పాదం నొప్పి:

 

1. పాదాలకు సరిపడే పాదరక్షలను వాడటం లేదా?

పాదరక్షలు అమరకపోవటం

2. ఉండాల్సిన దానికన్నా ఎక్కువ బరువు ఉన్నారా?

స్థూలకాయం (ఒబెసిటి)

3. పాదంలో బొటన వేలు ఒక్కటే నొప్పిగా ఉంటుందా?

గౌట్ వ్యాధి

4. ఎంతో కాలం నుంచి పాదాల్లో నొప్పి ఉంటోందా?

ఎముక పెరగటం (ఆస్టియోఫైట్స్)

5. పాదాలనొప్పితో పాటు ఇతర జాయింట్లలో కూడా నొప్పి ఉంటుందా?

కీళ్ళవ్యాధి (ఆర్తరైటిస్)

6. నడుస్తున్నప్పుడు పొడిచినట్లుగా, పదునైన నొప్పి వస్తుందా?

నరాల్లో గడ్డలు (న్యూరోమా)

7. రక్త సరఫరా సమస్యలున్నాయా?

రక్తనాళాలు బిరుసెక్కిసాగే గుణాన్ని కోల్పోవటం (ఎథిరోస్క్లీరోసిస్)

8. నడుము నొప్పి కూడా ఉందా?

ఇతర నొప్పుల ప్రభావం

 

పాదాలు మన శరీరం మొత్తాన్ని, జీవితాంతమూ మోస్తుంటాయి. జీవిత కాలంలో కొన్ని వందల వేల మైళ్లు పాదాలతో నడుస్తాము కనుక సహజంగానే మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు పాదాల్లో నొప్పి వచ్చే అవకాశం ఉంది. అలాగే స్థూలకాయం నుంచి కీళ్ల వ్యాధుల వరకూ అనేక సమస్యలు పాదాల నొప్పికి దారితీయవచ్చు. పాదాల్లో నొప్పి వస్తున్నప్పుడు వీటన్నిటినీ అన్ని కోణాల నుంచి ఆలోచించి సరైన చికిత్సను తీసుకోవడం అవసరం.

1. పాదరక్షలు అమరకపోవటం:

పాదరక్షలను బజార్లో దొరికే వాటిల్లోనుంచి అటు ఇటుగా సరిపోయే వాటిని 'ఎంచుకుంటాము' తప్పితే సరిగ్గా మన పాదాలకు సరిపోయే వాటిని బట్టలను కుట్టించుకునేట్లుగా తయారు చేయించుకోము. ఐతే, పాద రక్షల విషయంలో ఫ్యాషన్ కంటే సౌకర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. కాలి వేళ్లను లోపల కదిలించగలిగేటంత స్థలం ఉండాలి. పాదాలకు గాలి ఆడాలి. పిల్లల విషయానికి వస్తే, వారి పాదాలు పెరగడానికి అవకాశం ఉండాలి. వీలైతే ఎవరికీ సరిపోయే పాద రక్షలను వారు తయారు చేయించుకోవచ్చు.

2. స్థూలకాయం (ఒబెసిటి):

నేటి కాలంలో, మనలో ప్రతి ఇద్దరిలోనూ దాదాపు ఒకరు అధికబరువును కలిగి ఉంటున్నారు. స్థూలకాయం ప్రభావం పాదాల మీద పడుతుంది. పాదాలను సపోర్టు చేయడానికి లింగమెంట్లు ఉంటాయి. సంవత్సరాల తరబడి స్థూలకాయంతో సతమతమయ్యే వారి పాదాల్లోని లింగమెంట్లు డీలాపడి సాగిల పడతాయి. ఫలితంగా పాదానికి ఉండాల్సిన సహజాకృతి (ఆర్చ్) దెబ్బతిని నొప్పి వస్తుంది. ఈ స్థితి ప్రాప్తించినప్పుడు పాదాల్ లింగమెంట్లను శక్తివంతం చేయడానికి మునికాళ్ల మీద లేవడం వంటి ప్రత్యేక వ్యాయామాలను చేయాలి. అలాగే, త్వరితంగా బరువు తగ్గటానికి 'లేఖనవస్తి' వంటి శక్తివంతమైన ఆయుర్వేద చికిత్సలను వైద్య పర్యవేక్షణలో తీసుకోవాలి.

గృహచికిత్సలు: 1. త్రిఫలాచూర్ణాన్ని (అరచెంచా) కషాయం కాచిగాని, తేనె కలుపుకుని గాని రోజుకు మూడుసార్లు తీసుకోవాలి. 2. ముల్లంగి రసం (మూడు చెంచాలు) రోజూ రెండు పూటలా తీసుకోవాలి. 3. త్రిఫలాచూర్ణం, త్రికటు చూర్ణం, సైంధవ లవణం అన్నీ సమతూకంగా తీసుకుని పూటకు అరచెంచాడు చొప్పున రెండు పూటలా నువ్వులనూనె (చెంచాడు) కలిపి దీర్ఘకాలం పాటు తీసుకోవాలి. 4. వాయువిడంగ చూర్ణాన్ని అరచేంచాడు మోతాదుగా తేనెతో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 5. శుద్ధి చేసిన గుగ్గిలాన్ని పూటకు అరచెంచాడు మోతాదుగా మూడు పూటలా వేడినీళ్ళతో తీసుకోవాలి.

