వక్షోజాల నొప్పి:

 

1. రొమ్మునొప్పి ప్రతి నెలా బహిష్టుకు కొన్ని రోజుల ముందు నుంచి ప్రారంభ మావుతుందా?

స్తవశోథ (మాస్టైటిస్)

2. గర్భం ధరించారా? లేక పాపాయికి పాలిస్తున్నారా?

గర్భధారణ / చనుబాలిచ్చే కాలం

3. గర్భ నిరోధక మాత్రలనుగాని, హార్మోన్ రిఫేస్ మెంట్ థెరపీనిగాని తీసుకుంటున్నారా?

హార్మోన్ చికిత్సల దుష్ఫలితాలు

4. ఇతర రకాలైన మందులను వాడుతున్నారా?

మగవారిలో స్తనాల వృద్ధి (గైనకోమాస్టియా)

5. జాగింగ్ చేసే అలవాటు ఉందా?

జాగర్స్ నిపుల్

 

రొమ్మునొప్పిని ప్రతి మహిళ తన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అనుభవించే అవకాశం ఉంది. కొంతమందిలో ఇది నెల నెలా బహిష్టుకు ముందు వస్తూ ఉంటుంది. సాధారణంగా ఈ తరహా నొప్పి హార్మోన్స్ ప్రభావం చేత వచ్చేదే తప్పితే దానిలో కంగారు పదాల్సినంత ప్రమాదభరితమైన అంశమేదీ లేదు. రొమ్ము నొప్పి అనడంతోనే చాలా మంది ఆలోచన రొమ్ము క్యాన్సర్ వైపు పోతుంది. కాని, రొమ్ము క్యాన్సర్ అనేది నొప్పితోను, అసౌకర్యంతోను మొదలవ్వదు. రొమ్ములో నొప్పితో కూడిన గడ్డ కనిపించినప్పుడు అదో క్యాన్సర్ పెరుగుదల కంటే చీము గడ్డ అవ్వటానికే అవకాశాలు ఎక్కువ.

 

రొమ్ము క్యాన్సర్ లక్షణాలు మరో విధంగా ఉంటాయి: వ్యాధి ప్రారంభంలో నొప్పి ఉండదు. అలాగే స్పర్శకు గట్టిగా తగులుతుంది. కదిలించినప్పుడు కదలకుండా లోపల కణజాలాలతో సంబంధం కలిగి ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా పెరుగుదల పైన చర్మం కమలాఫలం తొక్కను పోలి ఉంటుంది. ఇటువంటి పెరుగుదల కనిపించినప్పుడు ఏ మాత్రం అశ్రద్ధ చేయకూడదు.

రొమ్ములో నొప్పి అనిపిస్తున్నప్పుడు అది ప్రమాదకారమా, కాదా, అనేది నిర్ణయించడానికి కొన్ని అంశాలను పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. అవేమిటో చూద్దాం.

 

1. స్తనశోథ (మాస్త్రెటిస్):

రొమ్మునొప్పి బహిష్టుకు ముందు రోజుల్లో వస్తే దానిని వైద్య పరిభాషలో 'ప్రీ మెన్ స్ట్రువల్ మ్యాస్ట్రెటిస్' గా చెబుతారు. దీనిలో రొమ్ములో కణజాలం గట్టిగా, కదుముల మాదిరిగా తగులుతుంది. కొంతమంది మహిళలలో రజస్వల (పెద్దమనిషి) అయినది మొదలు రజోనివృత్తి (మోనోపాజ్) వరకూ ప్రతినెలా ఈ నొప్పి వస్తూనే ఉంటుంది. కొన్ని రోజులు అవస్థలు పది చివరికి వారు దీనికి అలవాటు పడిపోతారు. రొమ్ము నొప్పి బహిష్టుకు వారం ముందు నుంచి రోజు రొమ్ముల్లోనూ మొదలవుతుంది.

