మూత్రవిసర్జనలో నొప్పి

 

1. మూత్రవిసర్జన సమయంలో అసౌకర్యంగా, మంటగా ఉంటుందా?

మూత్రకోశపు ఇన్ఫెక్షన్ (సిస్టైటిస్)

2. మిథునం తరువాత మూత్ర విసర్జన మంటగా అనిపిస్తుందా?

అఘాతాలు / దెబ్బలు / గాయాలు

3. మీరు స్త్రీలైతే - జననేంద్రియ స్రావాలు ఉంటాయా?

తెల్లబట్ట (వైట్ డిశ్చార్జ్ / ఫంగల్ ఇన్ఫెక్షన్ /త్రష్ / ట్రైకోమొనియాసిస్)

4. పొత్తికడుపులో గాని, వృషణాలలోకాని, అసౌకర్యంగానూ, నొప్పిగానూ ఉంటుందా?

లైంగిక వ్యాధులు (సెక్యువల్లీ ట్రాన్సిమిటెడ్ డిసీజెస్)

5. మూత్ర మార్గం నుండి చీము కారుతుందా?

పూయమేహం (గనోరియా)

6. మూత్రం ఎర్రగా రక్తంతో కలిసి కనిపిస్తుందా?

మూత్రమార్గంలో రాళ్లు (యూరినరీ స్టోన్స్)

7. మూత్రంలో మంట ఇతర అంశాలతోఎక్కువవుతుందా?

ఆహార, ఆహారేతర పదార్థాలు పడకపోవటం (ఎలర్జీ)

 

అలవోకగా జరిగిపోవాల్సిన మూత్ర విసర్జనలో అపశృతి ఏర్పడినప్పుడు ఎవరికైనా కంగారు పడుతుంది. అటువంటి సందర్భాలలో కారణాన్ని కనిపెట్టి తదనుగుణమైన చికిత్స తీసుకోవాలి తప్పితే కంగారుపడి ప్రయోజనం లేదు. అయితే కారణాలు కనుక్కోవడానికి ముందు మూత్రానికి,మూత్ర వ్యవస్థకీ సంబంధించి మీకు కొంత ప్రాథమిక సమాచారం తెలిసి ఉండటం అవసరం.

మూత్రం ఏ పదార్థాలతో తయారవుతుంది ? మన శరీరంలోని కణజాలలు ఆహారం ద్వారా శక్తిని తయారు చేసుకునే సమయంలో అనేక వ్యర్ధ పదార్థాలు తయారవుతుంటాయి. ఇవి రక్త ప్రవాహం ద్వారా కిడ్నీలకు చేరి మూత్రం రూపంలో బైటకు వెళ్లిపోతుంటాయి. మూత్రంలో ఈ వ్యర్థపదార్ధాల మోతాదు నాలుగైదు వంతులు మాత్రమే. మిగిలినదంతా నీరే. ఈ పదార్థాలలో నత్రజనికి సంబంధించిన యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటిన్లు ఎక్కువగా ఉంటాయి. మన శరీరంలో ప్రోటీన్లూ, తదితరాలూ రసాయనికంగా విచ్చినమయ్యేప్పుడు ఇవి తయారవుతాయి. వీటితోపాటు శరీరంలో అవసరానికి మించి చేరే సోడియం, పొటాషియం, క్లోరైడ్, కాల్షియం, మెగ్నీషియం, లోహం, సల్ఫేట్, ఫాస్ఫేట్, బైకార్బనేట్ వంటివి కూడా మూత్రంలో భాగంగా బైటకు వెళ్ళిపోతుంటాయి.

మూత్రవిసర్జన ఎలా జరుగుతుంది? మూత్రపిండాలు (కిడ్నీలు) రక్తాన్ని వడపోయడం ద్వారా మూత్రాన్ని తయారు చేస్తాయన్న సంగతి తెలిసిందే. ఇలా తయారైన మూత్రం మూత్ర నాళాల (యూరెటర్స్) ద్వారా మూత్రాశయాన్ని (యూరినరీ బ్లాడర్) చేరుతుంది. సుమారు అర లీటర్ వరకూ మూత్రం చేరిన తరువాత, మూత్రాన్ని విసర్జించాలనే భావం కలుగుతుంది. అంటే మూత్ర విసర్జనను ఆపడం, ఆపకుండా ఉండటమనే విషయాలు చాలా వరకూ మన ఆధీనంలోనే ఉంటాయన్న మాట.

