తల నొప్పి - పార్ట్ 2
మందుల దుష్ఫలితాలు:
మందుల వలన కూడా తలనొప్పి రావచ్చు. ఉదాహరణకు గుండె నొప్పిలో వాడే మందులు గుండెలోని రక్తనాళాలను వ్యాకోచపరచడానికి ఉపకరించినప్పటికీ తలలోని రక్తనాళాలను కూడా వ్యాకోచపరిచే తలనొప్పికి కారణమవుతాయి. ఇది చాలా తీవ్రాతీతీవ్రంగా ఉంటుంది. ఇవే కాకుండా యాంటీబయాటిక్స్, యాంటీ డిప్రెసెంట్స్, హార్మోన్లు. మత్తును కలిగించే మందులు, నొప్పుల బిళ్లలూ... ఇవన్నీ తలనొప్పిని కలిగించే అవకాశం ఉంది. మీరు వాడుతున్న మందుల వల్లనే మీకు తలనొప్పి వస్తున్నట్లుగా అనిపిస్తే మీ డాక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్ళండి.
మెదడులో కణితి (బ్రెయిన్ ట్యూమర్):
తీవ్రమైన తలనొప్పి నిరంతర లక్షణంగా కొనసాగుతుంటే బాధితుల సాధారణంగా బ్రెయిన్ ట్యూమరని ఆందోళన పడుతుంటారు. అయితే ఇది అంత సాధారణం మాత్రం కాదు. మెదడులో కణితి పెరుగుతున్నప్పుడు తలనొప్పి వచ్చే మాట వాస్తవమైనప్పటికీ దానికి కొన్ని నిర్దిష్టమైన లక్షణాలుంటాయి: తలనొప్పి మందంగా ఉంటుంది. సరిగ్గా ఒకచోట అంటూ కేంద్రీకృతమవదు. సమయం గడిచే కొద్ది ఎక్కువవతుంటుంది. నిద్రను చెడగొడుతుంది. శారీరక శ్రమతోనూ, బరువులు లేపడంతోనూ, దగ్గడంతోనూ, తుమ్మడంతోనూ ఎక్కువవుతుంది. అనుబంధ లక్షణాలుగా వాంతులు, ఒకరింతలు ఉంటాయి. దీనికి ప్రత్యేక పరీక్షలూ, చికిత్సలూ అవసరమవుతాయి. వైద్య సలహా తప్పనిసరి.
ఔషధాలు: వజ్రభస్మం, కాంచనారగుగ్గులు, లక్ష్మీవిలాస రసం (నారదీయ), భల్లాతకవటి, చిత్రాకాదివటి, క్రౌంచపాకం.
రక్తపోటు పెరగడం (హై - బిపి/హైపర్ టెన్షన్):
రక్తపోటు ఎక్కువగా ఉన్నప్పుడు తలనొప్పి వుండవచ్చు. తలనొప్పి వచ్చినప్పుడల్లా చాలామంది పేషెంట్లు బీపీ చూడమని అడుగుతుంటారుగాని నిజానికి రక్తపోటు మరీ తీవ్రంగా ఉంటే తప్ప తలనొప్పి రాదు. ఒకవేళ మీ తలనొప్పికి హై - బీపీనే కారణమైతే బరువు తగ్గించుకోవడం, ఆహారాన్ని సరిదిద్దుకోవడం, సరైన మందులను వాడటం ద్వారా దీనిని తగ్గించుకోవచ్చు.
గృహచికిత్సలు:
1. అశ్వగంధ, తెల్లమద్ది, పల్లేరు వీటిని సమ భాగాలు తీసుకుని కషాయం కాచి కప్పు ప్రమాణంగా రోజుకు రెండుసార్లు తాగాలి. 2. సర్పగంధ (పాతాళగరుడి), జటామాంసి, కరక్కాయ పెచ్చులు వీటి చూర్ణాలను ఒక్కోదాన్ని అర గ్రాము తీసుకొని అన్నిటినీ కలిపి రోజుకు రెండుసార్లు నీళ్ళతో తీసుకోవాలి. 3. మందార పువ్వును ఎండించి, చూర్ణంచేసి మూడు పూటలా పూటకు అరచెంచాడు వంతున తీసుకువాలి. 4. జటామాంసి (నాలుగు భాగాలు), అశ్వగంధ (రెండు భాగాలు), కురసానివాము (ఒక భాగం) అన్నిటినీ దంచి కషాయం కాచి రాత్రి పడుకునే ముందు అరకప్పు మోతదుగా పుచ్చుకోవాలి. 5. వెల్లుల్లి (6 భాగాలు), తులసి ఆకులు (2 భాగాలు) జాపత్రి చూర్ణం (6 భాగాలు) వీటిని రెక్టిఫైడ్ స్పిరిట్ లో రెండు రోజులుంచి వడకట్టి రెండు పూటలా పూటకు ఐదారు చుక్కలు నీటిలో కలిపి తాగాలి.
