కళ్లలో రక్తపు జీరలు:

 

1. ఎరుపుదనం ప్రధానంగా కనురెప్పల లోపల ఉందా?

ఇన్ఫెక్షన్ వల్ల కళ్ళ కలక (ఇన్ఫెక్టివ్ కంజెంక్టివైటిస్)

2. కంటిలో తెల్లగా కనిపించే ప్రాంతం హఠాత్తుగా ఎర్రగా మారిందా?

నేత్రపటల గత రక్తస్రావం (సబ్ కంజెంక్టైవల్ హెమరేజ్)

3. కృష్ణపటలం (ఐరిస్) చుట్టూ ఎరుపుదనం కనిపిస్తుందా?

నేత్ర శోథ (ఐ ఇన్ ఫ్లమేషన్)

4. కంట్లో మెర మెరలాడుతుందా?

ఎలర్జీ వల్ల కళ్ళ కలక (ఎలార్జిక్ కంజెంక్టివైటిస్)

5. కన్ను ఎర్రగా ఉండటంతో పాటు నొప్పిగా కూడా ఉంటుందా?

సంస్థాగత వ్యాధులు (సిస్టమిక్ డిసీజెస్)

6. కంటి ఎరుపుదనంతో పాటు చూపు కూడా దెబ్బతింటోందా?

కార్నియా వాపు (కెరటైటిస్)

7. కంటి పాప ఆకారంలోగాని, పరిమానంలోగాని మార్పు కనిపిస్తుందా?

కంటి అంతర్గత భాగాలు వ్యాధిగ్రస్తమవటం

8. కంటిని ముట్టుకుంటే చాలు నొప్పిగా ఉంటుందా?

నీటి కాసులు (గ్లాకోమా)

 

మనం ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కళ్లల్లోకి చూస్తూ మాట్లాడుతాం. కళ్లల్లో రక్తపు జీరలు ఉంటే ఇట్టే తెలిసిపోతుంది కనుక ఎదుటి వ్యక్తిలో మనం గమనించేది మొట్టమొదట ఈ లక్షణమే. వయసు పెరుగుతున్న కొద్దీ కళ్లు స్వచ్చమైన తెలుపును కోల్పోయి క్రమంగా రక్తపు జీరలను సంతరించుకుంటాయి. కోపం, ఉక్రోషం, తమకం వంటి అనేకానేక భావాలు కళ్లల్లో రక్తపు జీరలుగా ప్రతిఫలిస్తాయి. అలాగే, అనేకానేక వ్యాధులు, పరిస్థితులు కళ్లను ఎర్రగా, రక్తపు జీరలతో కనపడేలా చేస్తాయి. కళ్లల్లో ఎరుపుదనం కనిపించే విధానాన్ని బట్టి సమస్య ఏమిటన్నది కొంత వరకు ఊహించవచ్చు.

ఉదాహరణకు, కనురెప్పల క్రింద రక్త నాళాలు వాచిపోయి స్రావయుక్తంగా ఉంటే అది నేత్రాభిష్యందం (కంజెంక్టివైటిస్) వంటి ఇన్ఫెక్షన్లకూ. ఇన్ఫ్లమేషన్లకూ సూచన అలా కాకుండా కంటిలోని కృష్ణపటలం (ఐరిస్) చుట్టూ రక్తనాళాలు ఉబ్బిపోయి నొప్పిని, దృష్టి సమస్యలనూ కలిగిస్తుంటే కంటి పైన పారదర్శకంగా ఉండే కార్నియా పొరకు ఇన్ ఫ్లమేషన్ వచ్చినట్లుగా లేదా కంటి లోపలి నిర్మాణాలు వ్యాధిగ్రస్తమైనట్లుగా అర్థం చేసుకోవాలి. కంటి ఎరుపుదానానికి, రక్తపు జీరలకు వెనుక ఉన్న ఇలాంటి కారణాలను శోధించేందుకు ఈ కింది విషయాలు దోహదపడతాయి.

1. ఇన్ఫెక్షన్ వల్ల కళ్ళ కలక (ఇన్ఫెక్టివ్ కంజెంక్టివైటిస్):

కన్ను అంతా ఎర్రగా కనిపించడంతోపాటు కనురెప్ప లోపలి పొర మరింత ఎర్రగా కనిపిస్తే అది నేత్రాభిష్యందానికి (కంజెంక్టివైటిస్) సూచన. ఎలర్జీలూ, ఇన్ఫెక్షన్లూ నేత్రాభిష్యందాన్ని కలిగిస్తాయి. చీము, స్రావాలు అనవి ప్రధానంగా ఉంటే ఇన్ఫెక్షన్ గానూ, కేవలం దురద, మెరమెరలాడటాలు అనేవి ఉంటే ఎలర్జీగానూ అర్థం చేసుకోవాలి.

