ఛాతి నొప్ప
1. ఛాతి నొప్పి చాలా తీవ్రంగా ఉందా? దానిలోపాటు వాంతి వచ్చినట్లుండటం, ఆయాసం వంటి లక్షణాలు ఉన్నాయా?
గుండెపోటు (హార్ట్ ఎటాక్)
2. ఛాతినొప్పి శారీరకంగా శ్రమించినప్పుడు వస్తుందా?
గుండె నొప్పి (యాంజైనా)
3. అజీర్ణంతో సతమతమవుతున్నారా?
ఆమ్లపిత్తం (ఎసిడిటి /హార్ట్ బర్న్)
4. ఈ మధ్యన వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిందా? ఎప్పుడూ ఏదో తెలియని నీరసం ఆవహించి పీదిస్తుంటుందా?
గుండెపొర వ్యాధిగ్రస్తమవటం (పెరికార్డైటిస్)
5. నొప్పి తీవ్రంగా వస్తుందా? మీ వయస్సు 60 దాటిందా?
బృహద్దమని (ఐయోర్ట) ఉబ్బసం (ఎన్యూరిజం)
6. ఛాతిలో నొప్పితోపాటు ఆయాసం, దగ్గు, జ్వరం వంటివి కూడా ఉన్నాయా?
ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ (న్యుమోనియా)
7. సిగరెట్లు తాగుతారా? మీరు స్త్రీలైతే సంతాన నిరోధక మాత్రలు వాడుతున్నారా?
నెత్తురు కరుడుగట్టి రక్తప్రసారాన్ని అడ్డుకోవడం (ఎంబోలిజం)
8. పక్కటెముకల మీద ముట్టుకుంటే చాలు, చాలా నొప్పిగా ఉంటుందా?
ఛాతి ఎముకలు విరగటం / వైరల్ ఇన్ఫెక్షన్లు
ఛాతి నొప్పిని ఆయుర్వేద శాస్త్ర గ్రంథాలు 'ఉరః శూల' అనే పేరుతో వర్ణించాయి. ఇది తిరిగి రెండు విధాలుగా ఉంటుంది: మొదటిది పార్శ్వశూల. ఇది ఛాతీకి ఇరుపక్కలా వస్తుంది. రెండవది వక్షశూల, ఇది ఛాతి మధ్య భాగంలో వస్తుంది. ఛాతిలో నొప్పి ఉన్నప్పుడు నిజానికి ఇతర కారణాలను చాలా వాటిని గురించి ఆలోచించాల్సి ఉన్నా అన్నిటికంటే ముందు గుండెపోటుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఛాతి నొప్పి వస్తున్నప్పుడు ఈ కింది అంశాలు కూడా తోడైతే ఏ మాత్రం తాత్సారం చేయకుండా వైద్య సహాయం పొందాలి. - పురుషులకు 40 సంవత్సరాల వయసు, స్త్రీలకు 50 సంవత్సరాల వయసుకు పైబడటం. - రక్తపోటు అధికంగా ఉండటం. - కొలెస్టరాల్ అధికంగా ఉండటం. లేదా రక్తంలో ఇతర రకాలైన కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండటం. - కుటుంబంలో ఎవరికైనా గుండెజబ్బులు ఉండటం. - మధుమేహం కూడా తోడవటం. - శారీరక శ్రమ కొరవడటం. - అత్యధిక స్థాయిలో ఒత్తిడికి లోనవుతుండటం. ఛాతి ప్రదేశంలో గుండెతో పాటు చాలా రకాలైన నిర్మాణాలుంటాయి. వీటన్నిటికి నరాలు చేరతాయి, కనుక సహజంగానే ఈ నిర్మాణాలాన్నిటి వల్ల ఛాతినొప్పి వచ్చే అవకాశం ఉంది. గుండెకు ఇరుప్రక్కలా ఉండే ఊపిరితిత్తులు, వాటికిందగా ఛాతిని ఉదర ప్రదేశం నుంచి వేరు పరుస్తూ డయాఫ్రం, దానిని ఛిద్రం చేసుకుని అమాశయానికి దారితీస్తూ అన్ననాళికా, పక్కటెముకలూ, వీటిని ఒక దానితో మరొక దానిని కలుపుతూ ఉండే కండరాలూ, వీటికి చేరే నరాల సముదాయాలూ వీటన్నిటి వల్ల ఛాతినొప్పి వచ్చే అవకాశముంది. ఇది ఛాతికి సంబంధించిన కారణాలైతే, ఉదర ప్రదేశంలో ఉండే గాల్ బ్లాడర్ వ్యాధిగ్రస్తమైనప్పుడు సైతం చాతిలో నొప్పిగా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి నొప్పిని 'రిఫర్డ్ పెయిన్' అంటారు.
