నేను ఇద్దరం ఆడవాళ్ళం కలిసి వాళ్ళని కిందికి రమ్మన్నాం. వస్తూనే "మా ఇంటి తాళం మీద తాళం ఎందుకు వేశారు?" అంది ఎటాకింగ్ గా.
    "ఎందుకు వెయ్యం? ముందు ఒక సంగతి . మీరు ఇక్కడ మర్యాదస్థుల ఇళ్ళ మధ్య ఇళ్ళు తీసుకుని బ్రోతల్ హౌస్ గా మారిస్తే వూరుకోం. రెండోది మాకివాల్సిన డబ్బు కట్టకపోతే రూల్సు ప్రకారం తాళం వేసే అధికారం మాకుంది." ఆ అమ్మాయి దబాయింపుకి దిగేసరికి వళ్ళు మండి చాలా గట్టిగానే అన్నాను.
    "చూడు! మీరు ఆ తాళం బద్దలు కొట్టే పని చేస్తే వూరుకోం. పోలీసు కంప్లైంట్ యిచ్చి మీరు దందా చేస్తున్న సంగతి చెప్పి జైల్లో వేయిస్తాం. అట్టే మాట్లాడకుండా మా డబ్బు కట్టి మీ సామాన్లు తీసుకుని మీరు వెళ్ళండి. ఇంటి ఓనరుతో కూడా మాట్లాడాం. మీరిలాంటి వారని తెలియదని, మేం ఏం చేసినా తనకేం సంబంధం లేదని మిమ్మల్ని వెళ్ళగొట్టమని చెప్పాడు." ఆ అమ్మాయి ఆ దెబ్బతొ కాస్త తగ్గింది.
    రెండో అమ్మాయి బిక్క మొహం పెట్టి 'అంటీ! ఒకసారి తాళం తీస్తే నా బట్టలు తీసుకుని వెళ్ళిపోతాను. ఇది యీమె ఇల్లు. నేనూరికే వచ్చానంతే.' అంది.
    "అదంతా మాకనవసరం. డబ్బు కడితేనే తాళం తీస్తాం. డబ్బు కట్టి వెంటనే ఖాళీ చెయ్యాలి. ఇక్కడొక్క క్షణం వుండనీయం. " ఖచ్చితంగా అన్నా. "మీ ఇష్టం వచ్చినట్టు అర్ధరాత్రిళ్ళు మగాళ్ళ ని తీసుకొచ్చి మా బిల్డింగు పరువు తీస్తే చూస్తూ ఊరుకుంటామా?" చాలా గట్టిగా దబాయించాను. ఇదంతా హిందీలోనే మాటలు.
    "వాళ్ళు మా చాచాలు, కాకాలు.... ' రెండో అమ్మాయి ఏదో చెప్పబోయింది. 'ఛ, ఊరుకో . వాళ్ళెం నమ్మరులే నీ మాటలు.' మొదటి అమ్మాయి కసిరింది. రెండో అమ్మాయి ఏడుపు ఆరంభించింది. "నేను రానంటే కల్సి వుందాం రమ్మన్నావు. నా బట్టలు, వస్తువులు వుండిపోయాయి. ఎలా ఇప్పుడు?" అంటూ దుయ్యబట్టింది. మొదటి అమ్మాయి మొహం గంటు పెట్టుకుంది. "రేపొక రోజు టైమివ్వండి . ఎల్లుండి కడ్తాం డబ్బు .' అంది రాజీకోస్తూ.'
    "ఎల్లుండే తాళం తీస్తాం. తాళం తీసాక సామాను తీసుకుని వెంటనే వెళ్ళాలి. డబ్బు తెచ్చాక మాట్లాడు." పొద్దుటే పనివేళ వాళ్ళతో యింక వాదించే టైము లేక అందరం లోపలికెళ్ళాము. ఇద్ద్దరమ్మాయిలు ఆ రెండో అంతస్తు మెట్ల మీద కూర్చుని మాట్లాడుకుంటూ కళ్ళు తుడుచుకుంటూ కూర్చున్నారు.
    ఓ గంటా రెండు గంటలు పోయాక కాఫీ అది తాగి కాస్త పని చేసుకుని బయటికి తొంగి చూసేసరికి వాళ్ళక్కడే కూర్చున్నారు. ఒక్కక్షణం జాలేసింది. అప్పటికప్పుడు పాపం పొమ్మంటే ఎక్కడికి పోతారు? బట్టలవి యింట్లో వుండి పోయాయి ఏం చేస్తారు . అనిపించి కాస్త బాధ వేసింది. మనసుండబట్టలేక సెకండ్ ఫ్లోర్ వైపు వెళ్ళాను. నే వెళితే కాస్త ఆశగా చూశారు. మొదటి అమ్మాయి ఏదో అనబోయింది. "చూడమ్మాయి , చూస్తె పట్టుమని ఇరవై ఏళ్ళున్నట్లు లేవు, ఎందుకిలాంటి పనులు చేస్తున్నావు ? ఇలా వళ్ళమ్ముకునే పనికి దిగడం ఎంత నీచం?" అన్నాను.
