జ్వరం పార్ట్ - 2

3. చీముతో కూడిన ఇన్ఫెక్షన్, మలేరియా తదితర సందర్భాలు జ్వరంలో కాస్తంత చలి ఉంటుంది. ఇలా కాకుండా, ఒక్కొక్కప్పుడు శరీరాన్ని కుదిపేస్తున్నట్లుగా, పళ్లు కొరుక్కునేంతగా వణుకు వస్తుంది. ఇలాంటి స్థితిని ఆయుర్వేదం 'వేపదు' అనీ, 'శైత్యం' అనీ అంటారు.

 

సాధారణంగా కాలేయంలో చీముగడ్డలు తయారైనప్పుడుకాని, లేదా శరీరంలో మరెక్కడైనా చీము తయారైనప్పుడుకాని ఇలాంటి వణుకు వస్తుంది. అలాగే మూత్రపిండాలు కాని, మూత్రాశయం కాని వ్యాధి గ్రస్తమినప్పుడు లేదా రాళ్లతో తట్టుకుపోయినప్పుడు విపరీతమైన వణుకు, జ్వరాలు ఉంటాయి.

 

ఇంతే కాకుండా, జ్వరంతో కూడిన వణుకుకు అరుదైన కారణం మరొకటి ఉంది. దానిని వైద్య పరిభాషలో 'సబ్ ఎక్యూట్ బ్యాక్టీరియల్ ఎండో కార్దియిటిస్' అంటారు. గుండెలో ఉండే కవాటాలు వ్యాధిగ్రస్తమవడం వలన ఈ స్థితి ప్రాప్తిస్తుంది.

 

మన దేశంలో జ్వరంతో కూడిన వణుకుకు సర్వ సాధారణకారణం మలేరియా. అందుకే దానిని స్థానికంగా 'చలి జ్వరం' అని కూడా అంటారు. ఆయుర్వేదంలో వర్జించిన 'విషమ జ్వరం' లక్షణాలు మలేరియాకు సరిపోతాయి. ఈ జ్వరం బైటపడే విధానం, నడిచే తీరు, ఉపశమించే పధ్ధతి అన్నీ విషమంగా ఉండటం వలన దీనిని 'విషమ జ్వర' మన్నారు.

 

గృహాచికిత్సలు: 1. ఉసిరిక వరుగు, కరక్కాయ, పిప్పళ్లు, చిత్రమూలాలను సమాన భాగాలు తీసుకొని కషాయం కాచి పూటకు కప్పు చొప్పున రెండు పూటలా తాగాలి.

2. తులసి ఆకు రసం లేదా తుమ్మి ఆకు రసంలో (నాలుగు పెద్ద చెంచాలు) చిటికెడు మిరియాల చూర్ణం కలిపి తీసుకోవాలి.

3. వెల్లుల్లిపాయను వంట నూనెతో లేదా ఆవు నెయ్యితో కలిపి ముద్దగా నూరి తీసుకోవాలి.

 

ఔషధాలు: మృత్యుంజయ రసం (జీలకర్ర, బెల్లంతో), శీతాంశు రసం (సుదర్శన చూర్నంతో), పుటపక్వ విషమ జ్వరంతక లోహం (చౌషష్టి ప్రహారి పిప్పలి చూర్ణంతో)

4. క్షయ వ్యాధి (ట్యుబర్క్యులోసిస్) సాయంత్రం పూట జ్వరం రావడం, రాత్రిపూట చమటలు పట్టడం - ఇవి క్షయ వ్యాధి ముఖ్య లక్షణాలు, దీనిని ఆయుర్వేదంలో రాజయక్ష్మ అంటారు. అనేక వ్యాధుల వల్ల వచ్చేది, అనేక వ్యాధులను కలిగించేది కాబట్టి దీనికా పేరు. జ్వరంతో పాటు దగ్గు, విరేచనాలు, పక్కటెముకల్లో నొప్పి, గొంతు బొంగురు, అరుచి, నోటి నుంచి రక్తం పడటం అనేవి క్షయ వ్యాధిలో కనిపించే ఇతర లక్షణాలు.

1. గృహ చికిత్సలు:

1. పెన్నేరు, పిప్పళ్లను సమాన భాగాలు తీసుకొని చూర్ణం చేసి పంచదార, తేనె, నెయ్యి కలిపి తీసుకోవాలి.

2. పిప్పళ్ల చూర్ణం, ద్రాక్ష, చెక్కరలను అన్నిటినీ కలిపి తీసుకోవాలి.

3. లక్షా చూర్ణాన్ని 20 గ్రాముల మోతాదుగా బూడిద గుమ్మడికాయ రసంలో ముద్దగా నూరి తీసుకుంటే రక్తం పడకుండా ఉంటుంది.

4. అడ్డరసం ఆకుల రసాన్ని తేనె అనుపానంగా తీసుకోవాలి.

 

ఔషధాలు: సితోపలాది చూర్ణం, తాలీసాది చూర్ణం, చ్యవన ప్రాశ లేహ్యం, రాజ మృగాంక రసం, మహాలక్షీ విలాస రసం.

5.బ్రూసెల్లోసిస్ పాలను గేదెల నుంచి, ఆవుల నుంచి సేకరించి, పాశ్చరైజ్ చేయకుండా నేరుగా వాడే వారికి 'బ్రూసెల్లోసిన్; అనే వ్యాధి వచ్చేందుకు అవకాశం ఉంది, అలాగే వెటర్నరీ డాక్టర్ల కు పశు వధశాలల్లో పనిచేసే వారికి, పశువుల మీద ప్రయోగాలు చేసే సైంటిస్టులకు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. జ్వరంతోపాటు చమటలు పట్టడం, నిస్త్రాణ, తలనొప్పి, ఆకలి లేకపోవడం, కాళ్ళు చేతులు తాగుతుండటం నడుము నొప్పి మలబద్ధకం వణుకు దగ్గు గొంతు నొప్పి, కీళ్ల నొప్పులు - ఇవన్నీ ఈ వ్యాధి లక్షణాలు.

ఔషధాలు: గంధక రసాయనం, వ్యాధి హరణ రసాయనం.


6. ఆహారం విషతుల్యమవడం (ఫుడ్ పాయిజనింగ్) క్రీమి కీటకాలు, సూక్ష్మక్రీములు, రసాయన పదార్థాలు, వివిధ రకాల లోహపు పాత్రలు ఇవన్నీ ఆహారాన్ని విషతుల్యంగా, మార్చగలవని గ్రహించాలి. ఆహారం విషయుక్తమైనప్పుడు సాధారణంగా జ్వరంతోపాటు వాంతులు, విరేచనాలు మొదలైన అనుబంధ లక్షణాలు కూడా ఉంటాయి.

గృహచికిత్సలు: 1. మారేడు గుజ్జు చూర్ణాన్ని (అరచెంచా) బెల్లంతో కలిపి తీసుకోవాలి.

2. మారేడు గుజ్జు (అరచెంచా), మామిడి జీడి (అరచెంచా) వీటిని కషాయం కాచి తేనె, చెక్కరలు కలిపి తీసుకోవాలి.

3. శొంఠి, అతివాస, తుంగ గడ్డలు, నేల వేము, తిప్పతీగ, కొడిశపాల బెరడు ఈ అయిదు పదార్ధాలను కలిపి కషాయంగా కాచి తాగాలి.

ఔషధాలు: కర్పూర వటి, సంజీవని వటి, దాడిమాష్టక చూర్ణం.

 

7. మూత్ర కోశపు ఇన్ఫెక్షన్ (సిస్ట్రెటిస్) మూత్ర విసర్జన మంటగా ఉండటమే కాకుండా, మాటిమాటికి వెళ్లాల్సి రావటం అనే రెండు లక్షణాలు జ్వరంతో కూడి కనిపిస్తుంటే మూత్రాశయానికి ఇన్ఫెక్షన్ వచ్చిందేమో చూడాలి. ఇన్ఫెక్షన్ ఎగువకు ప్రసరించి మూత్ర పిండాలను కూడా వ్యాధి గ్రస్తం చేస్తే అప్పుడు పై లక్షణాలతో పాటు వణుకు కూడా ఉంటుంది.

గృహచికిత్సలు: 1చిన్న ఏలకుల చూర్ణాన్ని (2 గ్రా.) అరటి కాండం రసంలో (30 మి.లీ) కలిపి తీసుకోవాలి.

2. బూడిద గుమ్మడి కాయ రసం (40 మో.లీ), యవక్షారం (1గ్రా.), చెక్కర (10గ్రా.) అన్నీ తీసుకోవాలి.

3. పల్లేరు మొక్కను సమూలంగా తెచ్చి కషాయం కాచి పూటకు రెండు కప్పుల వంతున చెక్కర, తేనె కలిపి తాగాలి.

4 ఏలకులు (1గ్రా), కొండపిండి వేళ్లు (1గ్రా.) శిలాజిత్తు (1గ్రా) వీటి చూర్ణాలను అన్నిటిని కలిపి బియ్యపు కడుగు నీళ్లతో తీసుకోవాలి.

ఔషధాలు: చంద్ర ప్రభావటి, ప్రవాళ భస్మం, తారకేశ్వర రసం, ఏలాది చూర్ణం, శుద్ధ శిలాజిత్తు

 

8. పిడకామయ జ్వరాలు (ఎరప్టివ్ ఫీవర్స్) జ్వరంతో పాటు శరీరం కమలటం లేదా దద్దుర్లు కనిపించడం జరిగింటే పిడకాయమ జ్వరంగా (ఎరప్టివ్ ఫీవర్స్) బావించాల్సి ఉంటుంది. ఇందుకు కొన్ని రకాల వైరస్ లు కారణం. ఆయుర్వేదంలో గవద బిళ్లల (మంప్స్)ను 'కర్ణమూలిక' జ్వరం అనీ, అమ్మవారిని (స్మాల్ పాక్స్) 'బృహన్మ సూరిక' అని, ఆటలమ్మ (చికెన్ పాక్స్)ను 'లఘు మసూరిక' అనీ, పొంగు (మీజిల్స్)ను 'రోమాన్తిక' అనీ అంటారు.

గృహచికిత్సలు: 1. చింతాకు పొడిని (3 గ్రా.) చన్నీళ్లతో రోజుకు మూడుసార్లు తీసుకోవాలి.

2. రేగు ఆకులకాషాయం(60 మి.లీ) రోజుకి రెండు మార్లు తాగాలి.

3. తులసి ఆకు రసం (రెండు చెంచాలు చొప్పున) రెండు పూటలా తాగాలి. ఔషధాలు: గోదన్తీ మిశ్రణం, త్రిభువన కీర్తి రసం.

9. కిడ్నీలు, ఎముకల్లోని మూలుగ వ్యాధిగ్రస్తమవటం మూత్రపిండాల వ్యాధులలోగాని, ఎముకలోపల మూలుగ వ్యాధిగ్రస్తమైనప్పుడుగాని నడుము నొప్పి , జ్వరం మొదలైనవి వచ్చే అవకాశం ఉంది. ఔషధాలు: చంద్రప్రభావటి, లక్షాది గుగ్గులు.

 

10. . ఉదరావయవాలు వ్యాధిగ్రస్తమవటం: గాల్ బ్లాడర్, పేగులు, ఎపెండిక్స్ - వీటిల్లో ఏది వ్యాధిగ్రస్తమైణ కడుపు నొప్పితోపాటు జ్వరం ప్రధానంగా కనిపిస్తుంది. ఔషధాలు: మహా గంధకం, స్వర్ణ పర్పటి, పంచామృత పర్పటి.

 

11. గ్రంథుల వాపు: గ్రంథులు వాచినప్పుడు జ్వరం కనిపిస్తుంది. అనేక కారణాల వల్ల గ్రంథుల్లో వాపు కనపడుతుంది. వాటిలో ఇన్ఫెక్షన్ ఒక ముఖ్యమైన కారణం. ఉదాహరణకు మెడలో ఉండే గ్రంథులనే తీసుకుందాం. టాన్సిల్స్ వ్యాధిగ్రస్తమైనప్పుడుగాని, చెవులు వ్యాధి గ్రస్తమైనప్పుడు గాని, తలలో పేలు, చుండ్రు మొదలైనవి చిరాకు పెడుతున్నప్పుడుగాని క్షయ వంటి వ్యాధులు శరీరంలో బలపడుతున్నప్పుడు కాని ఈ గ్రంథులు వాస్తాయి. అలాగే, కాలుకు దెబ్బ తగిలినప్పుడు కూడా గజ్జలలోఉండే లసీకా గ్రంథుల్లో వాపు కనిపించడం చాలా మందికి అనుభవమయ్యే ఉంటుంది. దీనికంతా ఇన్ఫెక్షన్ ఎగువకు వెళ్లనివ్వకుండా చేసే రక్షణ వ్యవస్థగా భావించాలి.

 

ఒక్కొక్కసారి బ్రూసెల్లోసిస్, ఎయిడ్స్ వంటి వ్యాధులలో ఫలానా చోట అని కాకుండా, మొత్తం శరీరమంతా అన్ని గ్రంథులు వాపునకు గురవుతాయి.

 

ఔషధాలు: అపామార్గ క్షారం, కాంచనార గుగ్గులు, చంద్రప్రభావటి, ఖదిరాది వటి.

 

12. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ (న్యూమోనియా) ఊపిరిత్తుతులకు సంబంధించిన అన్ని వ్యాధుల్లోను జ్వరం కొద్దో, గొప్పో ఉంటుంది, ఈ వ్యాధుల్లో దగ్గు, ఆయాసం అనేవి ప్రధాన లక్షణాలుగా ఉంటాయి. గృహచికిత్సలు: 1. పిప్పళ్లను (1గ్రా.) కషాయంగా తీసుకోవాలి.

2. తుంగ ముస్తలు, శొంఠి, నేలవేములను సమానంగా తీసుకొని, కషాయం కాచి పూటకు కప్పు వంతున మూడు పూటలా తాగాలి.

ఔషధాలు: తాళీసాది చూర్ణం, స్వర్ణ సమీర పన్నగ రసం, త్రిభువన కీర్తి రసం, లక్ష్మీ విలాస రసం.

 

13. సబ్ ఎక్యూట్ బ్యాక్టీరియల్ ఎండో కార్డియిటిస్ గుండె కవాటాలు వ్యాదిగ్రస్తమై, 'సబ్ ఏక్యూట్ బ్యాక్టీరియల్ ఎండో కార్డయిటిస్' ప్రాప్తించినప్పుడు జ్వరం వస్తుంది, ఈ వ్యాధిలో రక్తపు ఫలకాలు తయారై గోళ్ల క్రింద చేరి చారికల్లా కనిపిస్తాయి.

 

ఔషధాలు: కస్తూర్యాది గుటిక, ప్రభాకర వటి, ధన్వంతర గుటిక, శృంగ భస్మం, రసరాజ రసం.

 

14. అభిఘాతాలు/ దెబ్బలు దెబ్బల వల్ల గాయాలై వాటి ద్వారా ఇన్ఫెక్షన్ శరీరంలోకి ప్రవేశించి జ్వరాన్ని కలిగించడం గురించి అందరికీ తెలిసిందే, ఇలా కాకుండా ఒక్కొక్కసారి ఏ ఇన్ఫెక్షన్ లేకుండా కూడా దెబ్బల వలన జ్వరం వస్తుంది. దీనిని ఆయుర్వేదం 'అభిఘాతజ' జ్వరం అంటుంది. దెబ్బల వల్ల పుట్టిన అదురుకు శరీరంలో కణజాలాల నుంచి రసాయన పదార్థాలు విడుదలై జ్వరాన్ని కలిగిస్తాయి. శారీరక క్రియలను వేగవంతం చేయడానికే ఇలాంటి ఏర్పాటు.

ఔషధాలు: పునర్నవాది గుగ్గులు, మహా వాత విధ్వంసినీ రసం. బాహ్యాప్రయోగాలు మర్మగుటిక, సురదారు లేపం.

 

15. అమవాతం (రుమటాయిడ్ ఆర్తరైటిస్) శరీరపు రక్షణ వ్యవస్థ లోపభూయిష్టంగా తయారైనప్పుడు కణజాలాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలవుతుంది. రుమటాయిడ్ ఆర్తరైటిస్ లో ఇదే జరుగుతుంది. ఫలితంగా కీళ్ల నొప్పులతోపాటు అంతులేని బడలిక, జ్వరం, కీళ్ల వాపులు మొదలైన లక్షణాలు ఉత్పన్నమవుతాయి.

ఔషధాలు: మహా యోగరాజు గుగ్గులు, స్వర్ణ వాత రాక్షసం, వాత గజాంకుశ రసం, సింహనాద గుగ్గులు, మహా రాస్నాది క్వాథం, బాహ్యాప్రయోగాలు - మహా నారాయణ తైలం, విషముష్టి తైలం.

 

16. క్యాన్సర్: కొన్ని రకాల క్యాన్సర్లు ముందుగా ఎటువంటి లక్షణాలను ప్రదర్శించకుండా, కేవలం జ్వరంతో మొదలయ్యేందుకు అవకాశం ఉంది. ఇటువంటి అవకాశాలను అన్నిటిని దృష్టిలో పెట్టుకొని అకారణంగా వస్తున్నట్లు కనిపించే జ్వరాన్ని సమగ్రంగా శోధించాల్సి ఉంటుంది.

ఔషధాలు: భాల్లాతక వటి, వజ్రభస్మం, పీయూషవల్లి రసం, కాంకాయక వటి (గుల్మ).

 

జ్వరాన్ని తగ్గించుకోవడమెలా?

ఆయుర్వేద శాస్త్రంలో జ్వరోపచర్యలను కారణాన్ని అనుసరించి సూచించారు. ఇలాంటి వాటిని 'హేతు విపరీత చర్యలు' అంటారు. జ్వర ప్రతిచర్యల ఫలితాలు అనేక విషయాలు మీద ఆధారపడి ఉంటాయి. ఆయా వ్యక్తుల తాలూకు ప్రాంతీయత (దేశం), శరీరంలో ఉండే దోష ప్రాబల్యం (దూష్యం), శారీరక శక్తి సామర్ధ్యాలు (బలం), రుతువుల ప్రభావం (కాలం), జీర్ణశక్తి (అనలం), శరీరపు తీరు తెన్నులు (దేహప్రకృతి), వయసు - వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని చికిత్సను రూపొందించాల్సి ఉంటుంది. అంతేకాక, సామాన్య కారణాలను అనుసరించి చేయాల్సిన సాధారణ చికిత్సలను కూడా చేయాల్సి ఉంటుంది. అసంఖ్యాకంగా ఉన్న ఇటువంటి ఔషధ చికిత్సలనుంచి జనసామాన్యానికి అందుబాటులో ఉండే కొన్నింటిని ఇక్కడ పొందుపరుస్తున్నాను.

 

తేలికపాటి ఆహారం తీసుకోవాలి: జ్వరం కనిపించడానికి ముందు ప్రతివారికి సూచన ప్రాయంగా దాని లక్షణాలు అనుభవమవుతుంటాయి. అలాంటి వాటిని 'పూర్వరూపాలు' అంటారు. తలనొప్పి, ఒళ్లు నొప్పులు, నాలుక మందంగా తయారవడం, బడలిక మొదలైన వాటిని పూర్వ రూపాలుగా భావించాలి. దీనికి 'లఘ్వశనం' సరైన చికిత్స. లఘువుగా లేదా తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడమే లఘ్వశనం జ్వర ప్రాదుర్భావం అమాశయం నుంచి మొదలవుతుంది. కాబట్టి జ్వరంలో ఆకలిమీద మొదటి వేటు పడుతుంది. అందుకే జ్వరంలో తీసుకునే ప్రతి చర్యా ఆకలిని రక్షించే విధంగా, లేదా వీలైతే పెంచే విధంగా ఉండాలి, లఘు భోజనం అందుకు ఉపకరిస్తుంది. లంఘన చికిత్సలో లఘు భోజనంతోపాటు ఆహారం తేలికగా జీర్ణమవడం కోసం పాచన ఔషధాలను కూడా ప్రయోగించాల్సి ఉంటుంది.

 

వేడినీళ్లు తాగాలి: జ్వరంలో ఉష్ణ జల పానాన్ని ఆయుర్వేదం ప్రముఖంగా చెప్పింది, ముఖ్యంగా కొత్తగా వచ్చిన జ్వరాన్ని తగ్గించడంలో వేడినీళ్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. వేడినీళ్ల వలన ఆకలి పెరుగుతుంది. బద్ధకం, బడలిక తదితరాలు దూరమవుతాయి. వేడినీళ్లను ఎలాపడితే అలా తాగకూడదు, దీనికొక పధ్ధతి ఉంది. నీళ్లను శుభ్రమైన పాత్రలో తీసుకొని సగం మిగిలే వరకు మరిగించి తాగాలి. ఒకసారి కాచిన నీళ్లను మళ్లీమళ్లీ మరిగించి తాగకూడదు.

 

షడంగ పానీయం: జ్వరంలో ఈ పానీయం అద్భుతంగా పనిచేస్తుంది. తుంగ ముస్తలు, పర్పాటకం, వట్టి వెళ్లు, చందనం, కురువేరు, శొంఠి ఈ ద్రవ్యాలను షడంగాలంటారు. ఇవి దినుసులు అమ్మే దుకాణాలలో లభ్యమవుతాయి. ఈ ద్రవ్యాలను అన్నిటిని సమాన భాగాలుగా తీసుకుని వాటిని 64 రెట్లు నీళ్లు పోసి సగభాగం మిగిలే వరకు కాచాలి. తరువాత మూత పెట్టి చల్లార్చాలి. దీనిని వడపోసుకుని ఏ పూటకాపూట తాగితే చక్కని ఫలితం కనిపిస్తుంది. దీని వలన మూత్రం జారీ అవడమే కాకుండా చమట పట్టి జ్వరం ఉపశమిస్తుంది. ఈ పానీయానికి శొంఠి కలిపితే జీర్ణ శక్తి మెరుగవుతుంది.

 

జ్వరంలో జావ తాగడం మంచిది: మీరు తినే ఆహారం బియ్యం, గోధుమలు, జొన్నలు... ఇటువంటిది ఏదైనా కానీయండి, దీనిని రవ్వలాగా మరపట్టించి, దోరగా వేయించి, నీళ్లతో కలిపి జావలాగా చేసుకొని తాగితే తేలికగా జీర్ణమవుతుంది. అయుర్వేదం ఇటువంటి ఆహారాన్ని 'యవాగు' అంటుంది. వేయించడం వలన దానిని జీర్ణం చేసుకోవడానికి అదనపు జీర్ణశక్తిని వెచ్చించాల్సిన అవసరం రాదు. అలాగె, ద్రవయుక్తంగా ఉంటుంది కనుక దప్పికను తీరుస్తుంది. వేడిగా ఉంటుంది కనుక చమటను పుట్టించి జ్వరం దిగేలా చేస్తుంది. మరీ నీళ్లు మాదిరిగా కాకుండా ఘనాహారంతో కలిసి ఉంటుంది. కనుక శరీరానికి బలాన్నీ, శక్తినీ ఇస్తుంది. అలాగే మలాన్నీ, వాయువును బహిర్గత పరుస్తుంది. యవాగులో రుచికోసం కొద్దిగా శొంఠిని, సైంధవ లవణాన్ని చేర్చి తీసుకోవచ్చు. వీటి వలన దీని గుణాలు ద్విగుణీకృతమవుతాయి.

