భుజం నొప్పి

1. మీకు ఇటీవలి కాలంలో దెబ్బలు తగిలాయా?

దెబ్బలు / గాయాలు

2. మీరు ఈ మధ్య కాలంలో చెయ్యిని అసహజమైన రీతిలో కదిలించడంగాని, అలవికాని పనులను చేయడం కాని జరిగిందా?

రాజ్జువుల వాపు (టెండినైటిస్)

3. భుజాన్ని కదిలించినప్పుడు జాయింటు లోపల శబ్దం వస్తుందా?

బర్సైటిస్

4. భుజం నొప్పితో పాటు ఇతర జాయింట్లు కూడా నొప్పి పుడుతున్నాయా?

సంధి శూల (అర్తరైటిస్)

5. భుజం నొప్పితో పాటు మెడ తిప్పడం కష్టమావుతుందా?

మెడ వెన్నుపూసలు అరిగిపోవడం (సర్వైకల్ స్పాండిలోసిస్)

6. భుజం పైన ఎరుపు రంగులో కమిలినట్టు ర్యాష్ వచ్చిందా?

విసర్పం (హెర్పిస్ జోస్టర్)

7. భుజం నొప్పితో పాటు ఛాతిలో నొప్పిగాని, కడుపులో నొప్పిగాని ఉంటుందా?

స్థానేతర సమస్య (రిఫర్డ్ పెయిన్)

 

