"చాలా ఎక్కువగా అంచనాలు వేసేస్తున్నారేమో... జాగ్రత్త" నవ్వింది మహిమ.
    "లేదు... నిజంగా చెపుతున్నా నువ్వు సుస్మితని కూడా మార్చేయగలవు అనిపిస్తోంది".
    "ఆ మర్చిపోయాను. సుస్మిత గారికి కూడా ఈ ఆఫీసులో ఏదన్నా ఒక పోస్ట్ ఇస్తే తన సమర్థత మీద నమ్మకం కలిగించినట్టూ ఉంటుంది. ఆమెకీ కాలక్షేపం ఉంటే అనవసర ఆలోచనలు తగ్గుతాయి. భర్త ఆఫీసులో తనూ ఉద్యోగం చేస్తే ఆమెకి అనుమానాలు రాకుండా ఉంటాయి. ఆమె కంపెనీలో మేజర్ షేర్ హోల్డర్ గదా, ఫైనాన్స్ సూపర్ విజన్ అప్పగించండి. చెక్ పవర్ ఇస్తే, బిజినెస్ ఫైనాన్స్ నెమ్మదిగా అలవాటవుతుంది" సలహా ఇచ్చింది మహిమ.
    "రియల్లీ మహిమ, యూ ఆర్ గ్రేట్! ఈ ఆలోచన మాకెవరికీ రాలేదు. నిజమే! కాలక్షేపంగానే కాక, కంపెనీ వ్యవహారాలు తను చూసుకుంటుంటే, ఇతర ఆలోచనలు, అనుమానాలకి తావు ఉండదు. ఇవాళే డాడీతో మాట్లాడతా. థాంక్స్ మహిమ. నీ మహిమతో మా ఇల్లు పావనం చేసే రోజు దగ్గరలోనే ఉండాలని ఆశిస్తాను..." నవ్వుతూ వంగి దండం పెట్టాడు.
    మహిమ ఈసారి కాస్త సిగ్గుపడింది.

                                    *  *  *  *

    "మహిమా, నీకోసం చిన్న బహుమతి" కాఫీ హౌస్ లో టేబుల్ దగ్గర కూర్చున్నాక, జేబులో నుంచి చిన్న గిఫ్ట్ ప్యాక్ తీసి టేబుల్ మీద పెట్టాడు విశాల్, మహిమ కళ్లలోకి చూస్తూ.
    "నాకోసమా? ఇప్పుడు దీని అవసరం ఏముంది?" మృదువుగా అంది మహిమ.
    "అలా అనకు. ఇది నా సంతోషం, ముచ్చట. తీసి చూడవా" అన్నాడు.
    మహిమ నవ్వి గిఫ్ట్ రేపర్ విప్పింది. చిన్న ముఖమల్ డబ్బాలో వజ్రపుటుంగరం.
    "ఉంగరం... మొన్న ఎంగేజ్ మెంట్ నాడు తొడిగారుగా, మళ్లీ ఇదెందుకు?"
    "అది కోడలికి అత్తవారు పెట్టింది. ఇది నా ఫియాన్సీకి ప్రేమకానుక" కొంటెగా అన్నాడు.
    "బానే ఉంది. ఉన్నవారు ఎంతయినా ఖర్చు పెట్టగలరు. మరి నేనేం ఇవ్వాలి మీకు".
    "ప్రేమకి విలువ కట్టకు. నీకంటే మంచి కనుక నాకింకేం కావాలి" మనస్ఫూర్తిగా అన్నాడు.
    "ఫరవాలేదే, బాగానే మాట్లాడుతున్నారు. మీ అన్నగారు 'పాపం మా వాడికి అమ్మాయిలంటే భయం, జెంటిల్ మేన్, నేనే వెతికి పెట్టాలి అమ్మాయిని' అన్నారు" మహిమ చిలిపిగా అంది.
    విశాల్ కాస్త సిగ్గుగా నవ్వి ... 'అన్నయ్యకి నేనేం ఇచ్చి ఋణం తీర్చుకోవాలో ఇంత మంచి అమ్మాయిని వెతికిపెట్టినందుకు' నాటక ఫక్కీలో అన్నాడు.
    "బానే ఉంది అన్నదమ్ముల వ్యవహారం. రామలక్ష్మణులని చరిత్రలోంచి తప్పించేట్లున్నారు ఇద్దరూ కలిసి..."
    "వినోద్ నిజంగా మంచివాడు. పాపం, వాడి జీవితం ఎందుకలా అయిందో... బాధగా ఉంది".
    "ఇంక ఆ పాత విషయం మరిచిపోయి, వాళ్ళిద్దరినీ మామూలు భార్యాభర్తల్లా కలిసి మెలిసి సంసారం చేసేట్టు చెయ్యాలి మనం. సుస్మిత గారిలో మార్పు తీసుకురావాలి. మనందరం కలిసి ఆవిదలోని భేదాభిప్రాయాలను పోగొట్టి, మనలో కలుపుకునేందుకు ప్రయత్నించాలి. మొన్న ఎంగేజ్ మెంట్ నాడు బాగానే మాట్లాడారు ఆవిడ..."
    "ఏమో... ఏం చేస్తావో కానీ నీ మాటల మహిమ చూపు. అన్నయ్యకి దగ్గర చేసే బాధ్యత నీదే! అవును మహిమ, ఒక్క విషయం అడగనా? నీకు ఇలా జాయింట్ ఫ్యామిలీలో ఉండడానికి ఇబ్బంది ఏమీ లేదు గదా? మా మార్వాడీ కుటుంబాలలో, ఇప్పటికీ అన్నదమ్ములం కలిసే ఉంటాం. మీ సౌత్ లో ఈ పద్ధతి లేదు గదా? నాకెందుకో ఈ విషయంలో నీ అభిప్రాయం తెలుసుకోవడం అవసరం అనిపించింది. తరువాత అభిప్రాయ భేదాలు రాకూడదు గదా? నీకేమైనా అభ్యంతరం ఉందా..." సందేహిస్తూ అడిగాడు.
    మహిమ అరక్షణం ఆలోచించకుండా "అస్సలు లేదు. నాకు ఇలా అందరూ కలిసిమెలిసి ఉండే కుటుంబం, పెద్దవారి అండదండల మధ్య వారి నీడలో ఉండడంలో ఎంతో తృప్తి ఉందనిపిస్తుంది. అందులో అమ్మాయిలు ఉద్యోగాలు చేసే కాలం... ఇంట్లో పెద్దవారుంటే ఎంతో నిశ్చింతగా ఉంటుంది. ఎప్పుడైనా ముందుముందు అలా అనిపిస్తే, అలాంటి పరిస్థితి వస్తే అప్పుడాలోచిద్దాం" నిజాయితీగా అంది.
    విశాల్ మహిమ చేయి మీద అభిమానంగా చేయివేసి "థాంక్స్ మహిమ!" అన్నాడు. ఆ చేతి మీద తన చెయ్యివేసి చిన్నగా నొక్కింది అభయం ఇస్తున్నట్టు మహిమ.

                                                  * సమాప్తం *