ఉదర పార్శ్వాల్లో నొప్పి:

 

1. అలవాటు లేకుండా బరువులు మోసారా?

కండరాల నొప్పి (మజిల్ క్రాంప్స్)

2. మూత్రంలో రక్తం కనిపిస్తుందా?

మూత్రాశయ సమస్యలు (బ్లాడర్ ఇన్ఫెక్షన్స్)

3. నొప్పి అలల మాదిరిగా నడుములో ప్రారంభమై, గజ్జల ద్వారా తొడల లోనికి వ్యాపిస్తుందా?

మూత్రాశయంలో రాళ్ళు (కిడ్నీ స్టోన్స్)

4. ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తుందా?

మూత్రకోశపు ఇన్ఫెక్షన్ (సిస్టైటిస్)

5. వాంతులూ, ఒకరింతలూ ఉన్నాయా?

మూత్రపిండాల వ్యాధి (ఫైలోనెఫ్రైటిస్)

6. మీ పార్శ్వ భాగంలో ఉండీ లేనట్లు నొప్పి ఉంటుందా?

పుట్టుకతో ప్రాప్తించిన కిడ్నీవ్యాధులు

7. తరచుగా మూత్రమార్గానికి, ఇన్ఫెక్షన్లు సోకడం, వాటిని అనుసరించి పార్శ్వ శూల రావడం జరుగుతోందా?

మూత్రపిండాల్లో సిస్టులు

8. జ్వరం వస్తూ, పోతూ ఉండటం, ఉష్ణోగ్రత తీవ్రస్థాయిలో ఉండటం, దానితోపాటు బరువు తగ్గటం వంటివి ఉన్నాయా?

మూత్రపిండాల్లో గడ్డలు (కిడ్ని యాబ్సిస్)

9. వంగినప్పుడూ, పక్కలకు తిరిగినప్పుడూ పదునైన నొప్పి, కత్తితో చీల్చినట్లు వస్తుందా?

కటిశూల (లంబాగో)

10. చర్మంపైన ముందస్తుగా కొద్దిగా జిలగా అనిపించి, ఆ తరువాత నీటి పొక్కులూ, దద్దుర్లూ వచ్చాయా?

విసర్పం (హెర్పిస్ / షింగిల్స్)

 

కడుపు పార్శ్వ భాగాల్లో నొప్పి రావడమనేది ఉదర శూల కంటే కొంచెం తక్కువగా కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో వచ్చే నొప్పికి కిడ్నీ వ్యాధులు ప్రధానమైన కారణమైనప్పటికీ ఇతర కారణాలను అశ్రద్ధ చేయకూడదు.

1. కండరాల నొప్పి (మజిల్ క్రాంప్స్):

బరువులను ఎత్తినప్పుడూ, ముందుకు వంగినప్పుడూ పార్శ్వ భాగంలో ఉండే కండరాలు అసాధారణంగా సాగే అవకాశం ఉంది. ముందుకు వంగిన వెంటనే నొప్పి వస్తే కార్యకారణ సంబంధాన్ని తేలికగానే ఊహించవచ్చుగాని, కొన్ని సందర్భాలలో వంగటం, బరువు లేపడం వంటివి చేసిన తరువాత, మూడు నాలుగు రోజుల తర్వాతెప్పుడో నొప్పి వస్తుంది. ఇలా జరిగినప్పుడు చాలా మంది కారణాన్ని మర్చిపోయి తమకు నొప్పి ఎందుకు వస్తుందనేది తెలియక సతమతమవుతుంటారు. ముందుకు వంగటం, పక్కకు తిరగడం, దగ్గటం, తుమ్మటం వంటివి చేస్తున్నప్పుడు డొక్కల్లో నొప్పి వస్తే ముందు కండరాల మీద ఒత్తిడి పడి ఉండటాన్ని అనుమానించాలి. విశ్రాంతి, వేడి కాపడాలు, వేదనాహర ఔషధాలు ఈ స్థితిలో ఉపయుక్తంగా ఉంటాయి.

ఔషధాలు: మహాయోగరాజగుగ్గులు, బృహత్ వాత చింతామణి రసం, మహావాత విధ్వంసినీరసం, మహానారాయణతైలం.

2. మూత్రాశయ సమస్యలు (బ్లాడర్ ఇన్ఫెక్షన్స్):

మూత్రం రక్తంతో కలిసిపోయి కనిపిస్తుంటే మూత్ర మార్గంలో ఏర్పడిన రాళ్ల గురించి ఆలోచించాలి. మూత్ర పిండాల్లో తయారైన రాళ్లు కిందకు కదులుతూ పదునైన నొప్పితో పాటు రక్తస్రావాన్ని కూడా కలిగించే అవకాశం ఉంది. ఈ తరహా నొప్పి తెరలుతెరలుగా వస్తుంది. ఒకోసారి, ఈ లక్షణాలు, రక్తాన్ని పలుచగా ఉంచడం కోసం తీసుకునే 'యాంటీ కోయాగులెంట్స్' వల్ల కూడా కనిపిస్తాయి. ఈ మందుల వల్ల రక్తపు గడ్డలు కిడ్నీలను చేరి అంతర్గత మార్గాలను అడ్డుకోవడం వల్ల నొప్పి, రక్తస్రావాలు కనిపిస్తాయి.

