అంతే, నన్ను ప్రజలు స్వామిగా గుర్తించారు. పూజించారు. పూజిస్తూన్నారు. ఎవరినో మోసం చేయాలన్న ఆలోచనతో ఆరంభించిన ఈకార్యం ఈనాడు ఎవరిని మోసం చెయ్యకుండానే నన్ను నేను వంచించుకోనక్కర లేకుండా నాకు తోచింది అందరికీ చేస్తూ నా జన్మకి ఓ అర్ధం సమకూరిందన్న సంత్రిప్తితో బ్రతుకుతున్నాను. ఎవరిస్తేనేం నా కారణంగా బీద ప్రజలకి పళ్ళు ఫలాలు తరచూ దొరుకుతున్నాయి. పూజల పేరుతొ, పర్వదినాల పేరుతొ నన్ను సంతృప్తి పరచడానికి ధనికులు చేసే అన్నదానాలు బీద ప్రజల కడుపు నింపుతున్నాయి. వరద వచ్చినా, కరువు వచ్చినా నే జోలిపట్టి అడిగితె లేదనే వారుండరు. అవన్నీ లేనివారిని అదుకుంటాయి. నాకు నచ్చిన నాలుగు ముక్కలు పదిమందికి నేర్పుతున్నాను. చిన్నప్పుడు నాన్న బలవంతాన చదివించిన సంస్కృత విద్య పురాణ గ్రంధాలు చదవి విన్పించడానికి తోడ్పడుతుంది. యింతకంటే జన్మకి సార్ధకత ఏముంటుంది/ చాలీచాలని జీతాలతో, రోగాలతో ఆకలితో, ఏడ్పులతో బ్రతికే ఆ జీవితం కంటే యిది ఎంత మెరుగు? అయితే అందరూ యిలా ఆలోచించలేరు. ఆలోచించితే సృష్టే ఆగిపోతుంది. అలా అలోచించి ఆచరణలో పెట్టగలిగినవారు అందుకే దేముళ్ళగా చలామణి అవుతున్నారు. నేను చెప్పేది పొట్టకూటి కోసం కాషాయగుడ్డలు కట్టుకునే దొంగ సాధువులు, సన్యాసులు , కనికట్టు విద్యలని మహాత్తులుగా భ్రమింపచేస్తూ ప్రజల చేత మన్ననలను అందుకునే బాబాలు, మాట కాదు -----"
    అవాక్కయి వింటున్న సత్యం ...... "మరి నీలో ఏ మహత్తులు లేవా? ఏ మహిమలు లేకుండానే ప్రజలు నిన్ను ఎలా నమ్మారు? నీపట్ల యింత భక్తీ విశ్వాసాలు ఎలా ఏర్పడ్డాయి?' ఆశ్చర్యంగా అడిగాడు.
    'కాషాయగుడ్డలు కట్టుకు అడుక్కు తినే సన్యాసికైన ఓ నమస్కారం పెట్టె , కనిపించిన రాయి రప్పలకి మొక్కే అమాయక ప్రజలు వున్న మన దేశంలో నన్ను మాత్రం ఎందుకు నమ్మరు? నేనేం వరాలిస్తానని చెప్పలేదు. నా దగ్గరకు వచ్చే వాళ్లకు మీ ప్రయత్నం మీరు చెయ్యండి . భగవంతుని పట్ల నమ్మకం వుంచండి అని మాత్రం చెప్తాను. నేనేదో చేస్తానని చెయ్యగలనని ఎవరిని నమ్మించలేదు. నేను సర్వం త్యజించడం , భోజనం దగ్గరనుంచి మానడం, నా కోసం కాక యితరుల కోసం నేను పాటుపడడం చూసి నా పట్ల వాళ్ళకి విశ్వాసం జనించి వుంటుంది. నా కారణంగా వూరు బాగుపడిందని, పూజలు, పురాణాలు జరుగుతున్నాయని బీదలకి అన్నవస్త్రాలు దొరుకుతున్నాయని వాళ్ళ కష్ట సుఖాలలో తోడు నీడగా వుంటున్నానని అందరికి నా మీద భక్తీ విశ్వాసాలు కుదిరి వుంటాయి. ఎవరి నించి ఏమీ ఆశించకుండా నీపని నీవు చేసుకుపో, ప్రపంచం నీ కాళ్ళ ముందు వాలుతుంది ఏదన్నా అడిగావా చేట్టేక్కుటుంది.' అని ఎవరో అన్నమాట నా విషయంలో నిజం---"
    "మరి మీ అమ్మ నాన్న.......'
    "ఏమంటారు ! ముందులో ఏడిచారు. తరువాత నిజంగానే నేను మారానని నమ్మారు. నావల్ల వూళ్ళో అందరికి పూజ్యులయి, వూరి పెద్దలంతా అదుకుంటుంటే హాయిగా వున్నారు. నేనుండి అంతమాత్రం చేయగలిగేవాడినా?
    సత్యం ఆశ్చర్యంగా శంకరాన్ని పరీక్షిస్తూ "నీలో చాలా మార్పు వచ్చింది, నీ మొహంలో , నీ కళ్ళలో ఏదో వెలుగు . మొహమే కాదు, శరీరంలోను, ఏదో తేజస్సు గోచరిస్తుంది. ఈ మార్పు నా భ్రమా, నిజమా...... ఇదెలా సాధ్యం ఏ మహాత్తూ లేకుండా.
    శంకరానందస్వామి చిరునవ్వు నవ్వాడు--' ఆవకాయ ముక్కతో అర్ధాకలితో నిండే కడుపుకి - యిప్పుడు ఆరోగ్యకరమైన పాలు, పళ్ళు, తేనే తింటే వచ్చే నిగారింపు యిది. పులుపు కారాలు విసర్జించి, చన్నీటి స్నానాలు , యోగాభ్యాసం నియమబద్దమైన జీవితం చీకు చింతా లేని మనశ్శాంతి యివన్నీ మానసికంగా ఆత్మవిశ్వాసాన్ని, మనో నైర్మాల్యాన్ని ప్రసాదించాయి. ఆ ఆత్మవిశ్వాసం తాలుకూ నీడలే నీవనుకునే కళ్ళలో వెలుగు, ఆరోగ్యకరమైన అభ్యాసాలు శరీరానికి దృడత్వాన్ని నిగారింపునిస్తాయి. ఆ నిగారింపే నీవనుకునే తేజస్సు! ఐహికసుఖాలని త్యాగం చేయడానికి కొంత సాధన అవసరం. మనో నిగ్రహం సంపాదించగలిగే ఏకాగ్రత సాధించాను ఇప్పుడు. అందుచేత నేనిప్పుడు శంకరాన్ని కాదు. శంకరానందస్వామిని అయ్యాను.' చిరునవ్వుతో అన్నాడు శంకరానందస్వామి.
    సత్యం ఏమనాలో తోచనట్లు అయన వంక అలా చూసాడు కొన్ని క్షణాలు, యింకా ఏదో అడాగాలని వున్నా అయన దర్శనం కోసం ప్రజలు కాచుకొని వుండడం చూసి లేచాడు.
    అతనికి తెలియకుండానే అప్రయత్నంగానే చేతులు జోడించాడు.
    
                                                          ***