"సారీ, నీ జీవితంలో వాక్యూమ్ నాకర్థం అయింది. కాని ఇది ఇండియా, ఎంత విదేశ సంస్కృతి అలవడినా యింకా ఓ ఆడ, మగ డెభై ఏళ్లున్నా యిద్దరు కలిసి ఓ యింట్లో వుంటే విచిత్రంగా చెప్పుకునే స్థాయి నుంచి యింకా దాటలేదు. ఈ పదిరోజులుగా పాలవాడు, పేపరువాడు, చాకలివాడు అంతా ఎంత వింతగా చూస్తున్నారూ గమనించావా! మనిద్దరం కల్సి వాక్ కి వెళ్తుంటే చుట్టుపక్కలవాళ్లు వింతగా చూస్తున్నారు. నా పిల్లలకీ సంగతి తెల్సి నాన్నకి ఈ వయసులో ఇదేం పని అనుకోవచ్చు"
    "చూడు.. మిగతా వాళ్ల గురించి ఈ లోకం ఏమనుకుంటుందోనన్నది నాకనవసరం. నీ పిల్లలకి మన స్నేహం గురించి చెప్పు. నీవు చెప్పలేకపోతే నే చెపుతా".
    "లోకం గురించి నీకక్కరలేకపోవచ్చు. లోకం నిన్ను పట్టించుకుంటుంది"
    "అదిసరే, ముందసలు నీకే ఇబ్బందిగా వున్నట్టుంది. పొమ్మని డైరెక్ట్ గా చెప్పలేక యిలా చెప్తున్నావా" ఆమె గొంతులో బాధ. ఆమె చూపులు తప్పించుకుని
    "అలా అనకు, నీవెంత వంటరితనం అనుభవించి ఈ నిర్ణయానికి వచ్చావో అర్థం అయింది. కానీ ఓ పక్క ఇలాంటి మన దేశంలో అలవాటులేక ఇద్దరం అపహాస్యం పాలవుతామేమోనని భయం. సరే ఆలోచిద్దాం! అందుకు కాస్త సమయం పడ్తుంది. అర్థం చేసుకో!"
    "సరేలేవయ్యా బాబూ! ఏదో నన్ను పెళ్లి చేసుకోమన్నట్టూ, ఆస్థిపాస్థులలో భాగం అడిగినట్లో బెంబేలు పడుతున్నావు" తేలిగ్గా నవ్వుతూ అంది.

                                                                        *    *    *    *    *

    "నాన్నగారూ మీ ఇ-మెయిల్' చూశాం అన్నయ్యా, నాకూ సంస్కృతీ ఆంటీ కూడా అన్నీ వివరంగా పంపించారు. అన్నయ్య నేను చాలా థ్రిల్లింగ్ గా ఫీలయ్యాం" శరణ్య చాలా ఎగ్జైటింగ్ గా అంది.
    "థాంక్స్ అమ్మా! మీరేమనుకుంటారో, ఈ వయసులో ఇదేం పని అని అనుకుంటారేమోనని భయపడ్డాను. శరత్ ఏమన్నాడు" పార్థసారధి ఆరాటంగా అడిగారు. అవతల కాన్ఫరెన్స్ ఫోనులో వింటున్న శరత్ - "నాన్నగారూ.. ఈ వయసులో వంటరిగా వున్న మీకు మంచి తోడు దొరకడం అదృష్టం అంటాను. మేం ఏం అనుకుంటాం.. మమ్మల్ని అంత తక్కువ అంచనా వేయొద్దు. ఆంటీ మీ యిద్దరి గురించి ఎంత చక్కగా విపులీకరించి రాశారో, ఆవిడ సంస్కారం, భావుకత, పరిజ్ఞానం, కవిహృదయం ఆమె పంపించిన ఇ-మెయిల్ తోటే అర్థం అయింది. అంత గొప్ప స్నేహితురాలు మీకు దొరకడం మీ అదృష్టం అంటాను"    
    "కానీ శరత్, మా స్నేహాన్ని ఎంతమంది అర్థం చేసుకోగలరంటావు?"
    "అదంతా వదిలేయండి నాన్న, ఇంకొకరి గురించి మీకనవసరం. మీ భావాలు పంచుకుంటూ మనసువిప్పి మాట్లాడుకుని మీ వంటరితనంలో పాలుపంచుకునే మిత్రురాలిని వదులుకోకండి. నాన్నగారూ.. యింకో విషయం - మీరు, ఆమె కావాలంటే, లోకం జంకువుంటే, పెళ్లి చేసుకున్నా మేం సంతోషిస్తాం" శరణ్య అంది.
    "వద్దు.. వద్దు పెళ్లి అనేసరికి హక్కులు బాధ్యతలు.. ఈ వయసులో ఆ బంధాలు వద్దనుకున్నాం"
    "అయితే సరే! ఆవిడ్ని హృదయపూర్వకంగా ఇంట్లోకి ఆహ్వానించండి. మిమ్మల్ని చూడడానికోసం అయినా ఈ శలవుల్లో తప్పకుండా వస్తాం" ఇద్దరూ ఒకేసారి అన్నారు. బైబై చెపుతూ.. ఆయన ఫోనుపెట్టి వెనక్కి తిరిగేసరికి కాంతమ్మ నర్సమ్మ నిలబడి ఏదో చెప్పాలని ఆరాటపడ్డారు. "ఏమిటి కాంతమ్మగారూ ఏం కావాలి" కాస్త ఆశ్చర్యంగా అడిగారాయన. ఆవిడ కాస్త. జంకుతూ తలదించుకుని "బాబుగారూ.. మేమో మాట చెపితే ఏం అనుకోరు గదా, చూడండి బాబుగారు.. ఏణ్ణార్థం నుంచి యిక్కడ వుండి మీ మంచి చెడ్డా చూస్తూ యింట్లో మనిషిలా వున్నాను. నర్సమ్మ అయితే గత పదిహేనేళ్ల నుంచి మీ దగ్గర పనిచేస్తోంది. ఆ చనువుతో మీతో ఓ మాట చెప్పాలని..." సందేహిస్తూ ఆగింది. కొంపదీసి యిద్దరూ పనిమానేస్తాం ఆవిడ యీ యింట్లో వుంటే అంటారా అన్న భయం ఒక్క క్షణం కనిపించింది.
    "ఫరవాలేదు చెప్పండి"
    "బాబుగారూ, యింట్లో వున్నాక జరుగుతున్నవన్నీ తెలియకుండా ఉండవు. వద్దనుకున్నా కొన్ని మాటలు చెవిన పడకా పోవు. సంస్కృతి అమ్మ వచ్చిందగ్గర నుంచి ఆవిడ ఎంత మంచి మనిషో రెండు రోజుల్లోనే అర్థం అయింది. ఆవిడ ఇక్కడ వుందామన్న ఆలోచనతో వచ్చారని, మీరే నలుగురూ ఏం అంటారోనన్న భయంతో వున్నారన్నది మాకు అర్థం అయింది. బాబూ వెధవలోకం ఏమనుకుంటే మీకేం బాబూ, మీ పిల్లలూ సంతోషంగా ఒప్పుకున్నాక ఇంకా ఆలోచన వద్దు. ఇంట్లో ఆవిడుంటే ఎంతో సందడిగా వుంది. మీకు తోడు నీడగా వుంటానని వచ్చిన ఆమెని వదులుకోవద్దు బాబూ"
    "సరేలే ఆలోచిస్తున్నాను.. చూద్దాం" అంటూ గదిలోకి వెళ్లిపోయారు.

