"ఆ భయం నాకు లేదు లెండి. ఈ కాలం ఆడపిల్లలు అంత వెర్రివాళ్ళు కాదని నాకు తెలుసు, మీకు తెలియకపోయినా! ఏమిటలా నిలబడిపోయారు? వెళ్ళి స్నానం చేసిరండి. అక్కయ్యగారూ, ముందు కాస్త కాఫీ ఇస్తారా! రైల్లో వెధవ కాఫీ తాగబుద్ధి వేయలేదు." తనే చొరవగా అడిగింది.
    తోడికోడలు తేరుకుని "..... ఆ ..... కాఫీ కలుపుతాను" అంటూ వెళ్ళిపోయింది.
    అత్తగారి మొహం మాడింది. ప్రభాకర్ ఏం మాట్లాడాలో తెలియనివాడిలా కుర్చీలో కూర్చుండిపోయాడు.
    విద్య పెట్టె తీసి ప్రభాకర్ బట్టలు తీసి, సబ్బు అది అతని చేతిలో పెట్టి "వెళ్ళండి, స్నానం చేసిరండి. మీకు కాఫీ బాధలేదుగా!" మొగుడు మీద తనకెంత చనువు, అధికారం వున్నాయో చూపించి వాళ్ళని ఉడుక్కునేటట్టు చేయడం విద్య ఉద్దేశం.
    అత్తగారు మొహం ముడుచుకుని వంటింట్లోకి వెళ్ళిపోవడం చూసి లోలోపల నవ్వుకుంది. ఆవిడ వెనకాలే చనువుగా వంట ఇంట్లోకి వెళ్ళింది. "ఏం టిఫిను చేస్తున్నారు ఇవాళ? దోసెలా..... ఆయనకి చాలా ఇష్టం. కొడుకు వస్తున్నాడని చేస్తున్నారా! కూర చెయ్యండి దోసెలకి. లేకపోతే ఆయన తినరు. అక్కయ్యగారూ, నేను స్నానం చేసి వచ్చి దోసెలు వేస్తాను. నే చేస్తే హోటలు మసాలా దోసెలా వుందంటారు ఆయన."    
    అత్తగారు, పెద్దకోడలు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు విద్య ధోరణికి. ఏదో నాటకం చూస్తున్నట్టు వింతగా వుంది వాళ్ళకి. విద్యలో ఈ మార్పు వాళ్ళు ఆశించలేదేమో, విద్య ప్రవర్తన ఇలా ఉంటుందని వాళ్ళెదురు చూడలేదేమో - నాటకంలో పాత్రలు డైలాగులు మర్చిపోయినట్టు తడబడ్తున్నారు.
    విద్య చనువుగా దోసెలు వేసింది. తరువాత కూర, అది తరిగి వంటింట్లో సాయం చేసింది.
    "నీకెందుకులే అమ్మా, మా ఇంట్లో పనులు చేయడం! నీవెళ్ళి కూర్చో" అంది అత్తగారు.
    "ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటే తప్పేం వుందండి? నాకేం రాదనుకున్నారా? కిందటి మాటంటే కాలేజీలు, చదువుల గొడవలో నేర్చుకోలేదు. ఈ ఆరునెలల్లో అమ్మ నన్ను తిట్టి, వంట రాకపోతే ఎలా అంటూ అన్నీ నేర్పింది" అంది, ఇదీ నా ఇల్లే అని తెలపాలని.
    భోజనాలు అయి ఎవరిగదుల్లోకి వాళ్ళు వెళ్ళారు.
    "మా అమ్మా వాళ్ళు నీలో మార్పుకి ఆశ్చర్యపోతున్నారు ఈ కోడలికి ఇంత బుద్ధి ఎలా వచ్చిందని మతులుపోయినట్లున్నాయి వాళ్ళకి -" ప్రభాకర్ గదిలో అన్నాడు.     
    "ఏం..... నేనేం దెయ్యాన్నీ, రాక్షసిని కాదు - మనిషిని మనిషిలా చూడగలిగితే ఏ సమస్యలూ ఉండవని తెలియచెప్పడానికి ప్రయత్నిస్తున్నాను." అంది విద్య నవ్వి.
    "ఏమో - కిందటిసారికి ఈసారికి నీలో చాలా మార్పు....."
    "కావాలని తెచ్చుకుని, ఓ ఛాన్సు ఇచ్చి చూద్దామని వచ్చాను. ఈసారి నన్ను, నా వాళ్ళని ఏమన్నా అననీండి  - అమర్యాదగా మాట్లాడనీండి. ఈసారి నాలో దెయ్యం మోలుకొంటుంది."   
    "సరే...... సరే బాబూ, ఊరుకో! మళ్ళీ గొడవలు మొదలుపెట్టకు -" భయంగా అన్నాడు.
    విద్య ఓ కునుకు తీసి లేచేసరికి మూడు గంటలవుతోంది. బద్దకంగా పక్కమీద పడుకున్న విద్యకి పక్కగదిలోంచి సన్నగా మాటలు వినిపించాయి. అది ప్రభాకర్ గొంతు.
