చూర్ణం, మహావాత విధ్వంసినీ రసం, పీయూషవల్లీరసం, ప్రాణదాగుటిక, సప్తవింశతిగుగ్గులు, త్రిఫలా గుగ్గులు, ఉసీరాసవం.

బాహ్యప్రయోగం- మహానారాయణతైలం.

3. వృషణాలపై నుండే బొడిపె వంటి భాగంలో వాపు (ఎపిడిడిమైటిస్):

వృషణాల వెనుక భాగంలో అనేకమైన నాళాలతో ఒక నిర్మాణం అనుసంధానించబడి ఉంటుంది. వైద్యపరిభాషలో ఈ నిర్మాణాన్ని 'ఎపిడిడిమిస్' అంటారు. వృషణాలలో తయారైన శుక్రకణాలు చిన్న చిన్న నాళాల ద్వారా ఎపిడిడిమిస్ చేరుకొని, అక్కడనుంచి వాస్ - డిఫరెన్స్ ద్వారా ప్రోస్టేట్ గ్రంథికి, దాన్నుంచి పురుషాంగంలోని మూత్రనాళం ద్వారా వెలుపలికి ప్రయాణిస్తాయి. ఒకోసారి ఈ ఎపిడిడిమిస్ కు ఇన్ఫెక్షన్ సోకి వాచిపోతుంది. అలా జరిగినప్పుడు దానిని 'ఎపిడిడిమైటిస్' అంటారు. ఈ స్థితి ప్రాప్తించినప్పుడు వృషణాల పై భాగంలోగాని, క్రిందభాగంలోగాని ముట్టుకోలేనంత నొప్పి ఉంటుంది. దీనిలో శోథహర ఔషధాలను అవసరానుసారం వాడాల్సి ఉంటుంది.

ఔషధాలు: అశ్వగంధాది చూర్ణం, దశమూలారిష్టం, ధనవంతరగుటిక, క్షీరబలాతైలం, కాంచనారగుగ్గులు, శోథఘ్నవటి

బాహ్యప్రయోగాలు - మర్మగుటిక, నాల్పామరాది తైలం, పిండ తైలం, సురదారు లేపచూర్ణం.

గజ్జలో గిలక (ఇంగ్వైనల్ హెర్నియా):

గజ్జ ప్రాంతంలోగాని, వృషణంలోగాని కంతి ఆకృతి కనిపించి తగ్గిపోతూ ఉంటే 'ఇంగ్వైనల్ హెర్నియా' (గిలక) గురించి ఆలోచించాలి. ఉదర ప్రదేశంలోని కండరపు గోడలు బలహీనంగా మారి పట్టుకోల్పోయినప్పుడు పేగులలో కొంత భాగం లూప్ మాదిరిగా గజ్జలోనికి, అక్కడ నుంచి వృషణంలోనికి జారుతుంది. డీలా పడిన ఉదరపు కండరాలు అదనంగా సాగటం వల్ల ఉదరంలోనూ, గజ్జల్లోనూ నొప్పిగా అనిపించడంతోపాటు వృషణంలో కూడా నొప్పి వస్తుంది. వృషణకోశంలోకి జారిన హెర్నియా వల్ల దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, నిలబడినప్పుడు.... మరో మాటలో చెప్పాలంటే, ఉదర ప్రదేశంలో ఒత్తిడి ఏర్పడే అన్ని సందర్భాలలోనూ నొప్పి, వాపులు ప్రస్ఫుటమవుతాయి. ఆయుర్వేద శాస్త్రకారుడు ఈ స్థితిని 'ఆంత్రవృద్ధి' అన్న పేరుతో వివరించాడు. ప్రారంభంలోనే గుర్తిస్తే స్నేహకర్మ, స్వేదకర్మ అనే ప్రత్యేక ఆయుర్వేద పద్ధతులతో ఈ స్థితిని చక్కదిద్దవచ్చు.

ఔషధాలు: నిత్యానంద రసం, వృద్ధివాదికవటి.

బాహ్యప్రయోగాలు - వాతారితైలం, హింగుత్రిగుణ తైలం, సైంధవాదితైలం.