ఎంత నీరు తాగితే అంతే మూ త్రాన్ని విసర్జిస్తామా? మూత్ర పిండాలు ఆరోగ్యంగా ఉన్నంతసేపు మనం ఎంత నీటిని తాగినా, శరీరంలో ఉండాల్సినంత నీరే ఉండి, మిగిలినదంతా విసర్జితమవుతూ ఉంటుంది. అయితే ఈ నీరంతా కేవలంమూత్రం రూపంలోనే విసర్జితమావ్వాలని లేదు; స్వేదం, శ్వాస, ఆవిరి, మలం వీటిల్లో దేని ద్వారానైనా వెళ్లి పోవచ్చు.

మూత్రం మోతాదులో హెచ్చుతగ్గులెందుకు ఉంటాయి? శరీరం సమతాస్థితిలో ఉండాలంటే దానిలోని పదార్థాలన్నీ నిర్ణీతమైన మోతాదుల్లో ఉండాలి. మనిషి శరీరంలో 60 శాతం బరువును నీరు ఆక్రమిస్తుంది. వాతావరణపు ఉష్ణోగ్రత పెరగడం, వ్యాయామం, జ్వరం, వాంతులు, విరేచనాలు తదితరాల వలన శరీరం ఎక్కువగా నీటిని నష్టపోతుంది. ఇటువంటి సమయంలో మిగిలి ఉన్న నీటిని రక్షించేందుకు కిడ్నీలు ఆయత్తమవుతాయి.

ఫలితంగా మూత్ర విసర్జన తగ్గిపోతుంది. మనిషి మెదడులో ఉండే హైపోథాలమన్ అనే భాగం శరీరపు నీటి నిలువలను ఎప్పటికప్పుడు బేరీజువేసుకుంటుంది. శరీరంలో నీటి శాతం తగ్గుతున్న సూచనలు అందగానే హైపోథామలన్ పిట్యూటరీ గ్రంథిని అప్రమతం చేస్తుంది. ఈ గ్రంథి వెంటనే మూత్రాన్ని నిరోధించే ' యాంటీడైయూరిటిక్ హార్మోన్' ను రక్తంలోకి విడుదల చేస్తుంది. ఇది మూత్ర పిండాలను చేరి వడపోత నియంత్రిస్తుంది. ఫలితంగా మూత్రం ఆగిపోవడంకాని తగ్గిపోవడం కాని, లేదా గాఢతను సంతరించుకోవడం కాని జరుగుతుంది.

ఇంతే కాకుండా, కిడ్నీలలో మొదలై, అంతమయ్యే 'రెవిన్ యాంజియోటెన్సిన్' అనే పునర్నివేశ వ్యవస్థ వలన కూడా మూత్ర విసర్జనలో హెచ్చుతగ్గులు సంభవిస్తాయి. మూత్ర విసర్జన కష్టంతోనూ, నొప్పితోనూ ఉన్నప్పుడు ఆయుర్వేద సంహితలు ప్రధానంగా మూడు స్థితులను పరిగణించమంటాయి. అవి:

1. మూత్రకృచ్చ్రం (మూత్ర ప్రవృత్తి నొప్పిగానూ, కష్టంగానూ ఉండటం)

2. మూత్రాఘాతం (మూత్ర ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడటం)

3. మూత్రాష్మరి (మూత్ర సంబంధాంశాలు ఘనీభవించి రాయిలాగా తయారవడం)

 

సంహితాకారులు లక్షణ ప్రాధాన్యతను బట్టి వీటిని వేర్వేరుగా చర్చించినా, ఒకదాని వలన మరొకటి ప్రభావితమయ్యే అవకాశాల గురించి సూచించడం ఈ సందర్భంగా గమనార్హం.

మూత్ర విసర్జనకు సంబంధించి సమస్యలెదురయినప్పుడు ఈ క్రింది అంశాలను పరీశిలించాలి.

