మెడ నొప్పి:

1. మీరు స్కూటర్ మీద కాని, కారులో కాని వెడుతూ, ట్రాఫిక్ లైట్ల వద్ద ఆగినప్పుడు వెనుక నుంచి వచ్చి ఏదైనా వాహనం ఢీకొన్నదా?

విప్ ల్యాష్ దెబ్బ

2. మెడ కండరాలు నొప్పులతో ఉంటున్నాయా?

కండరాలనొప్పి (మజిల్ క్రాంప్స్)

3. మెడ తిప్పినప్పుడల్లా చాలా నొప్పిగా ఉంటుందా?

మెడ వెన్నుపూసాలు అరిగిపోవడం (సర్వైకల్ స్పాండిలోసిస్)

4. మెడ తిప్పినా, పైకి చూసినా కళ్లు తిరుగుతాయా?

భ్రమ (వర్టిగో)

5. మీ మెడ ప్రాంతంలో ఏవైనా గ్రంథులు వాచాయా?

గ్రంథుల వాపు

6. మీ మెడ ముందు భాగంలో వాపులాంటిది ఏదైనా కనపడుతోందా?

థైరాయిడ్ సమస్యలు

 

ఆయుర్వేదిక్ మెడికల్ ప్రాక్టీస్ లో కేవలం మెడతిప్పి అంటూ వచ్చే వారు తక్కువేమీ వుండరు. వ్యాయామరహిత జీవితం, హడావుడితో నిండిన దైనందిత కార్యక్రమాలు, అనవసరమైన టెన్షన్లు, అస్తవ్యస్తమైన పనిగంటలు, అసహజమైన భంగిమలు ఇవన్నీ మెడనొప్పిని కలిగించే ప్రధాన కారణాలు.

 

వెన్నుముక అగ్ర భాగం మెడకు ఆధారానివ్వడమే కాకుండా, అత్యధిక స్థాయిలో కదలికను కూడా కలిగి ఉంటుంది. ఈ లక్షణం ఉండటం చేత మెడకు హాని కలిగే అవకాశం కూడా అంతే ఉంటుంది. వెన్నెముక విరగడం, లేదా పక్కకు తప్పుకోవడం జరిగితే అన్నిటికంటే ఎక్కువ నొప్పి ఉంటుంది. దీనిలో వెన్నెముక వాపు, విపరీతమైన నొప్పి ఉంటాయి. ఇలా మెడకు దెబ్బ తగిలినప్పుడు బాధితుడిని సరైన ప్రాథమిక చికిత్సా పద్ధతులు తెలుసుకొని మరీ వైద్య సహాయార్థం తరలించాలి. లేకపోతే మెడలోని వెన్నెముకకు మరింత హాని జరిగే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ మీకు మెడనొప్పి ఉన్నట్లయితే దానికి దారితీసే సాధారణ కారణాలను తెలుసుకునేందుకు ఈ కింది విషయాలు దోహదపడుతాయి.

 

1. విప్ ల్యాష్ దెబ్బ:

మీ వాహనం ఆగి ఉందని అనుకుందాం ఆ సమయంలో మీరూ నిశ్చల స్థితిలో ఉంటారు. అదే సమయంలో ఎవరైనా వెనుకనుంచి వచ్చి ఢీకొంటే హఠాత్తుగా మీ వాహనం ముందుకు కదులుతుంది. దానితోపాటు ,ఈ శరీరం కూడా ముందుకు కదులుతుంది. అయితే తల మాత్రం ఇంకా విశ్రాంతి స్థితిలోనే ఉంటుంది. ఇది కొద్ది సెకనులు మాత్రమే. అయినప్పటికీ జరుగవలసిన అనర్థం జరిగిపోతుంది. మీ మెడ కండరాలు వాటి పరిధిని మించి సాగుతాయి. అప్పుడు, ఆ క్షణంలో మీకేమీ నొప్పి ఉండకపోవచ్చుగాని మీరు మరుసటి రోజు ఉదయం తీవ్రమైన మెడనొప్పితో మేల్కొనే అవకాశం ఉంది. అలాంటి సందర్భాలలో మెడంతా అసౌకర్యంగా, పట్టేసినట్లు అనిపిస్తుంది.

 

సూచనలు: మహానారాయణ తైలం పూసుకొని కాపడం పెట్టుకోవాలి. అవసరమైతే యోగరాజ గుగ్గులును వైద్యుడి సలహాతో వాడుకోవచ్చు. పరిమిత కాలంపాటు మెడకు సర్వైకల్ కాలర్ తో ఆసరా ఇవ్వవచ్చు.