సూచనలు: నేత్రాభిష్యందం ఉన్నప్పుడు తలారా స్నానం చేయడాన్ని, తాంబూల సేవననూ సంహితాకారులు నిషేధించారు. ఉదయం పూట జలనేతి, రాత్రిపూట చల్లటి నీళ్లు తాగటం చేయాలి. అప్పుడే తీసిన వెన్న కంటికి చాలా మంచిది. త్రిఫలాలు, అభ్రకభస్మం, స్వర్ణమాక్షీక భాస్మాలను తేనెతో కలిపి తీసుకుంటే అన్ని రకాల నేత్రాభిష్యందాలూ తగ్గుతాయి. బాహ్యప్రయోగంగా ఆయుర్వేదంలో సేకం, ఆశ్చ్యోతనం, పుటపాకం, తర్పణం, అంజనం అనే క్రియాకల్పాలను చెప్పారు. వీటిని అవసరానుసారం చేయాల్సి ఉంటుంది.

గృహచికిత్సలు: 1. ఆవు నెయ్యికి (రెండు చెంచాలు) పంచదారను (చెంచాడు) చేర్చి రోజుకు మూడుసార్లు తీసుకోవాలి. 2. త్రిఫలాకషాయాన్ని అరకప్పు మోతాదుగా పాలతో కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. 3. వెలిగారం (బొరాక్స్) లేదా పటిక (ఆలమ్) ను వేడి నీటితో కరిగించి కాంతిని కడగాలి. 4. మునగాకు నుంచి రసం పిండి కంట్లో డ్రాప్స్ గా వేయాలి.

ఔషధాలు: త్రిఫలాగుగ్గులు, త్రిఫలాఘృతం, అభ్రకభస్మం, స్వర్ణమాక్షీక భస్మం.

బాహ్యప్రయోగం - నేత్రబిందు

2. నేత్ర పటల గత రక్తస్రావం (సబ్ కంజెంక్టైవల్ హెమరేజ్):

కంటిపైన పలుచగా, పారదర్శకంగా పరుచుకొని ఉండే కంజంక్టైవా అనే పొర కింద భాగంలో రక్తస్రావం జరిగితే (సబ్కంజంక్టైవల్ హెమరేజ్) కళ్లు రక్తం ఒడుతున్నట్లు ఎర్రగా కనిపిస్తాయి. కంటి ఉపరితలం పైన ఏ చిన్న పాటి దెబ్బతగిలినా ఆ ప్రాంతంలో ఉండే రక్తనాళం చిట్లి రక్తం చుట్టుప్రక్కల ప్రదేశానికి విస్తరిస్తుంది. కంటిని బలంగా నలుముకుంటే కూడా ఇలా జరిగే అవకాశం ఉంది. కంటి వెలుపలి పొరల్లో పరుచుకున్న ఈ రక్తం, చర్మంలో కముకు దెబ్బల వలన ఏర్పడే నీలం రంగు మచ్చలా కాకుండా, స్వచ్చమైన ఎరుపుదనంతో టమాటా రంగులో కనిపిస్తుంది. దీనికి కారణం ఈ రక్తం బయట వాతావరణానికి దగ్గరగా ఉంటూ ఆక్సికారణం చెందటమే. దెబ్బలూ, ఒత్తిళ్లూ మొదలైనవాటివలన ఎరుపుదనం ఏర్పడితే కన్ను మామూలు స్థితికి రావడానికి కనీసం రెండు మూడు వారాలు పడుతుంది.

ఔషధాలు: త్రిఫలాగుగ్గులు, చంద్రకళారసం.

బాహ్యప్రయోగం - త్రిఫలా ఆశ్చ్యోతనం.

3. నేత్ర శోథ (ఐ ఇన్ఫ్లమేషన్):

కంటిలోపల ఇన్ ఫ్లమేషన్ (ఐరైటిస్)వల్లగాని, కంటిలోపలి ద్రవాల్లో ఒత్తిడి పెరిగిపోవడం (ఎక్యూట్ గ్లాకోమా) వల్లగాని, స్వచ్చపటలం లేక కార్నియా వ్యాధిగ్రస్తమవటం (కెరటైటిస్) వల్లగాని ఇలాంటి ఎరుపుదనం ఏర్పడుతుంది.

ఔషధాలు: త్రిఫలా గుగ్గులు, సప్తామృత లోహం.

4. ఎలర్జీవల్ల కళ్ళకలక (ఎలార్జిక్ కంజెంక్టివైటిస్):

ధూళికణాలు కంట్లో పడినప్పుడు కంట్లోని సున్నితమైన భాగాలు ప్రతిస్పందించి ఎరుపుదనాన్ని, కన్నీళ్లనూ కలిగిస్తాయి. ఇదోకరకమైన రక్షణ ఏర్పాటు. ఈ స్రావాల వలన కంటిలోని నలుసులు పల్చబడి వెలుపలకు వెళ్లిపోతాయి.