గృహచికిత్సలు: 1. బొప్పాయి వేరును తెచ్చి, పొడిచేసి, పూటకు పావు చెంచాడు చొప్పున మూడుపూటలా తీసుకోవాలి. 2. ముసాంబరాన్ని చిటికెడు ప్రమాణంగా ద్రాక్షపండులో మాటుపెట్టి తీసుకోవాలి. 3. ఆముదపు వేరు కషాయానికి (అరకప్పు) యావక్షారాన్ని (చిటికెడు) కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 4. పసుపును (అరచెంచాడు) బెల్లంతో కలిపి, బియ్యపు కడుగునీళ్ళతో పుచ్చుకోవాలి. 5. పులిమెరిపట్ట, శొంఠి, పల్లేరు వీటి కషాయానికి బెల్లం కలిపి అరకప్పు మోతాదుగా రెండు పూటలా మండలం (40 రోజులు) పాటు తీసుకోవాలి. 6. దోసగింజల కషాయాన్ని లేదా కొబ్బరి పువ్వుల ముద్దను పాలతో కలిపి కొన్ని రోజులు పుచ్చుకోవాలి, 7. పిల్లిపీచర గడ్డల రసాన్ని (అరకప్పు) ఆవుపాలతో కలిపి తాగాలి. 8.కొడిశపాలపట్ట, లేదా వేరుచూర్ణాన్ని అరచెంచాడు చొప్పున అరకప్పు పెరుగుతో కలిపి రెండుపూటలా తీసుకోవాలి. 9. కొండపిండి వేళ్ళ కషాయానికి (అరకప్పు) శుద్ధిచేసిన శిలాజిత్తును (చిటికెడు) కలిపి పంచదార చేర్చి కొన్ని రోజుల పాటు రెండుపూటలా తీసుకోవాలి.

ఔషధాలు: చంద్రప్రభావటి, గోక్షురాదిగుగ్గులు, వరుణాదిక్వాథం, హజ్రల్యహూద్ భస్మం, సహచరాది తైలం.

3. మూత్రాశయంలో రాళ్ళు (కిడ్నీ స్టోన్స్):

నొప్పి అలలమాదిరిగా నడుములో ప్రారంభమై, గజ్జల ద్వారా తొడలలోనికి వ్యాపిస్తుంటే అది కిడ్నీల్లోని రాళ్లను సూచిస్తుంది. ఈ రకమైన స్థితిలో పాషాణ భేది, పునర్నవవంటి మూలికలు ఉపయుక్తంగా ఉంటాయి.

ఔషధాలు: చంద్రప్రభావటి, గోక్షురాది చూర్ణం, గోక్షురాది గుగ్గులు, పునర్నవాది మండూరం, శతావరి లేహ్యం, శోథారి మండూరం, సుకుమార రసాయనం, శతావరి ఘృతం, సూరాక్షార కాసీస భస్మం.

4. మూత్రకోశపు ఇన్ఫెక్షన్ (సిస్టైటిస్):

తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి రావడం, నొప్పి, మంటలు ఉంటున్నప్పుడు మూత్ర వ్యవస్థకు సంబంధించిన 'సిస్టైటిస్' గురించి ఆలోచించాలి.

ఔషధాలు: చందనాసవం, చందనాది వటి, చంద్రప్రభావటి, దేవకుసుమ రసాయనం, గోక్షురాది గుగ్గులు, గుడూచి సత్వం, కర్పూర శిలాజితు భస్మం, శతావరి లేహ్యం, సుకుమార ఘృతం, సుకుమార రసాయనం.

5. మూత్రపిండాల వ్యాధి (పైలోనెఫ్రైటిస్):

పైలోనెఫ్రైటిస్ అనే కిడ్నీ వ్యాధిలో వాంతులూ, ఒకరింతలూ ఉంటాయి. ఈ లక్షణాలతో పాటు చలి, వణుకు వంటివి ఉంటే ఈ వ్యాధి గురించి మరింత నిశితంగా ఆలోచించాలి.

ఔషధాలు: శ్వేతపర్పటి, చంద్రకళారసం, చందనాదివటి, చంద్రప్రభావటి, శిలాజిత్తు.

