అధిక రుతుస్రావం:

 

1. మీరు మానసిక ఒత్తిడికి గురవుతున్నారా?

మానసిక ఆందోళన

2. మీ పొత్తికడుపు ప్రాంతంలో కదుములను, వాపునూ గుర్తించారా? ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయాల్సి వస్తుందా?

గర్భాశయంలో నారవంటి కండర పెరుగుదలలు తయారవ్వటం (ఫైబ్రాయిడ్స్)

3. మీకు ఇటీవల గర్భాశయాంతర్గత కుటుంబ నియంత్రణ సాధనాన్ని అమర్చారా?

కుటుంబ నియంత్రణా సాధనం వల్ల దుష్ఫలితాలు

4. స్పష్టమైన కారణమేదీ లేకుండానే బరువు పెరుగుతున్నారా?

థైరాయిడ్ సమస్యలు

5. గర్భధారణ చిహ్నాలు కనిపించిన తరువాత, అధిక రక్తస్రావమవుతుందా?

గర్భపాతం (అబార్షన్)

6. మీకు నడుము నొప్పితోపాటు భర్తతో కలిసినప్పుడు నొప్పిగా ఉంటుందా?

గర్భాశయపు లోపలిపొర ఉదరంలో ఇతర భాగాల్లో పెరగటం (ఎండో మెట్రోయోసిస్)

7. బహిష్టు స్రావం నెలనెలా కాకుండా పొద్దస్తమానం కొద్ది మొత్తాలలో కనిపిస్తూనే ఉంటుందా?

గర్భాశయంలో తిత్తి వంటి నిర్మాణాలు పెరగటం (పాలిప్స్)

8. నెలసరి ఆగిపోయిన అనంతరం - ఒకటి రెండు సంవత్సరాల తరువాత -తిరిగి హఠాత్తుగా బ్లీడింగ్ కనిపించిందా?

గర్భాశయం లోపలి పొరకు క్యాన్సర్ సోకటం (ఎండోమెట్రియల్ క్యాన్సర్)

9. మీకు దీర్ఘకాలిక బహిష్టు స్రావంతో పాటు కడుపునొప్పి, జ్వరం వంటి లక్షణాలున్నాయా?

కటివలయంలో వాపు (పెల్విక్ ఇన్ ఫ్లమేటరీ డిసీజ్)

10. రక్తం గడ్డకట్టకుండా ఉండటానికి మందులు వాడుతున్నారా?

రక్తపు గడ్డలను నిరోధించే మందుల వల్ల దుష్ఫలితాలు

బహిష్టు స్రావం అధిక మొత్తాల్లో అవుతున్నప్పుడు దానిని ఆయుర్వేదం 'రక్తప్రదర వ్యాధి' గా పేర్కొంది. ఇది ప్రధానంగా పిత్తదోషం ప్రకోపించడం వలన ఉత్పన్నమవుతుంది. హార్మోన్ల తేడాలు అధిక రుతు'స్రావాన్ని కలిగిస్తే ఈ తేడాలనేవి తిరిగి పిత్తదోష వికృతి వలన సంభవిస్తాయి.

రుతుక్రమం ప్రారంభదశలో ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ గర్భాశయపు లోపలి పొరను దళసరిగా చేస్తుంది. ఒకవేళ ముందుముందు గర్భధారణ జరిగితే ఈ ఏర్పాటు గర్భానికి ఉపకరిస్తుంది. రుతుక్రమం మధ్యలో (ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మళ్లీ బహిష్టు స్రావం కనిపించడానికి 14 రోజుల ముందు) గర్భాశయానికి ఇరుప్రక్కల ఉండే అండాశయాలలో ఒకదాని నుంచి అండం విడుదల అవుతుంది.

ఇదే సమయలో ప్రొజెస్టరాన్ అనే మరొక స్త్రీ - సెక్స్ హార్మోన్ కూడా తారస్థాయికి చేరుకుంటుంది. అండం ఒకవేళ ఫలదీకరణం చెందితే ఈ హార్మోన్ వలన గర్భాశయపు పొర మరింత దళసరిగా తయారై, పిండానికి మెత్తని రక్షణ కవచంగా ఉపయోగపడుతుంది. ఒకవేళ అండం ఫలవంతం కాకపొతే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ లు తగ్గిపోయి, గర్భాశయపు లోపలి పొర కరిగి 'బహిష్టు స్రావం'గా గర్భాశయపు కండరాల సంకోచంతో బయటకు వచ్చేస్తుంది. ప్రతి నెలా ఇలా వెలుపలికి వచ్చే బహిష్టు స్రావపు మోతాదు ఆరోగ్యవంతులలో సుమారు 30 మిల్లీలీటర్ల వరకు ఉంటుంది. దీనికి మించి ఉంటే దానికి రక్త ప్రదరం అంటారు.

