నొప్పి

ఆయుర్వేద శాస్త్రంలో నొప్పిని వివిధ సందర్భాలలో వివిధ రూపాలుగా పేర్కొన్నారు. వేదన, శూల, దాహం, శోథ, అంగమర్థం ఇవన్నీ కొద్దిపాటి తేడాలతో నొప్పిని సూచించే పదాలు. అపశృతిని సరిచేసుకోవం కోసం శరీరం ఎన్నో రకాలైన పద్ధతులను అవలంభిస్తుంది. వాటిలో నొప్పి ఒకటి. నొప్పి మన శరీరాన్ని నిరంతరమూ కాపాడుతుంటుంది. ఉదాహరణకు గుండెపోటునే తీసుకుందాం. ఇది వచ్చినప్పుడు ఛాతిలో నొక్కుతున్నట్లుండే నొప్పి తీవ్రరూపంలో వస్తుందనీ, అది ఎడమ చేయిలోనికిగాని, లేదా నాలుకలోనికిగాని పాకుతుందనీ తెలుసు కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటాం. ఇలా కాకుండా, నొప్పి లేకుండా ఒకవేళ సైలెంట్ హార్ట్ ఎటాక్ వస్తే ఏమీ జరగలేదనీ ఉద్దేశ్యంతోనే ఉంటారు. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తారు. రిస్కుని, కారణాలను పట్టించుకోరు. రెండోసారి మళ్ళీ వస్తుంది. ఈ సారి వచ్చినప్పుడు అంత తేలికగా వదలకపోవచ్చు. కోలుకోవడానికి కూడా వీల్లేనంత తీవ్ర పరిణామాలు ఏర్పడవచ్చు.

 

చాలామంది క్యాన్సర్ ని నొప్పి తెలియక పోవడం అనే కారణంగానే బాగా పెరిగిపోయే వరకు పట్టించుకోకుండా అశ్రద్ధ చేస్తుంటారు. శరీరపు అట్టడుగు పొరల్లో ఎక్కడో పేగులు, గ్రంథులు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, రొమ్ములు ఇలా ఏ అవయవం లోపలో చడీచప్పుడు కాకుండా పెరిగే క్యాన్సర్ ని ప్రమాదస్థాయి వచ్చే వరకు గుర్తించలేకపోవడానికి కారణం క్యాన్సర్ కణితులు లక్షణ రహితంగా, నొప్పి లేకుండా పెరగడమే.

ఇంతకీ చెప్పివచ్చేదేమంటే నొప్పి వలన బాధే కాకుండా ఉపయోగాలు కూడా ఉన్నాయని.

 

మూగ జీవాలు దెబ్బలు తగిలినప్పుడు, గాయాలైనప్పుడు నొప్పి కారణంగా సంబంధిత భాగాన్ని కదలించకుండా ఉంటాయి కాబట్టే వైద్య సహాయం లేకపోయినప్పటికీ కోలుకోగలుగుతాయి.

 

శరీరం తనను తాను పునర్నిర్మించుకునేటప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా కావాలసింది నిశ్చలత్వం. డాక్టర్లు విరిగిన ఎముకలు అతుక్కోవడానికి 'పిండికట్టు' వేసినా, తెగిన గాయం అతుక్కోవడానికి కుట్లు వేసినా, ఈ చర్యల వెనుక ఉద్దేశ్యం ఆ భాగానికి విశ్రాంతి కల్పించాలనే, అందుకే నొప్పి పంపించే సందేశాలను అర్థం చేసుకోవాలి. దాని వెనుక ఉన్న కారణాలను విశ్లేషించుకోవాలి. ఆ తరువాత నొప్పిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.

 

నొప్పి - పరిమితి:

నొప్పిని గ్రహించడంలోనూ, వ్యక్తీకరించడంలోనూ, వ్యక్తినుంచి వ్యత్యాసముంటుంది. భయం, ఆందోళన వంటివి నొప్పి పైన ప్రభావాన్ని చూపిస్తాయి. అలాగే అకారణంగా వస్తున్నట్లు అనిపించే నొప్పి కూడా గాబరాను కలిగిస్తుంది.

