చెవుల నుంచి రక్త స్రావం:
1. చెవి తమ్మెను ముట్టుకున్నా, లాగినా బాగా నొప్పిగా అనిపిస్తుందా?
సెగగడ్డలు (బాయిల్స్)
2. చెవి లోపల దురదగా ఉంటుందా?
కర్పాణి (ఎగ్జిమా)
3. రక్తం కనిపించే ముందు తీవ్రమైన చెవిపోటు వచ్చిందా?
హఠాత్తుగా చెవికి ఇన్ఫెక్షన్ సోకటం (ఎక్యూట్ ఒటైటిస్)
4. మీరు ఇటీవల లౌడ్ స్పీకర్లలోంచీ వచ్చే పెద్ద శబ్దాలను సమీపం నుంచి విన్నారా?
కర్ణభేరి పగలడం (పర్ఫరేటేడ్ ఇయర్ డ్రమ్)
5. తలకు దెబ్బ తగిలిందా?
మెదడుకు దెబ్బతగలడం (హెడ్ ఇంజ్యూరి)
చెవుల నుండి రక్తస్రావమవ్వటమనేది అరుదుగా జరుగుతుంది. దీనికే దీని గురించి పెద్దగా ఎవరికీ అవగాహన ఉండదు. ఎప్పుడైనా, ఎవరికైనా, చెవినుంచి ఒకటి రెండు చుక్కలు రక్తస్రావమైనప్పటికీ దాని గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు. చెవి లోపలి మార్గాన్ని చుట్టి ఉండే చర్మం ఇరిటేట్ అయినప్పుడు ఇలా జరిగే అవకాశం ఉంది. అయితే, చెవినుంచి ఎక్కువ మొత్తాల్లో రక్త స్రావమవుతుంటే మాత్రం తేలికగా తీసుకోకూడదు. ప్రమాదకర స్థితుల్లో ఇలా జరుగుతుంది. చెవుల నుంచి రక్తస్రావమావుతున్నప్పుడు దాని తీవ్రతను అంచనా వేయడానికి ఈ క్రింది విషయాలు దోహద పడతాయి.
1. సెగగడ్డలు (బాయిల్స్):
చెవి మార్గాన్ని (ఇయర్ కెనాల్) ఒక చర్మపు పొర చుట్టి ఉంటుంది. ఇది చాలా బిగుతుగా అమరి ఉంటుంది. ఇక్కడ ఏదన్నా చిన్న కురుపు వంటిది తయారైతే, దానిలో ఉండే ద్రవాంశం లోపలికి వెళ్లడానికి స్థలం లేక, బయటకు పోవడానికి వీలు లేక తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. ఇది పగిలితే నాలుగైదు రక్తపు చుక్కలు కనిపించవచ్చు. దీనికి చిన్నపాటి శస్త్ర చికిత్స చేసి లోపల ఉన్న చీమును తొలగించాల్సి ఉంటుంది.
గృహచికిత్సలు: 1. శొంఠి పొడి, ఇంగువలను ముద్దగా నూరి రోజుకు రెండుసార్లు పట్టుకోవాలి. 2. రేగు ఆకులను (పిడికెడు) మెత్తగా నూరి, ఉడికించి పైకి కట్టాలి. 3. రణపాల ఆకులను వేడిచేసి పైకి కట్టాలి. 4. పసుపుకు తులసి ఆకులను చేర్చుతూ ముద్దగా నూరి పైన పట్టువేయాలి. దీనినే లోపలికి కూడా కుంకుడు గింజంత పరిమాణంలో తీసుకోవాలి. 5. తమలపాకును మెత్తగా అయ్యేంతవరకు పెనం మీద వేడిచేసి, ఆముదం పూయాలి. ఫెనిని సెగగెడ్డ మీద పరవాలి. ఇలా రోజుకు మూడు లేదా నాలుగు సార్లు చేయాలి. 6. శోభాంజనం వేరు, దేవదారు వేర్లను మెత్తగా నూరి గంజితో కలిపి పేస్టు మాదిరిగా తయారు చేయాలి. దీనిని కొద్దిగా వేడిచేసి సమస్య ఉన్నచోట పట్టుకోవాలి. 7. మెంతుల ముద్దను పైకి ప్రయోగించాలి.
ఔషధాలు: శారి బాద్యారిష్టం, గంధక రసాయనం, కర్పూర శిలాజిత్తు, కాంచనార గుగ్గులు, నిత్యానంద రసం, మహామంజిష్టాది క్వాథం, త్రిఫలా చూర్ణం, కైశోరగుగ్గులు, శతావరిఘృతం, త్రిఫలాగుగ్గులు, శారిబాది వటి.
బాహ్యప్రయోగం - చందనాది తైలం.