1. గుండెపోటు (హార్ట్ ఎటాక్):
ఛాతినొప్పి వస్తున్నప్పుడు ముందుగా హార్ట్ ఎటాక్ గురించి ఆలోచించాలి. అయితే చాలామంది అనుకునేటట్లు హార్ట్ ఎటాక్ ఎప్పుడూ ఛాతి నొప్పితోనే రావాలని లేదు. కొన్ని సార్లు ఏ లక్షణమూ లేకుండా కూడా హార్ట్ ఎటాక్ రావచ్చు. అటువంటి దానిని వైద్య పరిభాషలో 'సైలెంట్ మయోకార్డియల్ ఇన్ ఫార్ క్షన్' అంటారు. ఈ రకంగా హార్ట్ ఎటాక్ ఎంత నొప్పి లేకుండా వచ్చినప్పటికీ ఛాతిలో పట్టేసినట్లుండటం మాత్రం చాలామందికి అనుభవమవుతుంది. ఛాతిలో తెలియని అసౌకర్యంతో పాటు ఆయాసం, చమటలు పట్టడం, గుండెదడ వంటివి ఉంటాయి. అలాగే కడుపులో తిప్పడం, వాంతులవడం, కళ్లు తిరగటం కూడా ఉండవచ్చు, నొప్పి సాధారణంగా ఛాతి మధ్యలో వస్తుంది. అక్కడి నుండి వీపు, మెడ, చెవులు, దవడలు, నాలుక, భుజాలు, చేతులు ఈ ప్రాంతాల్లోకి ప్రసరిస్తుంది. ఎక్కువగా ఎడమచేయి లోనికి పాకుతుంది. సాధారణంగా స్త్రీలకు - బహిష్టులవుతున్నంత కాలం - హార్ట్ ఎటాక్ రాదు. వారిలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ రక్షణ కవచంగా పనిచేయడమే దీనికి కారణం. స్త్రీలల్లో హార్ట్ ఎటాక్ వస్తే. బహుశా ధూమపానం చేయడమో, లేక చేసే వారి పక్కన నిరంతరమూ గడుపుతుండటమో, సంతాన నిరోధక మాత్రలు వాడుతుండటమో, మధుమేహం బారిన పడటమో, అధిక రక్తపోటును కలిగి ఉండటమో వీటిల్లో ఏదో ఒక కారణమై ఉంటుంది. కొలెస్టరాల్ శాతం పెరిగినా, హిస్టరెక్టమీ ఆపరేషన్ సమయంలో గర్భాశయంతో పాటు అండాశయాలను తొలగించినా అటువంటి మహిళలకు ఇతరులకంటే గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఔషధాలు: అర్జునారిష్టం, అశ్వగంధారిష్టం, దశమూలారిష్టం, ధన్వంతర గుటిక, కస్తుర్యాది గుటిక, కస్తూరి మాత్రలు, ప్రభాకర వటి, శృంగి భస్మం, స్వర్ణమాలినీ వసంత రసం, విదార్యాది ఘృతం.