 

నొప్పి - లక్షణాలు:

నొప్పి వివిధ రూపాలలో, వివిధ లక్షణాలతో బహిర్గతమవుతుంది. మీకు నొప్పిగా ఉన్నప్పుడు డాక్టర్ కు కేవలం ఆ ఒక్కో విషయాన్ని చెప్పి ఊరుకుంటే సరిపోదు. దాని లక్షణాలన్నీ చెప్పాలి. వ్యాధిని నిర్ధారించాలనుకున్నప్పుడు డాక్టర్ కు దాని సమగ్రమైన రూపం తెలియాలి. అందుకు ఈ కింది అంశాలు దోహదపడతాయి.

 

నొప్పి ఉన్న భాగం:

నొప్పి అన్ని ప్రాంతాలలోనూ ఒకే మాదిరిగా బహిర్గతం కాదు. వివిధ ప్రాంతాల్లో నరాలు వివిధ సంఖ్యలో ఉంటాయి. ఉదాహరణకు నొప్పి ఉన్నప్పుడు మునివేళ్ళలో ఎక్కువ స్థాయిలోనూ పాదాలలో తక్కువ స్థాయిలోనూ తెలుస్తుంది. కొన్ని సార్లు కొన్ని రకాల నొప్పులు తప్పుదోవ పట్టిస్తుంటాయి.

 

ఉదాహరణకు 24 గంటల కడపునొప్పినే తీసుకుందాం. ఇది పేగుల తాలూకు 'ఎపెండిక్స్' అనే నిరుపయోగ అవశిష్ట భాగం వ్యాధిగ్రస్తం కావడం వలన వస్తుంది. ఇది ఉదార ప్రదేశంలో కుడివైపు తొంటి ఎముకకు కాస్త పైభాగాన ఉంటుంది. అపెండిసైటిస్ వచ్చినప్పుడు మొదట్లో నొప్పి ఎపెండిక్స్ ప్రదేశంలో కాకుండా, బొడ్డు చుట్టూ వచ్చే అవకాశం ఉంది. నొప్పిని గురించి అడిగే సమయంలో వైద్యులు ఇటువంటి విషయాలన్నిటినీ దృష్టిలో ఉంచుకుంటారు.

 

అదే విధంగా నొప్పి వచ్చే ప్రదేశాన్ని బట్టి కూడా దానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత పెరుగుతుంది. ఛాతిలో నొప్పినీ, ఉదరంలో నొప్పినీ ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు; అల్సర్లు చిద్రమవడం దగ్గర నుంచి గుండెపోటు వరకు ఎన్నో ప్రమాదకరమైన స్థితులు నొప్పి అనే లక్షణంతోనే సంకేతాలను పంపుతాయి. చేయి నొప్పి, కాలు నొప్పి మొదలయినవి ఉన్నప్పుడు పడకూడదుగాని, అప్రమత్తంగా ఉండాలి.

 

వ్యాప్తి:

మనలో ప్రతి ఒక్కరం మోచేతి వెనుక దెబ్బ తగిలినప్పుడు చేతి వేళ్ళ వరకూ ఝల్లుమనడాన్ని లేదా షాక్ కొట్టునట్లు అనిపించదాన్ని ఎప్పుడో ఒక్కప్పుడు చవి చూసి ఉంటాం. ఇలాంటి నొప్పులకు కారణం ఒకచోటునుంటే ఫలితం మరొక చోట ఉంటుంది. ఉదాహరణకు నడుము భాగంలో వెన్నెముక డిస్కులు స్లిప్ అయినప్పుడు, సయాటిక్ నరం మీద ప్రభావం పడి అది వెళ్ళేంత దూరమూ ఉంటే తొడలు, కాలి పిక్కలు, కాలి పాదం వరకు సలుపుతున్నట్లుండే, నొప్పి ఉంటుంది.

 

గాల్ బ్లాడరు, చిద్రమైన అల్సర్లు, ఫెలోపియన్ నాళాలలో వృద్ధిచెందే గర్భాశయేతర గర్భం (ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ) వీటినుంచి రక్తం స్రవిస్తున్నప్పుడు డయాఫ్రం (ఉదరాన్ని ఛాతి నుండి వేరుచేసే గుడారం లాంటి నిర్మాణం) ఇరిటేట్ అవుతుంది. ఫలితంగా భుజంలో నొప్పి వచ్చే అవకాశం ఉంది. దీనికి కారణం నరాలు ఒక చోటు నుంచి మరొక చోటుకు ప్రయాణించడమే.

