రుతుక్రమంలో తేడాలు

 

1. మీరు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారా?

మానసిక ఒత్తిడి (స్ట్రెస్)

2. గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా?

గర్భనిరోధక మాత్రల దుష్ఫలితం

3. ఏవైనా అల్లోపతిమందులు వాడుతున్నారా?

మందుల దుష్ఫలితాలు

4. బిడ్డకు మీ పాలు ఇస్తున్నారా?

స్తన్యాన్నివ్వటం వలన కలిగే మార్పు (బ్రెస్ట్ ఫీడింగ్)

5. మీకు లోలోపల ఆవిర్లు చిమ్ముతున్నట్లు వేడిగా ఉంటుందా? బరువు కోల్పోతున్నారా?

థైరాయిడ్ గ్రంథి చురుకుదనం పెరగటం (హైపర్ థైరాయిడిజం)

6. నిరంతరమూ బద్దకంగా అనిపిస్తుంటుందా? బరువు కూడా పెరుగుతున్నారా?

థైరాయిడ్ గ్రంథి చురుకుదనం తగ్గటం (హైపోథైరాయిడిజం)

7. బహిష్టు స్రావం నోరంతరము అల్పమోతాదులో కనిపిస్తూనే ఉంటుందా?

గర్భాశయంలో తిత్తి వంటి నిర్మాణాలు పెరగటం (పాలిప్స్)

8. జ్వరం, యోని స్రావం, పొత్తికడుపు నొప్పి వంటివి ఉన్నాయా?

ఇన్ఫెక్షన్లు

9. బహిష్టులు ఆగిపోయిన తరువాత, ఒకటి రెండేళ్లకు, తిరిగి రుతుస్రావం కనిపిస్తున్నదా?

గర్భాశయానికి క్యాన్సర్

 

బహిష్టు స్రావం మూడు రోజులపాటే జరగాలని నియమం లేదు; రెండు నుంచి ఏడు రోజుల మధ్య అటూ ఇటుగా జరగవచ్చు. అంతేకాకుండా ఒక మోస్తారు పరిమాణం నుంచి ఒకింత ఎక్కువ మోతాదు వరకు ఒక్కొక్కరిలో ఒక్కొక్కవిధంగా జరుగుతుంటుంది. అంటే హెచ్చు మంది మహిళల్లో నెలసరి క్రమం 28 రోజులున్నప్పటికి కొద్దిమందిలో మాత్రం దీని క్రమం 21 రోజులకు తగ్గడాన్నిగాని, లేదా 35 రోజులకు పెరగడాన్ని గాని గమనించవచ్చు.

రుతుక్రమం నిరంతంగా జరగాలంటే మెదడునుంచి అండాశయం వరకూ ఎన్నో రకాల నిర్మాణాలు సక్రమంగా పనిచేయాల్సి ఉంటుంది. రుతుక్రమం అనేది ఒక జీవగడియారం లాంటిది. దీని పనితీరులో అస్తవ్యస్థత చోటుచేసుకుంటే, అది తీవ్రమైన అసౌకర్యాన్ని, ఆందోళననూ కలిగిస్తుంది.

నెలసరి మధ్యలో హఠాత్తుగా బహిష్టు కనిపించడం, భార్యా భర్తల కలయిన తరువాత బ్లీడింగ్ కావడం, సంతాన నిరోధక మాత్రాలు వాడుతున్నప్పటికీ మధ్యమధ్యలో రుతుస్రావం కనిపించడం, రెండు మూడునెలలపాటు బహిష్టు కనిపించకపోవడం, లేదా పది రోజుల తేడాతో తరచుగా మెన్సెస్ కనిపిస్తుండటం.... ఈ సందర్భాలన్నిటినీ ఆయుర్వేద శాస్త్రంలోని యోని దోషాల క్రింద చర్చించారు. ముఖ్యంగా రుతుస్రావం సంబంధ సమస్యలన్నీ 'అర్తవ దోషాల' కిందకు వస్తాయి.