ఇతరత్రా ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కొందరిలో బహిష్టురక్తం కొంతఎక్కువ పరిమాణంలో వెళుతుంటుంది. ఇటువంటి సమయాలలో నీరసం, నిస్సత్తువ, కాళ్లు చేతులు లాగుతున్నట్లుఅనిపించడం, చిన్న పనికే ఆయాసం రావడం జరుగుతుంది. ఇతర లక్షణాలేవి ఉండనందున దీనిని సహజమైన స్థితిగానే భావించాలి. దీనికి కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇలా కాకుండా అధిక బహిష్టుస్రావం కొన్ని సార్లు ఇతర కారణాలకు అనుబంధ లక్షణంగా కూడా ఉంటుంది. ఈ కింది స్థితిగతులు రక్తప్రదర వ్యాధికి దోహదపడతాయి.

1. మానసిక ఆందోళన:

ఒత్తిడి కలిగించే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. ఒత్తిడి అనేది మెదడు అడుగుభాగంలో ఉండే హైపోథాలమస్, పిట్యూటరీ గ్రంథులపై అదనపు భారాన్ని మోపి వాటిని కల్లోల పరుస్తుంది. దీనితో స్త్రీ - సెక్స్ హార్మోన్ల విడుదల పైన ప్రభావం పడుతుంది. పర్యవసానంగా అధిక రుతుస్రావం కనిపిస్తుంది. అందుకే, మానసిక ఒత్తిడిని దూరం చేసుకొని అనుక్షణం ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి.

ఔషధాలు: నార సింహ ఘృతం, బ్రాహ్మీ ఘృతం, గోరోచనాది గుటిక, కళ్యాణక ఘృతం, క్షీరబలా తైలం, అశ్వగంధారిష్టం, సర్పగంధా చూర్ణం, స్వర్ణముక్తాది గుటిక, యాకూతీ రసాయనం.

బాహ్యప్రయోగం- బ్రాహ్మీ తైలం.

2. గర్భాశయంలో నారవంటి కండర పెరుగుదలలు తయారవ్వటం (ఫైబ్రాయిడ్స్):

గర్భాశయపు గోడలకు ఫైభ్రాయిడ్స్ పెరిగినప్పుడు వెలుపల నుంచి తడిమి చూస్తే కదుములుగా తగిలే అవకాశ ముంది. ఇవి మూత్రాశయం మీద ఒత్తిడిని కలిగించి బహు మూత్రత్వానికి కారణమవుతాయి. ఒకవేళ ఇవి చిన్న ఆకారంలో ఉంటే అప్పుడు కేవలం రక్తస్రావం మాత్రమే కనిపిస్తుంది. రుతుస్రావం అధిక మొత్తాలలో అవుతున్న వారిలో ముందస్తుగా ఫైభ్రాయిడ్స్ గురించి ఆలోచించాలి. ఒకోసారి గర్భాశయంలో కాకుండా, అండాశయంలో ఏర్పడిన ట్యూమర్ల వలన కూడా రక్తస్రావం కనిపిస్తుంది. అల్ట్రాసౌండ్ స్కాన్ తోనూ, లోపలి పరీక్షలతోనూ వీటిని కనిపెట్టవచ్చు. ఫైభ్రాయిడ్స్ కరిగించడానికి లేఖన ప్రధానమైన ఔషధాలను వాడాలి.

ఔషధాలు: త్రిఫలా గుగ్గులు, లోద్రాసవం, ప్రదరరిపు రసం, నిత్యానంద రసం.

