మలంతో పాటు రక్తం కనిపించటం

 

1. రక్తం కేవలం మలం చుట్టూ మాత్రమే కనిపిస్తుందా?

ఆర్శమొలలు (ఫైల్స్ / హెమరాయిడ్స్)

2. రక్తయుక్తమలంతో పాటు నొప్పి కూడా ఉందా?

స్థానికంగా చర్మం కోసుకుపోవటం (ఫిషర్)

3. మలంతో కూడిన రక్తం కనిపించడంతో పాటు మలద్వారం వద్ద దురద కూడా ఉందా?

చర్మవ్యాధి (స్కిన్ డిసీజ్)

4. మీకు అరుగుదల సక్రమంగా లేదా? భోజన వేళల మధ్యకాలంలో ఛాతిక్రింది, అమాశయం ప్రాంతంలో మంటగా ఉంటుందా?

కడుపులో మంట / పేగు పూత (గ్యాస్ట్రైటిస్)

5. మీరు ఇంగ్లిషు మందులు వాడుతున్నారా?

మందుల దుష్ఫలితాలు

6. స్పృహ తప్పడం, నీరసం వంటి లక్షణాలు ఉన్నాయా?

పేగులు (చిద్రమవటం (ఇంటస్టైనల్ పర్ఫరేషన్)

7. మలంతో పాటు కేవలం రక్తమే కాకుండా జిగురు వంటి పదార్థం కూడా కనిపిస్తుందా?

పేగుల్లో వ్రణాలు (ఇన్ ఫ్లమేటరీ బొవల్ డిసీజెస్)

8. రక్తం మలంతో పూర్తిగా కలిసిపోయి కనిపిస్తుందా? లేదా కేవలం మలం వెలుపలి వైపు మాత్రమే కనిపిస్తుందా?

పేగుల్లో రక్త స్రావం

9. ఇటీవలికాలంలో మీ మలవిసర్జన వేళలు మారాయా? మలవిసర్జన అసంపూర్ణంగా జరిగినట్లు అనిపిస్తుందా?

పేగుల్లో కణితులు, ఇతర పెరుగుదలలు

10. రక్తయుక్తమలం అతిసారంతో కూడి కనిపిస్తుందా?

పేగుల క్యాన్సర్

11. మీరు ఇటీవల రోడ్డుపక్కన కలుషితాహారం తిన్నారా?

అమీబియాసిస్, ఇరర ఇన్ఫెక్షన్లు

12. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటారా?

కాలేయ కణజాలం గడ్డిపడి వ్యాధిగ్రస్తమవటం (సిరోసిస్)

13. మీరు గుండెనొప్పి (యాంజైనా) బాధ పడుతున్నారా? మీకు ఇంతకుముందు ఎప్పుడైనా పక్షవాతపు లక్షణాలు (స్ట్రోక్) కనిపించాయా? మీకు అధిక రక్తపోటు కూడా ఉందా?

రక్తనాళాలు బిరుసెక్కి సాగే గుణాన్ని కోల్పోవటం (ఎథిరోస్క్లీరోసిస్)

14. మీకు తేలికగా చర్మం కములుతుంటుందా?

రక్తనాళాల్లో అసాధారణత

15. మలద్వారానికి ఏదన్నా దెబ్బ తగిలిందా?

దెబ్బలు/గాయాలు

16. మీ వయసు ఐదు దాటడం, అప్పుడప్పుడూ పొత్తికడుపు ప్రాంతంలో నొప్పిరావడాలు జరుగుతున్నాయా?