 

అయితే ఈ తరహా నొప్పులలో సమయం గడుస్తున్నకొద్దీ నొప్పి స్వస్థానంలో కేంద్రీకృతమవుతుంది. ఒక ప్రదేశంలో నొప్పి అనిపించేటప్పుడు అది ఆ ప్రదేశానికి సంబంధించినదై ఉండాలని నియమం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుంటే ప్రమాదకరమైన చిహ్నాలను అశ్రద్ధ చేసే అవకాశం ఉండదు.

 

గుణ ధర్మాలు:

ఒక్కొక్కరు నొప్పిని ఒక్కో విధంగా వర్ణిస్తారు. బిగేసినట్లు, మిలిపెట్టినట్లు, సూదులతో గ్రుచ్చినట్లు, పొడిచినట్లు, చీల్చినట్లు ఇలా వివిధ రకాల పోలికలతో చెబుతుంటారు. నొప్పికి సంబంధించిన ఇలాంటి లక్షణాలు నిజానికి వ్యాధిని నిర్ణయించే విషయంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు పదునైన నొప్పులు నరాలు ఇరిటేట్ కావడం వలన వస్తాయి. అలా కాకుండా మందంగా, అసౌకర్యంగా ఉండే నొప్పులు శరీరపు అంతర్గత నిర్మాణాలైన గుండె, పేగులు మొదలయినవి వ్యాధికి గురికావడాన్ని సూచిస్తాయి.

 

తీవ్రత:

నొప్పి ఎప్పుడూ కష్టంగానే ఉంటుందికాని ఎంత కష్టం అనేది తెలియాలి. నొప్పి తీవ్రతను నిర్ణయించదానికి డాక్టర్లు రూపాయిలో ఎంత శాతం అని అడుగుతుంటారు - పావలా వంతా, అర్థరూపాయి వంతా, లేక ముప్పావలా వంతా అనేది చెప్పమంటారు. దీనికి కారణం నొప్పిని కనుక్కోవడానికి సరైన సాధనం లేకపోవడమే. కిడ్నీలలో రాళ్ళ వలన, పేగులు అల్సర్లతో చిద్రమవడం వలన, కాలి ఎముక విరగటం వలన వచ్చే నొప్పులు చాలా తీవ్రస్థాయిలో ఉంటాయి. దీనికి భిన్నంగా గుండెపోటు, కంటిలో ఒత్తిడి పెరగటం వలన వచ్చే గ్లకోమా వంటివి ఏ మాత్రం నొప్పిని ప్రదర్శించకపోవచ్చు. మరొక ఆసక్తికరమైన విషయమేమిటంటే ఆహ్లాదకరమైన మానసికావస్థల్లో (ఉదాహరణకు ఆటలు ఆడేటప్పుడు, ఉద్రేకపూరితంగా ఉన్నప్పుడు) దెబ్బలు తగిలినా వెంటనే నొప్పి తెలియదు. విషాదకరమైన, అందోళనకరమైన మానసికావస్థల్లో చిన్నపాటి గాయమైనా ఎక్కువ నొప్పిగా అనిపిస్తుంది.

 

కొన్నిసార్లు నొప్పితో బాధపడేవారి ప్రవర్తన కూడా లక్షణ ప్రవృత్తిని తేలియజేస్తుంది. ఉదాహరణకు కిడ్నీలో రాళ్ళు ఉన్నప్పుడూ, పిత్తాశయపు సమస్యలతో బాధపడేటప్పుడు బాగా అశాంతిగా ఉంటారు; కూర్చుంటారు... ముందుకు వంగుతారు... పక్కకు తిరుగుతారు.... కాళ్ళు డొక్కలోకి ముడుచుకుంటారు... తమకు సాంత్వన లభించడానికి ఏమేమి చేయాలో అవన్నీ చేస్తారు. ఆదుర్దా చెందే మనస్తత్వమున్న వారికి ఈ నొప్పులు ఇనుమడిస్తాయి కూడా, నొప్పి బాగా తీవ్రంగా ఉన్నప్పుడు వాంతులు కావచ్చు. అలాగే చమటలు కారడం, రక్తంపోటు పెరగడం, వణుకు రావడం వంటివి కూడా సంభవించవచ్చు.