భుజాన్ని ఆవరించి ఉండే కీలులోని ఎముకలు, కండరాలు, స్నాయువులు (లింగమెంట్స్) వంటివి ఇన్ ఫ్లమేషన్ కి లోనవ్వడం వల్ల భుజం నొప్పి వస్తుంది, మన శరీరంలో అత్యంత ఎక్కువ స్థాయిలో కదిలికలు కలిగిన జాయింటు భుజం తాలూకు జాయింటే. ఇంతటి కదిలికలు కలిగినప్పుడు సహజంగానే, దానికి రక్షణ కూడా తక్కువగా ఉంటుంది. కీలు జారవచ్చు. లోపలి నిర్మాణాల్లో వాపు ఏర్పడవచ్చు. లేదా, త్వరగా వ్యాధిగ్రస్తమావ్వచ్చు. దీని ఫలితంగా తల దువ్వుకోవడం, చొక్కా తోడుక్కోవడం, తలకు నూనె రాసుకోవడం, స్కూటర్ హ్యాండిల్ పట్టుకోవడం వంటి రోజు వారీ పనులు కష్టతరమైపోతాయి. ఆయుర్వేద శాస్త్రం భుజం నొప్పిని 'అంసశోష', 'అపబాహుకం' అనే పదాలతో వ్యవహరిస్తూ వ్యాధి సమగ్ర రూపాన్ని అత్యంత విపులంగా వివరించింది. సంస్కృతంలో అంస ప్రదేశమన్నా, బాహు ప్రదేశమన్నా భుజం ప్రాంతమని అర్థం. వివిధ కారణాల చేత వాతం ప్రకోపించి భుజం ప్రాంతంలోని సంధి బంధాలను (జాయింటును కండరాలతో కలిపి ఉంచే నిర్మాణాలు) శోషింపచేయడం వల్ల భుజం నొప్పి కలుగుతుందనేది ఆయుర్వేద దృక్పథం. భుజం నొప్పి అనేది భుజంలోని జాయింట్ మూలంగానే రావాలని లేదు. ఒకోసారి ఇతర శారీరక కారణాలు కూడా భుజం నొప్పిని కలిగించే అవకాశం ఉంది. సరైన కారణాలను తెలుసుకుని తదనుగుణమైన చికిత్సలను తీసుకుంటే భుజం నొప్పి నెలల తరబడి బాదిస్తున్నప్పటికి ఇట్టే తగ్గిపోతుంది. 1. దెబ్బలు / గాయాలు దెబ్బలు తగిలినప్పుడుగాని, గాయాలైనప్పుడుగాని ముందస్తుగా ఇన్ ఫ్లమేషన్ తో కూడిన వాపు మొదలవుతుంది. ఎముకల అగ్ర భాగం మృదులాస్థి (కార్డిలేజ్) ని కలిగి ఉంటుందనీ, ఈ మృదులాస్థిని ఆవరించి సైనోవియల్ ప్లూయిడ్ అనే ద్రవ పదార్థం ఉంటుందనీ, సైనోవియల్ మెంబ్రేన్ అనే పొర ఈ ద్రవపదార్థాన్ని విడుదల చేస్తుందనీ మనకు తెలుసు. భుజం జాయింట్కు దెబ్బలు తగిలినప్పుడుగాని ఒత్తిడికి లోనైనప్పుడుగాని, జాయింటు ఉపరితలం నుంచి చిన్న చిన్న పెచ్చులు ఊడిపోయి సైనోవియల్ ప్లూయిడ్ లో తేలుతూ భుజం కదిలికలకు అవరోధం కలిగిస్తాయి. దీనికి ప్రతి చర్యగా, సైనోవియల్ పొర మరింతగా స్రవించి వాపును, ఒత్తిడిని, నొప్పిని కలిగించే అవకాశం ఉంది. ఒకోసారి మనకు తెలియకుండా తగిలిన దెబ్బ వల్లగాని, అసహజమైన రీతిలో శరీరాన్ని పంచడం, సాగదీయడం వంటి పనుల వల్లగాని భుజంలో ఒత్తిడి ఏర్పడి నొప్పి కలుగుతుంది. సూచనలు: దీనికి సత్వరమే శమనోపాయాలను చేపట్టాలి. ఐస్ గడ్డలను నలగగొట్టి గుడ్డలో వేసి నొప్పి ప్రాంతంలో ఉంచితే ఉపశమనం లభిస్తుంది. చేతిని వేలాడేయకుండా కొంచెం ఎత్తులో ఉంచి పట్టుకుంటే మంచిది. అవసరమనుకుంటే మెడ నుంచి రిబ్బన్ వంటి గుడ్డతో లూప్ లాగా (స్లింగ్)- ఆసరాకోసం - కట్టుకోవచ్చు. ఔషధాలు: త్రిఫలాగుగ్గులు, పునర్నవాది మండూరం, చంద్రప్రభావటి. బాహ్యప్రయోగం: మహావిషగర్భ తైలం. 2. రజ్జువుల వాపు (టెండినైటిస్): స్నాయువుల్లో (టెండాన్స్) వాపు తయారైనప్పుడు భుజం నొప్పి వస్తుంది. భుజం కీలును శరీరంతో కలుపుతూ ఎన్నో రకాల స్నాయువులు అమరి ఉంటాయి. వీటి మీద ఒత్తిడి పాడినప్పుడుగాని, అలవాటు లేకుండా భుజాన్ని అదే పనిగా కదిలిస్తూ పని చేసినప్పుడుగాని ఈ స్నాయువులు వ్యాధిగ్రస్తమవుతాయి. ఎముకల మధ్య ఇవి ఇరుక్కుపోయి ఇన్ పఫ్లేమ్ అవుతాయి. చెయ్యిని కొన్ని నిర్ణీతమైన భంగిమలలో కదిలించడం కష్టమైపోతుంది. స్నాయువులకు రక్త సరఫరా తగినంతగా ఉండకపోవడం మూలాన ఒకసారి నొప్పి అనేది వస్తే తగ్గడానికి చాలా కాలం తీసుకుంటుంది. కొన్ని కొన్ని సందర్భాలలో ఏడాదికాలం వరకూ పట్టవచ్చు కూడా. ఒకోసారి కీలును కప్పుతూ ఉండే క్యాప్సూల్ అనే