పెద్దపేగుల్లో సంచులవంటి నిర్మాణాలు తయారవ్వటం (డైవర్టిక్యులైటిస్)

 

మలంతో పాటు రక్తం కనిపించడమనేది చాలా ముఖ్యమైన లక్షణం. నోరు నుంచి మలద్వారం వరకు ఆవరించి ఉన్న జీర్ణకోశంలో ఎక్కడ సమస్య ఉత్పన్నమైనా మలంతో పాటు రక్తం కనిపిస్తుంది. అమాశయం ఎగువ ప్రాంతంలో రక్తం కారితే అది వాంతి రూరూపంలోనూ, అమాశయానికి దిగువన లీక్ అయితే మలం రూపంలోనూ బయటకు వస్తుంది. అమాశయంలోనికి కారే రక్తం ఎటువైపునుంచైనా ఏ రూపంలోనైనా బయటపడవచ్చు. రక్తస్రావ కారణాన్ని, ఉత్పత్తి ప్రదేశాన్నీ కనుక్కోవడానికి రక్తం ఏ రూపంలో బయటకు వస్తుందనేది తెలుసుకోవడం ముఖ్యం. ఉదాహరణకు, రక్తం తాజాగా స్వచ్చమైన ఎరుపురంగులో కనిపిస్తుంటే అర్శమొలల (రక్తార్శస్సు) వంటి వెలుపలి ప్రదేశాల నుంచి వస్తున్నట్లు అర్థం. ఇలా కాకుండా రక్తం పూర్తిగా నల్లని రంగులో, దాదాపు తారుమాదిరిగా మలంతో కూడి కనిపిస్తున్నట్లయితే పేగులవంటి ఎగువ ప్రదేశాలనుంచి రక్తం కారుతున్నదనీ, రక్తం పైన జీర్ణరసాలు ప్రభావాన్ని చూపించడంతో, తనలో లీనమైన ప్రాణవాయువును రక్తం కోల్పోయిందనీ అర్థం, ఇక్కడో ముఖ్యమైన విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి; మలం నల్లగా కనిపిస్తుంటే రక్తం లీక్ అవుతున్నదనే విషయాన్ని పసికట్టవచ్చుగాని ఎంత మొత్తంలో లీకయిందో ఊహించలేము.

ఎంచేతనంటే కేవలం రెండు చెంచాల రక్తం చాలు, మొత్తం మలాన్ని నల్లగా కనిపించేలా చేయడానికి, రోజువారీగా మలంతో పాటు రక్తం పోతుంటే తీవ్రమైన రక్తాల్పత ప్రాప్తిస్తుంది. చర్మం తెల్లగా పాలిపోవడం, చిన్నపనికే ఆయాసం రావడం, త్వరగా నీరసపడిపోవడం తదితర లక్షణాలతో రక్తాల్పతను కనిపెట్టవచ్చుగాని ఈ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపించే సమయానికి తీవ్రమైన అనారోగ్యం ప్రాప్తిస్తుంది. ఒకోసారి ఆరోగ్యం తిరిగి బాగుచేయలేనంతగా దెబ్బతింటుంది కూడా. అంచేత, మలంతో పాటు రక్తం కనిపిస్తున్నప్పుడు వెంటనే అప్రమత్తమవడం అవసరం. మలంతో పాటు రక్తం కనిపించడానికి అనేక కారణాలు దోహదపడినప్పటికీ వీటిల్లో చాలా భాగం తేలికగా తగ్గిపోయే విధంగానే ఉంటాయి. అయితే, కొన్ని అరుదైన సందర్భాల్లో, పేగుల క్యాన్సర్ వంటి ప్రమాదభరితమైన వ్యాధులు లోపల్లోపలే పెరుగుతూ కేవలం రక్తస్రావాన్ని మాత్రమే కలిగిస్తాయి కాబట్టి రక్తయుక్తమలాన్ని ఎప్పుడూ 'తేలికగా' తీసుకోకూడదు. వ్యాధి నిర్ణయం జరగటం తప్పనిసరి. దీనికి నాదీ మల మూత్రాది ఆయుర్వేదోక్త పరీక్షలతో పాటు మైక్రోస్కోప్ తో చేసే పరీక్ష. ఎండోస్కోపీ పరీక్ష, బేరియం ఎక్స్ రేలు అపయోగపడతాయి. అన్నిటికీ మించి ఈ కింది లక్షణాలు వ్యాధిని గుర్తించడానికి సహాయపడతాయి.

