రక్త స్రావాలు

 

శరీరాంతర్గాతంగానో, నవరంధ్రాలనుంచో రక్తస్రావమవుతున్నప్పుడు తగిన శ్రద్ధ వహించాల్సిందే. కాకపొతే బ్లీడింగ్ కి సరైన కారణం బోధపడితే అంతగా హైరానా చెందాల్సిన పనిలేదు. మనలో అందరికీ ఏదో ఒక సమయంలో - చర్మం కోసుకుపోయినప్పుడో, గాయమైనప్పుడో రక్తస్రావమవుతూనే ఉంటుంది. అలాగే, మహిళలకు ప్రత్యేకించి బహిష్టు సమయాల్లో బ్లీడింగ్ అవుతుంది. ఇవన్నీ స్పష్టమైన కారణంతో కూడుకున్నవి. ఐతే, అకారణంగా, ఇతర లక్షణాలేవీ లేకుండా రక్తస్రావమైతే మాత్రం చాలా మందికి ఆందోళన కలుగుతుంది. కొద్దిపాటి రక్తస్రావమైనప్పటికి ఇతర శారీరక స్రావాలతో పాటు కలిసిపోయి కనిపిస్తుంటే, అదంతా రక్తమేననుకొని కంగారు పడుతుంటారు.

నిజానికి కొద్దిపాటి రక్తస్రావాన్ని చూసి ఆందోళన చెందాల్సిన పనిలేదు. పైగా, రక్తస్రావమనేది ఇతర శారీరక సమస్యలను సకాలంలో గుర్తించి తగిన చర్యలు తీసుకోవడానికి సంకేతంగా పనిచేస్తుంది. ఉదాహరణకు, మలం, సన్నగా, తారు మాదిరిగా కనిపిస్తుంటే పేగుల్లోపల రక్తస్రావమవుతున్నట్లు అర్థం. పెగుల్లోపల పెరిగే క్యాన్సర్ ను సకాలంలో పసిగట్టడానికి ఇది సంకేతం. (చాలా సందర్భాలో క్యాన్సర్ ప్రారంభావస్థలో ఇతర లక్షణాలేవీ కనిపించవు.) అలాగే, కంటిలోపల, ఆఫ్తాల్మస్కోప్తో చూసినప్పుడు రెటినా మీద అగ్నిశిఖ మాదిరిగా రక్తపు బిందువులు కనిపిస్తే, అది అధిక రక్తపు పోటుకు సూచన.

కిడ్నీ, మూత్రకోశం, ఊపిరితిత్తులు, ముక్కు, గర్భాశయం మొదలైన వాటికి సంబంధించిన వ్యాధుల్లో ఆయా శారీరక స్రావాలు రక్తయుక్తంగా ఉంటాయి.అలాగే, రక్తకణాలు తయారయ్యే ఎముకల మూలుగలో సమస్య ఉన్నప్పుడు అసాధారణ రక్తస్రావం కనిపించవచ్చు. అందుకే, తరుచుగా రక్తస్రావం కనిపిస్తున్నప్పుడు అశ్రద్ధ చేయకూడదు. దగ్గినప్పుడు కఫంతో పాటు చిన్న రక్తపు జీర కనిపించినా, మల విసర్జన సమయంలో మలంతో పాటు రక్తం కనిపించినా ఊపిరితిత్తుల లైనింగ్ నలిగిందనో అర్శమొలలు చిట్లయనో ఇలామీకు మీరే ఏదో ఒకటి అన్వయించుకొని అశ్రద్ధ చేయకూడదు. తరచుగా రక్తస్రావమవుతున్నప్పుడు కూలంకషంగా పరీక్షించాల్సిందే. ఈ వివరాల్లోకి వెళ్లేముందు రక్తస్రావమవుతున్నపుడు ఎం జరుగుతుందీ, రక్తం గడ్డకట్టడం వెనుక ఉన్న విధి విధాన మేమిటన్నది తెలుసుకుందాం.

సద్యో వ్రణాల వల్ల రకటస్రావమవుతుంటే మర్మస్థానాలను (ధమనులను) గుర్తించి వాటి మీద ఒత్తిడి ప్రయోగించాలి.