స్త్రీ - సెక్స్ హార్మోన్ల పెరుగుదల కారణంగా శరీరంలో నీరు అధికంగా సంచితమై రొమ్ము కణజాలాల మీద ఒత్తిడిని కలిగించి నొప్పికి, గట్టిదనానికి కారణం అవుతుంది. దీని వల్ల ఒక్కొక్కసారి రొమ్ములో గడ్డలు ,కూడా తయారయ్యే అవకాశం ఉంది. సూచనలు: ఈ స్థితి పదేపదే తిరగబెడుతున్నప్పుడు ఆహారంలో కెఫిన్ కలిగిన పదార్థాలను (కాపీ, టీ, చాక్లెట్స్, కోలా డ్రింకులు) తగ్గించడంకాని, పూర్తిగా మానేయడం కాని చేయాలి, అలాగే 'ఈవినింగ్ ప్రైమ్ రోజ్ ఆయిల్' ను వాడటం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. ఇది మెడికల్ షాపుల్లో క్యాప్సుల్స్ రూపంలో దొరుకుతుంది. ఆహారంలో పిండి పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే ఈ తారగా నొప్పుల్లో మంచిది.

ఔషధాలు: కాంచనార గుగ్గులు, శోథజగ్న వటి, చంద్రప్రభావటి.

బాహ్యప్రయోగం: దశాంగలేపం.

 

2. గర్భధారణ / చనుబాలిచ్చే కాలం:

మహిళల్లో గర్భం ధరించిన తొలినాళ్లలో కనిపించే మొట్టమొదటి లక్షణం రొమ్ములో తిమ్మిర్లు పట్టినట్లు వుండటం, సద్యోగృహీత గర్భచిహ్నంగా... హృదయే వ్యథా... అంటూ శాస్త్రకారుడు ఈ లక్షణం గురించి చెబుతాడు. హృదయ ప్రదేశమంటే ఛాతి ప్రదేశమని అంతరార్థం. గర్భధారణ కొనసాగే కొద్దీ రొమ్ముల్లో స్థన్యవాహక గ్రంథులు అభివృద్ధి చెంది, చుట్టూ ప్రక్కల కణజాలాల మీద ఒత్తిడిని కలుగజేసి రొమ్ములో అసౌకర్యాన్నీ, కొద్దిపాటి నొప్పినీ కలుగజేస్తాయి. ఇదే విధంగా ప్రసవానంతరం పిల్లలకు పాలిచ్చే తల్లులలో ఒకవేళ ఏ కారణం చేతనైనా పాపాయికి పాలివ్వలేకపోతే కూడా రొమ్ములో స్థన్యం ఎక్కువగా తయారై నొప్పిగా, అసౌకర్యంగా అనిపిస్తుంది.

సూచనలు: వక్షోజాలకు సపోర్టు ఉండే విధంగా సరైన బ్రాసరీలను ధరించడం, సుఖోష్టంగా ఉండే కాపడాన్ని పెట్టుకోవటం, ఒకవేళ అబాలింతలైతే రొమ్ముల్లో అధికంగా సంచితమైన పాలను పిండేయడం, ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవడం వంటి పద్ధతులతో ఈ రకమైన అసౌకర్యాన్ని అధిగమించవచ్చు.

3. హార్మోన్ చికిత్సల దుష్ఫలితాలు:

గర్భనిరోధక మాత్రలనుగాని, హార్మోన్ రిప్లేస్ మెంట్ థెరపిగాని తీసుకునే వారిలో అదనపు ఫిమేల్ సెక్స్ హార్మోన్ల కారణంగా వక్షోజాల కణజాలాల్లో మార్పులు సంభవించి అసౌకర్యం, నొప్పి మొదలైనవి అనిపించే అవకాశం ఉంది. ఈ విధంగా సాధారణంగా మందులను వాడే మొదటి నెలలో సంభవిస్తూ ఉంటుంది. మోనోపాజ్ లక్షణాలను అదుపుచేయటానికి నేటి వరకు ప్రపంచ వ్యాప్తంగా హార్మోన్ రిప్లేస్ మెంట్ థెరపి (హెచ్.ఆర్.టి) ని వైద్యులు సూచిస్తూ వస్తున్నారు. అయితే, ఇటీవల కాలంలో నిర్వహించిన అధ్యయనాలలో హెచ్.ఆర్.టి కారణంగా క్యాన్సర్ తో సహా పలు అవాంఛనీయ సమస్యలు ఏర్పడటంతో ఈ చికిత్సపై జరుపుతున్న అధ్యయనాలను అర్థాంతరంగా ఆపుచేయాల్సి వచ్చింది.