1. ఆర్శమొలలు (ఫైల్స్ / హెమరాయిడ్స్):

మలం చుట్టూ రక్తం అంటుకుపోయి కనిపిస్తుంటే మలద్వారం తాలూకు వెలుపలి ప్రదేశాల నుంచి రక్తం కారుతున్నట్లు లెక్క. ఉదాహరణకు అర్శమొలల్లో ఇలా జరుగుతుంది. మలంతోపాటు రక్తంకనిపించడానికి ఇది అత్యంత సాధారణమైన కారణం. దీనికి తోడు, అర్శమొలల్లో మలద్వారం వద్ద నొప్పి. వాపులు ఉంటాయి. అసనద్వారంలో రక్తనాళాలు ఉబ్బిపోయి తగులుతాయి. దీనిని ప్రత్యక్షంగా పరీక్షించి నిర్ణయించవచ్చు.

గృహ చికిత్సలు: 1. వాము, శొంఠి సమతూకంగా తీసుకొని పొడిచేయాలి. దీనిని అరచెంచాడు మోతాదుగా గ్లాసు మజ్జిగతో కలిపి తీసుకోవాలి. 2. కరక్కాయల నుంచి గింజలను తొలగించి కేవలం పెచ్చులు మాత్రమే గ్రహించి పొడిచేయాలి. దీనిని పూటకు అరచెంచాడు చొప్పున రెట్టింపు భాగం బెల్లంతో కలిపి మూడు పూటలా తీసుకోవాలి. 3. ఉత్తరేణి గింజలను రెండు చెంచాలు పొడి చేసి బియ్యపు కడుగు నీళ్ళతో తీసుకుంటే రక్తం ఆగిపోతుంది. 4. నాగాకేశ్వర చూర్ణం (చెంచాడు), పంచదార (2 చెంచాలు), వెన్న (ఐదు చెంచాలు) అన్నీ కలిపి తీసుకుంటే అర్శమొలల్లో స్రవించే రక్తం ఆగుతుంది.

ఔషధాలు: అర్శకుఠార రసం, కాంకాయనగుటిక, నూరణ పటకములు, అభాయారిష్టం. బాహ్యప్రయోగం - కాసీసాదితైలం.

2. స్థానికంగా చర్మం కోసుకుపోవటం (ఫిషర్):

మలవిసర్జనతో పాటు నొప్పి ఉంటే మలాశయం లేదా పెద్ద పేగు చివరి భాగంలో సమస్య ఉన్నదని అర్థం. అర్శమొలలున్నప్పుడు, మలాశయం లోపలి పొర చీరుకుపోయినప్పుడు (ఫిషర్ / గుదవిదారం) ఇలాంటి నొప్పి వస్తుంది. ఉదర ప్రదేశంలో నొప్పి కేంద్రీకృతమై మలబద్దకంతో కూడి కనిపిస్తున్నట్లయితే కోలైటిస్ వంటి ఇన్ ఫ్లమేషన్లను, పేగుల్లో పెరిగే గడ్డలను లేదా ట్యూమర్లనూ అనుమానించాలి.

సూచనలు: దీనికి పైన పేర్కొన్న 'అర్శమొలల చికిత్స' తీసుకుంటే సరిపోతుంది.

3. చర్మ వ్యాధి (స్కిన్ డిసీజ్):

ఎగ్జమా, ఫంగల్ ఇన్ఫెక్షన్ల వంటి కారణాల వల్ల స్థానికంగా చర్మం రేగి దురద, రక్తస్రావాలు కలుగుతాయి. దీనికి కండూహర తైలాలు చక్కగా పనిచేస్తాయి.

