చర్మం కమలటం
1. దెబ్బ ఏదన్నా తగిలిందా?
గాయాలు/దెబ్బలు (ట్రామా)
2. మీ చర్మం పలుచగా, ముడతలుగా తయారవుతోంది?
(ఇతర అనారోగ్య లక్షణాలు ఏవీ లేకుండా) వృద్ధాప్యపు దుష్ఫలితాలు
3. చర్మం పైన దురద, దద్దురు వంటివి ఉన్నాయా?
దద్దురు/ఎలర్జీ (వీల్స్/అర్టికేరియా)
4. త్వరగా అలసిపోవడంతోపాటు రక్తాల్పత లక్షణాలు, జాయింట్లలో వాపు వంటివి కనిపిస్తున్నాయా?
రక్షణ శక్తి అదుపు తప్పి స్వయం ప్రేరితమవటం (ఆటో ఇమ్యూన్ డిజార్డర్)
5. అల్లోపతి మందులు వాడుతున్నారా?
మందుల దుష్ఫలితాలు
6. మీ చర్మం, కళ్లు పసుపు రంగులో కనిపిస్తున్నాయా?
కాలేయ వ్యాధులు (లివర్ డిసీజెస్)
7. మీ శరీరపు ఆకృతి మారిపోయిందా? కాళ్లు చేతులు సన్నబడటం, మధ్యభాగమంతా లావుగా తయారవ్వడం జరిగాయా?
కార్డిజోన్ హార్మోను అధిక స్థాయిలో విడుదలవ్వటం (కుషింగ్స్ సిండ్రోమ్)
8. మీకు తరచుగా ఫ్లూ, జలుబు వంటివి బాధిస్తుంటాయా?
వైరల్ ఇన్ఫెక్షన్లు
9. మీకు తరచూ ఇన్ఫెక్షన్లు వస్తుండటంతో పాటు రక్తాల్పత కూడా ఉందా?
లుకీమియా, ఇతర మూలుగకు సంబంధించిన వ్యాధులు
కొంతమంది తమ కాలు మీదనో, చేయి మీదనో చర్మం కమిలి ఉండటాన్ని చూసుకుని అది ఎలా అయిందో అర్థం గాక అవస్థపడుతుంటాయి. ఇలా ఏదో ఒకటి రెండుసార్లు జరిగితే, తమకు తెలియకుండా ఏదన్నా దెబ్బతగిలి ఉండవచ్చునని సరిపెట్టుకోవచ్చుగాని, తరచుగా ఇలాగే జరుగుతుంటే మాత్రం నిశ్చయంగా దీని గురించి ఆలోచించాల్సిందే. ఉదాహరణకు, జన్మతః ప్రాప్తించే 'హీమోఫీలియా' వంటి వ్యాధుల్లో ఇలా జరిగే అవకాశం ఉంది. రక్తం గడ్డకట్టడానికి తోడ్పడే ప్రోటీన్లలో లోపం సంభవించినప్పుడు ఇలాంటి వ్యాధులు వస్తాయి. ఈ తరహా వ్యాధుల్లో శరీరం లోపలి ప్రదేశాల్లో, అంటే కండరాలు, జాయింట్ల అభ్యంతర భాగాల్లో రక్తస్రావమవడంతో పాటు చర్మం కూడా కములుతుంది. కొంతమందిలో రక్తనాళాల గోడలు జన్మతః పలుచగా ఉండి తరచుగా రక్తస్రావమవుతూ ఉంటుంది. ఇంతకీ చెప్పవచ్చేదేమిటంటే, చర్మం కమలడానికి తేలికపాటి కారణాల నుంచి ప్రమాదభరితమైన కారణాల వరకూ అనేక రకాల అంశాలు దోహదపడతాయని. వీటన్నిటిని గురించి విశ్లేషించుకోవడం అవసరం. ఆయుర్వేదంలో ఈ తరహా సమస్యలను పిత్త ప్రకోప వికృతిగా చూస్తారు. దీనికి పిత్తహర చికిత్సలను, రక్తస్థంభన ఔషధాలనూ ఇవ్వాల్సి ఉంటుంది.