    "లేదమ్మా..... నిజంగా విద్య చాలా మారిపోయింది. లేకపోతే పొగరు వేషాలు వేస్తే నేదగ్గిరకు రానిచ్చేవాడినా?"     
    ఏమోరా! అదేదో పెద్ద ప్లానుతో వచ్చినట్టు కనిపిస్తోంది నాకు - లేకపోతే ఒక్కసారి ఇంత మార్పా? "నిన్నో చవటని చేసి ఆడించాలని ఏదో ఎత్తుతో వచ్చినట్టే ఉంది."
    "ఆ..... నేనేం అంత చవటననానీ ఉద్దేశం? నిజంగానే విద్య మారిందమ్మా-"
    "ఏమో నాయనా - నీ ఇష్టం. నీ పెళ్ళాం, నీ కాపురం! మాకేం పోయింది? నెత్తి నెక్కించి ఆడించుకో మాకేం?" ఆవిడ మాటల్లో కొడుకు కూడా పెళ్ళాం పక్షం మాట్లాడేసరికి అసూయ ధ్వనించింది.
    "ఏమిటమ్మా! విద్య చ్చిందని నీకేం సంతోషంగా లేదా? తను మారిపోయిందిగా, మళ్ళీ ఎందుకు గొడవలు?" కాస్త విసుగ్గా అన్నాడు.
    "అమ్మో, నాకేం బాధనాయినా? మీరు మీరు హాయిగా ఉంటే మాకెందుకు బాధ బాబూ. కన్నకడుపు కనుక వుండబట్టలేక అన్నాను. అయినా పెళ్ళాం బెల్లం కాని మొగాడెవడులే!" అంది తరువాత మాటలు వినబడలేదు.
    'ఫరవాలేదు! ప్రభాకర్ ఆ మాత్రం తన పక్షం మాట్లాడాడు చాలు' అనుకుంది విద్య.
    మధ్యాహ్నం టీ తాగుతుండగా "అత్తయ్యగారూ..... మీరు మాకేమన్నా ఇంటికి కావాల్సిన సామాను ఇస్తారా? ఇంట్లో బొత్తిగా ఏం లేవు. ఫ్రిజ్, ఓ బీరువా, మంచాలు, ఓ డైనింగ్ టేబుల్ అవీ కావాలి. మీరేం ఇచ్చేది చెబితే మిగతావి మేం కొనుక్కుంటాం. బొత్తిగా ఇంట్లో అసలు ఏం లేకుండా కాపురం ఎలా? ఫ్రెండ్సు వాళ్ళు వస్తే కూర్చోపెట్టడానికి కుర్చీలన్నా లేవు. గిన్నెలవీ కూడా కావాలి. మీరు సామాన్లు ఇస్తానంటే లారీ మాట్లాడతారు" అంది.
    అత్తగారు తెల్లబోతూ "మేం ఎందుకిస్తాం? నీ పుట్టింటివాళ్ళిస్తే తెచ్చుకో. కాదంటే నీ మొగుణ్ణి కొనమను. నీ కాపురానికి కావల్సినవి మేం ఇవ్వడం ఏమిటి?" అని కాస్త దురుసుగా అంది.
    "అబ్బే..... మా ఇంట్లో అన్నీ బోలెడున్నాయి. మళ్ళీ ఎందుకు కొనడం అని ఆయన అంటే, మీరిస్తారు కాబోలు అనుకున్నాను. మా అమ్మ మాకు కావల్సిన సామాన్లకి డబ్బిచ్చిందనుకోండి. కానీ ఈయన మిమ్మల్ని అడగాలి, మా ఇంట్లో అన్నీ వున్నాయి  అన్నారు ఇదివరకు. అంటే మళ్ళీ ఉన్నవే కొనడం ఎందుకు మీరిచ్చినవి చూసి మిగతావి కొందామనుకున్నాను" గడుసుగా అంది. అత్తగారు ధుమధుమలాడుతూ కొడుకు వైపు చూసింది. ప్రభాకర్ మొహం కళ తప్పింది.   
    "ఏరా..... సామానిస్తానన్నానా నీకు? బాగుంది నాయనా...... ఇటు ఆడపిల్లలకి కాపురాలకి కావాల్సినవి ఇచ్చి, అటు కోడళ్ళు తెచ్చుకోవాల్సింది కూడా మేం ఇవ్వాలా?" వ్యంగ్యంగా అంది. ప్రభాకర్ మొహం నల్లబడింది.  
    "ఎవరూ ఇవ్వనక్కరలేదు. నా ఇంటికి కావాల్సినవి నేను కొనుక్కోగలను" అని విసురుగా లేచి వెళ్ళిపోయాడు.
    రాత్రి "అమ్మని ఎందుకు సామాన్లు అడిగావు? మనకేం కావాలో చెబితే ఒక్కొక్కటి కొనేవాడిని గదా?" కోపంగా అడిగాడు విద్యని.     