2. గుండె నొప్పి (యాంజైనా):
డిమాండ్ కు తగినంతగా ఆక్సిజన్ సరఫరా లేకపోతే ఎక్కువదూరం నడిచినప్పుడూ, మెట్లు ఎక్కినప్పుడూ కాలి పిక్కల్లో నొప్పులు రావటం అందరికీ అనుభవమే. గుండె విషయంలోనూ ఇంచుమించుగా ఇదే జరుగుతుంది. కొవ్వు పదార్థాలు, కొలెస్ట్రాల్ వంటివి గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలను పాక్షికంగా అడ్డుకున్నప్పుడు ఆక్సిజన్ లోపం వలన నొప్పి ఉత్పన్నమవుతుంది. అనవసరమైన ఆందోళనలు, మానసిక ఉద్రిక్తతలు, శక్తికి మించిన శారీరక శ్రమ వంటివి నాడి వేగాన్నీ, రక్తపోటునూ పెంచుతాయి. దీనితో గుండె కండరాల పైన మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఈ అదనపు ఒత్తిడికి సరిపోయే విధంగా రక్త సరఫరా పెరగకపోవటంతో గుండెలో నలుపుతున్నట్లూ, గుండెకు చేతులతో పిండుతున్నట్లూ అనిపిస్తుంది. ఈ రకమైన నొప్పిని వైద్యపరిభాషలో 'యాంజైనా' అంటారు. ఆయుర్వేదంలో వివరించిన 'హృత్ శూల' లక్షణాలు దీనికి సరిపోతాయి. యాంజైనా నొప్పికి ఒక ప్రధానమైన లక్షణం ఉంటుంది. ఇది విశ్రాంతితో తగ్గడం. చలి వాతావరణంలోనూ, భోజనానంతర సమయంలోనూ, సాధారణంగా యాంజైనా వస్తుంటుంది. నొప్పి వచ్చినప్పుడు 3 లేక 4 నిమిషాల నుంచి 30 లేక 40 నిమిషాల పాటు ఉంటుంది. ఈ నొప్పి ద్వారానే మున్ముందు రాబోయే హార్ట్ ఎటాక్ ను పసిగట్టడానికి వీలవుతుంది కాబట్టి దీనికి ప్రాముఖ్యతనివ్వాలి.
సూచనలు: వైద్య పరీక్షలలో మీ ఛాతి నొప్పికి యాంజైనా పెక్టోరిస్ లేక హృత్ శూల కారణమని వెల్లడైతే ఈ కింది సూచనలు ఉపయోగపడతాయి.
1. గాలి స్వచ్చంగా ఉండాలి: మీకు ఒకవేళ ధూమపానం చేసే అలవాటు ఉంటే ముందుగా దానికి త్యజించడం అత్యవసరం. సిగరెట్ పొగలోని కార్భాన్ మోనాక్సైడ్ రక్తంలో ఉండే ప్రాణవాయువును తొలగిస్తుంది. అసలే ఆక్సిజన్ లోపంతో ఉన్న రక్తం కార్భాన్ మోనాక్సైడ్ జోక్యంతో మరింతగా క్రియాహీనమవుతుంది. పైగా సిగరెట్ పొగ రక్తంలోని ప్లేట్ లెట్ కణాలను ఒకదానితో మరొకటి అటుక్కునేలా చేస్తుంది. దీనితో రక్తనాళాలు మరింతగా పూడుకుపోయే ప్రమాదముంది. ఇవన్నీ కాకుండా సిగరెట్ పొగకు మరొక అవాంఛనీయ లక్షణం కూడా ఉంటుంది. ఆహారాన్ని కాని, ఔషధాన్ని కాని శరీరంలోనికి విలీనమవ్వకుండా అడ్డుకోవడం. మరి సిగరెట్లు తాగుతూ ఎన్ని మందులు వేసుకుంటే మాత్రం ఏం ప్రయోజనం? మరొక ముఖ్య విషయం - మీరు సిగరెట్లు తాగకపోయినా, మీ పక్కనున్న వారు తాగితే మీకు జరగాల్సిన నష్టం జరిగే తీరుతుంది కనుక ఇంట్లోను, ఆఫీసులోనూ, ప్రయాణాలలోనూ, ఎక్కడా ధూమపానాన్ని ప్రోత్సహించకండి.