1. మూత్రకోశపు ఇన్ఫెక్షన్ (సిస్టైటిస్):

మూత్రాశయం వ్యాధిగ్రస్తమైనప్పుడు మూత్ర విసర్జన సమయంలో అసౌకర్యంగా, మంటగా ఉంటుంది. మందులను ఒక పట్టాన లొంగకుండా ఉండటం. లొంగినట్లు కనిపించినా పదేపదే తిరగబెట్టడం ఈ వ్యాధి నైజం. సంభోగానంతరం ముఖ్యంగా మహిళలలో ఈ వ్యాధి ఎక్కువవుతుంటుంది. స్త్రీలకు పురుషులకంటే తక్కువ పొడవు కలిగిన మూత్ర ప్రసేకం ఉండటం వలన ఇన్ఫెక్షన్ త్వరగా లోనికి ప్రవేశిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ మూత్రాశయానికి మాత్రమే పరిమితం కాకుండా, ఒకోసారి కిడ్నీల వరకూ వ్యాపించవచ్చు. ఇలా జరిగితే తీవ్రమైన జ్వరం, వణుకు, చలి, నడుము నొప్పి మొదలయినవి సంభవిస్తాయి.

అయితే ఇక్కడ మరొక విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. మూత్రంలో మంట అనేది కేవలం ఇన్ఫెక్షన్ కారణంగానే రావాలని లేదు. మూత్ర ప్రసేకం ఇన్ ఫ్లేమ్ అయినప్పుడుగాని, దాని లోపలి మార్గం ఇరుకుగా మారినప్పుడుగాని, లేదా మూత్రాశయమే చిన్నదిగా ఉన్నప్పుడుగాని మంటరావచ్చు.

కొత్త దంపతుల్లో, దాంపత్యంలో పాల్గొనే సమయంలో జననేంద్రియాలు అసహజంగా రాపిడికి గురై ఒరుసుకుపోయే అవకాశం ఉంది. అలాంటప్పుడు కూడా మూత్రాశయం వ్యాధిగ్రస్తమవుతుంది.

సూచనలు: మూత్ర విసర్జన సమయంలో మంటగా ఉన్నప్పుడు వెంటనే కనీసం అరలీటరు మంచినీటిని తాగండి. దీనితో మూత్ర ప్రవృత్తి పెరిగి. సూక్ష్మక్రిములు చాలా వరకూ వెలుపలకు వెళ్లిపోతాయి. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మూత్రవిసర్జన చేయండి.

ఈ వ్యాధిలో అనుబంధ లక్షణంగా నడుము భాగంలో నొప్పి ఉండటం సహజం. వేడి నీళ్ళ సీసాను ఒక గుడ్లలో చుట్టి కాపడం పెట్టుకోవడం ద్వారా ఈ తరహా నొప్పులను తగ్గించుకోవచ్చు.

మూత్రంలోని ఆమ్లత్వాన్ని తగ్గించడం కోసం చెంచాడు వంటసోడాను ఒక గ్లాసు నీళ్ళతో కలిపి నాలుగు గంటలకు ఒకోసారి తాగాలి. అయితే రక్తపోటు ఉన్న వారికి ఈ సూచన వర్తించదు.

చింత, నిమ్మ మొదలయిన పుల్లని పదార్థాలను ఉపయోగించకూడదు. ఇవి మూత్రంలోని ఆమ్లత్వాన్ని మరింత పెంచుతాయి. అదేవిధంగా గ్రుడ్లు, చేపలు, మాంసం, జున్ను మొదలయిన జంతు సంబంధమైన ప్రోటీన్లను వాడకపోవడం మంచిది; వీటి ద్వారా ఆమ్లాంశాలు వ్యర్థపదార్థాలుగా తయారై మంటను కలిగిస్తాయి.

ఔషధాలు: గోక్షురాది గుగ్గులు, చంద్రప్రభావటి, చందనాసవం, చంద్రకళారసం, దశమూలహరితకీ, పలాశక్షారం, ప్రవాళభస్మం, యవక్షారం.

బాహ్యప్రయోగాలు - బృహత్ సైంధవాద్యతైలం, పిప్పల్యాది తైలం.