    ఆ అమ్మాయి చురచుర చూసింది. "మరి ఏం చెయ్యాలి? ఏం తిని బతకాలి ?" అంది తీక్షణంగా.
    "ఏం నీకెవరూ లేరా ? అమ్మా నాన్నా, చూసేవాళ్ళు లేరా? పెళ్ళి చెయ్యలేదా?" నాలోని రచయిత్రి సంగతి తెల్సుకోవాలని కూతూహాలపడింది.
    ఆ అమ్మాయి ముఖం ముడుచుకుంది. "వున్నారు, అంతా వున్నారు. వాళ్ళకి ఎక్కువై వదిలేశారు."
    "అదేమిటి?" ఆడపిల్లని అలా గాలికి వదిలేశారా?"
    "ఎనిమిది మంది పిల్లం. అయ్య చచ్చాడు. అమ్మ ఎక్కడ నుంచి తెచ్చి పెడుతుంది. మా పక్కింటి అబ్దుల్ భాయి బొంబాయిలో ఉద్యోగం యిప్పిస్తా అంటే నమ్మి పంపింది ఆడితో. ఆ సచ్చినోడు నన్ను ఎవరికో రెండు వేలకి అమ్మి పోయాడు."
    "నీవు ముస్లిం వా, మాతో హిందూ అని అబద్దం చెప్పావు. గుజరాతి అన్నావు."
    తలదించుకుంది ఆ అమ్మాయి. "ముస్లిం అంటే ఎవరూ ఇళ్ళు ఈయరు అందుకని" అంది.
    "మరి బొంబాయి నుంచి యిక్కడి కెలా వచ్చావు?" ఈ కధ వివరాలు తెల్సుకోవాలనిపించి పని కూడా పక్కన పెట్టి మాటలకి దిగాను.
    "ఎందుకీదంతా . తాళం తియ్యండి. రేపు డబ్బు కడతా.' నేను మెత్తబడడం చూసి జాలిగా అడిగింది.
    "నేను సెక్రటరీ తో మాట్లాడి తరువాత చెప్తాను. ముందు అంతా నిజం చెప్పు. బొంబాయి నుంచి ఎలా వచ్చావు ?"
    "నన్ను కొన్న అంటీ ఇద్దరు ముగ్గురు అమ్మాయిలను బెంగుళూరు పంపించి బట్టలిప్పించి నైట్ క్లబ్బులో డ్యాన్స్ చేయడానికి డాన్సు నేర్పించింది. కొన్నాళ్ళ కి డ్యాన్సులు చేస్తుంటే పోలీసులు ఓనాడు రైడ్ చేసి పట్టుకుని జైల్లో పెట్టారు. నాలుగు తన్ని డబ్బులు కట్టేవారు లేక వదిలేశారు వాళ్ళు. అక్కడ ఇంకొకడు తగిలి "నాతో హైదరాబాద్ రా, నా దగ్గిరుందువు" అన్నాడు. వాడెవడో డబ్బున్న వాడులాగా వున్నాడు . మార్వాడి అన్నాడు. ఓల్డ్ సిటీలో ఓ ఆరు నెలలు ఓ రూము తీసి పెట్టాడు నన్నక్కడ. కావాల్సివచ్చినప్పుడు వచ్చి పోయేవాడు. మోజు తీరాక రావడం మానేశాడు. ఆడు చెప్పాడని ఇంకెవరో మగాళ్ళు వచ్చి పోయేవారు. బతకాలి గదా, డబ్బు కావాలి గదా! నేనింకేం చేయాలి?" జవాబియ్యి అన్నట్లు చూసింది.
    "నీవేం చదువుకోలేదా?" అన్నాను.
    నవ్వింది.
    "చదువు! తిండికే లేనప్పుడు సదువేక్కడ? మా బాబా బతికుండగా స్కూలు కెళ్ళేదాన్ని. ఐదో క్లాసు దాకా చదివా. అయ్య పోయాక అమ్మ చదువు మాన్పించి పనికి పెట్టింది.
    "మరి యిక్కడికేలా వచ్చావు ? మూడు వందలు అద్దె, ఎడొందలుమెయింటేనేన్స్ ఇవన్నీ కట్టేంత సంపాదనుందా? ఇక్కడ అద్దెకి దిగావు మరి! ఇలాంటి ఇళ్ళ మధ్య వూరుకుంటారనే వచ్చావా?"
    "ఎవడో బ్రోకర్ కుదిర్చాడు. ఇలా సంసారులు మధ్య వుంటే , ఫ్యామిలీ టైపని నమ్మి మగాళ్ళు ఇష్టపడతారని . ఇల్లు , మంచాలు అవి చూసి ఫ్యామిలీ టైపంటే మోజుంటుంది. నీ సంపాదనలో నెలకింత యియ్యాలి. నే కష్టమర్లని పంపిస్తూ వుంటానని మాట్లాడి పెట్టాడు. వాడే ఇంటి ఓనర్ తో మాట్లాడి అడ్వాన్స్ కట్టాడు."
