బహిష్టు నొప్పి

1. బహిష్టు ప్రారంభమయ్యే ముందు పొత్తికడుపు నొప్పిగా ఉంటుందా?

శారీరక క్రియ

2. బహిష్టు నొప్పి గర్భనిరోధక మాత్రలను ఉపయోగించడం మానేసిన తరువాత నుంచి ప్రారంభమైందా?

గర్భనిరోధకమాత్రలను వాడుతూ ఆపేయడం

3. గర్భాశయాంతర్గత సంతాన నిరోధక సాధనాన్ని (ఐ.యు.సీ.డి.) అమర్చుకున్నారా?

కుటుంబ నియంత్రణా సాధనం వల దుష్ఫలితాలు

4. కడుపు నొప్పిం నడుము నొప్పిలతోపాటు మైథనంలో నొప్పి ఉంటుందా? మల మూత్ర నిర్హరణ వ్యవస్థలో తేడాలు చోటు చేసుకున్నాయా?

గర్భాశయ అంతర్గత పొర ఇతర ప్రదేశాల్లో పెరగటం (ఎండో మెట్రియోసిస్)

5. పొత్తికడుపు ఉబ్బరించినట్లుండటమే కాకుండా, తుంటి ప్రాంతం, నడుము ప్రాంతాల్లో బరువుగా ఉంటుందా?

గర్భాశయంలో నారవంటి కండర పెరుగుదలలు తయారవ్వటం (ఫైబ్రాయిడ్స్)

6. నొప్పి ఎప్పుడు వస్తుందనేది ఊహించగలవి కాకుండా ఉందా?

గర్భాశయంలో తిత్తి వంటి నిర్మాణాలు పెరగటం (పాలిప్స్)

7. గర్భాశయం ద్వారానికి ఇంతకుముందు ఇన్ఫెక్షన్ సోకిందా? లేదా గాయమయిందా?

గర్భాశయం ద్వారం ఇరుకుగా మారటం

8. నడుము, తుంటి ప్రాంతాలలోని అంగప్రత్యంగాలలో ఇన్ఫెక్షన్ చోటు చేసుకుందా? తెలుపు అవుతుందా?

కటివలయంలో వాపు (పెల్విక్ ఇన్ ఫ్లమేటరీ డిసీజ్)

 

మన శరీరంలో రకరకాల జీవగడియారాలు పనిచేస్తుంటాయి. స్త్రీలలో ఇటువంటి జీవ గడియారం ఒకటి యుక్త వయస్సు వచ్చిన నాటినుండి 40-55 సంవత్సరాలు వచ్చే వరకు కొనసాగుతుంది. దానినే బహిష్టు అంటాము. క్రమం తప్పకుండ బహిష్టుస్రావం రూపంలో ప్రతి 28 రోజులకు కనిపించే ఈ పరంపరను ఆయుర్వేదం 'రుతుక్రమం' అని పిలిచింది.

అలవోకగాజరాగ్ల్సిన ఈ క్రమం బాధామయంగా మారితే దానిని 'రజః కృచ్చ్రత' అంటారు. స్త్రీలలో అండం ఫలదీకరణం చెందిన తరువాత గర్భాశయంలో పెరగవలసి ఉంటుంది. దీనికోసం ముందునుంచే గర్భాశయం సన్నద్ధంగా ఉండటం అవసరం. ఈ ప్రయత్నంలో భాగంగా గర్భాశయం లోపల ఒక మెత్తటి పొర తయారవుతుంది.

ఒకవేళ గర్భం ఫలవంతమైతే ఈ పొరనుండే పిండానికి కావలసిన మౌలికాంశాలు అందుతాయి. లేనిపక్షంలో ఈ పొర మొత్తం కరిగి, బహిష్టు రూపంలో వెలుపలికి స్రవిస్తుంది. ఒక క్రమపద్ధతిలో ప్రతి 28 రోజులకు ఒకసారి వెలువడుతుండటం వలన ఈ బహిష్టు స్రావాన్ని 'నెలసరి' అనే పేరుతో పిలుస్తుంటారు. జీవ క్రియా ధర్మం కనుక బహిష్టు సమయంలో వచ్చే నొప్పి కొంత మేరకు ఆమోదయోగ్యమే అయినా, అది మిమ్మల్ని పట్టి కుదిపేస్తుంటే మాత్రం భరించాల్సిన అవసరం లేదు. కారణాన్ని కనుగొనడం అవసరం. బహిష్టు స్రావం సజావుగా వెలువడేలా చేయడానికి శరీరం లోపల ప్రోస్టాగ్లాండిన్స్ అనే రసాయన పదార్థాలు తయారవుతాయి.