3. కుటుంబ నియంత్రణా సాధనం వల్ల దుష్ఫలితాలు:

ఐ.యు.సి.డీ. లు (ఇంట్రాయుటిరైన్ కాంట్రాసెప్టివ్ డివైస్ లు) కొంతమందిలో గర్భాశయాన్ని అస్థిరం చేసి రక్తస్రావమయేలా చేస్తాయి. కుటుంబ నియంత్రణ సాధనాన్ని అమర్చిన మూడు నెలల తరువాత కూడా ఇంకా రుతురక్తం కనిపిస్తుంటే ఆ సాధనాన్ని తీసివేయించుకుని మరొక కుటుంబ నియంత్రణ పద్ధతిని అవలంభించడం మంచిది.

4. థైరాయిడ్ సమస్యలు:

కొన్ని సందర్భాల్లో థైరాయిడ్ సంబంధ కారణాలు కూడా అధిక రక్తస్రావానికి హేతువులవుతాయి. ఇది తెలుసుకోవాలంటే థైరాయిడ్ ఫంక్షన్ పరీక్షలను చేయించుకోవాల్సి ఉంటుంది.

5. గర్భపాతం (అబార్షన్):

గర్భధారణ సమయంలో సర్వసాధారణంగా బహిష్టు రక్తం కనిపించదు. అలా కాకుండా గర్భధారణ హఠాత్తుగా అధిక రక్తస్రావమవుతుంటే అది అబార్షన్ కి, లేదా అబార్షన్ జరుగబోతుందనడానికి సంకేతం లేదా గర్భాశయేతర గర్భం (గర్భాశయంలో కాకుండా ట్యూబ్స్ లో జరిగే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ) విచ్ఛిన్నానికి నిదర్శనం. సమస్య ప్రమాదకర స్థాయిలో ఉన్నదీ లేనిదీ చూసుకుని భవిష్యత్తులో గర్భం కొనసాగటం కోసం గాని లేదా గర్భాన్ని పూర్తిగా నిర్హరించడానికి గాని చికిత్స / చర్యలు తీసుకోవాలి.

గృహచికిత్సలు: (అబార్షన్ జరగటానికి) 1. ఆముదం కాండం, అతిథేయి వేళ్లు వీటికి (100 గ్రా.) పిప్పళ్ళను (పది) చేర్చి ముద్దచేయాలి. దీనిని శెనగగింజంత ప్రమాణంలో మాత్రలు చుట్టి నిల్వ చేసుకోవాలి. వీటిని పూటకు రెండు మాత్రలు చొప్పున ఉదయం, రాత్రి వేళల్లో అయిదారు రోజులపాటు తీసుకోవాలి. ఈ గృహచికిత్స గర్భం ధరించిన మొదటు మూడు నెలల్లో బాగా పనిచేస్తుంది. 2. గచ్చకాయలను (100 గ్రా.) నువ్వులనూనెతో సహా నూరి, ముద్దచేసి గర్భం ధరించిన మొదటి మూడు నెలల్లో తీసుకుంటే అబార్షన్ అవుతుంది. 3. చిరబిల్వ (సవిలి) వేళ్లను, చిత్రమూలం వేళ్లను సమానభాగాలు తీసుకుని మెత్తగా దంచి రసం పిండాలి. దీనిని పూటకు మూడు చెంచాలు చొప్పున మూడుపూటలా వారం రోజులపాటు తీసుకోవాలి. 4. సీతాఫలం వేరును ముద్దగా నూరి నీళ్ళతో ఉదయం ఖాళీ కడుపునా వారం రోజులపాటు గర్భం ధరించిన మూడు నెలలలోపు పుచ్చుకుంటే అబార్షన్ అవుతుంది.

ఔషధాలు: (గర్భం నిలవటానికి) కుహరవపిష్టి, గర్భపాల రసం, గర్భచింతామణి రసం, ముక్తాపిష్టి, లోహభస్మం, ప్రవాళపిష్టి, త్రివంగ భస్మం, వంగ భస్మం.

6. గర్భాశయపు లోపలిపొర ఉదరంలో ఇతర భాగాల్లో పెరగటం (ఎండో మెట్రియోసిస్):

నడుమునొప్పి, భర్తతో కలిసినప్పుడు నొప్పి రావడం వంటి లక్షణాలతో పాటు మూత్రవిసర్జన ఎక్కువసార్లు చేయాల్సి రావడం, వంధత్వం వంటివి ఉంటే అది ఎండోమెట్రియోసిస్ ను సూచిస్తుంది. ఈ వ్యాధిలో గర్భాశయం లోపల పొరలోని కొన్ని కణజాలాలు స్వస్థానం నుంచి తప్పించుకుని ఉదరకోశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లి, అక్కడ నుంచి మాసానుమాసం బహిష్టు రక్తాన్ని స్రవిస్తూ ఉంటాయి.