 

2. కండరాల నొప్పి (మజిల్ క్రాంప్స్):

ఒకోసారి ఏ విధమైన దెబ్బలు తగలకపోయినప్పటికీ, ఎటువంటి హానీ జరగకపోయినప్పటికీ మెడను ఆవరించి ఉండే బలమైన కండరాలు హఠాత్తుగా బిగుసుకునిపోవడానికి ఆస్కారం ఉంది. దీనికి కారణం ఆయా వ్యక్తుల శారీరక తత్వం వాత ప్రకృత్తితో ఉండటమేనని అంటుంది ఆయుర్వేద శాస్త్రం. బాగా ఒత్తిడికి లోనయినప్పుడు, ఏకధాటిగా బల్లముందు కూర్చుని పనిచేసినప్పుడు లేదా అస్తవ్యస్థంగా ఎగుడు దిగుడుగా పడుకున్నప్పుడు మెడ పట్టేసే అవకాశం ఉంది. టీవీ ముందు కూర్చున్నప్పుడో, రైళ్లలోనూ, బస్సుల్లోనూ కూర్చుని కునికిపాట్లు పడుతున్నప్పుడో మెడ కండరాలకు వెళ్లే నరం వెన్నుపూస మధ్యన ఇరుక్కుని కండరాలను బిగుసుకునేలా చేసే అవకాశం ఉంది. అప్పుడు అన్యాపదేశంగా మెడనొప్పి వస్తుంది. (ఇలా మెడ పట్టేయడానికి కారణం శరీరం తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నం చేయడమే. మెడ కండరాలు బిగుసుకు పోవడం వలన మెడ కదలికలు నిలిచిపోతాయి. ఫిలితంగా మున్ముందు నరం మీద ఒత్తిడి పడకుండా వుంటుంది.)

 

గృహచికిత్సలు: 1. శొంఠి కషాయంలో (అరకప్పు) ఆముదాన్ని (రెండుచెంచాలు) కలిపి రోజుకు రెండుసార్లు తాగాలి. 2. గుగ్గులం (శుద్ధిచేసినది) అరచెంచాడు తీసుకుని తిప్పతీగె కశాయానికి (అరకప్పు) చేర్చి మూడుపూటలా పుచ్చుకోవాలి.

 

ఔషధాలు: త్రయోదశాంగగుగ్గులు, మహావాత విధ్వంసినీ రసం, మహారాస్నాధిక్వాథం. బాహ్యప్రయోగం - మహానారాయణ తైలం.

 

3. మెడ వెన్నుపూసలు అరిగిపోవటం (సర్వైకల్ స్పాండిలోసిస్):

చాలామంది తమ తలబరువు ఎంత ఉంటుందనేది ఊహించలేరు. ఒకవేళ ఊహించినా, చాలా తక్కువగా అంచనా వేస్తారు. కనీసం 3-4 కిలోల బరువు తూగే తలను కేవలం ఒక మెడ మాత్రం - అదీ సంవత్సరాల తరబడి మోస్తుండటం -

 

మోయడమే కాకుండా - దానితోపాటు కదలికలను కూడా కలిగి ఉండటం గొప్ప విషయం. ఈ కారణం చేత మెడ ప్రాంతంలో సంధివాతం (ఆస్టియో ఆర్తరైటిస్) రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆధునిక వైద్య పరిభాషలో ఇటువంటి స్థితిని 'సర్వైకల్ స్పాండిలోసిస్' అంటారు. ఈ స్థితి ఇలాగే చికిత్సారహితంగా కొనసాగితే క్రమక్రమంగా మెడలోని కండరాలూ, లింగమెంట్లూ, జాయింట్లూ అన్నీ ఈ వ్యాధి బారిన పడతాయి. వెన్నుపూసలు నిరంతరమూ ఒత్తిడికి గురై ఇరిటేట్ అవుతుండటం వల్ల, వాటి చివర్ల నుంచి చిన్న చిన్న పిలకలు (ఆస్టియో ఫైట్స్) మొలుస్తాయి. ఇవి పెరుగుతూ వెన్నుపాము నుంచి బయటకు వచ్చే నరాల మీద ఒత్తిడి కలిగించడం మొదలెడతాయి. దీనితో, ఆ నరాలు వెళ్లినంత మేరా - మెడ, భుజాలు, చేతులు, వేళ్ల కొసలు - ఈ ప్రాంతాలన్నిలోనూ విపరీతమైన సలుపులు, నొప్పులు వస్తాయి.