ఇవి గర్భాశయం లోపలి పొరను కరిగించడానికి, గర్భాశయాన్ని సంకోచింపడానికి దోహదపడుతాయి. వీటి పనితీరు సక్రమంగా లేకపోతే బహిష్టు స్రావం బాధామయంగానూ, నొప్పిగానూ తయారవుతుంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం నడుము ప్రాంతంలోని కటి ప్రదేశం 'అపాన వాయువు'కు కేంద్రస్థానంగా ఉంటుంది. దీని ప్రభావం చేత బహిష్టు స్రావాలు, మల మూత్రాదులు నిరాటంకంగా వెలువడుతాయి. కొన్ని ప్రత్యేకతమైన కారణాలూ, పరిస్థితులులూ ఈ అపానవాయువును అడ్డుకున్నప్పుడు బహిష్టు స్రావం మందగించి నొప్పి మొదలవుతుంది. మీరు బహిష్టు నొప్పితో ఎక్కువగా ఇబ్బంది పడుతుంటే, ఈ కింది పాయింట్ల దిశగా ఆలోచిస్తే మీ ఆందోళన ఒక కొలిక్కివస్తుంది.

1. శారీరక క్రియ:

ఋతుక్రమం పొడవునా స్త్రీ శరీరంలో హార్మోన్లు హెచ్చు తగ్గులుగా విడుదల అవుతుంటాయి. వీటి ప్రభావం వల్లగాని, ప్రోస్టోగ్లాండిన్స్ అతి చురుకుదనం వల్లగాని అత్యధిక శక్తితో గర్భాశయం కుంచించుకున్నప్పుడు, పొత్తి కడుపు పై భాగంలో నొప్పి అనిపిస్తుంది. ఇతర కాంప్లికేషనన్లేవీ లేని సాధారణ బహిష్టు నొప్పుల్లో ఈ కింది సూచనలు ఉపయోగపడతాయి:

సూచనలు: బహిష్టు నొప్పికి కలబంద అనే మందు మొక్క అద్భుతంగా పనిచేస్తుంది. రాతి నెలలోనూ, ఎడారి ప్రాంతాలలోనూ పెరిగే ఈ మొక్కలో అసాధారణ ఔషధ విలువలు దాగి ఉన్నాయి. దీని గుజ్జునుండి స్వరసం తీపి బహిష్టుకు రెండు రోజుల ముందు నుంచి తాగటం ప్రారంభించాలి.

చాలా మంది మహిళలు బహిష్టు రోజులలో, కడుపు ఉబ్బరించినట్లుండటం వలన, భోజనం మానేసి స్వీట్లు, ఉప్పు కలిసిన చిరుతిండ్లు తింటుంటారు. కాని ఇలా తినడం వల్ల సమస్య మరింత ఎక్కువవుతుంది. తాజా కూరగాయలూ, పండ్లూ, కారం మసాలాలు కలపని సాత్వికాహారాలూ ఎక్కువగా తీసుకోవాలి. భోజనం తక్కువ మోతాదులలో ఎక్కువసార్లు తీసుకోండి.

కాఫీ, టీ, కోలా డ్రింకులూ, చాక్లెట్లను మానివేయండి; వీటిలో ఉండే కెఫిన్ మిమ్మల్ని ఉద్వేగ పరచడంతోపాటు బహిష్టు నొప్పులను అధికం చేస్తుంది. వీటిబదులు పల్చని పాలు తాగండి. పాలలో కాల్షియం సహజ రూపంలో లభిస్తుంది. బహిష్టు నొప్పులను నియంత్రించడంలో కాల్షియం గణనీయంగా తోడ్పడుతుంది.