2. అఘాతాలు / దెబ్బలు / గాయాలు:

కొన్నిసార్లు మైథున సమయంలో మూత్రప్రసేకం, మూత్రాశయ ద్వారాలు కమిలే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీలలో ఇలా జరుగుతుంటుంది. సంభోగానంతరం మూత్ర విసర్జనలో మంటగా అనిపిస్తే మూత్రాశయ ద్వారం ఒరుసుకుపోయినట్లుగా భావించాలి. సూచనలు: శృంగార కార్యకలాపాలతో మంట వస్తున్నప్పుడు మొరటుగా ప్రవర్తించడం మానుకోవాలి. సమాగమం ముందు శరీరమూ, మనసు రెండూ సన్నద్దమయ్యే వరకు సమయం తీసుకోవడం మంచిది, సెక్సులో నెమ్మదిగా ప్రవరించడం వలన వివిధ గ్రంథుల నుంచి జలీయాంశాల విడుదలకు ఆస్కారం ఏర్పడుతుంది. ఫలితంగా ఒరిపిడీ, రాపిడీ తగ్గుతాయి. అదేవిధంగా విధిగా మైథునం తరువాత మూత్ర విసర్జన చేయాలి, ఇలా చేయడం వలన సూక్ష్మక్రిములు మూత్రవ్యవస్థలో నిలువఉండే అవకాశాలుండవు.

3. తెల్లబట్ట (వైట్ డిశ్చార్జ్ / ఫంగల్ ఇన్ఫెక్షన్ / త్రష్ / ట్రైకోమొనియాసిస్):

ఫంగల్ ఇన్ఫెక్షన్ వలన జననేంద్రియం లోపలుండే శ్లేష్మపు పొర నొప్పితో కూడిన తెల్లని తెరలాగా మారే అవకాశం ఉంది. సంతాన నిరోధక మాత్రల రూపంలో తీసుకునే ఫిమేల్ సెక్స్ హార్మోన్లు ఈ స్థితిని ఇంకా తీవ్రతరం చేస్తాయి. ఈ మాత్రలలోని ఈస్ట్రోజెన్ యోని స్రావాల ప్రకృతిని మర్చి, ఫంగస్ పెరిగేలా చేయడమే దీనికి కారణం. రజోనివృత్తిలో - బహిష్టులు ఆగిపోయేటప్పుడు - తీసుకునే హార్మోన్ రిఫ్లేస్ మెంట్ థెరఫీ కూడా ఈ ఇబ్బంది కలుగవచ్చు.

అలాగే మధుమేహ రోగులలో రక్తంలోని చక్కర మోతాదు ఎక్కువ కావడం వలన కూడా ఈ స్థితి కలుగుతుంది. శక్తివంతమైన యాంటీబయాటిక్స్ ను దీర్ఘకాలం పాటు వాడినప్పుడు అవి ఉపయోగకరమైన బాక్టీరియాను కూడా అంతమొందిస్తాయి. ఫలితంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ వేళ్ళూనుకుంటుంది. తెల్లని జిగురు కలిగిన స్రావం ఉన్నట్లయితే ఫంగస్ ను అనుమానించాలి.

ఫంగల్ ఇన్ఫెక్షన్ లో త్రిఫలా, పంచవల్కలాలు మొదలైన ద్రవ్యాలతో చేసిన కషాయాలను డూష్ గా ఉపయోగించడం ద్వారా చక్కని ఫలితాలను పొందవచ్చు.

గృహ చికిత్సలు: 1. వస చూర్ణాన్ని పూటకు ఒక గ్రాము మోతాదుగా మూడుపూటలా తేనెతో తీసుకోవాలి . 2. అత్తిచెట్టు పట్టనుగాని, దానిమ్మ చెట్టు వేరు బెరడునుగాని, కషాయం కాచి యోనిని శుభ్రం చేసుకోవాలి, దీనిని 'డూష్; అంటారు. 3. తులసి ఆకులనుం వేపాకులను వెడల్పాటి గంగాళంలో మరిగించాలి. ఈ నీళ్ళతో కాళ్ళు బైటపెట్టి బొడ్డుమునిగేలా ఇరవై నిముషాలు కూర్చోవాలి. ఇలా రోజుకు మూడు సార్లు వారంరోజుల పాటు చేయాలి. 4. త్రిఫలా చూర్ణం (ఒక చెంచా), గుడూచిసత్వం (అరచెంచా) రెండు కలిపి తగినంత నెయ్యిని, తేనెను కలిపి ఆహారానికి ముందు రోజుకు మూడుసార్లు చొప్పున కనీసం రెండు నెలల పాటు పుచ్చుకోవాలి. 5. ఉలవల కషాయం (అరకప్పు) రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 6. చింతగింజ పిక్కలను పొడిచేసి అరచెంచాడు మోతాదుగా పాలతో రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 7. బ్రహ్మమేడి పండ్లను ఎండించి, పొడిచేసి అరచెంచాడు మోతాదుగా పంచదార, తేనెలు కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 8. నేల ఉసిరిక వేరును బియ్యం కడుగు నీళ్ళతో సహా ముద్దగా నూరి అరచెంచాడు మోతాదుగా రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 9. అరె పువ్వులను దంచి, కషాయం కాచి అరకప్పు మోతాదుగా రోజుకు మూడుసార్లు పుచ్చుకోవాలి. 10. పటికను పొంగించి పొడిచేసి పూటకు అరచెంచాడు మోతాదుగా అరటిపండు మధ్యలో పెట్టి రెండుపూటలా తీసుకోవాలి.