 

ఈ స్థితి ప్రాప్తించినప్పుడు తరచుగా మెడను విరుచుకొవాలనిపిస్తుంది. అలా చేసినప్పుడల్లా మెడలో శబ్దాలు రావడాన్ని కూడా గమనించవచ్చు. అంతే కాకుండా ఈ స్థితి 'మాడు నొప్పి' కి సైతం దారి తీస్తుంది. చేతివేళ్ల చివర్లు తిమ్మిరిపట్టినట్లు, చల్లదనంతో ఉన్నట్లు పక్షవాతానికి సంబంధం లేదు. ఈ వ్యాధిలో ఔషధాలతోపాటు పంచకర్మలు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

 

గృహచికిత్సలు: 1. వేపాకు, వేప పువ్వులు వీటి రసాన్ని పూటకు రెండు చెంచాలు చొప్పున రెండు పూటలా తీసుకోవాలి. 2. దురదగొండి గింజల కషాయాన్ని అరకప్పు చొప్పున రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 3. బలామూలం (తుత్తురు బెండ) వేళ్ళను కషాయంకాచి రెండు చెంచాల కశాయానికి ఒక చెంచా నువ్వుల నూనె కలిపి ఆహారం తర్వాత ముక్కులో గ్రాప్స్ గా (నాలుగైదు చుక్కలు) వేసుకోవాలి. 4. నువ్వుల నూనెకు తగినంత కర్పూరం కలిపి మెడమీద మసాజ్ చేసుకోవాలి. 5. వెల్లుల్లి గర్భాలను రోజుకు రెండు చొప్పున ముద్దగా నూరి పాలతో కలిపి తీసుకోవాలి.

ఔషధాలు: సింహనాద గుగ్గులు, మహావాతవిధ్వంసినీ రసం, మహారాస్నాదిక్వాథం.

 

4. భ్రమ (వర్టిగో):

మెడలోని వెన్నుపూసలు అరిగిపోయినప్పుడు మెడను తిప్పడం కష్టతరంగా ఉండటమే కాకుండా, కళ్లు తిరిగినట్లుండటం, మెడపట్టేయడం, నొప్పిగా ఉండటం వంటివి జరుగుతాయి. వయసు పైబడుతున్నకొద్దీ ఈ లక్షణాలు మరీ ఎక్కువవుతాయి. మెడలో వెన్నెముకకు ఇరుపక్కలా రెండు ధమనులు-మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే నిమిత్తం - అమరి ఉంటాయి. మెడను బాగా తిప్పినప్పుడు అసలే అరిగిపోయిన దశలో ఉన్న వెన్నుపూసలు, తమ గురుకుదనం వలన ఈ ధమనుల మీద పరోక్షంగా ఒత్తిడిని కలుగజేసి మెదడుకు వెళ్లే రక్త సరఫరాను అడ్డుకుంటాయి. దీని ఫలితంగా తలపైకెత్తి చూసినప్పుడు, లేదా భుజంమీదుగా వెనుకకు చూసినప్పుడు తల తిరిగినట్లనిపిస్తుంది.

 

గృహ చికిత్సలు: 1. వస కొమ్ము పొడి (పావు చెంచాడు) పెన్నేరు చూర్ణాన్ని (అరచెంచాడు) అర గ్లాసు పాలతో కలిపి తీసుకోవాలి. 2. పాతాళగరుడి (సర్పగంధ) చూర్ణాన్ని (పావు చెంచాడు) త్రిఫలాచూర్ణం (అరచెంచాడు)తో కలిపి తీసుకోవాలి. 3. వెల్లుల్లి, అల్లాలను సమాన భాగాలుగా తీసుకొని ముద్దచేసి పూటకు చెంచాడు చొప్పున రెండుపూటలా తీసుకోవాలి. 4. శతావరి (పిల్లిపీచర గడ్డలు), బలా (తుత్తురుబెండ) వేళ్ళను, ద్రాక్షను సమాన భాగాలు తీసుకొని పాలలో వేసి పంచదార కలుపుకొని తాగాలి.

 

ఔషధాలు: జహర్ మొహర్ పిష్టి, రస సింధూరం, సారస్వతారిష్టం, బలారిష్టం, అగ్నితుండివటి, ప్రవాళపిష్టి, సూతశేఖర రసం.

 

5. గ్రంథుల వాపు:

శరీరంలో ఎక్కడైనా గ్రంథులు వాచినప్పుడు నొప్పి, అసౌకర్యాలు కలుగుతాయి. మెడ ముందు భాగంలో, ట్రేకియా అనే గాలిగొట్టానికి ఇరుపక్కలా కొన్ని గ్రంథులు ఉంటాయి. టాన్సిలైటిస్ లోనూ, చెవికిసోకిన ఇన్ఫెక్షన్ల లోనూ, తలకు సోకినా ఇన్ ఫెక్షన్ల లోనూ ఇవి వాచే అవకాశం ఉంది. అప్పుడు మెడ అంతా నొప్పిగా ఉంటుంది. చిన్న చిన్న ఇన్ ఫెక్షన్ల తోనే కాకుండా, లుకీమియా వంటి ప్రమాదభరితమైన స్థితులలో కూడా ఇవి వాస్తాయి కనుక ఈ స్థితిని ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు.