మూత్రాన్ని జారీచేసే ఔషధాలను వాడితే బహిష్టు స్రావం కూడా సాఫీగాజరిగి, బాధ శమిస్తుందని కొంతమంది భ్రమిస్తుంటారు. ఐతే, ఈ తర్కం బహిష్టు నొప్పుల విషయంలో పని చేయదు. అంతేకాకుండా మూత్రంతోపాటు కొన్ని ఖనిజాలు శరీరం నుండి వెళ్లిపోయి నొప్పులు అధికమయ్యే అవకాశం కూడా ఉంది.

బహిష్టు నొప్పులెక్కువగా ఉన్నప్పుడు గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయడం, తేలికపాటి వ్యాయామాలూ, యోగా, విశ్రాంతి వంటివీ తోడ్పడుతాయి. బహిష్టు నొప్పికి చికిత్సగా ఆయుర్వేదం ప్రారంభానికి రెండు రోజుల ముందు విరేచన కర్మను పేర్కొంది. దీనికోసం త్రిఫలాచూర్ణంను వాడచ్చు. ఆహార పరంగా, మలబద్దకం లేకుండా చూసుకోవాలి. బాగా నీళ్లు తాగాలి. పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.

దుంపకూరలు, వంకాయ వేపుళ్లను మానేస్తే మంచిది.

బీరకాయ, పొట్లకాయ, సొరకాయ, మునగ, కాకర, దోస వంటి కాయగూరలు మంచివి. వెల్లుల్లి మరీ మంచిది. ఒకవేళ దీని వాసన మీకు నచ్చకపోతే వెల్లుల్లిని మజ్జిగతోనో, నిమ్మరసంతోనో తీసుకోవచ్చు.

బహిష్టు నొప్పులలో ఇంగువ సమర్థవంతంగాపనిచేస్తుంది. దీనిని ఒక గ్రాము మోతాదుగా ఆహారంతో కలిపిగాని, నేరుగా నీళ్లతోగాని తీసుకోవాలి.

గృహచికిత్సలు: 1. వస పొడిని (అరచెంచాడు) వేడి నీళ్ళతో రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 2. నల్లనువ్వులు (ఒక చెంచా), జీలకర్ర (అరచెంచా), బెల్లంతో సహా నూరి రెండు పూటలా తీసుకోవాలి. 3. మందారపువ్వులను గజ్జిగతో కలిపి ముద్దగా నూరి పూటకు రెండు చెంచాల వంతున రెండు పూటలా తీసుకోవాలి. 4. పత్తి చెట్టు వేరు బెరడును కచ్చాపచ్చగా దంచి కషాయం కాచి ప్రతి గంటకు అరకప్పు చొప్పున నొప్పి తగ్గించే వరకు తీసుకోవాలి.

ఔషధాలు: రజఃప్రవర్తనీవటి, అశోకారిష్టం, కుమార్యాసవం, బలాసూర్యోదయ రసం, నష్టపుష్పాంతక రసం, ఫలసర్పి, సుకుమారఘృతం. 2. గర్భనిరోధక మాత్రలను వాడుతూ ఆపేయడం: హార్మోన్లకు గర్భనిరోధకమాత్రల రూపంలో తీసుకునేటప్పుడు బహిష్టు స్రావం పైన గట్టి నియంత్రణ ఏర్పడటంతో పాటు నొప్పి కూడా నెమ్మదిస్తుంది. ఎప్పుడైతే వీటిని తీసుకోవడం ఆపివేస్తారో అప్పుడు మళ్లీ బహిష్టు స్రావం అధికమవడంతోపాటు నొప్పి కూడా మొదలవుతుంది.

ఔషధాలు: రజఃప్రవర్తనీవటి, క్రవ్యాదిరసం, టంకణభస్మం, వంగభస్మం.