ఔషధాలు: ఆరోగ్యవర్ధినీవటి, కైశోరగుగ్గులు, రసమాణిక్యం, పుష్యానుగ చూర్ణం, కర్పూర శిలాజిత్తు, చంద్రప్రభావటి, అశోకారిష్టం, లోద్రాసవం, పత్రంగాసవం.

బాహ్యప్రయోగాలు - జాత్యాదితైలం, మహామరిచ్యాదితైలం, మహానారాయణ తైలం.

4. లైంగిక వ్యాధులు (సెక్యువల్లీ ట్రాన్సిమిటెడ్ దిసీజాస్):

సుఖవ్యాధి కారకాంశాలైన సూక్ష్మక్రిములు ఊర్ధ్వముఖంగా పయనించి ప్రోస్టేటు గ్రంథిని చేరినప్పుడు లేదా అక్కడ నుండి కిందకు వృషణాలలోకి వెళ్ళినప్పుడు, ఆయా భాగాల్లో అసౌకర్యంగా ఉండే అవకాశం ఉంది. మూత్ర విసర్జన సమయాలలో ఇది నొప్పిగా కూడా మారుతుంది. కొన్ని సందర్భాలలో - శస్త్ర చికిత్సలో భాగంగా - మూత్ర ప్రసేకంలోనికి చొప్పించే కెథటర్ల వలన కూడా ఇదే తరహా ఇన్ఫెక్షన్ సంభావించవచ్చు. ఈ సమయాల్లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన కూడా ఇలా జరుగుతుంది.

ఔషధాలు: శిలాజిత్వాది వటి, మేహముద్గరవటి, శ్వేతపర్పటి, చందనాదివటి, చంద్రప్రభావటి, గోక్షురాదిగుగ్గులు.

5. పూయమేహం (గనేరియా): 

అనైతికమైన విచ్చలవిడి శృంగారం వల్ల మూత్రమార్గం ఇన్ ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇన్ఫెక్షన్ కారణంగా మూత్రం పోసుకునే సమయంలో మంట అనిపిస్తుంది.

గృహచికిత్సలు: 1. పెద్ద ఏలకుల గింజలు, సురేకారం సమాన భాగాలు తీసుకుని పొడిచేయాలి. దీనిని పూటకు పావు చెందాడు వంతున రెండుపూటలా నీళ్ళతో తీసుకోవాలి. 2. స్వర్ణగైరికం (రెండు భాగాలు), పటిక (ఒక భాగం), పంచదార (మూడు భాగాలు) వీటన్నిటినీ కలిపి పొడిచేయాలి. దీనిని పూటకు అరచెంచాడు చొప్పున మూడుపూటలా ధనియాలు కషాయంతో పుచ్చుకోవాలి.

ఔషధాలు: స్వర్ణవంగం, సంపూర్ణకాంచన రసం, ఇందుశేఖర రసం, చందనాసవం, ఖదిరారిష్టం, చందనావటి, త్రివంగభస్మం.