2. అతి సర్వత్ర వర్జయేత్: అతి అనేది ఏ విషయంలోనూ పనికి రాదంటుంది శాస్త్రం. ముఖ్యంగా ఆహారానికి ఇది మరీ వర్తిస్తుంది. తక్కువ కేలరీలున్న ఆహారాన్ని తీసుకోండి. కొవ్వునూ, ఉప్పునూ తగ్గించండి. ఒకవేళ తగ్గించకపోతే వీటి వినియోగం వల్ల రక్తపోటు పెరిగి రక్తప్రవాహవేగానికి కారణమవుతుంది. అంటే గుండె మామూలు స్థాయి కన్నా అదనపు శక్తితో పని చేయాల్సి ఉంటుందన్నమాట. దీనికి తగ్గట్లుగా గుండె కండరాలకు రక్త సరఫరా పెరగకపోవడంతో గుండెనొప్పి ప్రారంభమవుతుంది. మాంసాహారాన్ని తీసుకోవడం తప్పదనుకుంటే వంద గ్రాముల కంటే ఎక్కువ తీసుకోవద్దు, ఈ మొత్తాన్ని కూడా కొవ్వును వేరు పరిచి ఉపయోగించండి. మాంసాన్ని మరిగే నీళ్లలో ఉంచితే కొవ్వు పదార్ధం విడిపోతుంది, మాంసం నుంచి చర్మాన్ని కూడా తొలగించి కేవలం పీచుగా ఉండే కండరాలను మాత్రమే ఉపయోగించాలి, మాంసంతో పాటు ఉంది లివర్, కిడ్నీలు, గుండెలను తీసుకోవద్దు; వీటిలో కొలెస్టరాల్ శాతం ఎక్కువగా ఉంటుంది. నూనె పదార్థాలను బాగా తగ్గించండి; ఎట్టి పరిస్థితులలోనూ రోజు మొత్తం మీద ఐదారు టీ స్పూన్లకు మించి వాడకండి. పాలతో కూడా జాగ్రత్తగానే ఉండాలి, ఒకవేళ మీరు ప్యాకెట్ పాలు వాడుతున్నట్లయితే కొవ్వుశాతం సాధ్యమైనంత తక్కువ ఉండేలా చూసుకోండి. గేదె పాలైతే బాగా మరిగించి, పైన పేరుకున్న మీగడను వేరు పరిచి, నీళ్లు చేర్చి వాడుకోవాలి. కాలానుగుణంగా దొరికే తాజా ఫలాలను, కూరగాయలను ఉపయోగించాలి. యవ, గోధుమలు కొలెస్టరాల్ ను గణనీయంగా తగ్గించగలవని వెల్లడయింది కనుక వాటిని యథోక్తంగా ఉపయోగించండి.