1. గాయాలు / దెబ్బలు (ట్రామా):
నేరుగానో, పరోక్షంగానో చర్మానికి దెబ్బ తగిలితే చర్మం కిందనుండే రక్త నాళాలు నలిగిపోయి రక్తస్రావమవుతుంది. దెబ్బ తగిలిన కొద్ది నిమిషాల్లోనే రక్తస్రావమైన మేరా నీలం రంగు మచ్చ తయారవుతుంది. రక్తస్రావం మొదలైన తరువాత శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి చర్యలు మొదలవుతాయి. ఐతే, ఈ లోపుగానే ఐస్ గడ్డలు వంటి చల్లని పదార్థాలతో ఒత్తిడిని ప్రయోగిస్తూ 'శీతల చర్యలు' చేపడితే రక్త నాళాలు ముడుచుకుపోయి రక్తస్రావం ఆగిపోతుంది.
గృహచికిత్సలు: 1. ఆవు నెయ్యికి కొద్దిగా ఉప్పు చేర్చి, వేడిచేసి మర్దన చేసుకోవాలి. 2. మాల్కంగినీ తైలాన్ని పైకి మర్దన చేసుకోవాలి. 3. పచ్చిపసుపును ముద్దగా నూరి పైకి పూయాలి. 4. కలబంద ఆకు నుంచి గుజ్జును తీసి దెబ్బతగిలిన చోట ప్రయోగించాలి.
ఔషధాలు: వాతవిధ్వంసినీ రసం, త్రిఫలాగుగ్గులు, లక్షా గుగ్గులు.
బాహ్యప్రయోగాలు - మర్మగుటిక.
2. వృద్ధాప్యపు దుష్ఫలితాలు:
వయసు పై బడుతున్న కొద్దీ మన చర్మం పొడిగా పలుచగా తయారవ్వడంతో పాటు సాగే గుణాన్ని సైతం కోల్పోతుంది. దీని పర్యవసానంగాచర్మం క్రిందనుండే రక్తనాళాలు వెలుపలికి బహిర్గతమై ఏ విధమైన ప్రేరణలు లేకపోయినప్పటికీ వాటంతట అవే చిట్లిపోయి రక్తస్రావాన్ని కలిగిస్తాయి. వృద్ధాప్యంలో చాలా మందికి చర్మం మీద అక్కడక్కడా ఎర్రటి రక్తపు బిందువుల వంటివి కనిపించడానికి కారణం ఇదే. దీనిని వైద్యపరిభాషలో'సెనైల్ పర్పూరా' అంటారు. ఇది పెద్దగా ఆందోళన చెందాల్సిన స్థితి కాదు. ఐతే, చ్యవనప్రాశ వంటి ఔషధాలను నిరంతరమూ వాడుతుంటే ఇటువంటి సమస్యలు ఇబ్బంది పెట్టవు. ఈ మందులో ఉండే సి- విటమిన్ రక్త స్రావాలను నిలువరించడానికి సహకరిస్తుంది.
3. దద్దుర్లు/ ఎలార్నీ (వీల్స్/అర్టికేరియా):
తేనెటీగలు, ఇతర క్రీమికీటకాలు కుట్టినప్పుడు చర్మం పైన ఎలర్జీతో పాటు దురద, వాపు, రక్తస్రావాలు కనిపిస్తాయి.