నిర్మాణం వ్యాధిగ్రస్తమవడం వల్ల కూడా భుజం నొప్పి వస్తుంది. దీనిని వైద్య పరిభాషలో 'ఫ్రోజన్ షోల్డర్' అంటారు. విశ్రాంతి అనేది ఈ వ్యాధికి సంబంధించిన చికిత్సల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇటువంటి దీర్ఘకాలపు నొప్పులలో శీతలీకరణ చికిత్సలకంటే (ఐస్ ప్యాక్) వేడి కాపడాలు బాగా పని చేస్తాయి. అలాగే జాయింటుకు ఇరుపక్కలా ఉండే కండరాలను ప్రత్యేకమైన వ్యాయామాల ద్వారా శక్తివంతం చేయాల్సి ఉంటుంది. గృహచికిత్సలు: 1. వేపాకు, వేప పువ్వులు వీటి రసాన్ని పూటకు రెండు చెంచాలు చొప్పున రెండు పూటలా తీసుకోవాలి. 2. దురదగొండి గింజల కషాయాన్ని అరకప్పు చొప్పున రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 3. బలామూలం (తుత్తురు బెండ) వేళ్ళను కాషాయం కాచి రెండు చెంచాల కషాయానికి ఒక చెంచా నువ్వుల నూనె కలిపి ఆహారం తర్వాత ముక్కులో డ్రాప్స్ గా (నాలుగైదు చుక్కలు) వేసుకోవాలి. 4. నువ్వుల నూనెకు తగినంత కర్పూరం కలిపి మెడమీద మసాజ్ చేసుకోవాలి. 5. వెల్లుల్లి గర్భాలను రోజుకు రెండు చొప్పున ముద్దగా నూరి పాలతో కలిపి తీసుకోవాలి. ఔషధాలు: సింహనాదగుగ్గులు, మహావాతవిధ్వంసినీ రసం, మహారాస్నాదిక్వాథం. 3. బర్సైటిస్: భుజాన్ని కదిలించినప్పుడు జాయింట్ లోపల శబ్దం రావటం అనే లక్షణం బర్సైటిస్ ను సూచిస్తుంది. బర్సా లేదా భస్త్రిక అనేది జాయింటు లోపల కండరాలు, స్నాయువులు తేలికగా కదలటం కోసం అమరి ఉన్న నీటి సంచి వంటి నిర్మాణం, ఒకోసారి అలవాటు లేని పనులను అదే పనిగా చేయడం వల్లగాని, దెబ్బ తగలటం వల్లగాని, రుమాటిజం వంటి జబ్బుల వల్లగాని ఈ బర్సాల్లో వాపు ఏర్పడి నొప్పి కలుగుతుంది. ముఖ్యంగా కదలికలు కష్టమైపోతాయి. దీనిలో ఇన్ఫెక్షన్నూ, ఇన్ ఫ్లమేషన్నీ తగ్గించే మందులు వాడాల్సి ఉంటుంది. ఔషధాలు: మధుస్నుహీ రసాయనం, మహాయోగరాజగుగ్గులు. బాహ్యప్రయోగం: శ్రీగోపాల తైలం. 4. సంధి శూల (ఆర్తరైటిస్): విశ్రాంతిగా ఉన్నప్పుడు కొయ్యబారినట్లు గట్టిగా ఉంటూ, పగటి పూట శారీరక కదిలికలతో ఎక్కువయ్యే కీళ్ల నొప్పిని 'సంధివాతం' అంటారు. ఆస్టియోఆర్తరైటిస్'గా పిలిచే ఈ వ్యాధిలో ఎముకలు అరిగిపోయి కదిలికలు దుస్సాధ్యమైపోతాయి. వృత్తి రీత్యా చేసే వివిధ రకాల పనులే కాకుండా, వంశపారంపర్యత, జన్మసంబంధ నిర్మాణ లోపాల వంటి ఎన్నోకారణాల వల్ల ఈ తరహా నొప్పి ప్రాప్తిస్తుంది. దీనికి ప్రధానమైన కారణం 'అతియోగం', ఈ పదానికి అర్థం. జాయింటునుపరిధికి మించి, అవధికి మించి వాడటం. దీనికి చికిత్స రెండు రకాల ప్రయోజనాలను ఆశించి జరుగుతుంది. ఎముక అరుగుదలను పరిరక్షించడం మొదటి ప్రయోజనమైతే నొప్పిని తగ్గించి కదిలికలను తీసుకురావటం రెండో ప్రయోజనం. ఔషధాలు: ప్రవాళ భస్మం, మోతీ భస్మం వంటిని ఎముకల అరుగుదలను నిలువరిస్తే, వాత విధ్వంసినీ రసం వంటి మందులు నొప్పిని తగ్గించడానికి ఉపకరిస్తాయి. జాయింటు నొప్పితో పాటు సాదారణారోగ్యం దెబ్బతింటే దానిని 'ఆమ వాతం' అంటారు. 'రుమటాయిడ్ అర్తరైటిస్' లక్షణాలు ఈ వ్యాధి లక్షణాలతో సరిపోతాయి. ఈ వ్యాధిలో జాయింట్ల అరుగుదల ఉండదుగాని ఆమం ప్రకోపించడం చేత విపరీతమైన నొప్పి అనిపిస్తుంది. శాస్త్రకారుడు ఈ నొప్పి అనే లక్షణాన్ని 'వృశ్చికా దంశం'తో పోలుస్తాడు. తేలు కాటుతో సమానమైన నొప్పి అని దీనర్థం. మగవారిలో కంటే ఆడవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. స్వీయరక్షక వ్యవస్థ వ్యత్యస్థంగా మారడాన్ని (ఆటో - ఇమ్యూనిటీ) దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. దీనిలో వ్యాధి తగ్గినట్లే తగ్గి దానంతట అదే తిరగబడుతూ నిరాశా నిస్పృహలకు లోనుచేస్తుంటుంది. ఈ వ్యాధిలో ఆయుర్వేద పంచకర్మలతో పాటు ఇతర శమన చికిత్సలు చక్కని ఫలితాలను ఇస్తాయి. ఆయుర్వేదంలో చెప్పిన ఔషధ, ఆహార, విహార చికిత్సలను అన్నిటినీ ఇందులో ప్రయోగించాల్సి ఉంటుంది. శరీరంలో ఇతర భాగాల మాదిరిగానే భుజాలు కూడా ఇన్ ఫెక్షన్ కు గురయ్యే అవకాశం ఉంది. ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సాధారణంగా జ్వరం వస్తుంది. జలుబు వంటి వైరస్ ఇన్ఫెక్షన్లు తాత్కాలికంగా జాయింట్లలో వాపునుకలిగించే అవకాశం ఉంది. జర్మన్ మీజిల్స్, మధుమేహం, హైపటైటిస్ వంటి వ్యాధులు సైతం భుజం నొప్పిని కలిగించే అవకాశం ఉంది. అలాగే రుమాటిక్ ఫీవర్ లో కూడా భుజం నొప్పి. ఇతర కీళ్ల నొప్పులు ఉంటాయన్న సంగతి మర్చిపోకూడదు. గనోరియా ఉంటే, దానికి పూర్తి చికిత్స తీసుకోనట్లయితే, సూక్ష్మక్రిములు జాయింట్లను చేతి నొప్పిని కలిగిస్తాయి. జాయింటు పైన చీము గడ్డలు లేచినప్పుడు ఇన్ఫెక్షన్ చర్మం నుంచి లోనికి వ్యాపించి భుజం నొప్పిని కలిగించవచ్చు. ఇటువంటి సందర్భాలలో వ్యాధిని బట్టీ చికిత్స తీసుకుంటే నొప్పి దానంతట అదే తగ్గి పోతుంది. ఔషధాలు: క్షీరబలా తైలం (101 ఆవర్తాలు), లోహాసవం, మహారస్నాదిక్వాథ చూర్ణం, మహాయోగరాజ గుగ్గులు, పంచతిక్త గుగ్గులు ఘృతం, రాస్నాది క్వాథ చూర్ణం, స్వర్ణ వాత రాక్షసం, త్రయోదశాంగ గుగ్గులు, రాక్షసం, వాత గజాంకుశ రసం, యోగరాజ గుగ్గులు, బాహ్య ప్రయోగానికి అమవాత తైలం, ధన్వంతర తైలం, క్షీరబలా తైలం, కుబ్జ ప్రసారిణి తైలం, మహామాష తైలం, నారాయణ తైలం, ప్రభంజన విమర్దన తైలం, విషముష్టి తైలం అనేవి వాడాలి. 5. మెడ వెన్నుపూసలు అరిగిపోవటం (సర్వైకల్ స్పాండిలోసిస్): మెడ ప్రాంతంలోని వెన్నుపూసల డిస్కులు స్లిప్ అయినప్పుడు నరం మీద ఒత్తిడి పడి, భుజం లోపలకు నొప్పి ప్రసరించే అవకాశం ఉంది. దీనిని 'గ్రీవాస్థంభం' )సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. అటువంటి సందర్భాలలో భుజంలో నొప్పి ఉంటుంది. తప్పితే భుజాన్ని కదిలించడంలోగాని, తిప్పడంలోగాని ఇబ్బంది ఏదీ ఉండదు. సమస్యభుజంలో కాకుండా మెడలో ఉంటుంది కాబట్టి సర్వైకల్ స్పాండిలోసిస్ కు చికిత్స చేస్తే భుజం నొప్పి దానంతట అదే తగ్గిపోతుంది. గృహచికిత్సలు: 1. వేపాకు, వేప పువ్వులు వీటి రసాన్ని పూటకు రెండు చెంచాలు చొప్పున రెండుపూటలా తీసుకోవాలి. 2. దురదగొండి గింజల కషాయాన్ని అరకప్పు చొప్పున రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 3. బలామూలం (తుత్తురు బెండ) వేళ్ళను కషాయంకాచి రెండు చెంచాల కశాయానికి ఒక చెంచా నువ్వుల నూనె కలిపి ఆహారం తర్వాత ముక్కులో డ్రాప్స్ గా (నాలుగైదు చుక్కలు) వేసుకోవాలి. 4. నువ్వుల నూనెకు తగినంత కర్పూరం కలిపి మెడమీద మసాజ్ చేసుకోవాలి. 5. వెల్లుల్లి గర్భాలను రోజుకు రెండు చొప్పున ముద్దగా నూరి పాలతో కలిపి తీసుకోవాలి. సింహనాదగుగ్గులు, మహావాతవిధ్వంసినీ రసం, మహారాస్నాదిక్వాథం. 6. విసర్పం (హెర్పిస్ జోస్టర్): హెర్సిస్ జోస్టర్ (చప్పి / సర్పి / షింగిల్స్) శరీరంలో ఎక్కడైనా రావచ్చు, భుజంతో సహా. ఈ వ్యాధి మొదట్లో దురద. మంటతో మొదలై చివరికి తీవ్రమైన నొప్పిలోకి మారుతుంది. భుజం నొప్పితో పాటు భుజం పైన ర్యాష్ కనుక ఉన్నట్లయితే ముందు నరాలకు సంబంధించిన ఈ 'చప్పి వ్యాధి' గురించి ఆలోచించాలి. ఔషధాలు: గుడూచి సత్వం, కర్పూరశిలాజతు భస్మం, కామదుఘ రసం, మంజిష్టాది క్వాథ చూర్ణం, నింబాది క్వాథ చూర్ణం, షడంగ క్వాథ చూర్ణం. బాహ్యప్రయోగాలు - మహాతిక్తకఘృతం, నాల్పామరాది తైలం, పిండ తైలం.