    "బాగుంది...... నాకేం తెలుసు! ఇన్నాళ్ళూ ఎన్నిసార్లడిగినా మా వాళ్ళని అడగాలి. మా ఇంట్లో వున్నాయి. అవి వున్నాయి అంటే వాళ్ళిస్తారు కాబోలు మన కాపురానికి కావల్సినవి అనుకున్నాను." విద్య గడుసుగా అంటించింది.
    "మా అమ్మ కొంత డబ్బిచ్చింది. ముందుగా ముఖ్యమైనవి కొందాం. తరువాత మీరు ఒక్కొక్కటి కొందురుగాని" లాలనగా అంది. "చూశారా..... మీవాళ్ళూ మీ వాళ్ళూ అని ఇన్నాళ్ళూ వాళ్ళకోసం కట్టుకున్న పెళ్ళాన్ని కాలదన్నారు. మీ సంసారానికి కావల్సినవి అమర్చుకోడానికి కూడా వాళ్ళ పర్మిషన్ కావాలి. పెళ్ళాన్ని అవమానం చేశారు. ఇప్పటికన్నా తెల్సిందా - ఎవరంతటి వాళ్ళు వాళ్ళయ్యాక తల్లి అయినా, కొడుకయినా, కూతురయినా పెళ్ళయ్యాక ఎవరి సంసారం వాళ్ళు చూసుకోవాలి. కన్న వాళ్ళు కట్టుకున్న భార్యో భర్తో వచ్చేవరకే ఆదుకుంటారు. ఒక్కసారి పెళ్ళవగానే రెక్కలొచ్చిన పక్షులని పక్షులుగూట్లోంచి తరిమేస్తాయి. మనుషులు గనక మమకారాలుండవచ్చుగాని ఎవరి గొడవ వాళ్ళు చూసుకోమని వదిలేస్తాడు. కష్టం, సుఖంలో తోడు నీడయ్యేది భార్యకి భర్త, భర్తకి భార్య. కాని అమ్మా నాన్నాకాదు వయసువచ్చాక ఏం..... ఇప్పటికన్నా అర్థం అయిందా?" విద్య లాలనగా అతని జుట్టుసవరిస్తూ అంది.       
    విద్య వెళ్ళిన నెలా పదిహేనురోజుల తరువాత వచ్చిన ఉత్తరాన్ని ఆరాటంగా అందుకుని విప్పింది నిర్మల.
    "ఆంటీ..... థాంక్స్ - మీ సలహాని అమలులో పెట్టాను. మీరు చెప్పింది నిజమేననిపిస్తూంది. ఆయనలో మార్పు వచ్చింది. కొట్టొచ్చినట్టు తెలిసే మార్పు వచ్చింది. నాలో మార్పుకి సంతోషించి కొంత, మళ్ళీ గొడవ అయితే నేను వెళ్ళిపోతానేమోనన్న భయం కొంత. మొత్తానికి ఆయన మారారు..... మారుతున్నారు. తొంభై శాతం నేకోరుకున్న మార్పు వచ్చింది. ఇంకో పదిశాతం కొద్ది రోజులలో సాధించగలనన్న నమ్మకం కల్గుతుంది. మనిషి స్వతహాగా కాస్త షార్ట్ టెంపర్డ్. ఓర్మి, సహనం తక్కువ. దానికి తోడు పెంపకం పాడు చేసింది. ఇప్పుడిప్పుడే దారికి వస్తున్నారు. థాంక్స్ ఆంటీ..... నా ఆవేశానికి, అహంకారానికి అర్థం లేదని చెప్పి, పక్కదారిలో వెళ్ళి ఏదో సాధించగలననే నా అజ్ఞానాన్ని సరిదిద్ది, 'పక్కదారంటా వెడితే ఆ దారి ఎటు పోతుందో తెలియదు, తెలియని దారిని ఎన్నుకుంటే అవస్థపాలవుతావు, నీ గమ్యం చేరలేవు' అని బోధపరిచి, చేయిపట్టి, సరయిన దారికి మళ్ళించిన మీకు నేను ఎలా కృతజ్ఞతలు చూపగలను?! థాంక్స్ ఆంటీ..... నేను సంతోషంగానే ఉన్నాను. ఇప్పుడిప్పుడే ఆయన్ని ప్రేమించడం నేర్చుకుంటున్నాను. ఆయన నన్ను పూర్తిగా నమ్మారు. ఆయన జీవితానికి నేను తోడు నీడ అయి నిలుస్తానన్న నమ్మకం ఆయనకి కలిగిస్తున్నాను. త్వరలో ఆయన్ని తీసుకువస్తాను ఆంటీ...... థాంక్స్ ఆంటీ!"    
    విద్య ఉత్తరం చదువుతుంటే నిర్మల కళ్ళు ఆనందంతో నిండాయి.

                                         -----: సమాప్తం :-----