ఔషధాలు: ఆరోగ్యవర్ధీనీ వటి, చంద్రప్రభావటి, బృహద్వాత చింతామణి రసం, త్రిఫలా గుగ్గులు, గోమూత్రశిలాజిత్తు.
సలహాలు:
1. తలనొప్పికి సంబంధించి ఆయుర్వేద చికిత్సలు వివిధ కారణాలను ఆధారం చేసుకుని వివిధ రకాలుగా ఉంటాయి. అయితే, అన్ని రకాల తలనొప్పులలోనూ సాధారణంగా అణుతైలంను వాడచ్చు. దీనిని నస్యకర్మలోభాగంగా, ముక్కులో డ్రాప్స్ గా వాడాల్సి ఉంటుంది. దీనిని సరిగ్గా పీల్చగలిగితే ముక్కుకు ఇరుపక్కలా ఉండే సైనస్ లలోని అడ్డు తొలగిపోయి నాసామార్గం తేటగా తయారవుతుంది.
2. కఫ ప్రధానమైన తలనొప్పులతో లక్ష్మీవిలాసరస అనే మందు చాలా ఉపయుక్తమైనది. వాత ప్రధానమైన తలనొప్పిని గోదంతీభస్మ, శృంగి భస్మ అనే మందులతో తగ్గించవచ్చు. పిత్త ప్రధానమైన తలనొప్పిలో సూతశేఖర రసం ప్రధానమైనది. దీనిని పాలమీగడ, పంచదారలతో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది.
3. తీవ్రమైన తలనొప్పులలో శిరోవస్తి, శిరోధార వంటి ప్రత్యేకమైన చికిత్సలు చేయాల్సి ఉంటుంది.
4. తలనొప్పిని తగ్గించుకోవడానికి మీకై మీరు షాపునుండినేరుగా నొప్పి బిళ్లలను కొని వాడకండి. వాటిని విశృంఖలంగా వాడితే తలనొప్పి తగ్గకపోగా మరింత ఎక్కువయ్యే అవకాశాలున్నాయి.
5. వ్యాయామం ఒత్తిడిని తగ్గించడానికి తోడ్పడుతుంది. టెన్షన్ తలనొప్పులలో దీనిని ప్రయత్నించవచ్చు. అయితే ఈ సూచన మైగ్రేన్ తలనొప్పికి వర్తించదు.
6. ధూమపానం తలనొప్పిని పురిగొల్లుపుతుంది కనుక ఒకవేళ మీకు సిగరెట్లు తాగే అలవాటుంటే దానిని మానేయక తప్పదు.
7. సరైన నిద్ర చాలా రకాలైన తలనొప్పులను తగ్గించగలుతుంది. అయితే ఈ నిద్ర కూడా నిర్ణీత స్థాయిలోనే ఉండాలి; కునికిపాట్లు మైగ్రేన్ ను పురిగొల్పుతాయని వెల్లడయింది.
8. పడుకునేటప్పుడు సాధ్యమైనంతవరకు వెల్లకిలా పడుకోండి. బోర్లాపడుకున్నా. మునగదీసుకుని పడుకున్నా మెడ కండరాలు బిగదీసుకుపోయి తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎప్పుడూ తలను ఒకే దిశలో ఉంచి పనిచేయకండి. నిటారుగా నిలబడటం అలవరచుకోండి. రెస్ట్ లెస్ గా కాకుండా కుదురుగా కూర్చోండి.
9. కొంతమందికి చల్లటి ఉపచారాల చేత తలనొప్పి నుంచి రిలీఫ్ లభిస్తే మరికొందరికి వేడి కాపడాలు ఉపకరిస్తాయి. తలనొప్పి రక్తనాళాల వ్యాకోచం చేత, సంకోచం చేత – ఈ రెండు రకాల కారణాలచేత జనించదానికి అవకాశం ఉండటమే ఈ వైవిధ్యానికి కారణం. మీకు ఏ ఉపశమన పద్దతి ఉపకరిస్తుందో దానిని ఆచరించండి.