3. వ్యాయామం సర్వదా శ్రేష్ఠం: శారీరక శ్రమతో గుండె నొప్పి వస్తుంది కనుక అసలు వ్యాయామం గురించిన ఆలోచన కూడా రాకుడదని చాలామంది అనుకుంటారుగాని ఈ దృక్పథం సరైనది కాదు. సరైన వ్యాయామం గుండె జబ్బులున్న వారికి కూడా మంచినే చేస్తుంది. వ్యాయామాన్ని శారీరకంగా పూర్తిగా డీలా పడిపోయేలా కాకుండా, అర్థశక్తిగా చేయాలంటుంది ఆయుర్వేదం. వ్యాయామం చేస్తున్నప్పుడు నుదురుమీద చిరు చమట పడితే శారీరక శక్తిలో సగం శక్తి వినియోగమైనట్లుగా అర్థం చేసుకోవాలి. సరైన వ్యాయామం వలన మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అలాగే అనవసరపు బరువు కూడా తగ్గి శరీర తేలికగా, ఉల్లాసంగా ఉంటుంది. అంతే కాకుండా దీనిని క్రమబద్ధంగా చేస్తే గుండె స్పందనలు క్రమబద్ధంగా మారి రక్తపోటు సాధారణ స్థాయికి చేరుకుంటుంది. వీటన్నిటి వల్లా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని వేరే చెప్పనక్కర్లేదు. అయితే ఒక విషయం. వ్యాయామమ చేయబోయే ముందు ఒకసారి స్ట్రెస్ టెస్ట్ చేయించుకుని ఏ స్థాయివరకూ వ్యాయామాన్ని నిరపాయకరంగా చేయవచ్చునో తెలుసుకోవాలి.
4. రిలాక్స్ అవడం నేర్చుకోండి: ధ్యానం, పూజ, మెడిటేషన్ వీటికి మీరు ఏ పేరైనా పెట్టుకోండి, వీటిల్లో ఏ పద్ధతినైనా అవలంభించండి. ఈ పద్ధతుల వల్ల మీకు చక్కని రిలాక్సేషన్ లభిస్తుంది. వీటి సహాయంతో మీ ఆలోచనలు మిమ్మల్ని నియంత్రించేలా కాకుండా మీరు మీ ఆలోచనలకు నియంత్రించే దశకు చేరుకోగలుగుతారు. ప్రథమ చికిత్స: ఒకవేళ మీకు ఏ అర్థరాత్రో గుండెనొప్పి వస్తే కాళ్లు వెళ్లాడేసి కూర్చోండి; కాళ్లను కిందికీ, తలను పైకి ఉంచి కూర్చోవడం వల్ల గుండె కండరాల్లో ప్రవహించే రక్తపు ఒత్తిడిలో మార్పు వచ్చి గుండె నొప్పి తగ్గే అవకాశం ఉంది. ఈ చర్యతో వెంటనే మార్పు కనిపించకపోతే సత్వరమే వైద్య సహాయం తీసుకోండి.
గృహచికిత్సలు: 1. కటుక రోహిణి, అతి మధురం వీటిని సమాన భాగాలు తీసుకొని చూర్ణం చేసి రోజుకు మూడుసార్లు ప్రతిసారి అరచెంచాడు చొప్పున వేడి నీళ్ళతో తీసుకోవాలి. 2. తెల్లమద్దిపట్టను తెచ్చి చూర్ణం చేసి చెంచాడు మోతాదుగా వేదిపాలతో రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 3. పుష్కరమూల చూర్ణాన్ని పావుచెంచాడు చొప్పున రోజుకు మూడుసార్లు తేనెతో తీసుకోవాలి. 4. వెల్లుల్లి పాయను ముద్దనుచేసి చెంచాడు పేస్ట్ ను పాలలో కలిపి ఉడికించి రోజు రెండుపూటలా తాగాలి. 5. కరక్కాయ, వస, దుంపరాష్ట్రము, పిప్పళ్ళు, శొంఠి వీటినన్నిటిని సమతూకంగా తీసుకొని, పొడిచేసి, అరచెంచాడు చొప్పున రోజుకు మూడుసార్లు తీసుకోవాలి. 6. నవాసాగరం అనే పదార్థాన్ని సున్నంతో కలిపి ఒక సీసాలో భద్రపరిచి అవసరానుసారం వాసన చేస్తే హృదయశూల తగ్గుతుందని వైద్య యోగరత్నావళి పేర్కొంది, నవాసాగారానికి రక్తనాళాలను వ్యాకోచపరిచే గుణం ఉంది.
ఔషధాలు: శృంగి భస్మం, మహావాత విధ్వంసినీ రసం, త్రైలోక్య చింతామణి రసం, జహర్ మొహర్ భస్మం, బృహత్ వాత చింతామణి రసం, ఆరోగ్యవర్ధినీవటి.