3. కుటుంబ నియంత్రణా సాధనం వల్ల దుష్ఫలితాలు:

ఐ.యు.సి.డి.ని అమర్చుకున్న తొలి రోజుల్లో రుతుస్రావం అధికమయ్యే అవకాశముంది. అలాగే, లోపల మెలితిప్పుతునట్లు నొప్పి కూడా రావచ్చు. శరీరం సంతాన నిరోధక సాధనాన్ని శరీరేతర పదార్ధంగా భావించి తిరస్కరించడంతో ఈ సమస్య వస్తుంది. మూడు నెలలపాటు రక్తస్రావం ఇలాగే కొనసాగితే ప్రత్యామ్నాయ కుటుంబనియంత్రణా మార్గాలను అన్వేషించాలి.

4. గర్భాశయ అంతర్గత పొర ఇతర ప్రదేశాల్లో పెరగటం (ఎండో మెట్రియోసిస్):

ఈ వ్యాధిలో బహిష్టు నొప్పి వుంటుంది. గర్భాశయంలోని లోపలిపొరను పోలిన కణజాలం గర్భసంచిలో కాకుండా వేరే చోట ఉదరకోశంలో వివిధ ప్రదేశాల్లో కనిపిస్తున్నప్పుడు దానిని ఎండోమెట్రియోసిస్ అంటారు. గర్భాశయాంతర్గత పొర మాదిరిగా ఈ కణజాలం కూడా బహిష్టు సమయాల్లో ప్రేరేపితమై రుతురక్తాన్ని స్రవిస్తూ ఉంటుంది. ఐతే, ఈ రక్తానికి బయటకు వెళ్లే మార్గం ఉండకపోవడంతో లోపలే సంచితమై వాపునూ, తంతుయుత నిర్మాణాలనూ తయారుచేయడమే కాకుండా అంతర్గత అవయవాలను ఒకదానికొకటి అతుక్కునేలా చేస్తుంది. సంతానయోగ్య వయసు వచ్చిన మహిళల్లో సుమారు పదిశాతం మందిని ఈ వ్యాధి బాధిస్తుందని ఒక అంచనా. 25 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు స్త్రీలల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. బహిష్టులు మొదలుకాని ఆడపిల్లల్లోనూ, రజోనివృత్తి జరిగిన మహిళల్లోనూ ఈ వ్యాధి కనిపించదు. ఈ వ్యాధికి ఇతిమిద్ధమైన కారణం తెలియక పోయినా, తిర్యక్ దిశలో బహిష్టు రక్తం ప్రవహించి ఉదర కుహరంలోనికి చేరుకొని ఎండోమెట్రియల్ ఇంప్లాంట్స్ ని ఏర్పరిచి తద్వారా నెల నెలా సమస్యను కలిగించే అవకాశం ఉన్నదని అధ్యయన కారులు సిద్ధాంతీకరిస్తున్నారు. అనువంశిక, వ్యాధిరక్షణ శక్తి తగ్గటం, వ్యక్తిగత శరీర ప్రకృతి వంటివన్నీ ఈ వ్యాధిని కలిగించే అవకాశం ఉంది.

ఎండోమెట్రియోసిస్ వల్ల విపరీతమైన బహిష్టు నొప్పి వస్తుంది. కొంతమందిలో నడుము నొప్పి, మలమూత్ర విసర్జన సమయాల్లో నొప్పి సైతం ఉంటాయి. భార్యాభర్తల సంగమ సమయంలో నొప్పిగా అనిపిస్తుంది. బహిష్టు స్రావం అనియతంగా, అధిక మొత్తాల్లో, అపక్రమంగా జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో కనిపించీ కనిపించనట్లు, బొట్లు బొట్లుగా జరుగుతుంటుంది కూడా. ఈ లక్షణాల కారణంగా సంతానరాహిత్యం, అబార్షన్ల వంటివి చోటు చేసుకుంటాయి.

ఈ స్థితిని పోలిన వ్యాధిని ఆయుర్వేద సంహితలు 'వాతలు యోనివ్యాపత్తు'గా వర్జించాయి.

ఈ కింది సూచనలు పాటిస్తే ఎండోమెట్రియోసిస్ వల్ల ఇబ్బంది కలుగకుండా ఉంటుంది.