సూచనలు: ఈ స్థితిలో పంచవల్కలాలతోనూ, ఫలఘృతంతోనూ, చేసే 'ఉత్తర వస్తి' అనే ప్రత్యేక ఆయుర్వేద చికిత్స మంచి ఫలితాన్నిస్తుంది. (నిర్దేశిత ఔషధాలను యోని లోపలకు డూష్ లోలాగా పంపించే చికిత్సా ప్రక్రియకు ఉత్తర వస్తి అని పేరు.)

ఔషధాలు: అశోకారిష్టం, పుష్యానుగచూర్ణం, చంద్రకళారసం.

7. గర్భాశయంలో తిత్తి వంటి నిర్మాణాలు పెరగటం (పాలిప్స్):

గర్భాశయం లోపల పొరలలోగాని, గర్భాశయపు ముఖం వద్దకాని పాలిప్స్ పెరిగితే బహిష్టుస్రావం నెలనెలా కాకుండా తరుచుగా కొద్ది మొత్తాల్లో కనిపిస్తుంది. (శరీరాంతర్గత ఖాళీ ప్రదేశాలలోనకి చొచ్చుకు వెళ్లే కండర నిర్మిత పెరుగుదలలకు పాలిప్స్ అని పేరు.) వీటి వలన గర్భాశయం లోపలి పొర చెదిరి రక్తస్రావమతుంది.

ఔషధాలు: సప్తవింశతి గుగ్గులు, నిత్యానందరసం, చంద్రప్రభావటి.

8. గర్భాశయం లోపలి పొరకు క్యాన్సర్ సోకటం (ఎండోమెట్రియల్ క్యాన్సర్):

బహిష్టులాగిపోయిన కొంతకాలానికి తిరిగి బహిష్టు రక్తం కనిపిస్తే ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు; గర్భాశయ క్యాన్సర్ కు చెందిన అనుమానాన్ని ముందుగా నివృత్తి చేసుకోవాలి. ఔషధాలు:వజ్రభస్మం, కాంచనారగుగ్గులు, లక్ష్మీవిలాసరసం (నారదీయ), భల్లాతకవటి, చిత్రకాదివటి, క్రౌంచపాకం.

9. కటివలయంలో వాపు (పెల్విక్ ఇన్ ఫ్లమేటరీ డిసీజ్):

బహిష్టు స్రావం, కడుపు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు గర్భాశయం, ఫెల్లోపియన్ ట్యూబ్స్ మొదలైన వాటికి సోకినా ఇన్ ఫ్లమేషన్ ను సూచిస్తాయి. దీనికి వైద్యుడిని సంప్రదించి పీయూషవల్లి రసం అనే మందును తీసుకోవాలి.

గృహచికిత్సలు: 1. వన చూర్ణాన్ని పూటకు ఒక గ్రాము మోతాదుగా మూడుపూటలా తేనెతో తీసుకోవాలి. 2. అత్తిచెట్టు పట్టనుగాని, దానిమ్మ చేటు వేరు బెరడు కాని, కషాయం కాచి యోనిని శుభ్రం చేసుకోవాలి. దీనిని 'దూష్' అంటారు. 3. తులసి ఆకులను, వేపాకులను వెడల్పాటి గంగాళంలో మరిగించాలి, ఈ నీళ్ళతో కాళ్ళు బైట పెట్టి బొడ్డుమునిగేలా ఇరవై నిమిషాలు కూర్చోవాలి. ఇలా రోజుకు మూడు సార్లు వారంరోజులపాటు చేయాలి. 4. త్రిఫలాచూర్ణం (ఒక చెంచా), గుడూచిసత్వం (అరచెంచా) రెండూ కలిపి తగినంత నెయ్యిని, తేనెను కలిపి ఆహారానికి ముందు రోజుకు మూడుసార్లు చొప్పున కనీసం రెండు నెలల పాటు పుచ్చుకోవాలి. 5. ఉలవల కషాయం (అరకప్పు) రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 6. చింతగింజ పిక్కలను పొడిచేసి అరచెంచాడు మోతాదుగా పాలతో రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 7. బ్రహ్మమేడి పండ్లను ఎండించి, పొడిచేసి అరచెంచాడు మోతాదుగా పంచదార, తేనెలు కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 8. నేల ఉసిరిక వేరును బియ్యం కడుగు నీళ్ళతో సహా ముద్దాగా నూరి అరచెంచాడు రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 9. అరెపువ్వులను దంచి, కషాయం కాచి అరకప్పు మోతాదుగా రోజుకు మూడుసార్లు పుచ్చుకోవాలి. 10. పటికను పొంగించి పొడిచేసి పూటకు అరచెంచాడు మోతాదుగ అరటిపండు మధ్యలో పెట్టి రెండుపూటలా తీసుకోవాలి