ఔషధాలు: నవక గుగ్గులు, మేదోహర విడంగాదిలోహం, శిలాజిత్తు భస్మం, ఆరోగ్యవర్ధినీవటి, చంద్రప్రభావటి.

3. గౌట్ వ్యాధి:

పాదంలో బొటనవేలు నొప్పిగా ఉండటం అనేది వాతరక్తం అనే వ్యాధిలక్షణం. దీనిని గౌట్ వ్యాధితో పోల్చవచ్చు. ఈ వ్యాధిలో పాదం బొటనవేలు మూలస్థానంలో విపరీతమైన నొప్పి ఉంటుంది. సాక్సులను కూడా వేసుకోలేరు. నొప్పితో పాటు ఎరువుదనం, వాపులూ ఉంటాయి.పాదాలను ఎత్తి పెట్టి కూర్చోవాల్సి వస్తుంది. రక్తంలో యూరిక్ యాసిడ్ అనేది పెరగటం వల్ల ఈ స్థితి ప్రాప్తిస్తుంది. మామూలుగా ఆరోగ్యవంతులందరిలోనూ పాచనక్రియలో భాగంగా ప్రోటీన్ విచ్చినమైనప్పుడు యూరిక్ యాసిడ్ కొద్ది మొత్తాల్లో తయారవుతూనే ఉంటుంది. ఐతే, గౌట్ వ్యాధిగ్రస్తుల్లో ఈ యూరిక్ యాసిడ్ హెచ్చు మొత్తాల్లో తయారై, స్పటికాలుగా మారి, జాయింట్లను చేరి నొప్పిని కలిగిస్తుంది. గౌట్ వ్యాధి శరీరంలోని ఇతర జాయింట్లను కూడా వ్యాధిగ్రస్తం చేసే అవకాశం ఉన్నా, బొటన వేలును మాత్రం ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. దీనిని తగ్గించడానికి గుడూచి, కోకిలాక్ష, సురంజాన్ వంటి మూలికలతో తయారైన మందులను ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వ్యాధిలో ఆఃర నియమాలను పాటించడం ముఖ్యం. ఆల్కహాల్, మాంసాహారం, చిక్కుడు, బఠాణీలు, పుట్టగొడుగులు, క్యాలీఫ్లవర్, పాలకూరం చాక్లెట్స్, కోక్, టీ, కాఫీలు మానేయాలి.

ఔషధాలు: మహామంజిష్టాది క్వాథం, సిద్ధ హరితాళభస్మం, తాలసింధూరం, కైశోరగుగ్గులు, మహాయోగరాజ గుగ్గులు, చవికాసవం, శారిబాద్యాసవం, భల్లాతకవటి, గుడూచిసత్వం.

4. ఎముక పెరగటం (ఆస్టియోఫైట్స్):

కండరాలు, టెండాన్లూ ఎముకలతో కలిసే ప్రదేశాల్లోదీర్ఘకాలం నుంచి ఒత్తిడి పడుతున్నట్లయితే - శారీరక ప్రతిచర్యగా, ఆస్టియోఫైట్స్ అనే చిన్న చిన్న ఎముకల వంటి నిర్మాణాలు పెరుగుతాయి. ఇవి చుట్టు పక్కల నిర్మాణాలను చీల్చుకుని వృద్ధి చెందుతాయి కనుక మడమ ప్రాంతంలో నొప్పి వస్తుంది. ఉదయం పూట నొప్పి ఎక్కువగా ఉండి రోజు గడుస్తున్న కొద్దీ సర్దుకోవడం దీని ప్రధాన లక్షణం. అంటే, రెస్టు తర్వాత 'మొదటి అడుగులు' నొప్పిగా ఉంటాయన్న మాట.

ఔషధాలు: పంచతిక్తఘృత గుగ్గులు, క్షీరబలాతైలం (101 ఆవర్తాలు), ధన్వంతరీ తైలం (101 ఆవర్తాలు), రాస్నాదిగుగ్గులు.

బాహ్యప్రయోగాలు - హింగుత్రిగుణ తైలం, మహావిషగర్భతైలం.

5. కీళ్ళవ్యాధి (ఆర్తరైటిస్):

పాదాల్లో అనేక ఎముకలు, జాయింట్లూ ఉంటాయి కనుక శరీరంలో ఇతర జాయింట్లకు, ఎముకలకూ వచ్చే అన్ని సమస్యలూ పాదాల జాయింట్లకు వచ్చే అవకాశం ఉంది. పాదం నొప్పితో పాటు శరీరంలో ఇతర జాయింట్లలో కూడా నొప్పి ఉన్నట్లయితే సంధివాతం (ఆస్టియోరైటిస్), అమవాతం (రుమాయయిడ్ ఆర్తరైటిస్) తదితరాల గురించి ఆలోచించాలి.. సంధి వాతంలో కేవలం వాతహర చికిత్సలు (స్నేహ స్వేదాలు మొదలైనవి) సరిపోతే, అమవాతంలో కఫహర చికిత్సలు (రూక్ష స్వేదం మొదలైనవి కూడా అవసరమవుతాయి.