రుతుక్రమంలో ఆస్తవ్యస్థతకు 'రక్తప్రదరం' అని పేరు. ఈ స్థితిని చక్కదిద్దాలన్నప్పుడు, దీనికి దారితీసే కారణాలను అన్ని కోణాల నుంచి విశ్లేషించాల్సి ఉంటుంది.

1. మానసిక ఒత్తిడి (స్ట్రెస్):

బహిష్టు స్రావం మీద హార్మోన్ల ప్రభావం ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ హార్మోన్ల విడుదల మీద తిరిగి మానసిక ఒత్తిడి తన ప్రభావాన్ని చూపిస్తుంది. భావావేశాలు, శారీరక క్రియా సంకేతాలు రెండు మెదడునుంచి ప్రారంభం కావడమే దీనికి కారణం. కొందరు ఆడపిల్లలకు, యవ్వనంలోకి అడుగిడిన తొలి రోజుల్లో రుతుక్రమం అస్తవ్యస్థంగా జరగడానికి కారణం హార్మోన్ల వ్యవస్థ గాడిలో పడకపోవడమే.

జీవితానికి సంబంధించిన ఆశలు, ఆకాంక్షలు, పరీక్షలు, వైఫల్యాలు, ప్రేమలు, పెళ్లిళ్ల వంటి అనేకానేక కారణాలు మానసిక ఒత్తిడినీ, తద్వారా రుతుక్రమపు అస్తవ్యస్థతనూ కలిగిస్తాయి. ఒత్తిడిని ఎదుర్కొనడానికి సులభతరమైన మార్గం దానిని నియంత్రించడమే .

ఆయుర్వేదం సూచించిన సద్వ్రత్త సిద్ధాంతాలకు అనుగుణంగా జీవన వ్యవహారాలను మలచుకోవడం, యోగా, ధ్యానం, వ్యాయామం మొదలైన వాటిని ఆచరించడం దీనికి పరిష్కార మార్గాలు.

ఔషధాలు: నారసింహ ఘృతం, బ్రాహ్మీ ఘృతం, గోరోచనాది గుటిక, కళ్యాణక ఘృతం, క్షీరబలా తైలం, అశ్వగంధారిష్టం, సర్పగంధా చూర్ణం, స్వర్ణముక్తాది గుటిక.

బాహ్యప్రయోగం- బ్రాహ్మీ తైలం.

2. గర్భనిరోధక మాత్రల దుష్ఫలితం:

గర్భనిరోధక మాత్రల కోర్సు మధ్యలో ఏ రోజునైనా వాడటం మరిచిపోతే ఏమీ కాదుగాని, వరుసగా రెండు రోజులు మరిచిపోతే మాత్రం చిక్కులు వస్తాయి. రోజూ క్రమం తప్పకుండా గర్భనిరోధక మాత్రలు వాడుతున్నప్పుడు గర్భధారణలో లాగా గర్భాశయపు లోపలిపొర స్రవించకుండా ఉంటుంది. ఒకవేళ వరుసగా రెండు రోజులపాటు ఈ మాత్రలు వేసుకోవడం కుదరకపోతే అప్పుడు గర్భాశయం లోపలి పొర చెదిరి కొద్ది మొత్తంలో బహిష్టు రక్తం రుతుస్రావం రూపంలో బయటకు వస్తుంది. ఇలా జరిగినప్పుడు ఇలా జరిగినప్పుడు ఇక ఆ మాత్రల గర్భనిరోధక చర్యను, ఆ నెలకు సంబంధించి విశ్వసించడానికి వీలులేదు.

3. మందుల దుష్ఫలితాలు:

చాలా రకాల మందులు స్త్రీ శరీరంలో సెక్స్ హార్మోన్ల పనితీరుకు అడ్డు తగిలే అవకాశం ఉంది. దీని వలన రుతుక్రమంలో అస్తవ్యస్థకు ఆస్కారం ఏర్పడుతుంది. కొత్తగా ఏదైనా మందును ప్రారంభించినప్పుడు ఇలా జరిగితే వెంటనే ఆ విషయాన్ని మీ డాక్టర్ దృష్టికి తీసుకువెళ్లండి.