ఔషధాలు: బాహ్యప్రయోగాలు - జాత్యాదితైలం, మహామరీచ్యాది తైలం, కాసీసాదితైలం.

4. కడుపులో మంట / పేగు పూత (గ్యాస్ట్రైటిస్):

మలంతోపాటు రక్తం కనిపించడానికి ప్రధాన కారణం పెగుపూత. ఇది గ్యాస్ స్ట్రైటిస్, పెక్టిక్ అల్సర్, వంటి భేదాలతో వ్యక్తీకృతమవుతుంది. ఈ వ్యాధితో బాధపడేవారు మద్యం, కెఫిన్ కలిగిన పదార్థాలు, సిగరెట్లు, నూనె పదార్థాలు, మసాలాలు మానివేయాలి.

గృహచికిత్సలు: 1. పిల్లిపీచర గడ్డలు (శతావరి) పచ్చవి తెచ్చి, దంచి రసం తీసి పూటకు అరకప్పు చొప్పున రండు పూటలా పుచ్చుకోవాలి. 2. శతవారి చూర్ణాన్ని పూటకు అరచెంచాడు చొప్పున అరగ్లాసు పాలతో కలిపి రెండు పూటలా తీసుకోవాలి. 3. ఉసిరి చూర్ణాన్ని అరచెంచాడు మోతాదుగా పాలతో కలిపి రోజుకు రెండుసార్లు పుచ్చుకోవాలి. 4. శొంఠి, నువ్వులు, బెల్లం అన్నీ సమభాగాలు తీసుకొని ముద్దచేసి పూటకు చెంచాడు చొప్పున రెండు పూటలా గోరువెచ్చని పాలతో పుచ్చుకోవాలి. 5. నత్తగుల్లలను శుభ్రంగా కడిగి, పొడిచేసి చిటికెడు (500 మి.గ్రా) పొడిని వేడినీళ్ళతో కలిపి తీసుకోవాలి. దీనిని వాడేటప్పుడు నోరు పొక్కే అవకాశం ఉంది కనుక నోటికి నేతిని పూసుకోవాలి.

ఔషధాలు: కామదుఘారసం, సూతశేఖరరసం, ధాత్రిలోహం, నారికేళలవణం, శతావరి ఘృతం.

5. మందుల దుష్ఫలితాలు:

అనేక రకాల అల్లోపతి మందులు పేగుల్లోపల రక్తస్రావాన్ని కలిగిస్తాయి. జంటామైసిన్, ఎరిత్రోమైసిన్, ళినోమైసిన్ వంటి యాంటీబయాటిక్స్ తో పాటు కీళ్ళనొప్పులకోసం వాడే స్టీరాయిడ్స్, యాస్ప్రిన్ మందులకు ఈ నైజం ఉంది. డిజిటాలిస్ (గుండె స్పందనలను క్రమబద్దీకరించడం కోసం వాడే పదార్ధం(తో తయారైన మందుల వల్ల, మూత్రాన్ని జారీ చేసే మందులతో పాటు అనుబంధంగా ఇచ్చే పొటాషియం వల్ల రక్తస్రావమై మలంతో పాటు కనిపిస్తుంది. మందుల వల్ల రక్తస్రావ సమస్య వస్తున్నదని తేలితే వాటి వాడకం గురించి మీ డాక్టరుతో చర్చించండి. ఇక్కడో విషయాన్ని గమనించాలి; ఐరన్ క్యాప్సుల్స్ వాడే వారిలోనూ, గ్యాస్ ను తగ్గించుకోవడం కోసం చార్కోల్ టాబ్లెట్స్ వాడే వారిలోనూ, నేరేడు తదితర ఆహార పదార్థాలు తిన్న వారిలోనూ మలం ముదురు రంగులో కనిపిస్తుంది. ఐతే, ఈ స్థితిల్లో రక్తస్రావముండదు కనుక కంగారు పడాల్సిన పనిలేదు.