2. కర్పాణి (ఎగ్జమా):
చెవి లోపలి మార్గాన్ని కప్పి ఉంచే చర్మంపైన ఎగ్జమా అనే చర్మ వ్యాధి సోకితే దురదతో పాటు కొద్దిపాటి రక్తస్రావం కూడా కనిపించే అవకాశం ఉంది.
గృహచికిత్సలు: 1.మెట్ట తామర (సీమ అవిశ) ఆకులను ముద్దగా నూరి పైకి పూయాలి. 2. రేల చిగుళ్ళను పుల్లని మజ్జిగతో సహా నూరి పైకి పూయాలి. 3. వేపాకులు, ఉసిరికాయ పెచ్చులు, బావంచాలు సమతూకంగా తీసుకుని పొడిచేయాలి. దీనిని పూటకు అరచెంచాడు మోతాదుగా మూడుపూటలా తగిననత తేనెతో పుచ్చుకోవాలి. 4. దొండ ఆకులను ముద్దగానూరి రసం పిండి పైకి పూయాలి. 5. వేప బెరడుతో కాషాయం కాచి చర్మాన్ని శుభ్రపరచాలి. ఇదే వేప బెరడు ముద్దను పైకి కూడా రాయాలి. 6. వేప నూనెను పూటకు నాలుగు లేదా ఐదు చుక్కలు చొప్పున రెండు పూటలా పాలతో కలిపి నలబై రోజుల పాటు తీసుకోవాలి.
ఔషధాలు: ఆరోగ్యవర్ధినీవటి, పంచతిక్తగుగ్గులు ఘృతం, మహామంజిష్టాదికషాయం, గంధక రసాయనం, పంచనింబాది చూర్ణం.
బాహ్యప్రయోగం - క్షారతైలం.
3. హఠాత్తుగా చెవికి ఇన్ఫెక్షన్ సోకటం (ఎక్యూట్ ఓటైటిస్):
కొన్ని సందర్భాల్లో హఠాత్తుగా మొదల్లయ్యే ఇన్ఫెక్షన్ కర్ణభేరిని చిద్రం చేసి రక్తస్రావానికి కారణమవుతాయి. ముఖ్యంగా పిల్లల్లో ఈ తరహా సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కర్ణభేరిలో ఏర్పడిన రంధ్రం చిన్నదైతే దానంతట అదే పూడుకుపోయి మానిపోతుంది. రంధ్రం త్వరగా మానడానికి గుగ్గిలంతో దూవనం (పొగ) వేయాల్సి ఉంటుంది. చెవిలో రంధ్రం పడినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ద్రవాంశాలను ఔషధ రూపాల్లో వాడకూడదు; అవి రంధ్రం ద్వారా అభ్యంతర కర్ణం లోనికి ప్రవేశించి కొత్త సమస్యలను సృష్టించే అవకాశం ఉంది.
4. కర్ణభేరి పగలడం (పర్ఫరేటెడ్ ఇయర్ డ్రమ్):
పెద్ద పెద్ద విస్పోటనాలనుగాని, లౌడ్ స్పీకర్ల శబ్దాలనుగాని వినడం, స్విమింగ్ పూల్ లో డైవ్ చేయడం, విమానయానం చేయడం (ముఖ్యంగా ల్యాండింగ్), ఇటువంటి వాటి వల్ల కర్ణభేరికి ఇరుపక్కలా ఉండే ఒత్తిడిలో మార్పు వచ్చి, కర్ణభేరి పగిలి రక్తస్రావమయ్యే అవకాశం ఉంది. ఆయుర్వేదం వ్యాధులు కలగడానికి కారణాలను తేలియచేస్తూ 'అయోగం, అతియోగం, మిథ్యాయోగం' గురించి చెబుతుంది. అతియోగం అంటే దేన్నైనా అతిగా చేయడం, పెడా శబ్దాలను వినడం వల్ల వచ్చే ఇలాంటి ఇక్కట్లు అతియోగం క్రిందకు వస్తాయి. ఇలాంటివి చాలావరకు వాటంతటవే తగ్గిపోతాయి.
ఔషధాలు: గుగ్గులుధూపం.
బాహ్యప్రయోగం - బిల్వతైలం (డ్రాప్స్)
5. మెదడుకు దెబ్బతగలటం (హెడ్ ఇంజ్యురి):
తలకు బలమైన దెబ్బతగిలి, తల ఎముకలు ఫ్రాక్చర్ అయితేచెవులనుంచి విపరీతంగా రక్తస్రావమయ్యే అవకాశం ఉంది. దీనిని అనుసరించి స్పృహ కూడా తప్పవచ్చు. దీనికి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వైద్య సహాయం పొందాలి, లేకపోతే ప్రాణ ప్రమాదం జరుగుతుంది.