4. స్తన్యాన్నివ్వటం వలన కలిగే మార్పు (బ్రెస్ట్ ఫీడింగ్):

పసిపాపలకు పాలిచ్చే తల్లుల్లో కొన్ని రకాల హార్మోన్లు ప్రత్యేకంగా విడుదలవుతాయి. వీటి ప్రభావం వల్ల రుతుస్రావం, తాత్కాలికంగా నిలిచిపోయేందుకు అవకాశముంది.

5. థైరాయిడ్ గ్రంథి చురుకుదనం పెరగటం (హైపర్ థైరాయిడిజం):

థైరాయిడ్ గ్రంథి అతిగా చురుకుదనాన్ని సంతరించుకున్నప్పుడు (హైపర్ థైరాయిడిజం) సాధారణంగా నాడివేగం పెరగటం, ఆవిర్లు చిమ్ముతున్నట్లు వుండటంతోపాటు రుతుక్రమంలో అస్తవ్యస్థత చోటు చేసుకోవడం పరిపాటి. ఈ లక్షణాలతోపాటు విరేచనాలవ్వటం, ఎక్కువగా చమటలు పట్టడం, నాడి వేగవంతమవడం, ఆకలి పెరగటం, వేడి వాతావరణాన్ని భరించలేకపోవటం వంటి లక్షణాలు కూడా ఈ వ్యాధిలో కనిపిస్తాయి. దీనికి శారీరక క్రియలను అదుపు చేసేందుకు 'సంతర్పణ' చికిత్సలను చేయాల్సి ఉంటుంది.

సూచనలు: క్యాబేజీ క్యాలీఫ్లవర్ బచ్చలికూర సోయాచిక్కుడు, మెంతికూర, ముల్లంగి ఇవన్నీ థైరాయిడ్ గ్రంథి వేగాన్ని అదుపు చేస్తాయి. కనుక వీటిని ఆహారంలో సమృద్ధిగా వాడాలి. రిఫైన్డ్ ఆహార పదార్థాలను, పాల పదార్థాలను, గోధుమలను, కెఫిన్ కలిగిన ఆహారాలను, మద్యాన్ని తగ్గించాలి. విటమిన్ - సి కలిగిన టమాటా, నిమ్మ, నారింజ, ఉసిరి వంటి పండ్లను తరచుగా తీసుకోవాలి. పసుపు, సుగంధిపాల, యష్టిమధుకం అనే మూలికలు వాడితే హైపర్ థైరాయిడిజంలో మంచి ఫలితం కలుగుతుంది.

ఔషధాలు: శతావరిఘృతం, సుకుమార రసాయనం, అమృత ప్రాశ ఘృతం, కూష్మాండలేహ్యం, క్షీరబలా తైలం (101 ఆవర్తాలు), ప్రవాళపిష్టి, ప్రవాళ పంచామృతం.

6. థైరాయిడ్ గ్రంథి చురుకుదనం తగ్గటం (హైపో థైరాయిడిజం):

ఇది సరిగ్గా పైన పేర్కొన్న స్థితికి వ్యతిరేకం. అంటే థైరాయిడ్ గ్రంథి మందకొడిగా తయారవడం వల్ల (హైపో థైరాయిడిజం) పైన పేర్కొన్న హైపర్ థైరాయిడిజంకు వ్యతిరేకమైన లక్షణాలు అంటే, మలబద్దకం, జుట్టు పలుచన కావడం, చలి వాతావరణాన్ని తట్టుకోలేక పోవడం, కాళ్లపైన చర్మం దళసరిగా మారడం వంటివి కనిపిస్తాయి. వీటన్నిటితోపాటు రుతుక్రమంలో అస్తవ్యస్థత కూడా చోటు చేసుకుంటుంది. ఈ వ్యాధిలో శరీరాన్ని తేలికగా, చురుకుగా చేయడం కోసం అపతర్పణ చికిత్సలు అవసరమవుతాయి.