6. పేగులు చిద్రమవటం (ఇంటస్ట్రెనల్ పర్ఫరేషన్):

స్పృహ తప్పడం, నీరసం వంటి లక్షణాలతో పాటు రక్తం మలంతో కూడి కనిపిస్తుంటే రక్తస్రావం తీవ్రస్థాయిలో అవుతున్నట్లుగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా పెప్టిక్ అల్సర్స్ చిద్రమై రక్తస్రావమవుతున్నప్పుడు ఇలా జరుగుతుంది. దీన్ని ఆయుర్వేదంలో చిద్రోదరం అంటారు. దీనికి అత్యవసరమే ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయాల్సి ఉంటుంది.

7. పేగుల్లో వ్రణాలు (ఇన్ ఫ్లమేటరీ బొవల్ డిసీజెస్):

పేగులను వ్యాధిగ్రస్తం చేసి, అల్సర్లను కలిగించే వ్యాధులను ఇన్ ఫ్లమేటరీ బొవెల్ డిసీజెస్ (ఐ.బి.డి.) అంటారు. ఇలాంటి వ్యాధి చిన్న పేగుల్లో వస్తే క్యాన్స్ డిసీజ్ అనీ, పెద్ద పేగుల్లో వస్తే అల్సరేటివ్ కొలైటిస్ అనీ వ్యవహరిస్తారు. వీటిల్లో కడుపునొప్పితో పాటు బరువు తగ్గటం, రక్తాల్పతలు ఉంటాయి. మలంతో పాటు రక్తం కనిపించడం ఈ వ్యాధుల్లో ప్రధాన లక్షణం. చిన్న పేగులో రక్తస్రావమవుతున్నప్పుడు మలం నల్లగానూ, పెద్దపేగుల్లో రక్తస్రావమవుతున్నప్పుడు మలం ఎర్రగానూ కనిపిస్తుంది. చాలా సందర్భాల్లో మలం లోహపు రంగులో కనిపిస్తుంటుంది. ఈ వ్యాధులు సాధారణంగా యుక్తవయసులో ప్రారంభమై దీర్ఘకాలం పాటు కొనసాగుతాయి. పేగుల లోపలి గోడల్లో వ్రణాలనేర్పరచి గోడలను దళసరిగా చేస్తాయి, ఈ వ్యాధులకు ఇంతవరకూ స్పష్టమైన కారణాలు తేలియరాలేదు. ఇన్ఫెక్షన్లు తాత్కాలికంగావ్యాధిరూపాన్ని తీవ్రతరం చేస్తాయి తప్పితే కేవలం ఇన్ఫెక్షన్లనే కారణాలుగా భావించలేము. ఈ వ్యాధులల సమూహాన్ని ఆయుర్వేదంలో వివరించిన గ్రహణి అనే వ్యాధితో పోల్చవచ్చు. ఈ వ్యాధికి ఆయుర్వేదంలో పర్పటి కల్పాలను చెప్పారు. వీటిని నిర్దేశిత ,మోతాదులో పరిమిత కాలం పాటు ప్రత్యేకమైన ఆహారాలతో కలిపి ఇస్తే ఈ వ్యాధి నిశ్చయంగా తగ్గుతుంది.

సూచనలు: ఆహారాన్ని కొద్దిమొతాల్లో తరచుగా తీసుకోవాలి. మషాలాల వాడకం తగ్గించాలి. మాంసం, గుడ్లు, వంటివాటికి కుళ్లిపోయిన మాలాశయాన్ని కల్లోల పరిచే నైజం ఉంటుంది కాబట్టి వాడకూడదు. పంచదార, పెసలు, పిండి పదార్థాలు కూడా ఈ వ్యాధిలో మంచివికావు, మజ్జిగ, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. తగినంతగా విశ్రాంతి తీసుకోవాలి.

