మోచేయి నొప్పి:

 

1. మీకు అలవాటు లేకుండా స్క్రూలు బిగించడాలు వంటి పనులు చేసారా?

మోచేయి నొప్పి (టెన్నిస్ ఎల్బో)

2. మోచేయి నొప్పితో పాటు ఇతర జాయింట్లలో కూడా నొప్పి రావడం, సాధారణారోగ్యం దెబ్బతినడం వంటివి జరుగుతున్నాయా?

సంధిశూల (ఆర్తరైటిస్) / అమవాతం (రుమటాయిడ్ ఆర్తరైటిస్)

3. మోచేయి ఎర్రగా, ఉబ్బెత్తుగా, కోయ్యబారినట్లు స్టిఫ్ గా కనిపిస్తుందా?

ఇన్ ఫెక్టివ్ ఆర్త రైటిస్

 

కంప్యూటర్ మౌస్, కీబోర్డులతో ఎక్కువసేపు పని చేసే వారూ, బట్టలు ఉతకడం, అంట్లు తోమడం వంటివి చేసే మహిళలూ స్క్రూడ్రైవర్లు ఉపయోగిస్తూ పని చేసే వృత్తి పనివారూ, టెన్నిస్ ఆడే క్రీడాకారులూ వీరందరిలోనూ మోచేయి నొప్పి రావడానికి ఆస్కారం ఎక్కువ. మోచెయ్యి నొప్పిని ఆయుర్వేదంలో సంధిశూలకు సంబంధించిన ఒక అంశంగా పరిగణిస్తారు. టెన్నిస్ వంటి ఆటల్లో, మోచెయ్యిని అసహజంగా, తరుచుగా ఉపయోగించడం వల్ల (రిపీటెడ్ స్ట్రెస్ ఇంజ్యురీ వల్ల) ఇది వస్తుంటుంది. కాబట్టి దీనిని జన సామాన్యంలో 'టెన్నిస్ ఎల్బో' అని అంటుంటారు.

 

మోచెయ్యిలో ఉబ్బెత్తుగా, పొడుచుకు వచ్చినట్లు కనిపించే ఎముకకు ముంజేయి కండరాలు వెళ్లి అతుక్కుంటాయి. ఎక్కువగా మోచేయి కండరాలను కొనసాగే తత్వం దీనికి ఉంటుంది. అందుకే, నొప్పి మొదలైన వెంటనే కారణాలను పనిపెట్టి తగిన చర్యలూ, చికిత్సలూ తీసుకుంటే ఈ నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందచ్చు. ఆలస్యం చేసే కొద్దీ వ్యాధి గంభీరంగా మారే అవకాశం ఉంది.

 

1. మోచేయి నొప్పి (టెన్నిస్ ఎల్బో):

మోచెయ్యి వెలుపలి భాగంలో (మోచెయ్యి కండరాలు దండ ఎముక కింది భాగానికి అతుక్కునే భాగానికి అతుక్కునే చోట) హఠాత్తుగా నొప్పి వస్తే దానిని టెన్నిస్ ఎల్బోగా అర్థం చేసుకోవచ్చు. ఈ తరహా నొప్పిలో కొద్దిపాటి బరువులను కూడా ,మోయలేరు. చేతి సంచిని పట్టుకోవడం వంటి పనులను సైతం చేయలేరు. పెన్నుతో రాయడం వంటి చిన్న పని కూడా దుస్సాధ్యమై పోతుంది. సూచనలు: నొప్పి పూర్తిగా తగ్గే వరకూ బరువైన పనులు చేయకూడదు. ముఖ్యంగా నొప్పిని ఎక్కువ చేసే పనులు అసలే చేయకూడదు. వేడి కావడాలనూ, చల్లటి ప్యాక్ లనూ మార్చి మార్చి ప్రయోగిస్తే నొప్పి తీవ్రత తగ్గుతుంది. నొప్పి పూర్తిగా తగ్గటానికి ఐదారు నెలల వరకూ పడుతుంది. కాబట్టి సంయమనం పాటించాలి. ఆరాట పడినా, హైరానా పడినా నొప్పి తగ్గక పోగా ఎక్కువవుతుంది.

 

ఔషధాలు: లక్ష్మీ విలాసరసం, సమీరపన్నగరసం, మల్లసింధూరం, యోగేంద్రరసం, బృహత్ వాత చింతామణి రసం, రసోనపిండం, మహాయోగరాజగుగ్గులు. బాహ్యప్రయోగం - మహావిషగర్భ తైలం.


2. సంధిశూల (ఆర్తరైటిస్) / అమవాతం (రుమటాయిడ్ ఆర్తరైటిస్):

మోచేయి జాయింటులో కూడా, శరీరంలోని ఇతర జాయింట్ల మాదిరిగానే సంధివాతం (ఆస్టియో ఆర్తరైటిస్), అమవాతం (రుమటాయిడ్ ఆర్తరైటిస్) వంటివి రావచ్చు. అందుకే, మోచేయినొప్పి ఉన్నప్పుడు ఇతర జాయింట్లలో కూడా నొప్పి ఉన్నదేమో చూడాలి. సూచనలు: సర్వశరీర గతంగా అనేక జాయింట్లలో నొప్పి ఉన్నప్పుడు ఆయుర్వేదోక్త స్నేహ స్వేదాలు (ఔషధ సిద్ధ తైలాలనూ, కషాయాలనూ ఉపయోగించడం), పంచకర్మలు (వమన విరేచనాల వంటి వాటిని ప్రయోగించడం) చేస్తే మంచి ప్రయోజనం కలుగుతుంది.

 

ఔషధాలు: త్రయోదశాంగగుగ్గులు, మహాయోగరాజగుగ్గులు, రసోనసిండం, ప్రవాళ పంచామృతం.

బాహ్యప్రయోగం - ప్రసారిణీ తైలం.

 

3. ఇన్ ఫెక్టివ్ ఆర్త రైటిస్:

శరీరంలో స్థానికంగానూ, సార్వదైహికంగానూ ఇన్ఫెక్షన్లు ఏర్పడితే, అవి ఒకోసారి అంతటితో ఆగిపోకుండా జాయింట్లను చేరి వాటిని కూడా వ్యాధిగ్రస్తం చేసే అవకాశం ఉంది. ఉదాహరణకు, జాయింట్లను 'అదురు' నుంచి కాపాడటం కోసం ఉపయోగపడే 'బాలసా' అనే మెత్తని దిండ్లవంటి నిర్మాణాలు ఇన్ఫెక్షన్ల బారిన పాడినప్పుడు మోచెయి జాయింటులో నొప్పి వచ్చే అవకాశం ఉంది. అలాగెం గనోరియా నుంచి క్షయవ్యాధి వరకూ అనేక రకాల ఇన్ఫెక్షన్లు మోచెయి నొప్పిని కలిగించే అవకాశం ఉంది. (క్షయ వ్యాధి ఊపితితిత్తులకు మాత్రమే సోకాలని లేదు; జాయింటుకు కూడా సోకవచ్చు.)

 

ఔషధాలు: గంధక రసాయనం, మధుస్నుహీరసాయనం, చోప్ చీన్యాదిచూర్ణం, వ్యాధిహరణ రసాయనం, చతుర్ముఖ రసం, క్షీరబలాతైలం, లోహసౌవీరం, మహాయోగరాజగుగ్గులు, మంజిష్టాదిక్వాథచూర్ణం, పంచతిక్త గుగ్గులు, ఘృతం, సుకుమార రసాయనం, స్వర్ణవాతరాక్షసం.