సూచనలు: పీచుపదార్థాలను ఎక్కువగా తీసుకుంటే కండరాలు ముడుచుకోవడం వల్ల ఏర్పడే 'శూల' (క్రాంపింగ్) తగ్గుతుంది. అలాగే గింజ ధాన్యాలు, ఇతర నూనె గింజలను తీసుకుంటే, వాటిల్లో ఉండే తైలాల వల్ల నొప్పి ఉపశమిస్తుంది.

పెరుగు, మజ్జిగ, వెల్లుల్లి, ఇంగువ, కాయగూరలు, క్యారెట్స్ వంటివి మంచివి. పంచదార, జంతుసంబంధ కొవ్వు పదార్థాలు నొప్పిని ఎక్కువ చేస్తాయి కాబట్టి వీటిని తగ్గించుకోవాలి. పాలు, మాంసాల్లో హార్మోన్లు ఉండే అవకాశం ఉంది కనుక వీటిని కూడా తగ్గించుకోవాలి.

బీ- కాంప్లెక్స్ విటమిన్ లు కలిగిన ఆహారాలను తీసుకుంటే శరీరంలో సంచితమైన అధిక ఈస్ట్రోజన్ విచ్చినమవుతుంది.

ఉసిరి వంటి విటమిన్ - సి కలిగిన ఆహారాలను తీసుకుంటే రక్తస్రావం ఆగుతుంది. విటమిన్ - ఇ వాపును తగ్గిస్తే, లోహం కలిగిన ఆహారాలు (ద్రాక్ష, యాపిల్) రక్తాన్ని వృద్ధి పరిచి రక్తస్రావం వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తాయి. క్యాల్షియం కలిగిన ఆహారాలు (పాలకూర, టమాట, మజ్జిగ( గర్భాశయం కండరాల్లో పుట్టే నొప్పిని తగ్గిస్తాయి.

యుక్తవయసునుంచే ఏరోబిక్ వ్యాయామాలను చేసే ఆడపిల్లల్లో ఎండోమెట్రియోసిస్ తక్కువగా కనిపించినట్లు ఇటీవల జరిగిన కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవే కాకుండా జల క్రీడలు, ఈత, మెడిటేషన్ వంటి ప్రత్యామ్నాయ విధానాల వల్ల కూడా మంచి ఫలితం కనిపిస్తుంది.

ఫైటో ఈస్ట్రోజన్స్ ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. సోయా చిక్కుడు, ఇతర చిక్కుడ్లు, టమాట, పుచ్చకాయ, రేగు, కంది, పెసర, యష్టి మధుకం, దానిమ్మ వీటిల్లో ఎక్కువగా ఫైటో ఈస్ట్రోజన్స్ ఉంటాయి. శరీరంలో ఈస్ట్రోజన్స్ తగ్గినప్పుడు సానుకూలంగాను, ఈస్ట్రోజన్స్ పెరిగినప్పుడు ప్రతికూలంగాను పనిచేసే సహజమైన స్టీరాయిడ్ ఎంజైమ్ మాడ్యులేటర్స్ ను ఫైటో ఈస్ట్రోజన్స్ అంటారు.

ఔషధాలు: అశోకారిష్టం, పుష్యానుగ చూర్ణం, చంద్రకళారసం.

 

5. గర్భాశయంలో నారవంటి కండర పెరుగుదలలు తయారవ్వటం (ఫైబ్రాయిడ్స్):

కొంతమందికి గర్భాశయపు కండర పొరలలో అక్కడక్కడా కంతులు తయారవుతుంటాయి.ఇవి గర్భాశయం లోపలికీ, లేదా బయటకూ పెరుగుతుంటాయి. ఒక మోస్తారు పరిమాణాన్ని సంతరించుకునే వరకు ఇవి నొప్పిని కలిగించవు. ఒకవేళ ఇవి గర్భాశయం లోపలికి పెరుగుతుంటే మాత్రం బహిష్టు స్రావాన్ని అడ్డుకుని నొప్పిని కలిగిస్తాయి. గట్టి 'నార' లాంటి పదార్థంతో తయాతవుతాయి కనుక వీటిని వైద్య పరిభాషలో 'ఫైబ్రాయిడ్స్' అంటారు.