3. ఆమ్లపిత్తం (ఎసిడిటి / హార్ట్ హార్న్):
జీర్ణశక్తిని వృద్ధి పరిచే మందుల ప్రకటనలు చూసినప్పుడు వాటిలో 'హార్ట్ బర్న్' అనే మాట కనిపిస్తుంది. నిజానికి ఈ పదానికి, గుండెకూ ఏ సంబంధం లేకపోయినా అజీర్ణం వలన ఛాతిలో మంటగా ఉండటాన్ని ఆధారం చేసుకుని ఈ పదం వాడుకలోకి వచ్చింది. అమాశయంలో ఉండే ఆమ్ల పదార్ధం స్వస్థానం నుంచి పైకి పొంగటం వలన అన్న నాళిక లోపలిపోర ఇరిటేటై మంట మొదలవుతుంది. పెప్టిక్ అల్సర్ కూ, హార్ట్ బర్న్కూ కొంత మౌలికమైన తేడా ఉంది. అందుకే అన్ని సందర్భాలలోనూ దీని మీద అల్సర్ కు పనిచేసే మందులు పనిచేయవు. శారీరక భంగిమలను సరిచేసుకోవడం, అధిక బరువును తగ్గించుకోవడం మొదలైనవి దీనికి చికిత్సా సూత్రాలు.
అల్సర్ లో మాదిరిగా ఈ నొప్పికి ఆహార సేవలతో సంబంధం ఉండదు. ఛాతిలో మంటను హార్ట్ ఎటాక్ గా భావించి వైద్య సహాయాన్ని ఆశ్రహించినా మీకు జరిగే నష్టం ఉండదుకాని, హార్ట్ ఎటాక్ ను సాధారణమైన 'గ్యాస్ ట్రబుల్' కు అన్వహించుకుని అశ్రద్ధ చేస్తే మాత్రం దానికి ఒకోసారి జీవితాన్నే మూల్యంగా చెల్లించాల్సి వస్తుంది. నోరంతా చేదుగా ఉండటాన్ని బట్టి, ముందుకు వంగినప్పుడు నొప్పి ఎక్కువ కావడాన్ని బట్టి హార్ట్ బర్న్ ను గుండెనొప్పితో సంబంధం లేనిదిగా అర్థం చేసుకోవచ్చు.
సూచనలు: ముందుకు వంగటం, బరువులు ఎత్తడాలు చేయకూడదు. ఒకవేళ చేస్తే ఆమాశయంలోని యాసిడ్స్ వ్యతిరేక దిశలో, ఎగువకు, అన్ననాళికలోకి ప్రవేశించి ఛాతిలో నొప్పిని, మంటనూ కలిగిస్తాయి. మంచాన్ని తల వైపు ఎత్తుగా, ఏటవాలుగా ఉంచి పడుకోవాలి. టమాటాలు, కమలాఫలాలు, నిమ్మకాయలు, చింతపండు, ఇతర పులుపు పదార్థాలను వాడకూడదు. అలాగే ఆల్కాహాల్, కూల్ డ్రింకులు తీసుకోకూడదు. కొవ్వు పదార్థాలనూ, కాఫీ, టీ, సిగరెట్లనూ పూర్తిగా మానివేయడం ద్వారా, బరువును తగ్గించుకోవడం ద్వారా హార్ట్ బర్న్ ను నివారించుకోవచ్చు. ఈ వ్యాధిలో విరేచన కర్మను శోధన చికిత్సగానూ, పిత్తహర ఔషధాలను శమన చికిత్సగానూ ఇవ్వాల్సి ఉంటుంది.