గృహచికిత్సలు: శల్లకి (అందుగు) నిర్యాసాన్నిగాని లేదా యష్టి మధుకాన్నిగాని లేదా కలబంద గుజ్జుకాని పావు చెంచాడు మోతాదులో తేనె చేర్చి తీసుకోవాలి.

8. పేగుల్లో రక్తస్రావం:

రక్తం మలంతో పూర్తిగా కలిసిపోయి 'ఏకరూపంగా' కనిపిస్తుంటే జీర్ణావయవాల పైభాగంలో ఎక్కడో రక్తస్రావమవుతున్నట్లు అర్థం. ఉదాహరణకు అమాశయం (స్టమక్)లో గాని, ప్రథమాంత్రాల్లో (డుయోడినం)గానీ అల్సర్లు ఏర్పడినప్పుడు ఇలా జరగవచ్చు. ఇంతే కాకుండా అన్నవాహిక (ఇసోఫేగస్) పూసినా, దానిలోపాలి రక్తనాళాలు చిట్లిన రక్తయుక్తంగా కనిపించవచ్చు.

సూచనలు: దీనికి పైన పేర్కొన్న 'పేగుల్లో వ్రణాల' చికిత్స తీసుకోవాలి.

9. పేగుల్లో కణితులు, ఇతర పెరుగుదలలు:

మలవిసర్జన విధానంలోగాని, సంఖ్యలోగాని మార్పులు చోటుచేసుకోవడం ఆలోచించాల్సిన అంశం. ముఖ్యంగా ఆకలి తగటం, బరువు తగ్గటం, మలం, రిబ్బనులాగా బల్లపరువుగా రావటం, రక్తం కనిపించటం ఇవన్నీ పేగుల్లోపల పెరిగే కంతులను సూచిస్తాయి. కొన్ని సందర్భాల్లో, పేగుల్లోపల పెరిగే గడ్డల వల్ల, మల విసర్జన చేసినప్పటికీ మళ్లీ చేయాలని అనిపిస్తుంటుంది. పేగుల్లో తయారైన కంతి లోపలి ప్రదేశంలో ఒత్తిడి కలిగిస్తుండటం దీనికి కారణం. ఇవే లక్షణాలు ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్ (ఐ.బి.యస్.) లో కూడా కనిపిస్తాయి.

ఔషధాలు: లావణభాస్కర చూర్ణం, కాంకాయనవటి (గుల్మ), పీయూషవల్లీ రసం, ప్రాణదాగుటిక, సంజీవనీవటి.

10. పేగులో క్యాన్సర్:

పేగుల్లో పెరిగే క్యాన్సర్ కంతుల వల్ల అతిసారం, మలబద్దకం వంటివి కనిపించే అవకాశం ఉన్నప్పటికీ ఇన్ఫెక్షన్లు, ఇన్ ఫ్లమేషన్ల వల్లనే ఎక్కువగా రక్తస్రావం కనిపిస్తుంది.

సూచనలు: ఇన్ ఫ్లమేషన్ వల్ల సమస్య వున్నప్పుడు కుటజ అనే మూలిక అద్భుతంగా పని చేస్తుంది, ఈ మూలిక ప్రధాన ద్రవ్యంగా తయారయ్యే కుటజఘనవటి, కుటజారిష్ట వంటి మందులు అనేకం లభ్యమవుతున్నాయి. వీటిని అవసరానుసారం వాడాలి.

11. అమీబియాసిస్, ఇతర ఇన్ఫెక్షన్లు:

అమీబియాసిస్ మన దేశంలో అత్యధికంగా కనిపించే వ్యాధి. ఇది కలుషితమైన ఆహారపానీయాలను తీసుకునే వారికి వస్తుంది, అమీబియాసిస్ మలవిసర్జనతో పాటు రక్తం కనిపించడం సర్వసాధారణం. కడుపులో నులి నొప్పి, మల విసర్జనతో పాటు కడుపు నొప్పి కాస్త తగ్గినట్లనిపించడం, మలం పూర్తిగా పచనం కాకుండా అమయుక్తంగానూ కనిపించడం, గ్యాస్ తయారవ్వడం అనేవి అమీబియాసిస్ లో కనిపించే ప్రధాన లక్షణాలు.