4. గవద బిళ్ళలు (మంప్స్):

గవద బిళ్ళల వ్యాధి (మంప్స్ అనే లాలాజల గ్రంథులకు సోకే వైరస్ వ్యాధి) వచ్చినప్పుడు కొంతమందికి వృషణాలలో నొప్పి వస్తుంది. నిజానికి ఈ వ్యాధి పసితనంలో ఎక్కువగా వచ్చేదైనప్పటికి పెద్దవారిలో రాదని చెప్పలేము. టీకాలు ద్వారా నేటి కాలంలో చాలా వరకూ ఈ వ్యాధి అదుపులో ఉంటున్నప్పటికీ అరుదుగానైనా కొన్ని కేసుల్లో వ్యాధి లక్షణాలు ఇప్పటికి కనిపిస్తూనే ఉన్నాయి. ఈ వ్యాధిలో ప్రధానంగా లాలాజల గ్రంథులు ఇన్ ఫెక్ట్ అయినప్పటికీ, ప్యాంక్రియాస్, వృషణాలు కూడా వ్యాధి బారిన పదే అవకాశం లేకపోలేదు. ఇలా వృషణాలు వాపునకు, నొప్పికి గురైన వారిలో 10 శాతం మందికి శాశ్వత వంధ్యత్వం ప్రాప్తించే అవకాశం ఉంది.ఈ స్థితిని ఆయుర్వేదంలో 'పాషాణగర్ధభం' అంటారు. ముందస్తుగా లాలాజలగ్రంథులు వ్యాధిగ్రస్తమవుతాయి కాబట్టి 'కర్ణమూలిక' అని కూడా దీనికి మరో పేరు ఉంది.

గృహచికిత్సలు: 1. రావిపట్ట పొడి, శొంఠి పొడి వీటిని నీటితో సహా ముద్దగా నూరి పైన పట్టు వేయాలి. 2. అవిసి ఆకులను దంచి, పసరు పిండి పైకి లేపనంలా రాయాలి.

ఔషధాలు: హింగుళేశ్వర రసం, మృత్యుంజయ రసం, త్రిభువన కీర్తి రసం.

బాహ్యప్రయోగం - గంధఫిరోజ లేపం, అర్కలేపం.

5. వృషణాలు మెలికపడటం (టార్షన్):

వృషణ కోశాలలోని వృషణాలు అటూ, ఇటూ తేలికగా కదలగలిగేలా ఉన్నప్పటికీ, వాటికవి మెలికలు తిరిగి ఉచ్చు బిగుసుకోకుండా ఉండటం కోసం లోపల తగినంత ఖాళీ ప్రదేశము, తగిన అమరిక ఉంటాయి. ఒకోసారి ఈ అమరిక దెబ్బతిని, వృషణాలు మెలికపడి రక్త సరఫరాను కోల్పోతాయి. వైద్య పరిభాషలో ఇటువంటి స్థితిని 'టెస్టిక్యులర్ టార్షన్' అంటారు. రక్త సరఫరాకు అవరోధం ఏర్పడటం వల్ల వృషణాలలో తీవ్రమైన నొప్పి, వాపు కలుగుతాయి. సాధారణంగా ఈ స్థితి దానంతటకు అదే తగ్గేదైనప్పటికీ, కొన్ని సందర్భాలలో మాత్రం తగ్గకుండా ప్రమాదకర స్థితిలోనికి దారితీస్తుంది. ఆరుగంటలకు మించి వృషణాలకు రక్తసరఫరా నిలిచిపోతే వృషణాలు నైక్రోసిస్ కు లోనై నిర్జీవమైపోయేందుకు అవకాశం ఉంది. దీనికి తక్షణమే వైద్య సహాయం కల్పించాలి. అత్యవసరం కాని కేసులను శోథహర (యాంటీఇన్ ఫ్లమేటరీ) ఔషధాలతో చికిత్సించవచ్చు.

ఔషధాలు: పునర్నవాదిమండూరం, ఆరోగ్యవర్ధినీవటి, తాప్యాదిలోహం, అభాయారిష్టం, పునర్నవాసవం, శారిబాద్యాసవం, స్వర్ణమాక్షీకభస్మం, అభ్రకభస్మం, కుసుమాకర రసం, తాళి సింధూరం, గుర్ధవటి, శోథహరగుటిక.

బాహ్యప్రయోగాలు - దశాంగలేపం, మర్మగుటిక.