ఈ విషయాన్ని గూర్చి దాదాపు అన్ని పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి కూడా. ప్రపంచం మొత్తం, ప్రస్తుతం హెచ్.ఆర్.టి. కి ప్రత్యామ్నాయాల గురించి చూస్తోంది. సూచనలు: సోయా చిక్కుడు, ఇతర చిక్కుళ్లు, టమాట, పుచ్చకాయ, రేగు, కంది, పెసర, యష్టి మధుకం, దానిమ్మ వీటిని బాగా తీసుకోవాలి. వీటిల్లో ఎక్కువగా 'ఫైటో ఈస్ట్రోజన్స్' ఉంటాయి. శరీరంలో ఈస్ట్రోజన్ తగ్గినప్పుడు సానుకూలంగాను, ఈస్ట్రోజన్స్ పెరిగినప్పుడు ప్రతికూలంగాను పనిచేసే సహజమైన స్టీరాయిడ్ ఎంజైమ్ మాడ్యులేటర్స్ ను ఫైట్స్ ఈస్ట్రోజన్స్ అంటారు.

ఔషధాలు: అశోకారిష్టం, అశోక ఘృతం, అశోకాది వటి, కళ్యాణక క్షీరబలా తైలం (101 ఆవర్తాలు), నష్టపుష్పాంతక రసం, పుష్యానుగ చూర్ణం, ఫలసర్పి, ప్రదరాంతక రసం, సుకుమార ఘృతం, సుకుమార రసాయనం, శతావరి లేహ్యం.

4. మందులు దుష్ఫలితాలు:

కొన్ని రకాల అల్లోపతి మందులకు రొమ్ముల్లో అసౌకర్యాన్ని, నొప్పిని కలిగించే నైజం ఉంటుంది. గుండె లయను క్రమబద్ధం చేయడానికి వాడే 'డిజిటాలిస్' అనే మందుకు, హార్ట్ ఫెయిల్యూరును, హైబిపిని కంట్రోల్ చేయడానికి వాడే మందులకు, మత్తును కలిగించటానికి వాడే ట్రాన్ క్విలైజర్స్ కు వక్షోజాలలో అసౌకర్యాన్ని కలిగించే తత్వం ఉంటుంది. ఈ మందులను వాడుతూ అసౌకర్యాన్ని కనుక అనుభవిస్తున్నట్లయితే, వైద్య సలహాతో మందులను ఆపేయటంకాని, మోతాదును తగ్గించటం కాని చేయాలి.

5. మగవారిలో స్తనాలవృద్ధి (గైనకోమాస్టియా):

ఆల్కహాల్ అధికంగా తీసుకునే మగవారిలో కాలేయం దెబ్బతిని ఈస్ట్రోజన్ ను (స్త్రీ సెక్స్ హార్మోన్) బహిర్గత పరచలేదు. దీనితో స్థనాలలో అసౌకర్యము, నొప్పి కలిగే అవకాశం వుంది. దీనిని వైద్య పరిభాషలో; గైనకోమాస్టియా; అంటారు. దీనికి పరిష్కారంగా ఆల్కహాల్ ను మానేయటమే కాకుండా శోథహర ఔషధాలు వాడాలి.

ఔషధాలు: కాంచనార గుగ్గులు, పునర్నవాది గుగ్గులు, చంద్రప్రభావటి.

6. జాగర్స్ నిపుల్:

కొంతమందిలో దుస్తులు స్థవ చూచుకాలకు ఒరుసుకొని అసౌకర్యం, నొప్పి కలిగే అవకాశం వుంది. ఇది ఎక్కువగా జాగింగ్ చేసేవారిలో కనిపిస్తుంది. దీనికి పై పూతగా 'జాత్యాదిఘృతం' అనే ఆయుర్వేద మందును రాస్తే సరిపోతుంది. అలాగే సరైన లోదుస్తులను ధరించాల్సి ఉంటుంది.