గృహచికిత్సలు: 1. మిరియాలపొడిని (అరచెంచా) పాలతో (ఒక కప్పు) కలిపి రోజుకు మూడుసార్లు తీసుకోవాలి. 2. మారేడుకాయ గుజ్జు (అరచెంచా), నల్లనువ్వులు (అరచెంచా) కలిపి పుల్లటి పెరుగుతో సహా నూరి రోజుకు మూడుసార్లు తీసుకోవాలి. 3. మారేడు గుజ్జు (అరచెంచా)ను బెల్లంతో (అరచెంచా) కలిపి రోజుకు మూడు సార్లు నీళ్ళు అనుపానంగా తీసుకోవాలి. 4. పిప్పళ్ళను (మూడు) వేయించి పొడిచేసి పాలతో (ఒక గ్లాసు) కలిపి పుచ్చుకోవాలి.

ఔషధాలు: కుటజఘన వటి, కుటజారిష్టం, చౌషష్టప్రహారపిప్పలి, పంచామృతపర్పటి, దాడిమాష్టక చూర్ణం, లఘుగంగాధర చూర్ణం.

12. కాలేయ కణజాలమ గట్టిపడి వ్యాధిగ్రస్తామవటం (సిరోసిస్):

అధిక మొత్తాల్లో మద్యం తాగే వారికి కాలేయం వ్యాధిగ్రస్తమై నారలాంటి పీచుపదార్థం కాలేయమంతా వ్యాపించే అవకాశం ఉంది. దీనిని వైద్య పరిభాషలో 'సిరోసిస్' అంటారు. అన్ని పీచుపదార్థాల మాదిరిగా కాలేయంలో తయారైన పీచుపదార్థానికి కూడా రక్తసరఫరా కుంటుపడుతుంది. రక్తనాళాలు పూడుకుపోతాయి. ఈ లక్షణం ఎగువ రక్తనాళాలకు కూడా వ్యాపించి గొంతులోని రక్తనాళాలను చిట్లిపోయేలా చేస్తుంది. ఫలితంగా పేగుల్లోకి రక్తస్రావమై మలం నల్లగా మారుతుంది. కాలేయం సంబంధ వ్యాధులకు ఆయుర్వేదంలో మంచి చికిత్సలు ఉన్నాయి.

ఔషధాలు: చించాది లేహ్యం, ధాత్రీ లోహం, గుడ పిప్పలి, కుమార్యాసవం, క్షీరపిప్పలి, కాంత వల్లభ రసం, సురక్షార కాసీస భస్మం, శోథారి మండూరం, సూతికాభరణ రసం, సప్తామృత లోహం, శిలాజిత్వాది లోహం, తాప్యాది లోహం.

13. రక్తనాళాలు బిరుసెక్కి సాగే గుణాన్ని కోల్పోవటం (ఎథిరోస్క్లీరోసిస్):

రక్తనాళాలు బిరుసెక్కి గట్టిగా తయారైనందువల్ల గుండెపోటు, పక్షవాతాలు వచ్చే అవకాశముందన్న విషయం తెలిసిందే. అయితే, ఇదే తరహాలో, వయసు పెరిగేకొద్దీ పేగులకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళం కూడా బిరుసెక్కి గట్టిపడే అవకాశం ఉంది. అదే జరిగితే అప్పుడు రక్తనాళం చిట్లి పేగుల్లోకి రక్తం కారుతుంది. ఇలా జరిగినప్పుడు రక్తస్రావంతో పాటు కడుపులో నొప్పి కూడా వస్తుంది.