 

అవధి:

లక్షణాలకు కారణమైన అంశాలను ఊహించడానికి ఈ విషయం బాగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఛాతిలో నొప్పి గుండెకు రక్త సరఫరా తగ్గడం వలన వచ్చేదే అయితే, కొద్దిపాటి విశ్రాంతితో తగ్గిపోవాలి. ఇదే హార్ట్ ఎటాక్ వల్ల వచ్చే నొప్పి అయితే అంత త్వరగా తగ్గదు. అదే విధంగా ఉదరపు కండరాలు పట్టేయడం వలన వచ్చే నొప్పి స్వల్పకాలికమేగాని, అమీబియాసిస్ వలన వచ్చే నొప్పు చాలా సేపు కొనసాగుతుంది.

 

పునరావృతాలు:

ఆగి ఆగి వచ్చే నొప్పులు చాలామందికి అనుభవమే. అదే విధంగా పేగుల్లో అద్దంకి ఏర్పడటం, విషాహారాల వలన కూడా నొప్పులు తెరలు తెరలుగా వస్తుంటాయి. దీనికి భిన్నంగా కీళ్ళు వ్యాధి గ్రస్తమైనప్పుడు నొప్పి నిరంతరమూ ఉంటూనే ఉంటుంది. పిత్తాశయంలో రాళ్ళు ఉన్నప్పుడు లేదా వ్యాధిగ్రస్తమైనప్పుడు కొన్ని గంటలపాటు ఏకధాటిగా నొప్పి కొనసాగి, ఆ తరువాత రోజుల తరబడి అదృశ్యమైపోవచ్చు.

 

సమయం:

రోజు మొత్తంలో ఏ సమయంలో నొప్పి వస్తుందో తెలుసుకుంటే నొప్పికి క్లూ దొరుకుతుంది. ఉదాహరణకు కొంతమందిలో మైగ్రేన్ తలనొప్పులు ఉదయం పూట ఎక్కువగా వస్తుంటాయి. అలాగే కొంతమంది మహిళలకు నొప్పులు బహిష్టు సమయంలో ఎక్కువగా వస్తుంటాయి. డుయోడినల్ (చిన్న పేగు మొదటి భాగం) అల్సర్లతో నొప్పి సాధారణంగా తెల్లవారు ఘూమున, రెండు మూడు గంటల మధ్య వస్తూ ఉంటుంది. ఇది ఆహారం తీసుకుంటే కాని తగ్గదు.

 

ప్రేరకాలు:

ఈ విషయంలో కూడా ముఖ్యమైనదే. ఉదాహరణకు ఛాతిలో నొప్పి వచ్చినప్పుడు ఒకవేళ ముందుకు వంగితే నొప్పు ఎక్కువైతే అప్పుడది గుండె పోటు కంటే హాయేటస్ హెర్మియా (ఆమాశయం పై భాగం డయాఫ్రం ద్వారా అన్ననాళికలోనికి చొచ్చుకు వెళ్ళడం) అయ్యే అవకాశాలు ఎక్కువ, అలాగే, నడుము నొప్పి ఉంటూ, దగ్గినప్పుడు ఎక్కువవుతుంటే దానికి కారణంగా ఎముకలు వ్యాధిగ్రస్తం కావడం కంటే, డిస్క్ తొలగడాన్ని గురించే ఎక్కువ ఆలోచించాలి. పోతే ఇంతకూముందు గాల్ బ్లాడర్ వ్యాధిగ్రస్తమైనప్పుడు భుజంలో నొప్పి వచ్చే అవకాశం ఉందనుకున్నాం కదా- అయితే భుజాన్ని పైకెత్తుతున్నప్పుడు ఈ నొప్పి ఎక్కువవుతుంటే పిత్తకోశానికి సంబంధించిన జబ్బు కన్నా, భుజం లోపలి నిర్మాణాలు ఇన్ ప్లేమ్ అవ్వడం గురించే ఎక్కువ ఆలోచించాలి.