ఔషధాలు: అపామార్గక్షారం, కాంచనారగుగ్గులు, చంద్రప్రభావటి, ఖదిరాదివటి.

 

6. థైరాయిడ్ సమస్యలు:

థైరాయిడ్ గ్రంథి వాచినప్పుడు దానిని 'గాయిటర్' అంటారన్న సంగతి తెలిసిందే. ఇక్కడొక్క ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ గ్రంథిలో వాపు కనపడటమనేది దాని పనితీరు మందగించినప్పుడు, అతిగా, చురుకుదనాన్ని సంతరించుకున్నప్పుడు, ఈ రెండు సందర్భాలలోనూ జరుగుతుంది. థైరాయిడ్ హార్మిన్ విడుదలలో హెచ్చుతగ్గులను సరిచేసుకునే ప్రయత్నంలో ఈ గ్రంథి తనను తాను పరిమాణపరంగా మార్చుకుంటుంది. ఒకోసారి ఈ గ్రంథి ఇన్ ఫ్లేమ్ అవుతుంది కూడా, స్వయం ప్రేరిత రక్షణ శక్తి (ఆటో ఇమ్యూనిటి) దీనికి కారణం. దీని వలన ప్రమాదమంటూ పెద్దగా ఉండదు. కాకపోతే మెడలో అసౌకర్యంగా ఉంటుంది.

 

గాయిటర్ ఉన్నప్పుడు సందర్భాన్ని బట్టి హైపర్ థైరాయిడిజం వుంటే సంతర్పణ చికిత్సలనూ, హైపోథైరాయిడిజం వుంటే అపతర్పణ చికిత్సలనూ చేయాల్సి ఉంటుంది.

 

సలహాలు:

1. మెడకు దెబ్బ తగిలినప్పుడు వెంటనే శీతలోపచారాలు చేస్తే వాపు జనించకుండా ఉంటుంది. ఐస్ క్యూబ్స్ నలగగొట్టి మెత్తటి టవల్ లో చుట్టి శీతలోపచారాలకు వాడవచ్చు.

2. వాపు తగ్గినా తరువాత నొప్పి తగ్గటానికి ఉష్ణోపచారాలు అద్భుతమైనవి. మెత్తని ఇసుకను మూటలా కట్టి, పెనం లీడ వేడిచేసి దానితో మెడమీద కాపడం పెట్టుకోడాలి.

3. కూర్చునేటప్పుడు నిటారుగా కూర్చోవాలి. ఒక టవల్ ను గుండ్రంగా చుట్టూ తలకింది వంపులో అమర్చుకుంటే మెడ కండరాలు అనవసరమైన ఒత్తిడికి గురికాకుండా ఉంటాయి.

4. ఒకే భంగిమలో, గంటల తరబడీ - కూర్చుని గాని, నిలబడికాని, వంగుని కాని పనిచేయకూడదు. మధ్య మధ్యలో అటూ ఇటూ తిరగాలి. ఒకవేళ కంప్యూటర్ పై పని చేస్తుంటే దాని తెరను కళ్లకు సమాతరంగా అమర్చుకోవాలి.

5. టెలిఫోన్ ఉపయోగించాల్సి వస్తే దానిని చేత్తోనే పట్టుకోవాలి. భుజానికి, చెంపకి మధ్య ఇరికించుకుని మాట్లాడటం అసహజమైన చర్య. అలా చేస్తే మెడనొప్పి రావడం ఖాయం.

6. నవారు మంచాలను, నులకమంచాలను, మడతమంచాలను ఉపయోగించడం మంచిది కాదు. అన్నింటికంటే ఉత్తమం చెక్క బల్లమీద నాలుగైదు దుప్పట్లు పరుచుకుని విశ్రమించడం, బోర్లా పడుకోకూడదు. పలుచటి దిండు వాడాలి. అసలు వాడకపోయినా మంచిదే.

7. చలి వాతావరణం వాతాన్ని పెంచుతుంది. చలి గాలి బైటకు వెళ్లాల్సి వస్తే మెడను కూడా కప్పుకోవాలి.

8. ఓషధీకృత తైలాభ్యంగనలూ, వాలుకాస్వేదం, గుగ్గులుతో తయారైన ఔషధాలూ, శిరోవస్తి వంటి ప్రత్యేక ఆయుర్వేద చికిత్సలూ మెడనొప్పిలో అత్యంత ఉపయుక్తంగా ఉంటాయి.