ఔషధాలు: ఆరోగ్యవర్ధినీవటి, కైశోరగుగ్గులు, రసమాణిక్యం, పుష్యానుగ చూర్ణం, కర్పూర శిలాజిత్తు, చంద్రప్రభావటి, అశోకారిష్టం, లోద్రాసవం, పత్రంగాసవం.

బాహ్యప్రయోగాలు - జాత్యాదితైలం, మహామరిచ్యాదితైలం, మహానారాయణ తైలం.

10. రక్తపు గడ్డలను నిరోధించే మందుల వల్ల దుష్ఫలితాలు:

పక్షవాతం ఒకసారి వచ్చిన వారు మళ్లీ రాకుండా ఉండటానికి, రక్తం గడ్డ కట్టకుండా నిరోధించే మందులను వాడుతుంటారు. వీటి వలన బహిష్టుస్రావం అధికంగా జరిగేందుకు అవకాశముంది, ఇలా జరిగితే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.

సలహాలు:

1. అధిక రుతుస్రావంలో అశోకారిష్టం, లోధ్రాసవం, ప్రవాళ భస్మం, ముక్తాపిష్టి వంటివి మంచి ఫలితాలను ఇస్తాయి. వీటిని సరైన వైద్య సలహాతో ఆయా స్థితిగతులకు అనుగుణంగా వాడుకోవచ్చు.

2. ఆహారంలో కారం, పులుపు, మసాలాలను బాగా తగ్గించుకోవాలి. అసలు వాడకపోతే ఇంకా మంచిది.

3. అరటి, దానిమ్మ, ఉసిరి వంటి పండ్లు ఈ స్థితిలో హితవు చేస్తాయి. అలాగే నెయ్యి కందిపప్పు, పాలు, పాత బియ్యం మొదలైన వాటిని నిర్భయంగా తీసుకోవచ్చు.

4. ఎండలో తిరగటం, ప్రయాణాలు చేయడం, శారీరకంగా, మానసికంగా శ్రమించడం పనికిరాదు.

5. పడుకునేటప్పుడు మంచాన్ని కాళ్లవైపు కొంచెం ఎత్తుగా అమర్చుకోవాలి.

6. బహిష్టు స్రావమనేది నెలనెలా జరిగే సహజమైన చర్య. సాధారణారోగ్యాన్ని మెరుగు పరచుకోవడం, వ్యక్తిగత స్వాస్థ్యాన్ని కాపాడుకోవడం, పోషకాహారాని తీసుకోవడాలు చేస్తే అధిక రుతుస్రావ సమస్య విసిగించదు.

గృహచికిత్సలు: 1. అశోకచెట్టు పట్ట చూర్ణాన్ని (అరచెంచా) గ్లాసు పాలలో కలిపి రోజుకు రెండుసార్లు తాగాలి. 2. అతిమధురం (యష్టిమధు) చూర్ణాన్ని (అరచెంచా) పంచదారతో కలిపి రోజుకు మూడుసార్లు తీసుకోవాలి. 3. తుత్తురు బెండ వేరు చూర్ణాన్ని (అరచెంచాడు) పాలతో కలిపి రోజులు రెండుసార్లు తీసుకోవాలి. 4. కొడెశపాల గింజల చూర్ణాన్ని పూటకు అరచెంచాడు మోతాదుగా రెండు చెంచాల చక్కరతో కలిపి రోజుకు రెండుసార్లు చన్నీళ్ళతో తీసుకోవాలి. 5. దానిమ్మ ