జ్వరం

1. మీరు ఇటీవల కాలంలో ఉధృతంగా వ్యాయామాలు గట్రా చేస్తున్నారా? లేదా వేడి వాతావారణంలో పనిచేస్తున్నారా? స్త్రీలైతే - బహిష్టు నెలమధ్యలో ఉన్నారా? సహజ శారీరక చర్య

2. జ్వరం, దానితో పాటు దగ్గు, జలుబు, గొంతు నొప్పులు ఉన్నాయా? శ్వాస మారపు ఇన్ఫెక్షన్

3. జ్వరమే కాకుండా చలి, వణుకు ఉన్నాయా? చీముతో కూడిన ఇన్ఫెక్షన్/ మలేరియా తదితర సందర్భాలు

4. రాత్రిపూట చమట పోస్తుంటుందా? ఆకలిగా లేకపోవడం, బరువు తగ్గడంతో పాటు దగ్గు కూడా వుందా? క్షయ వ్యాధి (ట్యుబర్క్యు లోసిస్)

5. వృత్తిపరంగా పాడి పశువుల మధ్య పనిచేస్తున్నారా? బ్రూసెల్లోసిస్

6. ఏదైనా పదార్ధాన్ని తిన్న తరువాత జ్వరం మొదలైందా? ఆహారం విషతుల్యమవటం (ఫుడ్ పాయిజనింగ్)

7. జ్వరంతో పాటు మూత్ర విసర్జన మంటగా ఉండటమే కాకుండా, మాటిమాటికి వెళ్లాల్సి వస్తుందా? మూత్ర కోశపు ఇన్ఫెక్షన్ (సిస్ట్రెటిస్)

8. శరీరం కమిలిండా? లేదా, దద్దుర్లు ఏవైనా లేచాయా? పిడకామయ జ్వరాలు (ఎరాప్టివ్ ఫీవర్స్)

9. జ్వరంతో పాటు నడుము నొప్పి కూడా ఉందా? కిడ్నీలు, ఎముకల్లోని మూలుగ వ్యాధిగ్రస్తమవటం

10. జ్వరంతో పాటు కడుపు నొప్పి కూడా ఉందా? ఉదరావయవాలు వ్యాధి గ్రస్తమవటం

11. జ్వరంతోపాటు గ్రంథులు వాచాయా? గ్రంథుల వాపు

12. జ్వరమే కాకుండా దగ్గు, ఆయాసం ఉన్నాయా? ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ (న్యుమోనియా)

13. చేతి గోళ్ల కింద చారికలు కనిపిస్తున్నాయా? సబ్ ఎక్యూబ్ బ్యాక్టీరియల్ ఎండో కార్డయిటిస్

14. దెబ్బలు తగిలిన తరువాత జ్వరం వచ్చిందా? అభిఘాతాలు/దెబ్బలు

15. జ్వరంతో పాటు కీళ్ళనొప్పులు కూడా ఉన్నాయా? అమవాతం (రుమటాయిడ్ ఆర్త రైటిస్)

16. జ్వరంతోపాటు బరువు తగ్గడం, నీరసం, గ్రంథుల వాపు మొదలైన లక్షణాలున్నాయా?

 

క్యాన్సర్

ఆయుర్వేద వైద్య శాస్త్రకారులు జ్వరానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. జ్వరాన్ని ఒక లక్షణంగానే కాకుండా ఒక వ్యాధిగా, ఒక అవస్థగా ఇలా వివిధ రకాలుగా వివరించారు.

పునరావృతాన్ని బట్టి నిరంతరమూ జ్వరము వస్తుంటే సంతత జ్వరమనీ, రోజు విడిచి రోజు వస్తుంటే తృతీయ జ్వరమనీ, రెండు రోజులకు ఒకసారి (ప్రతి నాలుగవ రోజు) వస్తుంటే చాతుర్ధక జ్వరమనీ అంటారు.

 

శరీరానికి తగిలిన దెబ్బలను ఆధారం చేసుకొని వచ్చే జ్వరాన్ని 'అభిఘాతజ్వరం' అంటారు.

చికిత్సా సౌలభ్యం కోసం ఇలా వివిధ రకాలుగా జ్వరాన్ని వివరించారు. చరక సంహిత విమానస్థానంలో అగ్ని వేశుడు ఆత్రేయుడిని, “ఒక మనిషి ఉన్నట్లు మరొక మనిషి ఉండడు. వ్యక్తుల మధ్య దేహ ప్రకృతిలోను, ఆహారపు అలవాట్లలోను, రూపురేఖలలోనూ, శక్తి యుక్తుల్లోనూ, వయసులోనూ, వ్యత్యాసాలుంటాయి. దీనికి భిన్నంగా కొన్ని సందర్భాల్లో అందరికీ ఒకే మాదిరి జ్వారాలు, వ్యాధులు వస్తుంటాయి. ఇదెలా సాధ్యం?” అని అడుగుతాడు.

 

దీనికి ఆత్రేయుడు ఇచ్చిన వివరణ అత్యంత ప్రామాణికమైనది. “వ్యక్తులు వేరైనా వారందరి మీద నాలుగు రకాల అంశాలు తమ ప్రభావాన్ని ఒకే విధంగా ప్రదర్శిస్తుంటాయి. అవి వాయువు, ఉదకం, దేశం , కాలం. ఇవి ఎప్పుడైతే దూషితమవుతాయో అప్పుడు వ్యాధులు ప్రబలుతాయి.”

 

ఇక్కడ వాయువు అంటే మనం పీల్చే గాలి, ఉదకం అంటే మనం ఉపయోగించే నీరు. దేశం అంటే నివసించే ప్రాంతం. కాలం అంటే శిశిర, వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత ఋతువులు. వ్యాధిని కలిగించే విషయంలో వాయువు కంటే ఉదకము, ఉదకం కంటే దేశము, దేశం కంటే కాలము, ఇలా ఒక దానికంటే మరొకటి బలీయంగా మనుషుల మీద తమ ప్రభావాన్ని చూపించి వ్యాధులు ప్రబలడానికి కారణమవుతాయని చరక సంహిత చెబుతుంది.

 

మన శరీరానికి ఉండే అద్భుతమైన శక్తి సామర్ధ్యాలలో ఉష్ణోగ్రతను నియంత్రించు కోవడమొకటి. దీనిని అర్థం చేసుకోవడానికి నీరు మీద వాతావరణపు ప్రభావాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు, నీరు అనేది సాధారణ వాతావరణంలో ద్రవంలాగా ఉంటుంది. ఇదే నీరు ఉష్ణోగ్రత తగ్గినప్పుడు ఇస్ మాదిరిగాను, ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఆవిరి మాదిరిగాను మారుతుందని మనకు తెలుసు. నీరు తన అసలైన లక్షణాలను ప్రదర్శించాలంటే ద్రవ రూపంలోనే ఉండాలి, ఇలా జరగాలంటే డానికి ఒక నిర్దిష్టమైన ఉష్ణోగ్రత కావాలి. మన శరీరము అంతే. దానిలోని రకరకాల వ్యవస్థలు నిరాటంకంగా పని చేయాలంటే ఒక నిర్దిష్టమైన ఉష్ణోగ్రతఉండాలి. అంటే శారీరక ఉష్ణోగ్రత 97.5 డిగ్రీల ఫారెన్ హీట్ నుంచి 99 డిగ్రీల ఫారెన్ హీట్ మధ్యన ఉండాలన్న మాట.

 

చాలా మంది అనుకునేటట్లు మన శరీరపు ఉష్ణోగ్రత ఎప్పుడు సరిగా 98.4 డిగ్రీల ఫారెన్ హీట్ వద్దనే నిలకడగా ఉండదు. కొద్దిగా అటూ ఇటూ మారుతుంటుంది. ఇది శారీరక క్రియలో భాగమే. ఉదాహరణకు ఉష్ణోగ్రత ఉదయం పూట తక్కువగా ఉండి సాయంత్ర మయ్యేటప్పటికి కొంచెం పెరుగుతుంది. అలాగే వృద్ధాప్యంలో యుక్త వయసులో కంటే కాస్త తక్కువగా ఉంటుంది. అంతే కాదు - పురుషుల కంటే స్త్రీలలో సాధారణ ఉష్ణోగ్రత ఒకింత తక్కువ స్థాయిలో ఉంటుంది. అయితే అండం విడుదలయిన తరువాత ఇది ఒక డిగ్రీ వరకు పెరుగుతుంది. మాంసక్రుత్తులు కలిగిన ఆహార పదార్థాలు, వ్యాయామం, మానసిక అలజడులు సైతం ఉష్ణోగ్రతను పెంచుతాయి. వాతావరణ ప్రభావం సరేసరి; ఇతరత్రా ఆరోగ్యంగా ఉన్న వారిలో అకారణంగా శారీరక ఉష్ణోగ్రతలో మార్పు కనిపిస్తే ముందుగా వాతావరణ ప్రభావాన్ని గురించి ఆలోచించాలి.

 

అయితే ఈ మర్పంతా ఒక పరిధికి లోబడి మాత్రమే ఉంటుందని గమనించాలి. ఒకవేళ ఈ పరిధికి మించి ఉష్ణోగ్రత పెరిగితే అలాంటి స్థితిని జ్వరం అంటారు.

 

జ్వర తీవ్రతను కొలిచే విధానం

పూర్వకాలంలో థర్మామీటర్ కనుగొనక ముందు వైద్యులు రోగి నుదురు మీద తమ చేతి వెనుక భాగాన్ని ఆనించి చర్మపు వేడిమిని అంచనా కట్టేవారు. అయితే అందరి చర్మాలు ఒకే విధమైన వేడిమిని ప్రదర్శించకపోతే వలన ఈ విధానం మీద ఆధారపడటం కష్టమయ్యేది. ఆ తరువాత కాలంలో థర్మామీటర్ రూపకల్పనతో ఈ సమస్య తీరినట్లయింది.

 

సాంక్లోరియస్ మొదటిసారిగా వైద్య సంబంధమైన ఉష్ణమావిని (థర్మామీటర్) రూపొందించారు. ఫారెన్ హీట్ అనే శాస్త్రవేత్త పాదరసాన్ని ఆధారం చేసుకొని పనిచేసే థర్మామీటరును రూపొందించినప్పటికి దానిని వైద్య రంగంలో విస్తృతంగా వినియోగానికి తెచ్చిన ఘనత మాత్రం అతని సహాధ్యాయుడు హార్మన్ కు దక్కుతుంది.

 

శారీరక ఉష్ణోగ్రతను సాధారణంగా మూడు పద్ధతుల ద్వారా చూస్తుంటారు. నోటి ద్వారా చూడటం మొదటి పధ్ధతి. చంకలో, లేదా గజ్జలో థర్మా మీటర్ను ఉంచి చూడటం రెండవ పద్ధతి. మల ద్వారంలో థర్మామీటరు బల్బ్ ను చొప్పించి చూడటం మూడవ పద్ధతి. ఈ మూడు పద్ధతుల్లో నోటి ద్వారా ఉష్ణోగ్రతను చూసే పద్ధతి ఎక్కువగా ఆమోదయోగ్యమైనది. అయితే చిన్న పిల్లలలో నోటి ద్వారా కంటే థర్మామీటర్ చంకలోనో, గజ్జలోనో ఉంచి చూడటమే శ్రేయస్కరం. ఒక్కొక్కసారి కలరా వంటి వ్యాధులలో శరీరంలోపల జ్వరం ఉన్నా చర్మం దానిని ప్రదర్శించదు. అటువంటి సందర్భాల్లో మలద్వారం నుంచి ఉష్ణోగ్రతను నమోదు చేయాల్సి ఉంటుంది. నిజానికి శారీరక ఉష్ణోగ్రతను యథాతథంగా తెలియచేసేది ఈ పద్ధతే. ఇటీవల కాలంలో ఎలక్ట్రానిక్ డిజిటల్ థర్మామీటర్లు, పట్టీ మాదిరిగా ఉండే స్ట్రిప్ థర్మామీటర్లు వస్తున్నాయి. వినియోగానికి ఇవి అనువుగా ఉన్నా జ్వరతీవ్రతను యథాతథంగా కొలవడానికి పాదరసపు థర్మామీటర్ కంటే ఉత్తమమైనది మరొకటి లేదనే చెప్పాలి. శరీరపు వేడిమిని మరింత నిర్దిష్టంగా కొలవడానికి థర్మోకపుల్ అనే సాధనం ఉపయోగపడుతుంది. అయితే సాధారణ సందర్భాల్లో దీనిని వాడరు.

 

థర్మామీటర్ ఎలా వాడాలి?

జ్వర తీవ్రతను కొలవడానికి థర్మామీటర్ సరైన సాధనం. ప్రతి ఇంటిలోనూ ఉండాల్సిన ముఖ్యమైన వస్తు విది. అలాగే ప్రతివారూ దీనిని ఉపయోగించే పద్ధతిని తెలుసుకోవాలి.

 

థర్మామీటర్ ఉపయోగించబోయే ముందు పాదరసం ఉన్నవైపు కాకుండా రెండవ చివర పట్టుకొని స్థిరంగా దులిపితే పాదరసం బల్బు లోనికి దిగుతుంది . (పరుపు పరిచిన మంచం పైన దులిపితే ప్రమాదవశాత్తు పడిపోయినా పగలకుండా ఉంటుంది) ఆహారం తీసుకున్న తరువాత కాని, వేడి పానీయాలు తాగిన తరువాత కాని, ధూమపానం చేసిన తరువాత కాని థర్మామీటర్ ను ఉపయోగించకూడదు. కనీసం అరగంట పాటు ఆగాలి. నోరు తెరిచి నాలుకను బైటకు చాస్తే నాలుక కింద సంచుల వంటి ఖాళీలు కనిపిస్తాయి. థర్మా మీటర్ బల్బును వాటిలో ఒక దానిలో ఉంచి, దంతాలతో నొక్కకుండా పెదవులను మూసీ కనీసం 3 నిమిషాలు ఉంచాలి. ఈ సమయంలో నోటితో కాకుండా ముక్కుతో గాలి పీల్చాలి. ఒకవేళ థర్మామీటర్ పొరపాటున నోటిలో పగిలితే కంగారు పడాల్సిన పనిలేదు; నోటిలో అల్సర్లు లేనంత వరకు పాదరసం వలన ప్రమాదం జరుగదు. ఏదేమైనా వైద్య సహాయం మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. థర్మామీటరును వడిన తరువాత చల్లని సబ్బునీళ్లతో కడిగితే సరిపోతుంది. దీనికోసం వేడి నీళ్లను ఉపయోగించకూడదు.

 

ఉష్ణోగ్రత నియంత్రణ

శరీరంలో వేడిమి ఏ స్థాయిలో తయారవుతుంటుందో, అదే స్థాయిలో ఖర్చవుతుంటే శరీరపు ఉష్ణోగ్రత నియంత్రణలో ఉన్నట్లు లెక్క. అలా కాకుండా తయ్యారయ్యే వేడిమికి పొంతన లేకుండా ఉంటే శరీరపు ఉష్ణోగ్రత పెరగడం కాని, లేదా తగ్గటం కాని జరుగుతుంది.

 

ఇదెలా జరుగుతుందో తెలుసుకోవడానికి విద్యుత్ తో పని చేసే ఆటోమాటిక్ ఇస్త్రీ పెట్టే ఒక చక్కని ఉదాహరణ. ఇస్త్రీ పెట్టే ప్లగ్ పెట్టిన తరువాత చేరుకోవలసిన వేడికి చేరుకోగానే దానంతట అదే ఆఫ్ అయిపోతుంది. వేడి తగ్గగానే మళ్ళీ ఆన్ అవుతుంది. దాదాపు ఇటువంటి ఉష్ణోగ్రత నియంత్రణే మన మెదడులో ఉంటుంది. హైపోథాలమస్ అనే భాగం శరీరపు సంకేతాలను ఆధారం చేసుకుని ప్రతిగా స్పందిస్తుంది. దీనితో శరీరంలో అవసరానుసారం శరీరపు ఉష్ణోగ్రత పెరగడం కాని, తగ్గడం కాని జరుగుతుంది. వాతావరణపు ఉష్ణోగ్రత బాగా తగ్గినప్పుడు లేదా శరీరపు వేడిమి తగ్గే సందర్భాలు ఉత్పన్నమైనప్పుడు మన చర్మం లోనికి వెళ్ళనివ్వకుండా నిరోధిస్తాయి. దీనితోపాటు శరీరంలో కొన్ని రకాల హార్మోన్లు విడుదలై జీవన క్రియలను వేగవంతం చేసి వేడిని పుట్టిస్తాయి. అంతేకాకుండా కండరాల సంకోచ వ్యాకోచాల ద్వారా కూడా వేడి పుడుతుంది. ఇదిలా ఉండగా శరీరంలో వేడి తగ్గాల్సిన సందర్భం వచ్చినప్పుడు సరిగ్గా పై చర్యలకు వ్యతిరేకంగా జరుగుతుంది.

 

జ్వరంలో ఉష్ణోగ్రత ఎందుకు పెరుగుతుంది?

జ్వరంలో ఉష్ణోగ్రత ఎందుకు పెరుగుతుందో ఇంకా ఎవరికీ పూర్తిగా తెలియదు. అయినప్పటికీ వైద్య అధ్యయనకారులు చేస్తున్న కొన్ని ప్రతిపాదనలు సంతృప్తికరమైన వివరణలనే ఇస్తున్నాయి.

సూక్ష్మక్రిములు, గాయాలు, దెబ్బలు తదితర హానికరాంశాల కారణంగా శరీరంలో పైరోజన్లు అనే ప్రోటీన్లు విడుదలవుతాయి. ఇవి ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థ గరిష్ట పరిమితిని ఒకటి రెండు మెట్లు పైకి జరుపుతాయి. అంటే ఇస్త్రీ పెట్టెలో నైలాన్ మీద ఉన్న నాబ్ ను కాటన్ మీదకు తిప్పి తద్వారా వేడిమి స్థాయిని పెంచడం లాంటిదన్న మాట.

 

జ్వరం వలన శరీరపు పనితీరు వేగ వంతమవుతుంది. రక్తపోటు కొద్దిగా పెరుగుతుంది. నాడి వేగం కూడా పెరుగుతుంది. గుండె వడివడిగా స్పందిస్తుంది. శ్వాస సైతం వేగవంతమవుతుంది. ఈ చర్యలన్నిటివల్లా శరీరంలో పేరుకుపోయిన పైరోజన్లు బైటకు విసర్జితమవడానికి ఆస్కారమేర్పడుతుంది. ఈ పని పూర్తయిన తరువాత జ్వరం తగ్గుముఖం పడుతుంది.

 

జ్వరంలో వణుకు ఎందుకు వస్తుంది?

జ్వరంతో ఒళ్ళు కాలిపోతున్నప్పుడు చలి వణుకులు ఎందుకు వస్తాయనే సందేహం కొంతమందికి కలుగుతుంది. జ్వరంలో సాధారణ ఉష్ణోగ్రత స్థాయి 98.4 కు బదులు 103 డిగ్రీలకు పెరిగిందనుకుందాం. ఈ ఉష్ణోగ్రతకు చేరుకోవడానికి శరీరంలో ఉష్ణోగ్రతను పెంచే వ్యవస్థలు చైతన్య వంతమవుతాయి. వాటిలో వణుకు ఒకటి. కండరాల సంకోచ వ్యాకోచాల వల్ల ఉష్ణోగ్రత జనిస్తుంది.ఎప్పుడైతే ఈ ఉష్ణోగ్రత అత్యధిక స్థాయిని చేరుకుంటుందో అప్పుడు వణుకు ఆగిపోతుంది.

 

వైద్య పరంగా ఆలోచిస్తే జ్వరాన్ని మనకు సహాయపడే లక్షణంగానే అర్థం చేసుకోవాలి. 'సర్వరోగాగ్రజం' అని చరక సంహిత జ్వరాన్ని గురించి వ్యాఖ్యానించడంలోలోని అర్థమేమిటంటే దీనిని ఒక సంకేతంగా తీసుకుని కారణాలను విస్తృతంగా శోధించాలని. ఒకవేళ జ్వరం 105 డిగ్రీలను మించితే అప్పుడు కారణమేదైనా జ్వరాన్ని తగ్గించడమే ప్రధాన లక్ష్యమవ్వాలి. ఎందుకంటే ఇంత ఉష్ణోగ్రతలో మెదడులోని కణజాలలు, శరీరంలోని ఎంజైములు నిర్వీర్యమైపోయి మరణం అనివార్యమవుతుంది. ఈ కారణం చేతనే చరకసంహిత జ్వరానికి 'మృత్యు' అనే పర్యాయ పదాన్ని వాడింది.

 

జ్వరంలో ప్రమాద సంకేతాలు

జ్వరం ఉన్నప్పుడు హైరానా పడటం, అశ్రద్ధ చేయడం రెండు మంచి పద్ధతులు కావు. జ్వర ప్రతికూల పరిస్థితులను గమనించడానికి ఈ దిగువ అంశాలు తోడ్పడుతాయి.

 

నాలుగు నెలలలోపు పసిపిల్లల్లో జ్వరం కనిపించడం (ఈ వయస్సులో ఉష్ణోగ్రత ఎంత అనేది ముఖ్య కాదు. పెరిగిందా లేదా అనేది ముఖ్యం); జ్వరంతో పాటు మెడ కండరాలు బిగదీసుకుపోవడం; జ్వరం 105 డిగ్రీల ఫారిన్ హీట్ మించడం; జ్వరం అయిదు రోజులకు మించి కొనసాగడం.

 

జ్వరాన్ని కలిగించే కారణాలు

ఆయుర్వేద దృక్పథం ప్రకారం శరీరపు వేడిమి (దేహోష్మ) అనేది అంతర్గత కణజాలాలలో ఉండే పిత్త ధాతువు నుంచి జనిస్తుంది. ఇది రక్త ధాతువు ద్వారా మొత్తం శరీరానికి సరఫరా అవుతుంది.

 

పేగులలో ఉండే పాచకపిత్తం, కణజలాలలో ఉండే ధాత్వగ్నులు కలిసి దేహోష్మకు కారణమవుతాయి. ఇది వ్యత్యస్తమైనప్పుడు జ్వరం పుడుతుంది.

 

జ్వరమనేది అంతర్గత కారణాలకు వ్యక్త లక్షణం కాబట్టి జ్వరానికి చికిత్స చేసేటప్పుడు దాని విస్తృతమైన కారణాల మీద దృష్టి సారించాల్సి ఉంటుంది. అప్పుడది లాక్షణిక చికిత్సగా కాకుండా, కారణానుగణమైన చికిత్సగా పరిపూర్ణతను సంతరించుకుంటుంది.

 

1. సహజ శారీరక చర్య:

శరీరపు క్రియలో భాగంగా, సాధారణ ఉష్ణోగ్రత కొన్ని కొన్ని సందర్భాల్లో కాస్తంత పెరగడం సహజం. వేడి నీళ్లతో స్నానం చేసిన తరువాత గాని, లేదా వేడి వాతావరణంలో గడిపిన తరువాత కాని ఇలా జరుగుతుంది. అలాగే స్త్రీలలో అండం విడుదలైన మరునాడు సాధారణ ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతుంది.

 

ఇస్ క్రీములు, వేడి పానీయాలు తీసుకున్న తరువాత నోటి ద్వారా ఉష్ణోగ్రత నమోదు చేస్తే దానిలో మార్పులు కనిపిస్తాయి. ఈ సందర్భాలన్నీ సహజమైనవి కనుక వీటికి ప్రత్యేకించి తీసుకోవలసిన చర్యలేమీ ఉండవు.

2. శ్వాస మార్గపు ఇన్ఫెక్షన్

ఇన్ఫెక్షన్ అనేది జ్వరానికి సర్వ సాధారణమైన కారణం. సూక్ష్మక్రిములు - అవి వైరస్ లు కానివ్వండి, బ్యాక్టీరియా కానివ్వండి, ఫంగై కానివ్వండి ;లేదా పరాన్న జీవులు కానివ్వండి ఇవన్నీ ఇన్ఫెక్షన్ ను, తద్వారా జ్వరాన్ని కలిగించే అవకాశం ఉంది.

 

ఆయుర్వేదంలో ఇలాంటి కారణాలతో వచ్చే జ్వరాలను 'భూతాభిషంగ' జ్వరాలంటారు. ఇటువంటి వాటిని ఆయా లక్షణాలను బట్టి, వివిధ రకాల పరీక్షలను బట్టి నిర్ధారణ చేసి చికిత్స చేయాల్సి ఉంటుంది.