6. మూత్రమార్గంలో రాళ్ళు (యూరినరీ స్టోన్స్):

మూత్రమార్గంలో తయారైన రాళ్లవల్ల మూత్రవిసర్జన సమయంలో నొప్పి వస్తుంది. మూత్రపిండాలు రాళ్లలో చాలా భాగం మూత్రంలోని కాల్షియం ఘనీభవించడం ద్వారా తయారవుతాయి. ఎక్కువగా ఎండలో తిరిగే వారికీ, శారీరకంగా బాగా శ్రమించే వారికీ, కదలకుండా కూర్చుని పనిచేసే వారికీ, ఎక్కువ కాల్షియం కలిగిన ఆహార పదార్థాలను తీసుకునే వారికీ మూత్రమార్గంలో రాళ్ళు తయారవుతుంటాయి. కొంతమందిలో అనువంశిక లక్షణంగా కూడా రాళ్ళు తయారవుతాయి. ఈ రాళ్లు మూత్రంతో పాటు, మూత్ర నాళాల ద్వారా మూత్రాశయంలోనికి, అక్కడినుండి మూత్ర ప్రసేకం ద్వారా వెలుపలికి ప్రయాణిస్తాయి. ఇలా రాళ్లు కదులుతూ వెళ్ళే సమయంలో సున్నితమైన లోతట్టు పొర చీరుకుపోయి అంతర్గతంగా రక్తస్రావమవుతుంది. ఈ రక్తం మూత్రంతో కలిసి ఎరుపు రంగులో కనిపిస్తుంది. మూత్రం పోసుకునే సమయంలో పదునైన నొప్పితో పాటు నడుము భాగంలో నొప్పి ఉంటే మూత్ర మార్గంలో రాళ్లను గురించి ఆలోచించాల్సి ఉంటుంది.

సూచనలు: మూత్ర 'పిండాలలో రాళ్ల వల్ల మంట ఉన్నప్పుడు చంద్రప్రభావటి, గోక్షురాదిగుగ్గులు, కుమార్యాసవం, మూలకక్షారం, పలాశక్షారం, శుక్రమాత్రుకావటి, స్వర్ణభూపతిరసం, త్రైకాంతకఘృతం, విడంగారిష్టం మొదలైన ఆయుర్వేద ఔషధాలు వాడాలి. అలాగే ప్రత్యేక చికిత్సా పద్ధతులుగా స్వేహ స్వేదాలు ఉపయోగపడతాయి. సాధారణంగా ఈ రాళ్లనేవి కాల్షియం ప్రధానంగా ఉంటుంటాయి కనుక కాల్షియం కలిగిన ఆహార పదార్థాలను మానేయాలి. కాల్షియాన్ని కరిగించే తత్వం ఆమ్లపదార్థాలకు ఉంటుంది కనుక మూత్రాన్ని ఆమ్లంగా మార్చే ఉలవల వంటి పదార్థాలను తీసుకోవడం మంచిది. అయితే మూత్ర పిండాల రాళ్ళన్నీ కాల్షియం వల్లనే ఏర్పడాలని లేదు; యూరిక్ యాసిడ్ వలన కూడా ఏర్పడవచ్చు. యూరిక్ యాసిడ్ ఘనీభవించడం ద్వారా ఏర్పడిన రాళ్ళలో ఆమ్ల పదార్థాలు నిషిద్ధం. ఇటువంటి వారికి యవక్షారం, సర్జక్షారం మొదలైన క్షారాలు ఉపయోగపడతాయి. ఆహారంగా ఏది తీసుకున్నా లేదా ఏది మానివేసినా, మూత్ర పిండాల రాళ్ళతో బాధపడేవారు గుర్తించుకోవలసిన విషయం - సమృద్ధిగా నీళ్లు తాగాలని, బాగా నీళ్లు తాగటంవలన మూత్రం రాళ్ళుగా మారే ప్రవృత్తి తగ్గుతుంది.

7. ఆహార, ఆహారేతర పదార్థాలు పడకపోవడం (ఎలర్జీ):

మసాలాలు, మద్యం, కాఫీ మొదలయిన వాటి వలన మూత్ర విసర్జనలో మంట వచ్చే అవకాశం ఉంది. అలాగే కొన్ని రకాలసబ్బులూ, పౌడర్లూ (వాటిలో కలిపే రసాయన పదార్థాల కారణంగా) మూత్ర మార్గాన్ని ఇరిటేట్ చేసే మూత్రంలో మంటను కలిగిస్తాయి. నైలాన్ తో తయారైన లోదుస్తుల వలన కూడా కొంతమందికి మూత్ర విసర్జన సమయంలో మంటగా అనిపిస్తుంది.

మూత్రమార్గంలో మంట, నొప్పి ఉన్నప్పుడు వీటిని అన్నీతిని పరిగణలోకి తీసుకుని తగిన జాగ్రత్తలూ, నివారణ చర్యలూ చేపట్టాలి.