ఔషధాలు: క్షీరబలా తైలం (101 ఆవర్తాలు), లోహాసవం, మహారాస్నాది క్వాథ చూర్ణం, మహాయోగరాజ గుగ్గులు, పంచతిక్తగుగ్గులు, ఘృతం, రాస్నాది క్వాథ చూర్ణం, స్వర్ణ వాత రాక్షసం, త్రయోదశాంగ గుగ్గులు, వాత రాక్షసం, వాత గజాంకుశ రసం, యోగరాజ గుగ్గులు.

బాహ్యప్రయోగాలు - అమవాత తైలం, ధన్వంతర తైలం, క్షీరబలా తైలం, కుబ్జ ప్రసారిణి తైలం, మహామాష తైలం, నారాయణ తైలం, ప్రభంజన విమర్ధన తైలం, విషముష్టి తైలం.

6. నరాల్లో గడ్డలు (న్యూరోమా):

పాదాల వేళ్ల మధ్య నుండే నరాల మీద చిన్న చిన్న పెరుగుదలలు (న్యూరోమా)ఎపడితే ఈ తరహా నొప్పి వస్తుంది.

ఔషధాలు: బృహద్వాత చింతామణి రసం, మహావాత విధ్వంసినీరసం, రౌప్య భస్మం, మాణిక్యభస్మం.

7. రక్తనాళాలు బిరుసెక్కి సాగే గుణాన్ని కోల్పోవటం (ఎథిరోసస్క్లీరోసిస్):

పాదాలకు రక్తసరఫరా పూర్తి స్థాయిలో జరగకపోతే పోషక తత్వాలు కణజాలాలకు సరిగా అందవు. దీని పర్యవసానంగా పాదాల్లో నొప్పి మొదలవుతుంది. ముఖ్యంగా మధుమేహం వంటి వ్యాధుల్లో, రక్తనాళాలు బిరుసెక్కి, సంకోచవ్యాకోచాలను కోల్పోవటం వలన ఇలా జరుగుతుంది. చలి వాతావారణంలో కొంతమందికి - ముఖ్యంగా మహిళలకు - పాదాలకు రక్తసరఫరా అందక వేళ్లు 'కొంకర్లు' పోవటం, నీలంగా మారటం జరుగుతుంది, ఈ స్థితిని చక్కదిద్దటానికి ఆయుర్వేదంలో 'అభ్యంగన కర్మ'ను చేస్తారు. ఇది రక్తసరఫరాను పునరుద్ధరిస్తుంది. ఈ స్థితితో బాధపడుతున్నవారికి సిగరెట్ పొగ హాని చేస్తుంది కనుక జాగ్రత్త పడాలి. అలాగే కొవ్వు పదార్థాలు కూడా మానేయాలి.

గృహచికిత్సలు: 1. వెల్లుల్లిపాయలు (ఐదు గ్రాములు) తీసుకొని పైపొర తొలగించి లోపలి గర్భాలనుమజ్జిగలో (కప్పు) ఆరుగంటల పాటు నానేయాలి. తరువాత కడిగి పాలలో (గ్లాసు) వేసి పావుగ్లాసు పాలు మాత్రం మిగిలేంతవరకు మరిగించాలి. దీనిని వడపోసుకునిఅవసరమైతే కొద్దిగా పంచదార కలుపుకుని ప్రతిరోజూ రాత్రిపూట తాగాలి. 2. కరివేపాకును ఎండబెట్టి పొడిచేసి అన్నంలోగాని, మజ్జిగలోగాని పూటకు చెంచాడు చొప్పున ప్రతిరోజూ రెండుపూటలా తీసుకోవాలి.

ఔషధాలు: లశునాదివటి, నవకగుగ్గులు, పునర్నవాదిగుగ్గులు, మేదోహరవిడంగాది లోహం.

8. ఇతర నొప్పుల ప్రభావం:

శరీరంలో ఇతర ప్రాంతాల్లో సమస్య ఉన్నప్పుడు పాదాల్లో సైతం నొప్పిగా అనిపిస్తుంది. ఉదాహరణకు, గృద్రసీ వాతం (సయాటికా), కటిశూల (స్లిప్ డిస్క్) వంటివి ఉన్నప్పుడు సమాంతరంగా పాదాల్లో నొప్పి, తిమ్మిరి వంటివి ఉండచ్చు. ఇలాంటి సమస్యలున్నప్పుడు ప్రధాన వ్యాధికి చికిత్స తీసుకుంటే సరిపోతుంది.