గృహచికిత్సలు: 1. పిల్లిపీచర గడ్డలను పొడిచేసి, అరచెంచాడు మోతాదుగా పాలతో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 2. ఉసిరికాయ పెచ్చులను పొడిచేసి అరచెంచాడు మోతాదుగా గోరువెచ్చని నీళ్ళతో కలిపి తీసుకోవాలి. 3. అతిమధురం వేరును పొడిచేసి పావు చెంచాడు మోతాదుగా పాలతో కలిపి తీసుకోవాలి. 4. తిప్పసత్తును రేగు గింజంత మోతాదును చన్నీళ్లతో లేదా తేనెతో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి.
ఔషధాలు: సంశమనీవటి, అవిపత్తికర చూర్ణం, దాత్రీలోహం, కామదుఘరసం, శంఖభస్మం, సూతశేఖర రసం, ప్రవాళ పంచామృతం, సుకుమార ఘృతం.
4. గుండెపోటు వ్యాధిగ్రస్తమవటం (పెరికార్డైటిస్):
గుండెకు పెరికార్డియం అనే ఒక పలుచని పొర చుట్టి ఉంటుంది. ఒకవేళ ఇది వైరస్ ఇన్ఫెక్షన్ల వంటి కారణాలచేత వ్యాధిగ్రస్తమైతే (పెరికార్డైటిస్) ఛాతి నొప్పి వస్తుంది. ఇది దాదాపు యాంజైనాలాగా ఉంటుంది కాని, అదనంగా ఊపిరి తీసుకుంటున్నప్పుడు ఎక్కువవుతుంటుంది. కొన్ని సందర్భాల్లో కేవలం వైరల్ ఇన్ఫెక్షన్ల వల్లనే కాకుండా, గుండెపోటు తరువాత కూడా గుండె వెలుపలి పొర వ్యాధిగ్రస్త మయ్యే అవకాశముంది. అంతే కాదు - వ్యాధి క్షమత్వ శక్తి గతి తప్పడం వల్ల (ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్) గాని.కొన్ని రకాల క్యాన్సర్ల వల్లగాని 'పెరికార్డైటిస్' రావచ్చు.
ఔషధాలు: శృంగి భస్మం, పుష్కరమూలాది చూర్ణం, నాగార్జునాభ్రరసం, వాతచింతామణి రసం (బృహత్), హృదయార్ణవ రసం, ముక్తాపిష్టి, అకీకపిష్టి, ప్రభాకరవటి, ప్రవాళభస్మం, యాకుతీరరసాయనం.
5. బృహద్ధమని (ఐయోర్ట) ఉబ్బసం (ఎన్యూరిజం):
గుండె నుంచి బయటకు వెళ్లే బృహద్ధమనుల లోపలి గోడల మీద రక్తంలోని కొన్ని పదార్థాలు పేరుకుపోయి రక్తనాళాలను పెళుసెక్కేలా, సాగుడు గుణాన్ని కోల్పోయేలాగా చేస్తాయి. రక్త ప్రవాహపు ఒత్తిడి వల్ల బిరుసుగా తయారైన రక్తనాళాలు తేలికగా చిట్లుతాయి. ఇలా చీరుకుపోయిన ప్రతిసారి కత్తితో కోసినంటగా నొప్పి వస్తుంది. ఈ తరహానొప్పి ఛాతిలోనే కాక, వీపులో కూడా కేంద్రీకృతమయ్యే అవకాశముంది. ఎన్యూరిజంగా పిలిచే ఇటువంటి స్థితిని ఎట్టి పరిస్థితులలోనూ అశ్రద్ధ చేయకూడదు, సత్వరమే వైద్య సహాయం పొందాలి.
6. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ (న్యుమోనియా):
ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకినప్పుడు న్యుమోనియా వస్తుందన్న సంగతి తెలిసిందే. ఊపిరితిత్తుల పైపొర కూడా వ్యాధిగ్రస్తమైతే ఆయాసం, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో పాటు ఊపిరిపీలుస్తున్నప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఛాతినొప్పి వస్తుంది. బ్యాక్టీరియా, వైరస్ తదితర సూక్ష్మక్రిముల ద్వారానే కాకుండా రసాయన పదార్థాలు సైతం దీనికి కారణమవుతాయి.
