గజ్జల్లో నొప్పి

 

1. గజ్జల్లో నొప్పితోపాటు ఒక మోస్తారు పెరుగుదలగాని ఉబ్బుగాని కనిపిస్తుందా?

గజ్జల్లో గిలక (ఇంగ్వైనల్ హెర్నియా)

2. గజ్జ ప్రదేశంలో స్పర్శించినప్పుడు స్థిరంగా ఉండే కణితి వంటి ఆకృతులు తగులుతున్నాయా?

లింఫ్ గ్రంథుల వాపు (లింఫ్ ఎడినైటిస్)

3. కాలును చాపినప్పుడు గజ్జల్లో నొప్పి వస్తుందా?

కండరాల నొప్పి (మజిల్ క్రాంప్స్)

4. దగ్గినప్పుడు, ముందుకు వంగినప్పుడు నొప్పిఎక్కువవుతుందా?

వెన్నుపూసల మధ్యనుండే డిస్క్ జారటం (స్లిప్ డిస్క్)

5. మూత్రంలో రక్తం కనిపిస్తుందా?

మూత్రపిండాల్లో రాళ్లు (కిడ్నీ స్టోన్స్)

 

చాలామంది గజ్జల్లో నొప్పి ఉన్నప్పుడు దానిని జననాంగాలకు సంబంధించియా సమస్యగా ఊహించుకుని బయటకు చెప్పుకోవటానికి బిడియపడుతూ లోలోపలే బాధ పడుతుంటారు. నిజానికి జననాంగాలకు, గజ్జల్లో నొప్పికి సంబంధం లేదు. తోడ అగ్ర భాగము, ఉదర ప్రదేశం లోని క్రింది భాగము కలిసే ప్రదేశాన్ని 'గజ్జలు' అని అంటాము. ఈ ప్రాంతంలోని నిర్మాణాలలో తలెత్తిన సమస్యల వల్ల నొప్పి వస్తుంది. గంనల్లో నొప్పికి అనేక రకాలైన అంశాలు కారణాలుగా నిలుస్తాయి కనుక వాటిని సంక్షిప్తంగా తెలుసుకుందాం.

1. గజ్జల్లో గిలక (ఇంగ్వైనల్ హెర్నియా):

గజ్జ ప్రాంతంలో నొప్పితోపాటు ఒక మోస్తారు బొడిపె వంటి ఆకృతి కనిపించినప్పుడు ఇంగ్వైనల్ హెర్నియా (గజ్జలో గిలక) గురించి ఆలోచించాలి. ఉదర ప్రదేశంలోని కండరపు గోడల్లో బలం తగ్గిపోయి పట్టుకోల్పోయినప్పుడు పేగులలో కొంత భాగం లూప్ మాదిరిగా గజ్జల్లోకి జారుతుంది. డీలా పడి, శక్తిని కిల్పోయిన ఉదరపు కండరాలు అదనంగా సాగటం వల్ల గజ్జ ప్రాంతంలో నొప్పి వస్తుంది. అంతే కాకుండా చిన్న గోళీకాయ సైజునుంచి ఒక మోస్తారు జామకాయ సైజు వరకూ 'ఉబ్బు' కనిపిస్తుంది. ఈ ఉబ్బు వల్ల సహజంగా నొప్పి లేకపోయినప్పటికీ చుట్టూ పక్కల కండరాల ఒత్తిడిని ప్రదర్శించడంతో నొప్పిగా అనిపిస్తుంది. ఒకవేళ క్రిందకు జారిన పేగు గజ్జ ప్రాంతంలోని కండరాల మధ్య ఇరుక్కుపోయి రక్త సరఫరాను కోల్పోయినట్లయితే గ్యాంగ్రిన్ గా తయారై తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. సుశృత సంహిత అనే ఆయుర్వేద గ్రంథం ఈ స్థితిని 'ఆంత్రవృద్ధి' అన్న పేరుతో చర్చించింది. హెర్నియాకు సంబంధించిన ఈ ఉబ్బు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, నిలబడినప్పుడు..... మరో మాటలో చెప్పాలంటే ఉదర ప్రదేశంలో ఒత్తిడి ఏర్పడే అన్ని సందర్భాలలోను ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. వ్యాధి లక్షణాలు కనిపించీ కనిపించడంతోనే తగిన చికిత్సను చేస్తే ఈ స్థితిని పెరగనివ్వకుండా అదుపు చేయవచ్చు.

ఔషధాలు: నిత్యానంద రసం, వృద్ధివాదికవటి, వాతారితైలం, హింగుత్రిగుణ తైలం, సైంధవాది తైలం.

2. లింఫ్ గ్రంథుల వాపు (లింఫ్ ఎడినైటిస్):

తాల్సిల్స్ వ్యాధిగ్రస్త మైనప్పుడు మెడ ప్రాంతంలో గ్రంథులు వాచినట్లుగానే కాలులోగాని, మలద్వారపు పరిసర ప్రాంతంలోగాని, ఉదర ప్రదేశంలోగాని ఇన్ఫెక్షన్ ఉంటే గజ్జలో లింఫ్ గ్రంథులు వాచీ చేతికి గట్టిగా తగులుతాయి. ఇవి ఇన్ఫెక్షన్ ను ముందుకు ప్రసరించనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నంలో తాము వాపునకు గురవుతాయి. జనసామాన్యంలో వీటిని 'అడ్డకర్రలు' అంటారు. ఇవి గోరుచుట్టు, బ్రూసెల్లోసిస్ వంటి తేలికపాటి వ్యాధులవల్లనే కాకుండా లుకీమియా, లింఫోమా వంటి గంభీరమైన కారణాల వల్ల కూడా కనిపిస్తాయి. వీటి వల్ల గజ్జల్లో నొప్పి అన్యాపదేశంగా ఉంటుంది. ఈ స్థితి కనిపిస్తున్నప్పుడు స్థానికంగా స్నేహ స్వేదాలతో పాటు ఇన్ఫెక్షన్ ను దృష్టిలో పెట్టుకుని కారణానుగుణమైన చికిత్సలను కూడా చేయాల్సి ఉంటుంది.