గృహచికిత్సలు: 1. ఐయోడిన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను (సముద్రపు చేపలు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, పిల్లిపీచర గడ్డలు) ఎక్కువగా తీసుకోవాలి. 2. థైరాయిడ్ గ్రంథి చురుకుదనాన్ని తగ్గించేలా చేసే ఆహార పదార్థాలను (క్యాబేజీ, మెంతికూర, క్యాలీఫ్లవర్, మొక్కజోన్నలు, చిలకడదుంపలు, తోటకూర) తీసుకోకూదు. 3. విటమిన్ బి. కాంప్లెక్స్ కలిగిన ఆహారాలు (తృణ ధాన్యాలు, గింజలు) విటిమిన్ ఎ- కలిగిన ఆహారాలు (ముదురు ఆకుపచ్చని రంగులో ఉండే ఆకులు, పసుపు, పచ్చ రంగులో ఉండే పండ్లు) ఎక్కువగా తీసుకోవాలి.

ఔషధాలు: చతుర్ముఖ రసం, క్రమవృద్ధి లక్ష్మీ విలాస రసం, మకరధ్వజ సింధూరం, పూర్ణ చంద్రోదయం, పంచబాణ రసం, స్వర్ణక్రవ్యాధి రసం, వసంతకుసుమాకర రసం, ఆరోగ్యవర్ధినీ వటి, చంద్రప్రభావటి, గోక్షురాది గుగ్గులు, కాంచనార గుగ్గులు, మధుస్నుహి రసాయనం, మహాయోగరాజ గుగ్గులు, నవక గుగ్గులు, పంచతిక్త గుగ్గులు ఘృతం, త్రయోదశాంగ గుగ్గులు, యోగరాజ గుగ్గులు, భృంగరాజాసవం, ధాత్రీలోహం, కుమార్యాసవం, కాంతవల్లభరసం, లోహాసవం, లోహ రసాయనం, లోకనాథ రసం, నవాయస చూర్ణం, ప్రాణదా గుటిక, రజత లోహ రసాయనం, స్వర్ణమాక్షీక భస్మం, స్వర్ణకాంత వల్లభ రసం, సప్తామృత లోహం.

7. గర్భాశయంలో తిత్తి వంటి నిర్మాణాలు పెరగటం (పాలిప్స్):

గర్భాశయపు లోపలి పొరలనుంచి ఉద్భవించే కండరపు నిర్మాణాలను 'పాలిప్స్' అంటారు. ఇవి ఉన్నప్పుడు రుతుస్రావపు అవధీ, పునరావృతమయ్యే తత్వమూ పెరిగేందుకు అవకాశం ఉంది. సూచనలు: ఈ స్థితిలో పంచవల్కలాలతో (న్యగ్రోధ, ఉదుంబర, అశ్వత్థ, పారీష, ప్లక్ష అనే అయిదు వృక్షాల పట్టలను పంచవల్కలాలు అంటారు) తయారు చేసిన కషాయంతో డూష్ చేస్తే ఉపయుక్తంగా ఉంటుంది.

ఔషధాలు: సప్తవింశతి గుగ్గులు, నిత్యానందరసం, చంద్రప్రభావటి.

8. ఇన్ఫెక్షన్లు:

భర్త నుంచి భార్యకు సుఖ వ్యాధులు ప్రాప్తించినప్పుడు వంధ్యత్వమే కాకుండా, రుతుక్రమంలో అస్తవ్యస్థత కూడా చోటుచేసుకుంటుంది. ఈ స్థితిలో జ్వరం యోని స్రావం, పొత్తికడుపు నొప్పి వంటి లక్షణాలు కూడా ఉంటాయి. ఔషధాలు: గంధక రసాయనం, వ్యాధిహరణ రసాయనం, చందనాదివటి, త్రివంగభస్మం.