 

ఉపశయాలు:

కడుపులో మంట, నొప్పి ఈ రెండు ఉన్నప్పుడు తినేసోడాను నీళ్ళలో కలిపి తాగితే ఉపశమనం లభిస్తే - అప్పుడు దానిని పేగు పూత వలన వచ్చిన నొప్పిగా అనుకోవచ్చు. అలాగే గుండె దడగా ఉన్నప్పుడు కొద్దిపాటి వ్యాయామంతో సమిసిపోతే గుండెకు సంబంధించిన ప్రమాదకరమైన జబ్బులేవీ లేవని అనుకోవచ్చు.

 

అనుబంధ లక్షణాలు:

మైగ్రేన్ తలనొప్పులతో దృష్టి లోపాలు, వాంతులు మొదలయినవి అనుబంధ లక్షణాలుగా ఉంటాయి. అలాగే మూత్ర పిండాలలో రాళ్ళు ఉన్నప్పుడు సాధారణంగా మూత్రంలో రక్తం పోతూ ఉంటుంది. గుండెపోటు చాలా సందర్భాలలో ఆయాసం, వికారం, చమట, స్పృహ తప్పడం వంటి లక్షణాలతో అనుబంధించి ఉంటుంది.

 

శరీరంలో నొప్పి అనేది నరాల ద్వారా, వాటిలో జరిగే రసాయన చర్యల ద్వారా కొనసాగుతుంటుంది. లక్షణానికి వెనుక ఉండే కారణాన్ని కనుగొనడానికి నొప్పి బాగానే ఉపయోగపడినా, చాలా సందర్భాలలో ఇది భరించలేనంత బాధను, అసౌకర్యాన్ని కలిగిస్తుంటుంది. చాలామంది ఈ నొప్పినుండి ఉపశమనం పొందడం కోసమే డాక్టర్ వద్దకు వెళుతుంటారు. అల్లోపతిలో నొప్పిని తగ్గించడానికి వాడే కొన్ని రకాల మందులకు 'నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ ఫ్లమేటరీడ్రగ్స్' అని పేరు. ఇన్ ఫ్లమేషన్ని (నొప్పి, వాపు, ఎరుపుదనం, స్థానిక ఉష్ణోగ్రత పెరగడం మొదలయిన లక్షణాలు) తగ్గించడానికి ఇవి పనికొస్తున్నప్పటికీ, దీర్ఘకాలంగా వాడాల్సివచ్చినప్పుడు వాటికి గల సైడ్ ఎఫెక్ట్స్ కు గురి కావలసి వస్తోంది. ఉదాహరణకు యాస్ప్రిన్ వలన చర్మంపైన దద్దుర్లు, దురద, కడుపులో మంట, వికారంగా ఉండటం, వాంతులు, రక్తాన్ని వాంతి చేసుకోవడం వంటివి ఉండవచ్చు. అలాగే పారాసిటమాల్ ను అధిక మోతాదులలో తీసుకోవడం వలన న్యూట్రోఫినియా (రక్తంలోని తెల్ల కణాలలో బాక్టీరియాను కబళించే గుణం ఉన్న న్యూట్రోపిల్స్ తగ్గడం), త్రాంబోసైటోపీనియా )రక్తాన్ని గడ్డ కట్టించే నైజం ఉన్న ప్లేట్ లెట్స్ తగ్గటం) చర్మంపైన దద్దుర్లు, హీమోలైసిన్ (ఎర్రరక్తకణాలలోని హిమోగ్లోబిన్ చుట్టు ప్రక్కల ద్రవంలోకి వీలినం కావడం), కాలేయం దెబ్బతినడం వంటివి సంభవించవచ్చు.

 

ఫేనిల్ బ్యుటజోన్ వలన కడుపులో మంట, ఛాతిలో అసౌకర్యంగా ఉండటం, వాంతులు, ఒకరింతలు, చర్మంపై దద్దుర్లు, నిద్రలేమి, కళ్ళు బైర్లు కమ్మడం, కంటిలోపల నొప్పి, రెటీనాలో రక్తస్రావం, పాంక్రియాస్ వాపు. తల తిరగడం, మూత్రంలో రక్తం పోవడం, ఫిట్స్, రావడం, రక్తల్పత, కాలేయం దెబ్బతినడం, మూత్రపిండాలు చెడిపోవడం, చర్మం పైపొరలు పొలుసులుగా రాలడం, శరీరపు వాపు, ఊపిరితిత్తులు నిండుకుపోవడం, ఆయాసం, కడుపులో అల్సర్లు వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. ఇదే విధంగా ఇతర నొప్పిని తగ్గించే మందులు కూడా వివిధ సైడ్ ఎఫెక్ట్స్ ను కలిగిస్తాయి. పదేపదే ఈ మందులు వాడాల్సి వచ్చినప్పుడు మూత్రపిండాల మీద దుష్ఫలితాలను కలిగించడం వైద్య శాస్త్రవేత్తలను కలవరపరుస్తుంది.