    "మరి వాడినే అడిగి మెయింటేనేన్స్ కట్టకపోయవా? ఏం డబ్బులు సంపాదిస్తున్నావు, ఎడొందలు లేకుండా వున్నావా?" అన్నా.
    "ఏం సంపాదన . వంద, రెండొందలు యిస్తారు వెధవలు. " ఏడ్చుకుంటూ మాట్లాడింది కసిగా.
    ఆ అమ్మాయి ఈ రెండు మూడేళ్ళలోనే ఎంత రాటుదేలిందో అర్ధమైంది. ఇరవై ఏళ్ళ అమ్మాయి పట్టుమని పదహారేళ్ళకె ఇలాంటి జీవితంలోకి నెట్టబడి బతుకు తెరువుకి వళ్ళమ్ముకునే స్థితికి పరిస్థితులు లాగినందుకు బాధ, జాలి కల్గింది. ఓ ఆడపిల్ల కడుపు కోసం తన వాళ్లున్నా తన బతుకు తన తోవ చూసుకోవాల్సి రావడం, డానికి కారణమైన బీదరికం ...... కన్న తల్లి కూడా పట్టించుకోకుండా వదిలెయ్యడం, డబ్బు కోసం పిల్లని నిర్ధాక్షిణ్యంగా అమ్ముకోడం..... ఇలాంటి కధలు ఎన్నెన్నో రోజుకి జరుగుతుంటాయి. ముఖ్యంగా ముస్లిం బీద కుటుంబంలో మొగాళ్ళు రెండు , మూడు పెళ్ళిళ్ళు చేసుకుని డజన్ల కొద్ది పిల్లలని కనడం, డబ్బులకి అమ్మడం, అరబ్ దేశాలకి పెళ్ళి పేరుతొ ఎవడితోనో పంపడం, ఇలాటి వార్తలన్నీ పేపర్లలో చదువుతూనే వుంటాం. యిలాంటి అమ్మాయిలని ఎవరాదుకుంటారు ? ప్రభుత్వం ఆదుకోవాలి. అలాటి హోములలో పెట్టిన పిల్లలు ఆ కట్టడికి వుండలేక , తిండి సరిగ్గా దొరక్క స్వేచ్చ కోసం పారిపోయి, ఇలాంటి జీవితాలే ఎన్నుకుంటారు. ఈ బతుకు ఇంతే.... పోనీ ఈ ఒక్క రోజుకీ తాళం తీసి బట్టలవి తీసుకోనిస్తే జాలనిపించి వెళ్ళి సెక్రటరీ తో మాట్లాడాను. "మనం జాలి పడి తాళం తీస్తే డబ్బులివ్వదు. పదిరోజులు బట్టి చీకట్లో నీళ్ళు లేకుండా వుంది గాని డబ్బిచ్చిందా? అయినా తెలిశాక కూడా ఇలాంటి వాళ్ళని ఇంకా వుండనిస్తే అందరూ మనల్ని అంటారు యాక్షన్ తీసుకోలేదని. ఇంత స్ట్రిక్ట్ గా వుండకపోతే డబ్బు కట్టదు." అన్నాడు. అదీ నిజమే. రూల్సు రెగ్యులేషన్స్ పాటించాలి గదా! అలా పదిగంటల వరకు మేం దయతల్చి తాళం తీస్తావేమోనన్నట్లు కూర్చున్నారు. తరువాత ఇంక లాభం లేదనుకుని వెళ్ళిపోయారు.

                                           *    *    *    *
    పది పదిహేనురోజుల తరువాత ఎవరో యిద్దరు కుర్రాళ్ళని వెంటబెట్టుకు వచ్చింది. ఈలోగా వాళ్ళు వెళ్ళిన ఓ రెండు మూడు రోజులకు ఆ యింట్లో అమ్మాయిలు ఏమయ్యారంటూ రాత్రిళ్ళు మగాళ్ళు వస్తూనే వున్నారు. వాచ్ మెన్ తిట్టి ఆ అమ్మాయి ఇల్లు ఖాళీ చేసింది అని చెప్పాక రాకలు తగ్గాయి. డబ్బు కట్టి తాళం తీయించుకుని సామాన్లు ప్యాక్ చేసుకుని తీసుకు వెళ్ళిపోయింది. వెళ్ళేముందు "ఎక్కడికి వెళ్తున్నావు" అన్నా వుండబట్టలేక. నావంక నిర్లక్ష్యంగా చూసి "ఓల్డ్ సిటీకి . మీలాంటి మర్యాదస్తులుండే చోటికి కాదు లెండి" అంది వ్యంగ్యంగా. ఆ వ్యంగ్యంలో హేళన కంటే బాధ వుందని అనిపించింది.    
        
                                                   ***