7. నెత్తురు కరుడుగట్టి రక్తప్రసారాన్ని అడ్డుకోవడం (ఎంబోలిజం):
సిగరెట్ తాగేవారిలోను, సంతాన నిరోధకమాత్రలు వాడే మహిళలలోను ఒకవేళ ఛాతినొప్పి వస్తున్నట్లయితే ఊపిరితిత్తులలో ఉండే పెద్ద రక్తనాళాలలో రక్తపు గడ్డలు ఏర్పడటం గురించి ఆలోచించాలి. ఈ గడ్డలు రక్తనాళాలను పూర్తిగా అడ్డుకుని స్థానిక కణజాలాలను జీవరహితంగా చేయడానికి అవకాశం ఉంది. అప్పుడు ఛాతిలో తీవ్రమైన నొప్పే కాకుండా, రక్తాన్ని వాంతి చేసుకోవడం కూడా జరుగవచ్చు. గర్భనిరోధక మాత్రలు వాడే మహిళలలో రక్తపు గడ్డలు ఏర్పడటానికి అవకాశాలున్నాయి. అలాగే కాళ్లకు దెబ్బలు తగిలినప్పుడూ వెరి కోస్ వీన్స్ ఏర్పడినప్పుడూ, ఆపరేషన్ల తరువాత దీర్ఘకాలంపాటు బెడ్ రెస్ట్ తీసుకుంటున్నప్పుడూ, కాళ్ల సిరలలో రక్తం సంచితమై కదుములుగా ఏర్పడే వీలుంది. ఇవి ఎగువకు - ఊపిరితిత్తులలోకి ప్రయాణించి తదనుగుణమైన సమస్యలను కలిగిస్తాయి. ఆయుర్వేదంలో దీనిని 'ఖవైగుణ్యం' అంటారు. 'ఖ' అంటే స్రోతస్సు లేదా మార్గం, వైగుణ్యం అంటే అడ్డుకుపోవడం.
ఔషధాలు: నాగార్జునాభ్రరసం, లశునాదివటి, సమీరపన్నగరసం.
8. ఛాతి ఎముకలు విరగటం / వైరల్ ఇన్ఫెక్షన్లు:
పక్కటెముకలు విరిగినప్పుడు, ఛాతి మీద దెబ్బలు తాగినప్పుడు దగ్గినా, తుమ్మినా, శరీరాన్ని మేలితిప్పినా విపరీతమైన నొప్పి వస్తుంది. నరాలు విరిగిన ఎముకల మధ్య ఇరుక్కోవటం వల్ల ఇలా జరుగుతుంది. ఒకోసారి, దెబ్బలు, గాయాలతో సంబంధం లేకుండా, ఆస్టియోపోరోసిస్ (ఎముకల్లో క్యాల్షియం తగ్గి, పెళుసెక్కడం), క్యాన్సర్ వంటివి ఉన్నప్పుడు కూడా ఎముకలు వాటంతట అవే విరిగి ఛాతి నొప్పిని కలిగించే అవకాశం ఉంది. సర్పి వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు వస్తే, పక్కటెముకల మధ్యనుండే ప్రదేశం వ్యాధిగ్రస్తమై ముట్టుకోలేనంత నొప్పి కలగవచ్చు.
సూచనలు: ఎముకలు పెళుసుబారి, చిద్రమై, విరిగిపోవడం జరిగితే తేలికపాటి వ్యాయామాలు, క్యాల్షియం కలిగిన శంఖభస్మం వంటి మందులూ అవసరమవుతాయి. దెబ్బలు, గాయాలకు మర్మగుటిక, లాక్షాదిగుగ్గులు వంటి మందులు, వైరల్ వ్యాధులకు హరిద్రాఖండ యోగ (బృహత్), పంచనింబచూర్ణం వంటి మందులూ అవసరమౌతాయి.