 

పరిశోధనలు, ఆయుర్వేద చికిత్సలు:

ఈ నేపథ్యంలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో, నిరపాయకరమైన విధానంతో ఇన్ ఫ్లమేషన్ ను తగ్గించగలిగే నివారణల గురించి అధ్యయనాలు జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి. చరక, సంహిత, సుశృత సంహిత, భావ ప్రకాష మొదలైన ఆయుర్వేద గ్రంథాలలో పేర్కొన్న ఓషధులు, ఔషధ సంయోగాల పైన వివిధ అధ్యయనకారులు అనేక రకాల ప్రయోగాలూ, అధ్యయనాలూ నిర్వహించగా సంతృప్తికరమైన ఫలితాలు వెల్లడైనాయి.

 

ఉదాహరణకు గుగ్గిలాన్ని తీసుకుంటే, ఈ చెట్టు నిర్యాసానికి (మ్రానుబంక) హైడోకార్డిజోన్, ఫినైల్, బ్యుటాజోన్ లాగా ఇన్ ఫ్లమేషన్ కు వ్యతిరేకంగా పనిచేసే గుణం ఉన్నట్లుగా తేలింది.

 

అల్బినో ఎలుకలను బ్రౌన్ రీస్ ఫార్మాల్డిహైడ్ ద్వారా కీళ్ళ నొప్పులను కలిగించి ఈ చెట్టు నిర్యాసాన్ని ఇచ్చినప్పుడు ఈ విషయం రుజువైంది, జామ్ నగర్ కు చెందినా రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ నివేదిక ప్రకారం ఇది ఇన్ ఫ్లమేషన్ ను సమర్థవంతంగా తగ్గించడంతోపాటు. రోజుకు 10నుంచి 12 గ్రాముల మోతాదులో కూడా ఏ రకమైన దుష్ఫలితాలూ కలిగించలేదనీ, కొలెస్టరాల్ ను కూడా గణనీయంగా తగ్గించగలిగిందనీ రుజువైంది. స్థూలకాయం వలన వచ్చే కీళ్ళనొప్పుల్లో కూడా ఇది బాగా పనిచేస్తుందని ఆ నివేదిక అభిప్రాయపడింది.

 

అదే విధంగా ఆముదపు వేరుకు కూడా ఇన్ ఫ్లమేషన్ ప్రధాన లక్షణమైన వ్యతిరేకంగా పనిచేసే గుణం ఉన్నట్లు వెల్లడయింది. కరజీన్ అనేది ఒక రకమైన నాచుమొక్క నుండి తీసే పదార్థం. దీనిని ఎలుకలకు ఇచ్చి వాపును తగ్గించి, ఆ తరువాత ఆల్కహాల్ ద్వారా తీసిన ఆముదపు వేళ్ళ సారాన్ని ఇచ్చినప్పుడు వాపు 70 శాతం తగ్గినట్లు శాస్త్రజ్ఞులు గమనించారు. ఇదే కేసులో ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్ ను ఇచ్చి చూసినప్పుడు వాపు 65 శాతం మాత్రమే తగ్గటం గమనార్హం.

 

ఇవేకాక, అనేక ఇతర మందు మొక్కల మీద కూడా శాస్త్రీయ అధ్యయనం జరిగింది. ఆ మొక్కలన్నింటిలోనూ వివిధ శ్రేణులలో ఇన్ ఫ్లమేషన్ వ్యతిరేక లక్షణాలున్నట్లు వీటితోపాటు మహారాస్నాదిక్వాథం, యోగరాజుగుగ్గులు, స్వర్ణభస్మం మొదలయిన వాటి మీద కూడా అధ్యయనాలు నిర్వహించారు. ఫలితాలు అద్భుతంగా ఉన్నట్లు రుజువైంది.