గర్భధారణ వయసు వచ్చిన మహిళలు 25 శాతం మందిలో ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. బహిష్టులు మొదలుకాని ఆడపిల్లల్లో ఇవి అసలు కనిపించవు. అలాగే, బహిష్టులు ఆగిపోయినవారిలో కూడా కుంచించుకుపోయి కనపడకుండా పోతాయి. ఈస్ట్రోజన్ హార్మోన్ కూ ఫైబ్రాయిడ్స్ కూ సంబంధం వుంది; గర్భధారణ వంటి ఈస్ట్రోజన్ పెరిగే సందర్భాలన్నిటిలోనూ ఫైబ్రాయిడ్స్ పెరుగుతాయి.

బహిష్టు స్రావం అత్యధిక మొత్తాల్లో కావడం ఫైబ్రాయిడ్స్ ప్రధాన లక్షణం. ఈ సమస్య ఉన్న వారికి కటివలయం మొత్తం అసౌకర్యంగా, ఒత్తిడిగా, నొప్పిగా అనిపిస్తుంది. ఫైబ్రాయిడ్స్ చుట్టుపక్కల నిర్మాణాల మీద ఒత్తిడిని ప్రదర్శించడం వల్ల మలబద్దకమే కాకుండా మూత్రవిసర్జన తరచుగా చేయాల్సి వస్తుంది. నరాల మీద ఒత్తిడి పడటం వల్ల తొడల్లోనూ, నడుములోనూ నొప్పిగా అనిపించవచ్చు. కంతులు బాగా పెరిగి గర్భంలో పెరుగుతున్న శిశువు మీద ఒత్తిడిని కలిగించి అబార్షన్ కి దారితీయవచ్చు. ఆయుర్వేదంలో ఫైబ్రాయిడ్స్ కు సంబంధించిన అంశాలు అర్తవాతివృద్ధి (హైపర్ ఈస్ట్రోజినీమియా), మాంసార్భుదం (ఫైబ్రోమైయోమా)అనే వ్యాధుల వివరణల్లో లభిస్తాయి. ఈ వ్యాధితో బాధపడుతున్న వారికీ సూచనలు ఉపకరిస్తాయి:

సూచనలు: ఆహారంలో పండ్లు, ఆకుకూరలు, గింజధాన్యాలు ఉండేలాగా చూసుకోవాలి. సోయాతో తయారైన ఆహారపదార్థాలనూ, దానిమ్మనూ ఎక్కువగా తీసుకోవాలి. వీటిల్లో ఐసోఫ్లావన్స్ ఉంటాయి. ఇది అధిక ఈస్ట్రోజన్ని తగ్గిస్తాయి. జంతు మాంసాన్ని, కొవ్వునూ, పంచదారను, కెఫిన్ కలిగిన పదార్థాలనూ తగ్గించాలి.

రసాయన ఎరువులతోనూ, క్రిమిసంహారక మందులతోనూ పెరిగిన కూరగాయలను తినకూడదు. విటమిన్ - ఇ, విటమిన్ - సి లను నేరుగానో, ఆహారం రూపంలోనో తీసుకుంటే హార్మోన్స్ విడుదల సక్రమంగా జరిగి ఫైబ్రాయిడ్స్ కుంచించుకుపోతాయి.

ఈవెనింగ్ ప్రైమ్ రోస్ ఆయిల్ ను ఈ సందర్భంగా ప్రత్యేకించి పేర్కొనాలి. ఇది బయట మార్కెట్ లో ప్రైమోసా వంటి పేర్లతో క్యాప్సుల్స్ రూపంలో లభిస్తోంది. దీనిని వైద్య సలహా మేరకు వాడుకోవచ్చు.

ఔషధాలు: త్రిఫలాగుగ్గులు, లోధ్రాసవం, ప్రదరరిపు రసం, నిత్యానంద రసం.

6. గర్భాశయంలో తిత్తి వంటి నిర్మాణాలు పెరగటం (పాలిప్స్):

గర్భాశయంలో పాలిప్ లు పెరిగినప్పుడు సాధారణంగా బహిష్టు నొప్పి వస్తుంది. దీనికి 'అర్భుదహర' చికిత్సలు అవసరమవుతాయి. ఔషధాలు: నిత్యానంద రసం, సప్తవింశతిగుగ్గులు, కాంకాయనవటి (గుల్మ), పీయూషవల్లీ రసం.