 

7. స్థానేతర సమస్య (రిఫర్డ్ పెయిన్):

ఒకోసారి భుజం నొప్పి స్థానిక కారణాల వల్ల కాకుండా ఇతర కారణాల చేత కూడా రావచ్చు. ఇటువంటి నొప్పిని వైద్య పరిభాషలో 'రిఫర్డ్ పెయిన్' అంటారు. గుండెకు సంబంధించిన కారణాలైన గుండె నొప్పి, గుండె పోటుల్లో ఈ తరహా నొప్పి (ముఖ్యంగా ఎడమ భుజంలో) వస్తుంటుంది. ఇదే విధంగా ఇతర అంతర్గత కారణాలు కూడా ముందు భుజం నొప్పి రూపంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు ఊపిరితిత్తులను ఆవరించి ఉండే పొర వ్యాధిగ్రస్తమైనప్పుడుగాని (ప్లూరసీ), అన్ననాళిక పూతకు గురైనప్పుడుగాని (ఇసోఫాగైటిస్), గాల్ బ్లాడర్ వ్యాధిగ్రస్తమైనప్పుడుగాని, ఆమాశయంలో అల్సర్ కారణంగా చిల్లు (పర్ ఫరేషన్ పదినప్పుడుగాని, ఉదరవితానం (డయాఫ్రం )పైన గడ్డ లేచినప్పుడుగాని, గుండె వెలుపలి పొర వ్యాధి గ్రస్తమైనప్పుడు గాని (పెరికార్డైటిస్) , ఛాతిలో ఏదైనా పెద్ద ధమని చీరుకుపోయినప్పుడు (ఎన్యూరిజం) గాని భుజం నొప్పి వచ్చే అవకాశం ఉంది. సూచనలు: నొప్పి వ్యక్తమయ్యే విధానం ఒకోవ్యక్తిలో ఒకో రకంగా ఉంటుంది, కాబట్టి వైద్యుని వద్దకు వెళ్లినప్పుడు కేవలం ఎక్కువ ఇబ్బందిని కలిగించే లక్షణాన్ని మాత్రమే చెప్పి ఊరుకోకుండా శారీరకంగా జరిగే ప్రతి మార్పును తేలియపరిస్తే వ్యాధి నిర్ధారణ సులువవుతుంది. ఈ తరహా సమస్యలున్నప్పుడు వ్యాధి కారణాన్ని బట్టి చికిత్స చేస్తే భుజం నొప్పి తగ్గిపోతుంది.