10. సినిమా హాళ్లలో తలనొప్పి వస్తే అది ఆక్సిజన్ పూర్తిస్థాయిలో అందకపోవడం వల్లనేనని గ్రహించాలి. హాల్లోనుంచి బయటకు వచ్చి కాసేపు బలంగా, క్రమబద్ధంగా, స్థిరంగా గాలి పీల్చుకొని వదిలితే ఉపశమనం లభిస్తుంది. మీ ఛాతీకంటే ఉదార ప్రదేశపు కండరాలు ఎక్కువగా కదిలితే మీరు బలంగా గాలి పీల్చుకున్నట్లు లెక్క.
11. చాలామంది తలనొప్పితో బాధపడుతున్నప్పుడు అసంకల్పితంగా కణతలను నొక్కుకోవడం, నుదురు ఒత్తుకోవడం చేస్తుంటారు. ఇలా చేయడం వలన తలకు హెచ్చు స్థాయిలో వేరే రక్తం కొద్దిగా అడ్డుకున్నట్లే నొప్పి తగ్గుతుంది. అయితే అంతకంటే తలకు చేరే అధిక రక్తాన్ని తగ్గించడానికీ, మెడ కండరాలను రిలాక్స్ చేయడానికీ మారాక ఉపాయం ఉంది. మెడ వెనుక ప్రాంతంలో, తల కింద భాగంలో, ఇరుపక్కలా ఉండే పల్లపు ప్రాంతంలో మీ రెండు బొటన వేళ్లతోనూ కాస్తంత ధృడంగా నొక్కి వదలండి. ఇలా మూడు నాలుగు సార్లు చేస్తే ఫలితం ఉంటుంది.
12. మితిమీరిన శబ్దాలను వినకండి. అలాగే మిరుమిట్లు గొలిపే కాంతులను చూడకండి. ఇలా చేయడాన్ని ఆయుర్వేదం 'అతియోగం' అంటుంది. సకల వ్యాధులకూ అతియోగం ఒక ప్రధాన కారణం.
13. కాఫీ, టీలకు అలవాటు పడినప్పుడు వాటిని తాగకపోతే తలనొప్పి వస్తుందని చాలామంది చెబుతుంటారు. వాటిలో ఉండే కెఫిన్ కు అలవాటు పడినప్పుడు అది నిర్ణీతమైన మోతాదులో శరీరానికి అందకపోతే రక్తనాళాలు వ్యాకోచం చెంది తలనొప్పికి ఆస్కారం ఏర్పడుతుంది. అయితే వీటి వాడకం మరీ ఎక్కువైనా తల నొప్పి వచ్చే వీలుంది. కెఫిన్ ఎక్కువైనప్పుడు రక్తనాళాలు మరీ ఎక్కువగా సంకోచం చెందటం దీనికి కారణం. దేనికైనా 'అతి' పనికిరాదని గ్రహించండి.
14. వేళపట్టున తినండి, ఇదేదో రొటీన్ గా చెప్పే సలహా కాదు. దీని వెనుక బలమైన సిద్ధాంతం ఉంది. నిర్ణీతమైన సమయంలో తినకపోతే రక్తంలోని చెక్కెర మోతాదు పడిపోతుంది. ఫలితంగా మెదడులోని రక్తనాళాలు సంకోచం చెంది తలనొప్పి వస్తుంది.
15. ఉప్పునూ, కారం మసాలాలనూ తగ్గించండి. ఒకవేళ మీకు బాబుల్ గమ్ నమిలే అలవాటుంటే దానిని మానేయండి. బబుల్ గమ్ వలన దవడ కండరాలు ఎక్కువగా బిగుసుకుపోయి తలనొప్పికి ఆస్కారం ఏర్పడుతుంది.
16. కొన్ని రెస్టారెంట్లలో ఆహార పదార్థాల రుచికోసం 'మోనోసోడియం గ్లుటామేట్' ను కలుపుతారు. కొంతమందిలో దీని వలన తీవ్రమైన తలనొప్పి వస్తుంది. అలాగే చాక్లెట్లలో కలిపే 'టైరమిన్' కు కూడా తలనొప్పిని కలిగించే నైజం ఉంది. మద్యపానం, ఐస్ క్రీమ్ లి మొదలైనవి కూడా తలనొప్పిని కలిగించగలవు కనుక వీటన్నిటినీ తగ్గించాలి.
17. ఎత్తయిన ప్రదేశాలకు వెళ్లేటప్పుడు నిమ్మజాతికి చెందినా ఫలరసాలను ఆహారంగా తీసుకోండి. వీటిలో విటమిన్ -సి ఉంటుంది. ఇది తలనొప్పులను నిరోధించగలుగుతాము.