గృహచికిత్సలు: 1. ఉత్తరేణి, వాము (ఓమం) ఆకుల పేస్టునూ, సోయాచిక్కుడు, వెలగపండు గుజ్జునూ కీటకాలు కుట్టిన చోట ప్రయోగిస్తే వెంటనే ఫలితం కనిపిస్తుంది. 2. బెముడు పాలలో మిరియాల పొడిని కలిపిగాని, పొగాకు ఆకుల పొడినిగాని బాహ్యఔషధంగా వాడవచ్చు. 3. ఉసిరిక పరుగు చూర్ణాన్ని (అరచెంచాడు) నెయ్యితో (రెండు చెంచాలు) కలిసి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 4. వామును అరచెంచాడు మోతాదుగా చెంచాడు బెల్లంతోకలిపి రోజుకు రెండుసార్లు సమస్య తగ్గేవరకు తీసుకోవాలి. 5. వేపాకు ముద్దను (అరచెంచాడు) తేనెతో (చెంచాడు) కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 6. అల్లం రసం (రెండు చెంచాలు), పాత బెల్లం (రెండు చెంచాలు) కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 7. తిప్పతీగ, పసుపు, వేపపట్ట, పల్లేరు, అతిమధురం వీటిని సమతూకంగా తీసుకొని ఒకటిగా కలపాలి. దీన్ని రెండు చెంచాలు పరిమాణంగా తీసుకుని కషాయం కాచి తాగాలి.
ఔషధాలు: హరిడ్రాఖండ యోగం (బృహత్), సూతశేఖర రసం, అవిపత్తి కరచూర్ణం, కామదుఘరసం.
4. రక్షణ శక్తి అదుపు తప్పి స్వయం ప్రేరితమవటం (ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్):
రుమటాయిడ్ ఆర్తరైటిస్, పాలీ ఆర్తరైటిస్ వంటి వ్యాధుల్లో శరీరపు కణజాలాలు పరసపరం విభేదించుకోవడం వల్ల యాంటీ బాడీస్ తయారై రక్తాన్ని గడ్డ కట్టనివ్వకుండా చేస్తాయి. అంటే, స్వయం ప్రేరితరక్షణ శక్తి (ఆటో ఇమ్యూనిటీ) మూలంగా తయారైన ప్రతిరక్షక కణాలు రక్తం గడ్డ కట్టడానికి తోడ్పడే ప్లేట్ లెట్స్ సంఖ్యను గణనీయంగా తగ్గించి వేస్తాయన్నమాట. దీని పర్యవసానంగా శరీరాంతర్గతంగా రక్తస్రావమవడంతో పాటు చర్మం కమలటం కూడా జరుగుతుంది.
ఔషధాలు: బోలపర్పటి, రస సింధూరం, చంద్రకళారసం, అమృతాగుగ్గులు.
5. మందుల దుష్ఫలితాలు:
హార్ట్ ఎటాక్, డీప్ వీన్ త్రాంబోసిస్, పక్షవాతం వంటి వ్యాధుల్లో, రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు గాను కొంతమంది యాంటీకోయాగులెంట్స్ వాడుతుంటారు. వీటి మోతాదు ఎక్కువైతే, శరీరాంతర్గతంగా రక్తస్రావమవడంతో పాటు చర్మం కూడా కములుతుంది. క్వినైన్ (మలేరియాలో వాడతారు), కొన్ని రకాల యాంటీబయాటిక్స్, స్టీరాయిడ్ మందులు.... వీటన్నిటికీ రక్తస్రావాన్ని కలిగించే నైజం ఉన్నందువల్ల, వీటిని వాడే వారిలో చర్మంలో అక్కడక్కడా కమిలినట్లు కనిపించే అవకాశం ఉంది. మందులతో సమస్య వస్తున్నప్పుడు ఈ విషయాన్ని డాక్టరు దృష్టికి తీసుకువెళ్లాలి.
6. కాలేయ వ్యాధులు (లివర్ డిసీజెస్):
కళ్లు, చర్మమూ పసుపు రంగులో కనిపించడంతో పాటు కొద్దిపాటి ఒత్తిడికే చర్మం కమలడం జరుగుతుంటే ఏదైనా కాలేయ సంబంధ సమస్య ఉందేమో చూడాలి. మామూలుగా, ఆరోగ్యవంతుల్లో కాలేయం అనేది రక్తం గడ్డకట్టడానికి తోడ్పడే కె - విటమిన్ ను తయారు చేస్తుంది. సిరోసిన్, హైపటైటిస్ వంటి కాలేయ సంబంధ సమస్యలున్నప్పుడు కె- విటమిన్ తయారీ కుంటుపడి రక్తస్రావం జరుగుతుంది. ఆయుర్వేదంలో లివర్ సంబంధ సమస్యలకు చక్కని ఔషధాలున్నాయి.