శరీరాంతర్గతంగా రక్తం అనేది రక్తనాళాల ద్వారా (ధమనులు, సిరలు) సంచరిస్తుందన్న సంగతి తెలిసిందే. ధమనులు (ఆర్టరీస్) సిరల (వీన్స్) కంటే దళసరిగోడలతో, ఎక్కువ సాగుడు గుణాన్ని కలిగి ఉంటాయి. ధమనులు గుండె నుంచి ఆక్సిజన్ తో కూడిన తాజా రక్తాన్ని కణజాలాలకు చేరవేస్తే సిరలు కణజాలాలు వినియోగించుకున్న 'చెడు' రక్తాన్ని తిరిగి గుండెకూ, ఊపిరితిత్తులకూ రక్తచంక్రమణార్థం చేరవేస్తాయి. సిరల ద్వారా ప్రవహించే రక్తానికి ఒత్తిడి ఉండదు కనుక సిరల గోడలు పలుచగా, కొలాప్స్ అయ్యే విధంగా ఉంటాయి. ధమనుల ద్వారా ప్రవహించే రక్తం ఆక్సిజన్ తో నిండి ఉండటం వల్ల స్వచ్చమైన ఎరుపుదనంతో, ప్రకాశవంతంగా ఉంటుంది. ఏదన్నా ధమని తెగితే, హెచ్చు ఒత్తిడి ఉండటం మూలాన రక్తం చిమ్ముతుంది. దీనికి భిన్నంగా, సిర తెగినప్పుడు రక్తం ఉబుకుతూ ఉండటమే కాకుండా, త్వరగా గడ్డకడుతుంది.

సాధారణంగా, శరీరాంతర్గతంగా జరిగే రక్తస్రావమనేది ఏదో ఒక ప్రదేశానికో లేక అంగానికో చెందినదై ఉంటుంది. ట్యూమర్, అల్సర్, ఇన్ఫెక్షన్, గాయాల వంటి స్థానిక కారణాల వల్ల రక్తస్రావమవుతుంది. రక్తస్రావం మొదలవ్వడంతోనే రక్తం గడ్డకట్టే ప్రక్రియ కూడా మొదలవుతుంది. రక్తనాళం దెబ్బతిన్నప్పుడు ముందుగా దాని గోడల చివర్లు మూసుకుపోతాయి. పర్యవసానంగా రక్తప్రసరణ తాత్కాలికంగా తగ్గిపోవడంతోపాటు గాయం కూడా చిన్నదవుతుంది. ఈ లోపుగా రక్తంలోని ప్లేట్ లెట్స్ గాయమైన ప్రదేశానికి చేరుకొని ప్రత్యేకమైన ప్రోటీన్లను విడుదల చేసి, ఒక ప్లగ్ మాదిరి పదార్థాన్ని తయారుచేసి, రక్తస్రావాన్ని నిలువరిస్తాయి. ఈ పరంపరలో ఎక్కడైనా లోపం సంభవిస్తే రక్తం పూర్తిస్థాయిలో గడ్డకట్టకుండా ఉండిపోయే అవకాశం ఉంది. ఉదాహరణకు, జన్మతః రక్తనాళాలు బలహీనంగా ఉండే 'హెరిడిటరీ హెమరేజిక్ టెలాంఙెక్టైసిస్' లో ఇలా జరగవచ్చు. లేదా ఎముకలల్లోని మూలుగ వ్యాధిగ్రస్తమవడం చేత వచ్చే లుకేమియా అనే రక్తకణాల క్యాన్సర్ లో జరగవచ్చు. ఐతే, ఈ తరహా వ్యాధుల్లో రక్తస్రావం ఒకే ప్రాంతం నుంచి కాకుండా విభిన్న ప్రదేశాల నుంచి జరుగుతుంది. ఇదే స్థితి రక్తాన్ని గడ్డకట్టనివ్వకుండా చేసే 'యాంటీ కోయాగూలెంట్స్' మందులను వాడే వారి విషయంలోనూ, విటమిన్ - కె వాడే వారిలోనూ, లేదా కాలేయ వ్యాధులున్న వారిలోనూ కనిపించవచ్చు. అందుకే చర్మం తరచుగా కములుతుంటే, గతంలో జరిగిన రక్తస్రావం గురించి ఆరా తీయడం అవసరం. ముఖ్యంగా టాన్సిలెక్టమీ, పళ్లు పీకడం, ఎముకలకు సంబంధించిన ఆపరేషన్లూ తదితరాల గురించి తెలుసుకోవాలి. ఈ విభాగంలోని వ్యాసాలు వివిధ రకాల రక్తస్రావాల గురించి తేలియచేస్తాయి.