9. గర్భాశయానికి క్యాన్సర్:

ఇది సత్వరమే పరీక్ష చేయించుకోవలసిన స్థితి. క్యాన్సర్ కాకపొతే మంచిదే. కాని ఒకవేళ అయితే మాత్రం దానిని సరైన సమయంలో గుర్తించడం వలన సరైన చికిత్స తీసుకోవడానికి వీలవుతుంది. అన్ని రకాల క్యాన్సర్లూ అసాధ్యాలు కావు. వాటిని మొదట్లో గుర్తించకపోవడం వల్లనే అసాధ్యాలుగా మారతాయి.

ఔషధాలు: వజ్రభస్మం, కాంచనార గుగ్గులు, లక్ష్మీవిలాసరసం (నారదీయ), భల్లాతకవటి, చిత్రాకాదివటి, క్రౌంచపాకం.

సలహాలు:

1. రుతుక్రమంలో అస్తవ్యస్థతకు సంస్థాగత మైన కారణం పిత్తదోషం వికృతి చెందటం, ఈ దోష వికృతికి దారితీసే అన్ని పరిస్థితులనూ జాగ్రత్తగా గమనించి తదనుగుణంగా చర్యలు తీసుకోవాలి.

2. కారం, పులుపూ, మసాలాలను తీసుకోకూడదు. శారీరక క్రమ, మానసుక శ్రమ రెండు పనికిరావు. విశ్రాంతిగా గడపాలి, అయినదానికి, కానిదానికి చిరాకు పడకూడదు; కోపాన్ని తగ్గించుకోవాలి.

3. సమస్య పూర్తిగా తగ్గే వరకు భార్యాభర్తల కలయికను ఆయుర్వేదం నిషేధించింది.

4. బ్లీడింగ్ ఎక్కువగా అవుతున్నప్పుడు మంచాన్ని, కాళ్లవైపు ఎత్తులో ఉంచి పడుకుంటే మంచిది. దిండును (తలగడ) వాడకూదు. తలను కిందకూ కాళ్లను ఎత్తులోనూ ఉంచి ఏటవాలుగా పడుకోవడం వల్ల అథోమార్గంలో రక్తస్రావమవ్వకుండా ఉంటుంది.

5. ఉసిరికాయలను (గింజలను తొలగించి) నీళ్లు చిలకరిస్తూ మెత్తగా నూరండి. దీని నుంచి రసం పిండి, ఆరు చెంచాలు మోతాదుగా చక్కరతో కలిపి తీసుకోండి. ఇలా ప్రతిరోజు రెండు పూటలా చేస్తే త్వరలోనే ఫలితం కనిపిస్తుంది. ఒకవేళ రసాన్ని తీయడం కష్టంగా అనిపిస్తే ఉసిరిపొడిని నీళ్లతో కలిపి తీసుకోవచ్చు.

6. తిప్పతీగ ఆకులను దంచి రసాన్ని పిండి ఆరు చెంచాలు మోతాదుగా పటిక బెల్లం (మిశ్రి) పొడితో కలిపి తీసుకుంటే రక్తప్రదరం శ్రవిస్తుంది

7. అడ్డరసం ఆకుల నుంచి స్వరసం తీసి రెండు చెంచాలు మోతాదుగా తీసుకోవాలి. అడ్డరసం రక్తస్రావాన్ని ఆపడంలో పేరెన్నికగన్నది.

8. రేగు, నేల ఉసిరి, శుద్ధిచేసిన లక్క, లొద్దుగ, నాగకేశరాలు, కుశ అనే గడ్డిజాతికి చెందిన మొక్క, అశోక ఇవన్నీ రుతుక్రమాన్ని అదుపు చేస్తాయి. వీటిని వైద్యుడిని సంప్రదించి వాడుకోవచ్చు.

9. రక్తప్రదరానికి ఆయుర్వేదంలో శక్తివంతమైన మందులు ఉన్నాయి. చంద్రప్రభావటి, చంద్రకళారస, అశోకారిష్టం, పుష్యానుగచూర్ణం వంటి ఔషధాలను వాడితే, పిత్తాన్ని సమస్థితిలోకి తెచ్చి రుతుక్రమాన్ని పునర్వ్యవస్థీకరిస్తాయి. వీటిని వైద్య సలహా మేరకు వాడుకోవచ్చు.