గృహచికిత్సలు: 1. శొంఠి కషాయానికి (అరకప్పు) ఆముదాన్ని (రెండు చెంచాలు) కలిపి రెండుపూటలా వారం లేదా పది రోజుల పాటు తీసుకోవాలి. 2. వావిలి ఆకు కషాయాన్ని పూటకు అరకప్పు చొప్పున మూడుపూటలా పుచ్చుకోవాలి. 3. పారిజాతం ఆకుల కషాయాన్ని పూటకు అరకప్పు చొప్పున మూడుపూటలా తీసుకోవాలి.

ఔషధాలు: త్రయోదశాంగ గుగ్గులు, మహారాస్నాదిక్వాథం, సమీరపన్నగ రసం, యోగరాజగుగ్గులు, వాతవిధ్వంసినీ రసం, అమృతభల్లాతక లేహ్యం, వాతగజాంకకుశ రసం.

14. రక్తనాళాల్లో అసాధారణత:

కొంతమందికి జన్మతః రక్తనాళాలు సున్నితంగా ఉండి తేలికగా చిట్లి రక్త స్రావమతుంటుంది. ఇటువంటి వారికి అకారణంగా చర్మం కమలడం, శరీరాంతర్గతంగా రక్తస్రావమవడం జరుగుతుంది. ఇదే విధానం పేగుల్లోపల కూడా జరిగి రక్తస్రావమై మలం నల్లగా మారుతుంది. హఠాత్తుగా, ఇతిమిద్ధమైన కారణం లేకుండా ఎవరిలోనైనా పేగుల్లోపల రక్తస్రావమై మలం నల్లగా మారితే ఇటువంటి జన్మతః ప్రాప్తించిన లక్షణాల గురించి ఆలోచించాలి. దీనిని ఆపడానికి ఆయుర్వేదంలో సంధాన, స్కందన, పాచన దహనాలనే చికిత్సలను చేస్తారు.

15. దెబ్బలు / గాయాలు:

యాక్సిడెంట్లు మొదలైన వాటి కారణంగా మలద్వారం చుట్టు పక్కల దెబ్బ తగిలినా, మలద్వారం లోనికి ఏదన్నా వస్తువు చొచ్చుకువెళ్లినా పేగుల్లోపల రక్తస్రావమై మలం నల్లగా మారుతుంది. దీనికి లక్షణానుగుణంగా వ్రణరోపణ చికిత్సలు చేయాల్సి ఉంటుంది.

ఔషధాలు: వ్రణరోపణ తైలం, జాత్యాదితైల, మర్మగుటిక (ఇవన్నీ బాహ్యప్రయోగాలు). 1

16. పెద్దపేగుల్లో సంచులవంటి నిర్మాణాలు తయారవ్వటం (డైవర్టిక్యులైటిస్):

వృద్ధాప్యంలో పేగులకు సంబంధించి కనిపించే ఒక ప్రధానమైన సమస్య డైవర్టిక్యులైటిస్. ఈ వ్యాధిలో పెద్దపేగు చివరిభాగంలో చిన్న చిన్న సంచుల మాదిరి కోశాలు తయారవుతాయి. మలాశాయపు గోడలు బలహీనపడటం వల్ల ఇవి తయారవుతాయి. వీటిల్లోకి ఆహారవ్యర్థాలు ప్రవేశిస్తే చుట్టుపక్కల కణజాలం వ్యాధిగ్రస్తమై డైవర్టిక్యులైటిస్ ప్రాప్తిస్తుంది. దీనితో కడుపునొప్పి, జ్వరం, రక్తస్రావాలు ప్రాప్తిస్తాయి. ఈ వ్యాధికి చికిత్సగా, పేగుల నిర్హరణ శక్తిని పెంచే మందులు వాడాలి.

ఔషధాలు: అగస్త్యహరీతకలేహ్యం, పంచామృతపర్పటి, మహాగంధకరసం, రసపర్పటి, స్వర్ణపర్పటి.