ఔషధాలు: అపామార్గక్షారం, కాంచనారగుగ్గులు.

బాహ్యప్రయోగం - పునర్నవాదితైలం, సప్తగుణతైలం

3. కండరాల నొప్పి (మజిల్ క్రాంప్స్):

అలవాటు లేకుండా వెడల్పైన సీటు కలిగిన ద్విచక్ర వాహనాల మీద కూర్చునప్పుడుగాని, కాళ్లను అసహజమైన రీతిలో చాచినప్పుడుగాని తొడ జాయింటులో ఉండే కండరాలు, స్నాయువులూ వాటి పరిధికి, అవధికి మించి సాగి గజ్జల్లో నొప్పిని కలిగిస్తాయి. విశ్రాంతి దీనిలో అద్భుతమైన చికిత్స. అలాగే, నొప్పి ప్రారంభావస్థలో ఐస్ ముక్కలను ఒక గుడ్డలో చుట్టి నొప్పి ఉన్న చోట ప్రయోగిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఒకటి రెండు రోజుల తరువాత కూడా నొప్పి ఉన్నట్లయితే వేడి కాపడాల వల్ల ఉపశమనం లభిస్తుంది.

ఔషధాలు: త్రైలోక్యచింతామణి రసం, వాతకులాంతక రసం (బృహత్) శోథఘ్నవటి, విష్ణుతైలం (బృహత్).

4. వెన్నుపూసల మధ్యనుండే డిస్క్ జారటం (స్లిప్ డిస్క్):

వెన్నుప్రాంతంలో డిస్కులు తొలగినప్పుడు నరాల మీద ఒత్తిడి ఏర్పడి, నొప్పిగా మారి గజ్జల్లోకి ప్రసరిస్తుంది. దీని ఫలితంగా దగ్గటం, తుమ్మటం, ముందుకు వంగి బరువును లేపడం చేసినప్పుడు నొప్పి తీవ్రస్థాయిలో వస్తుంది. ఈ తరహా నొప్పిలో బయటకు ఏ లక్షణం కనిపించకపోయినా, లోపలెక్కడో సలుపుతున్నట్లు నొప్పి వస్తూ ఉంటుంది. దీనిలో ఫలానా చోట నొప్పి ఉన్నదని చెప్పడం కష్టమవుతుంది. దీనికి ఆయుర్వేదంలో అద్భుతమైన చికిత్సలు ఉన్నాయి, స్నేహస్వేదాలను, పంచకర్మ చికిత్సలనూ చేస్తే చక్కని ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా వస్తి కర్మ. కటీ వస్తి అనే చికిత్సలను చేస్తే మొండి కేసుల్లో కూడా ఆశ్చర్యకరమైన మార్పు కనిపిస్తుంది.

గృహచికిత్సలు: 1. శొంఠి కషాయానికి (అరకప్పు) ఆముదం (రెండు చెంచాలు) కలిపి రోజుకు మూడుసార్లు తీసుకోవాలి. 2. తిప్పతీగ కషాయానికి (అరకప్పు) గుగ్గులు (అరచెంచా) కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి.

ఔషధాలు: త్రయోదశాంగగుగ్గులు, మహావాతవిధ్వంసినీ రసం, మహారాస్నాదిక్వాథం. బాహ్యప్రయోగం - మహానారాయణ తైలం.

5. మూత్రపిండాల్లో రాళ్లు (కిడ్నీ స్టోన్స్):

కిడ్నీలో రాళ్లు ఉన్న వారికి గజ్జలో నొప్పి వస్తే, రాళ్లు కదులుతుండటం గురించి ఆలోచించాల్సి ఉటుంది. కిడ్నీల నుంచి మూత్రకోశం వరకూ సాగే మూత్రనాళం (యురెటర్) లో రాయి చేరి కదులుతుంటే ఇలాంటి నొప్పి వచ్చే అవకాశం ఉంది. నొప్పి ఒకోసారి గజ్జ ప్రాంతానికే పరిమితం కాకుండా వృషణాలు, తొడలు, ఉదరప్రాంతాలలోకి వ్యాపించే అవకాశం ఉంది. కిడ్నీలో రాళ్లు తయారై కదులుతున్నప్పుడు సాధారణంగా మూత్రంలో రక్తం కలిసిపోయి కనిపిస్తుంది. ఈ వ్యాధిలో మూత్రాన్ని జారీ చేసే ఔషధాలు వాడాలి.

ఔషధాలు: చంద్రప్రభావటి, గోక్షురాది చూర్ణం, గోక్షురాది గుగ్గులు, పునర్నవాది మండూరం, శతావరి లేహ్యం, శోథారి మండూరం, సుకుమార రసాయనం, శతావరి ఘృతం, సురాక్షార కాసీస భస్మం.