6. శుక్రవేగావరోధం:

కొంతమంది యువకులలో లైంగికంగా ఉద్రేకం చెందినా తరువాత, ఒకవేళ ఏ కారణం చేతనయినా శుక్రస్కలనం జరుగకపోతే, అది వృషణాలలో అసౌకర్యానికి, నొప్పికి దారి తీస్తుంది. శృంగార భావనలతో మనసు, శరీరాలు ఉత్తేజపడినప్పుడు శుక్రకణాల విడుదల జరుగుతుంది. ఇవి వృషణాలను దాటి ఎపిడిడిమిస్ వద్దకు చేరుకొని స్కలనానికి సిద్ధంగా ఉంటాయి. ఒకవేళ తదుపరి పరిస్థితులు కనుక శుక్రస్కలనం జరిగేటంత బలీయంగా లేకపోతే శుక్రనాళాల్లో (వాస డిఫరెన్స్) శుక్రం నిండుకుపోయి అసౌకర్యము, నొప్పి కలుగుతాయి. సమాగమం జరిగేంతవరకు ఈ నొప్పి కొనసాగుతుంది.. కొంతమందిలో హస్త ప్రయోగం తరువాతగాని, నిద్ర తరువాత గాని ఈ సౌకర్యం దానంతట అదే నిష్క్రమిస్తుంది. దీనికి ప్రత్యేకించి చికిత్స చేయాల్సిన అవసరం ఉండదు. కాకపొతే, ఇదే పరిస్థితి పలుమార్లు జరుగకుండా చూసుకోవాలి. లేనట్లయితే, శుక్రకణాలు గట్టిపడి రాళ్లుగా తయారైయ్యేందుకు అవకాశం ఉంది.

7. మూత్రపిండాల్లో రాళ్ళు (కిడ్నీ స్టోన్స్):

కొంతమందికి మూత్ర పిండాల్లో రాళ్లు తయారవుతుంటాయి. ఇవి ఎంత చిన్నగా ఉన్నప్పటికీ, మూత్రనాళం నుంచి మూత్రకోశం వైపు జారేటప్పుడు తీవ్రమైన నొప్పి జనించి, నొప్పి నరాల ద్వారా వృషణాలకు చేరుకొని అక్కడ నొప్పి రూపంలో బహిర్గతమవుతుంది. మూత్ర మార్గంలో రాళ్లు ఉండి కదులుతున్నప్పుడు మూత్రంలో రక్తం కనిపించడం పరిపాటి.

గృహచికిత్సలు: 1. బొప్పాయి వేరును తెచ్చి, పొడిచేసి, పూటకు పావు చెంచాడు చొప్పున మూడుపూటలా తీసుకోవాలి. 2. ముసాంబరాన్ని చిటికెడు ప్రమాణంగా ద్రాక్షపండులో మాటుపెట్టి తీసుకోవాలి. 3. ఆముదపు వేరు కషాయానికి (అరకప్పు) యవక్షారాన్ని (చిటికెడు) కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి.. 4. పసుపును (అరచెంచాడు) బెల్లంతో కలిపి, బియ్యపు కడుగునీళ్ళతో పుచ్చుకోవాలి.. 5. పులిమెరిపట్ట, శొంఠి, పల్లేరు వీటి కషాయానికి బెల్లం కలిపి అరకప్పు మోతాదుగా రెండు పూటలా మండలం (40 రోజులు) పాటు తీసుకోవాలి. 6. దోసగింజల కషాయాన్ని లేదా కొబ్బరి పువ్వుల ముద్దను పాలతో కలిపి కొన్ని రోజులు పుచ్చుకోవాలి. 7. పిల్లిపీచర గడ్డల రసాన్ని (అరకప్పు) ఆవుపాలతో కలిపి తాగాలి. 8. కొడిశపాలపట్ట, లేదా వేరుచూర్ణాన్ని అరచెంచాడు చొప్పున అరకప్పు పెరుగుతో కలిపి రెండుపూటలా తీసుకోవాలి.. 9. కొండపిండి వేళ్ళ కషాయానికి (అరకప్పు) శుద్ధిచేసిన శిలాజిత్తును (చిటికెడు) కలిపి పంచదార చేర్చి కొన్ని రోజుల పాటు రెండుపూటలా తీసుకోవాలి.

ఔషధాలు: చంద్రప్రభావటి, గోక్షురాదిగుగ్గులు, వరుణాదిక్వాథం, హజ్రల్ యహూద్ భస్మం, సహచరాది తైలం.