 

ఫలరసాలు: జ్వరంతో ఒళ్లు వేడిగా తయారైనప్పుడు శరీరం చల్లబడటం కోసం చమట పుడుతుంది. ఇలా మరీ ఎక్కువసేపు జరిగితే శరీరం లోపల మిగిలి ఉన్న నీటిని కాపాడుకోవడం కోసం స్వేదరంధ్రాలు మూసుకుపోతాయి. దీనితో జ్వరం మరింత పెరిగిపోయే అవకాశం ఉంది. ఇలా జరగకుండా ఉండాలంటే సమృద్ధిగా ద్రవాహారాలను, పండ్లరసాలను తీసుకోవాలి. ఒకవేళ ఫలరసాలను తీసుకోవడం వెగటుగా అనిపిస్తే కాస్త ఇస్ ను చేర్చి తీసుకోవచ్చు, పిల్లలు పండ్లరసాలను తీసుకోకుండా మారాం చేస్తుంటే, వాటిని డీప్ ఫ్రిజ్ లో గడ్డకట్టించి, 'ఇస్ ఫ్రూట్' లాగా చేసి ఇవ్వవచ్చు.

 

శీతలోపచారాలు: జ్వరం 103 డిగ్రీల ఫారిన్ హీట్ ను మించుతున్నప్పుడు శీతలోపచారాలు చేపట్టడం ముఖ్యం. తడి బట్టనుకాని, స్పాంజ్ ను గాని నీళ్లలో ముంచి గట్టిగా పిండి వళ్లంతా తుడవాలి. చంకలు, గజ్జలు మొదలైన భాగాలలో వేడి కేంద్రీకృతమై ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాలను ప్రత్యేక శ్రద్ధతో తుడవాలి.

 

దుప్పట్లను అవసరానుసారం వాడాలి: జ్వరంగా ఉన్నంత మాత్రాన దుప్పటి కప్పుకోకూడదు. కేవలం చలిగా ఉన్నప్పుడు మాత్రం కప్పుకుంటే సరిపోతుంది. ఒళ్లు జ్వరంతో కాలిపోతున్నప్పుడు దుప్పటిని తొలగించడం, చలికి వణికిపోతున్నప్పుడు కప్పుకోవడం మార్చి మార్చి చేస్తుంటే త్వరగా జ్వరం నుంచి సాంత్వన లభిస్తుంది.

 

జ్వర చికిత్స: జ్వరాన్ని తగ్గించే ఔషధాలలో కొన్ని ఉష్నోత్పాదక కేంద్రం గరిష్ట స్థాయిని తగ్గిస్తే మరికొన్ని జ్వర కారకాలపై దాడి చేస్తాయి. కొన్ని ఔషధాలు దోషాలను పాచనం చేస్తే మరికొన్ని స్వేదాన్ని అధికం చేయడం ద్వారా జ్వరాన్ని తగ్గిస్తాయి. మరికొన్ని ఔషధాలు కేవలం తమ ప్రభావం చేతనే జ్వరాన్ని తగ్గించగలుగుతాయి. ఉదాహరణకు వత్సనాభి, కర్పూరం, తులసి, మద్యం, పర్పాటకం, చేదు పోట్ల, తిప్పతీగ, ఇవన్నీ మస్తిష్కంలోని ఉష్ణోత్పాదక కేంద్రంమీద పనిచేసి జ్వరాన్ని తగ్గిస్తాయి.

 

బాష్పస్వేదం, దూపనం, పెన్నేరుగడ్డ, చేదుబాదం, పోక, ఉమ్మెత్త, జిల్లేడు, అటుకుమామిడి, ఉలవలు, వేడినీళ్లు, ఇవన్నీ స్వేదాన్ని పుట్టించడం ద్వారా జ్వరాన్ని తగ్గించగలుగుతాము. తాళకం, క్వినైన్, మల్లసింధూరం వంటి ఔషధాలు కీటాణు నాశకాలుగా పనిచేసి సూక్ష్మజీవుల విషలక్షణాలను అరికడతాయి.

 

జ్వరాలను వివిధ రకాలుగా వర్గీకరించి వాటికి అనుగుణంగా ఔషధాలను ప్రయోగించాల్సి ఉంటుంది. సుదర్శన చూర్ణం, జ్వరభైరవ రసం, గోదన్తీ భస్మం, మృత్యుంజయ రసం వంటి అనేకానేక ఔషధాలను జ్వర హరాలుగా వాడవచ్చు. దీనికి ముందు సరైన వైద్య సలహా తీసుకుని వీటిని వాడితే చక్కని ఫలితం ఉంటుంది.