7. గర్భాశయ ద్వారం ఇరుకుగా మారటం:

గర్భాశయపు ద్వారం (సెర్విక్స్) ఇన్ఫెక్షన్ చేత 'ఇరుకుగా; మారినప్పుడు లోపలి బహిష్టు స్రావం లోపలే సంచితమై అసౌకర్యాన్నీ, నొప్పినీ కలిగిస్తుంది.

ఔషధాలు: గంధక రసాయనం, త్రిఫలా గుగ్గులు, పునర్నవాది గుగ్గులు.

8. కటివలయంలో వాపు (పెల్విక్ ఇన్ పఫ్లమేటరీ డిసీజ్):

గర్భాశయం, దాని ముఖద్వారం, ట్యూబులూ వీటిలో దేనికి ఇన్ఫెక్షన్ సోకినా, లోపల వాపు, నొప్పి, అసౌకర్యం మొదలైన లక్షణాలు మొదలవుతాయి. దీనిని 'పెల్విక్ ఇన్ ఫ్లమేటరీ డిసీజ్; అంటారు. ఈ వ్యాధిలో నెలసరిలో హెచ్చుతగ్గులతోపాటు బహిష్టు నొప్పి కూడా చోటు చేసుకుంటుంది. దీనికి కూడా దీర్ఘకాలం పాటు కీటాణు నాశక ఔషధాలను వాడాల్సి ఉంటుంది.


గృహచికిత్సలు: 1. వస చూర్ణాన్ని పూటకు ఒక గ్రాము మోతాదుగా మూడుపూటలా తేనెతో తీసుకోవాలి. 2. అత్తిచెట్టు పట్టనుకాని, దానిమ్మ చెట్టు వేరు బెరడునుగాని, కషాయం కాచి యోనిని శుభ్రం చేసుకోవాలి. దీనిని 'డూష్' అంటారు. 3. తులసి ఆకులను, వేపాకులను వెడల్పాటి గంగాళంలో మరిగించాలి. ఈ నీళ్ళతో కాళ్ళు బైటపెట్టి బొడ్డుమునిగేలా ఇరవై నిముషాలు కూర్చోవాలి. ఇలా రోజుకు మూడు సార్లు వారంరోజుల పాటు చేయాలి. 4. త్రిఫలా చూర్ణం (ఒకచెంచా), గుడూచి సత్వం (అరచెంచా) రెండూ కలిపి తగినంత నెయ్యిని, తేనెను కలిపి ఆహారానికి ముందు రోజుకు మూడుసార్లు చొప్పున కనీసం రెండు నెలల పాటు పుచ్చుకోవాలి. 5. ఉలవల కషాయం (అరకప్పు) రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 6. చింతగింజ పిక్కలను పొడిచేసి అరచెందాడు మోతాదుగా పాలతో రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 7. బ్రహ్మమేడి పండ్లను ఎండించి, పొడిచేసి అరచెందాడు మోతాదుగా పాలతో రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 8. నేల ఉసిరిక వేరును బియ్యం కడుగు నీళ్ళతో సహా ముద్దుగా నూరి అరచెంచాడు మోతాదుగా రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 9. అరె పువ్వులను దంచి, కషాయం కాచి అరకప్పు మోతాదుగా రోజుకు మూడుసార్లు పుచ్చుకోవాలి. 10. పటికను పొంగించి పొడిచేసి పూటకు అరచెంచాడు మోతాదుగ అరటిపండు మధ్యలో పెట్టి రండుపూటలా తీసుకోవాలి.

ఔషధాలు: ఆరోగ్య వర్ధినీవటి, కైశోరగుగ్గులు, రసమాణిక్యం, పుష్యానుగ చూర్ణం, కర్పూర శిలాజిత్తు, చంద్రప్రభావటి, అశోకారిష్టం, లోద్రాసవం, పత్రంగాసవం.

బాహ్యప్రయోగాలు - జాత్యాదితైలం, మహామరీచ్యాదితైలం, మహానారాయణతైలం.