6. పుట్టకతో ప్రాప్తించిన కిడ్నీ వ్యాధులు:

పార్శ్వ భాగంలో నులినొప్పి అనేది కొన్ని సందర్భాల్లో జన్మతః ప్రాప్తించిన కిడ్నీ వ్యాధుల్లో కనిపిస్తుంది. వ్యాధి పురోగమనం మొదలైన తరువాత, లక్షణాలు కనిపించడానికి చాలా కాలం పడుతుంది. ఈ వ్యాధుల్లో కిడ్నీలు ముడుచుకుపోయి గట్టిగా తయారవుతాయి. పూర్తిస్థాయిలో పనిచేయనందున ఇన్ఫెక్షన్లకు ఆస్కారం ఏర్పడుతుంది. ఈ వ్యాధుల్లో, కొన్ని సందర్భాల్లో ఒక్కోకిడ్నీకీ ఒకటి కంటే ఎక్కువ నాళాలు ఉంటాయి. లేదా, నాళాల్లోని వాల్వులు సహజ నైజాన్ని కోల్పోయి మూత్ర ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. వీటన్నిటి ఫలితంగా మూత్ర పిండాలు ఉబ్బిపోయి నులినొప్పిని కలిగిస్తాయి. దీనిని జాగ్రత్తగా పరీక్షంచి ఆహారంలో మార్పులనూ, తగిన చికిత్సలనూ చేయాల్సి ఉంటుంది.

7. మూత్రపిండాల్లో సిస్టులు:

కిడ్నీల్లో ఒక మోస్తారు నుంచి భారీ పరిమాణంలో సిస్టులు తయారైతే డొక్కల్లో నొప్పి రావడమే కాకుండా తరచుగా ఇన్ఫెక్షన్లకు కూడా ఆస్కారం ఏర్పడుతుంది. సిస్టుల కారణంగా మూత్రం నిలిచిపోవడం వల్ల ఇలా జరుగుతుంది.

ఔషధాలు: గోక్షురాదిగుగ్గులు, పునర్నవాదిగుగ్గులు, శ్వేతపర్పటి.

8. మూత్రపిండాల్లో గడ్డలు (కిడ్నీ యాబ్సిస్):

మూత్రపిండాల్లో చీముగడ్డలు (యాబ్సిస్ లు) తయారైనప్పుడు జ్వరం వస్తూ, పోతూ వుండటం, ఉష్ణోగ్రత తీవ్రస్థాయిలో వుండటం, దానితోపాటు బరువుతగ్గటం వంటివి వుంటాయి. ఈ చీము గడ్డలనుంచి కీటాణువులు బయటకు వస్తున్నప్పుడల్లా జ్వరం వస్తుంది.

ఔషధాలు: తారకేశ్వరరసం, వసంతకుసుమాకర రసం.

9. కటిశూల (లంబాగో):

వెన్నెముక పూసల మధ్యనుంచి నరాలు వెలుపలకు ప్రయాణిస్తాయి. ఇవి నొప్పి, ఉష్ణోగ్రతల్లాంటి సమాచారాలను వెన్నుపాముద్వారా, మెదడుకు చేరవేస్తుంటాయి. దీనికి 'కటివస్తి' అనే ఆయుర్వేద చికిత్సను చేస్తే చక్కని ప్రయోజనం కలుగుతుంది. ఈ చికిత్సా ప్రక్రియలో నడుము ప్రాంతంలో సుఖోష్ణంగా ఉండే ఔషధసిద్ధ తైలాలను కొంచెం సేపు నిలకడగా ఉంచడం జరుగుతుంది.

ఔషధాలు: అగ్నితుంటివటి, చంద్రప్రభావటి, ఏరండపాకం, మహాయోగరాజగుగ్గులు.

బాహ్యప్రయోగం - మహావిషగర్భతైలం.

10. విసర్పం (హెర్పిస్ / షింగిల్స్):

హెర్పిస్ లేదా షింగిల్స్ అనే వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల దద్దురు, నీటిపొక్కులు, నొప్పి వస్తాయి. చిన్నతనంలో చికెన్ పాక్స్ ఇన్ఫెక్షన్ వచ్చిన వారికి, తరువాత వయసులో ఈ వ్యాధి రావచ్చు. దద్దురు వచ్చే ముందు శరీరంలో ఒక ప్రక్కనంతా పొడుస్తున్నట్లు నొప్పి వస్తుంది.

ఔషధాలు: గుడూచిసత్వం, కర్పూరశిలాజతుభస్మం, కామదుఘరసం, మంజిష్టాదిక్వాథం, నింబాదిక్వాథ చూర్ణం, షండంగక్వాథచూర్ణం.

బాహ్యప్రయోగాలు: మహాతిక్తక ఘృతం, నాల్పామరాది తైలం, పిండ తైలం.