ఔషధాలు: అవిపత్తికర చూర్ణం, భృంగరాజాసవం, చంద్రప్రభావటి, ధాత్రీలోహం, ద్రాక్షాది రసాయనం, గుడూచి సత్వం, జంబీరాది పానకం, పంచతిక్త క్వాథ చూర్ణం, పిప్పల్యాది లోహం, పునర్నవాది మండూరం, శిలాజిత్వాది లోహం, సప్తామృత లోహం, తాప్యాది లోహం.
7. కార్టిజోన్ హార్మోను అధిక స్థాయిలో విడుదలవ్వటం (కూషింగ్స్ సిండ్రోమ్):
కిడ్నీల పై నుండే ఎడ్రినల్ గ్రంథులు అవసరానికి మించి ఉత్తేజానికి గురై, అధిక స్థాయిలో కార్టిజోన్ హార్మోనును విడుదల చేస్తే 'కూషింగ్స్ సిండ్రోమ్' అనే స్థితి ఏర్పడుతుంది. ఈ స్థితి ఏర్పడటానికి ఎడ్రినల్ గ్రంథులతో పాటు మెదడు మూల భాగంలో ఉండే పిట్యూటరీ గ్రంథి కూడా కారణమయ్యే అవకాశం ఉంది. కార్టిజోన్ హార్మోన్ వల్ల శరీరంలో ప్రోటీన్లు విచ్చిన్నమవుతాయి. రక్తనాళాల గోడలు కూడా ప్రోటీన్ సంబంధ పదార్థంతోనే నిర్మితమవుతాయి కాబట్టి ఇవి చిట్లిపోయి రక్తస్రావమవుతుంది. దీని ఫలితంగా చర్మం కములుతుంది.
ఔషధాలు: పునర్నవాది గుగ్గులు, శోథఘ్నవటి, మూత్రవిరేచనీయక్వాథం.
8. వైరల్ ఇన్ఫెక్షన్లు:
చిన్న చిన్న వైరల్ ఇన్ఫెక్షన్లయినప్పటికి ఒకోసారి రక్తంలోని ప్లేట్ లెట్స్ ని నాశనం చేస్తుంటాయి. ప్లేట్ లెట్స్ రక్తం గడ్డకట్టడానికి తోడ్పడుతాయి కాబట్టి వీటి నాశనంతో చర్మం ఉన్నట్టుండి అక్కడక్కడా కములుతుంది. అందుకే, చిన్న చిన్న రుగ్మతలనుకూడా అశ్రద్ధ చేయకుండా సకాలంలో తగ్గించుకోవాలి.
9. లుకీమియా, ఇతర మూలుగకు సంబంధించిన వ్యాధులు:
లుకీమియాతోపాటు ఎముకల మూలుగను వ్యాధిగ్రస్తం చేసే అనేక ఇతర వ్యాధుల వల్ల రక్తస్రావం, చర్మం కమలడాలు జరుగుతాయి. నిజానికి ఇతిమిద్ధమైన కారణం లేకుండా చర్మం కమలడం, నీరసం ఆవహించడం, రక్తాల్పత తాలూకు ఇతర లక్షణాలూ కనిపిస్తున్నట్లయితే ముందుగా లుకీమియాను అనుమానించాలి. ఐతే, అదృష్టవశాత్తు ఈ వ్యాధి అంత సాధారణంగా కనిపించదు.
ఔషధాలు: మోతీ భస్మం, ప్రవాళ భస్మం, ముక్తాపిష్టి రౌప్యభస్మం.