చనుమొనల నుంచి రక్తస్రావం:

 

1. చనుమొన పొడిగా, చిట్లినట్లుగా,నొప్పిగా కూడి ఉంటుందా?

ప్రసూతికాలంలో చనుమొన చిట్లడం (సోర్ / క్రాక్ డ్ నిపుల్)

2. ఒక రొమ్ము తాలూకు చనుమొన నుంచి మాత్రం రక్తం కనిపిస్తుందా? అలాగే అదే రొమ్ములో గడ్డలు తగులుతున్నాయా?

గడ్డలు / పెరుగుదలలు / క్యాన్సర్

 

చనుమొనల (నిపుల్) నుంచి రక్తం కారుతున్నప్పుడు జాగ్రత్తగా గమనించాలి. ఎందుచేతనంటే చూచుకం చిట్లడం దగ్గరనుంచి శిశువుకు పాలివ్వడం వల్ల ఏర్పడిన గాయం వరకు ఏదైనా దీనికి కారణం కావచ్చు. అన్నిటికి మించి రొమ్ము క్యాన్సర్ కు సంబంధించిన అనుమానాన్ని నివృత్తి చేసుకోవడం అవసరం. (అన్ని రొమ్ము క్యాన్సర్లూ గడ్డల మాదిరిగా ఉండాలని లేదు; ముఖ్యంగా ప్రారంభావస్థలో.) ఈ క్రింది విషయాలు మీరు సరైన దిశలో ఆలోచించడానికి సహాయపడతాయి.

1. ప్రసూతికాలంలో చనుమొన చిట్లడం (సోర్ / క్రాక్ డ్ నిపుల్):

కుచాగ్రానికి గాయమైనప్పుడుగాని, చిత్లినప్పుడుగాని లేదా ఎగ్జిమా వంటి చర్మవ్యాధి వచ్చినప్పుడు గాని చనుమొన నుంచి కొద్దిగా రక్తస్రావం కనిపించే అవకాశం ఉంది.

సూచనలు: దీనికి జాత్యాది ఘృతం చాలా బాగా పని చేస్తుంది. జాతి అంటే సన్నజాజి, ఈ మొక్కకు గాయాలను తగ్గించే శక్తి ఉంది. అలాగే, శతధౌత ఘృతం అనే మందు కూడా బాగా పని చేస్తుంది. (ఔషధసిద్ధమైన నెయ్యిని వంద సార్లు కడిగి ఔషధంగా తయారు చేస్తే దానిని శతధౌత ఘృతం అంటారు.) ఈ రెండుమందుల్లోనూ నెయ్యి ప్రధాన ద్రవ్యంగా ఉంటుంది. నెయ్యికి గాయాలను, వ్రణాలనూ మాన్పే అద్భుతమైన శక్తి ఉందన్న సంగతి తెలిసిందే.

2. గడ్డలు / పెరుగుదలలు / క్యాన్సర్:

రోమ్ముల్లోని స్తన్యవాహక మార్గాల్లో చిన్న చిన్న పెరుగుదలలు ఏర్పడితే రక్తస్రావం కనిపించే అవకాశం ఉంది. దీనికి దశాంగలేపం అనే ఆయుర్వేద మందును పైపూతగా వాడితే వెంటనే గుణం కనిపిస్తుంది. కేవలం ఒక వక్షం నుంచే రక్తస్రావమవుతుంటే మాత్రం ఏ మాత్రం అశ్రద్ధ చేయకూడదు; 35 సంవత్సరాలు దాటినా మహిళలు ఈ విషయంలో మరింత శ్రద్ధ వహించడం అవసరం. మామోగ్రామ్ అనే ఒక రకమైన ఎక్స్ రే పద్దతి ద్వారా స్తనాలకు సంబంధించిన క్యాన్సర్లను తేలికగా కనిపెట్టవచ్చు.

సూచనలు: ఇటీవల కాలంలో చిత్రమూలం, తాళీసుపత్రి, బిళ్లగన్నేరు, అశ్వగంధ, పసుపు వంటి అనేక ఆయుర్వేద మూలికలకు క్యాన్సర్ వ్యతిరేక గుణాలున్నట్లుగా అధ్యయానాల్లో వెల్లడయ్యింది. బ్రెస్ట్ క్యాన్సర్ అని తేలితే, అవసరమనకుంటే, కీమోథెరపీతో పాటుగానూ, లేదా కీమోనూ, రేడియేషన్నీ భరించలేని స్థితిలో ఉన్నవారికి నేరుగానూ ఈ మూలికలతో తయారైన మందులను ఇవ్వచ్చు.

ఔషధాలు: వజ్రభస్మం, కాంచనార గుగ్గులు, లక్ష్మీవిలాస రసం (నారదీయ), భల్లాతకవటి, చిత్రాకాదివటి, క్రౌంచపాకం.