సూచనలు: ధూళి కణాలు బయటకు వెళ్లిపోకుండా కంట్లోనే ఉండిపోతే స్వచ్చమైన త్రిఫలాకషాయాన్ని కంట్లో చిమ్మిచ్చి కొట్టాలి. ఐనప్పటికీ కంట్లో నలుసు అలాగే ఉండిపోతే, ఏదన్నా సన్నటి గాజు కడ్డీని కనురెప్ప పైన ఉంచి, కనురెప్పలను చేతితో పట్టుకుని, గాజుకడ్డీ ఆధారంగా తిరగతిప్పాలి. ఇప్పుడు, నలుసు ఎక్కడుందో మీకు కనిపిస్తుంది, దీనిని స్వచ్చమైన బట్టకొసతో తొలగించాలి.

5. సంస్థాగత వ్యాధులు (సిస్టమిక్ డిసీజెస్):

నొప్పి అనేది ఇన్ఫెక్షన్ కు, ఇన్ ఫ్లమేషన్ కూ సూచన. కంట్లో నలుసులు పడటం, స్వచ్చపటలం లేక కార్నియా వ్యాధిగ్రస్తమవటం (కెరటైటిస్), కన్ను లోపలి భాగం ఇన్ ఫ్లేమ్ అవ్వడం (ఐరైటిస్), కంటిలోపల ఒత్తిడి పెరగడం (గ్లాకోమా) తదితర స్థానిక కారణాలే కాకుండా మధుమేహం, రుమటాయిడ్ ఆర్త రైటిస్, సిస్టమిక్ ల్యూపస్ ఎరితిమాటోసిస్ వంటి ఆటోఇమ్యూన్ వ్యాధుల (రక్షణ శక్తి స్వయం ప్రేరితంగా మారడం వల్ల వచ్చే వ్యాధులు) కారణంగా కంటిలో ఎరుపుదనం ఏర్పడుతుంది. ఇలాంటి సందర్భాల్లో కారణానుగుణమైన చికిత్స చేయాలి.

6. కార్నియా వాపు (కెరటైటిస్):

కంజెంక్టివైటిస్ వల్ల తాత్కాలికంగా దృష్టిలో మసగదనం ఏర్పడుతుంది. ఇది ప్రమాదకరం కాదు. అయితే కెరటైటిస్, హెర్పిస్ ఇన్ఫెక్షన్ల వల్ల ఎరుపుదనమే కాకుండా కంటి చూపు సైతం దెబ్బతినే ప్రమాదముంది.

సూచనలు: దీనికి తక్షణమే స్వర్ణభస్మం వంటి ఇమ్యూనిటీని పెంచే ఔషధాలతో చికిత్స చేయాల్సి ఉంటుంది. త్రిఫలాఘృతం రోజువారీ తీసుకుంటే వైరస్ లకు వ్యతిరేకంగా రక్షణ శక్తి పెరుగుతుంది.

7. కంటి అంతర్గత భాగాలు వ్యాధిగ్రస్తమవటం:

నేత్రాభిష్యందం (కంజెంక్టివైటిస్)లో కంటిపాప సైజులో ఏ విధమైన మార్పు ఉండదు. ఐతే, కెరటైటిస్, ఐరైటిస్ వ్యాధుల్లోనూ, కంట్లో నలక పడిన సందర్భాల్లోనూ కంటిపాప సైజు మారుతుంది. కంటిపాప ఆకృతి మారినప్పుడు సత్వరమే చికిత్సకు ఉపక్రమించాల్సి ఉంటుంది.

8. నీటి కాసులు (గ్లాకోమా):

నేత్రాభిష్యందం వంటి ఇన్ ఫ్లమేటరీ వ్యాధుల్లో కన్ను సున్నితంగా మారి ఒత్తిడిని తట్టుకోలేనట్లుగా తయారవుతుంది. అయితే గ్లాకోమా (కంటి లోపల ద్రవం సంచితమై ఒత్తిడి పెరగటం) వ్యాధిలో కన్ను గుడ్డు మొత్తం నొప్పిగా ఉంటుంది. దీనిలో క్రమంగా కంటి చూపు దెబ్బతినే అవకాశం ఉంది. ఇదే సమస్య హఠాత్తుగా సంభవిస్తే ఎక్యూట్ గ్లాకోమాగా అర్థం చేసుకోవాలి. దీనిలో నొప్పి ఎరుపుదనాలు తీవ్రస్థాయిలో ఉంటాయి. హస్త స్వేదంతోనూ, ఆశ్చ్యోతనం వంటి క్రియాకల్పాలతోనూ కంటిలో ఏర్పడిన ఒత్తిడిని తగ్గించవచ్చు.

ఔషధాలు: ప్రవాళపిష్టి, స్వర్ణమాక్షీక భస్మం, త్రిఫలా గుగ్గులు, సప్తామృత లోహం.

బాహ్యప్రయోగం - చంద్రోదయవర్తి (అంజనం).