                                           *    *    *    *    *

    తెల్లారి కాంతమ్మ గాబరాగా "బాబుగారూ అమ్మగారు గదిలో లేరు. ఆమె సామాన్లు లేవు. ఇదిగో ఈ ఉత్తరం మాత్రం వుంది. కాఫీ ఇద్దామని వెళితే లేరు బాబూ" ఆరాటంగా అంది. తెల్లబోతూ ఉత్తరం అందుకున్నారు పార్థసారథి.
    "పార్థసారథిగారూ - నేవెళ్లిపోతున్నాను. యిక్కడికి వచ్చి నేనెంత తప్పు చేశానో నిన్నటితో అర్థం అయింది. శ్రీరాముడంతటి ఏకపత్నీ వ్రతుడిగా మిగిలిపోవాలన్న నీ కోరికని నే కాదనలేదే! నీ శ్రీమతి స్థానం కోరలేదే! నే అడిగింది తోటిమనిషి తోడు! దానికోసం మీలో ఎన్ని ఎనుమానాలు, ఎంత సందిగ్ధత ఎంత ఆలోచన, ఎన్ని ప్రశ్నలు! నర్సమ్మ, కాంతమ్మళ కున్నంతపాటి కన్సరన్ అయినా లేదే మీలో. మీ పిల్లలకున్నంత సంస్కారవంతమైన ఆలోచనే లేదే మీలో! పరిగెత్తి వచ్చి పిల్లలు వప్పుకున్నారు. నర్సమ్మ యిలా అంది, కాంతమ్మగారలా అంది అని సంబరంగా నా చేయిపట్టుకు ఊపుతూ అన్ని అడ్డంకులు తీరిపోయిన సంతోషం నీలో చూడాలన్న నా ఆశ - ఆ రాత్రంతా నాతో మాట్లాడకుండా నీ ఆలోచనతో నీ గదిలో కూర్చుని యింకా యింకా సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్న నిన్ను చూశాక, ఇంత పిరికి సగటు మనిషికోసమా నేను పరిగెత్తి వచ్చాను. ఎంత తప్పుగా అంచనా వేశాను అన్న బాధతో నా మనసు చిన్నపోయింది. రేపు మనం కల్సివుంటే ఎవరో ఏదో అన్నారు, ఎవరో నవ్వారు అంటూ నొచ్చుకుంటూ కూర్చుంటావేమో! ఇలాంటిచోట నేను స్వేచ్చావాయువులు ఎలా పీల్చగలను? సగటు మగాడిననిపించుకున్నావు. పదిహేనురోజుల మీ ఆతిథ్యానికి ధన్యవాదాలు! శలవు.. సంస్కృతి"
    ఉత్తరం చదివాక కలగాల్సినంత బాధ కలగకపోగా, మీదపడబోయే ఆపదేదో తప్పిందన్న భావనే కల్గింది ఆయనకి.

                                                                                                  (ఆంధ్రభూమి వీక్లీ - మే, 2008)

                                                  *  *  సమాప్తం  *  *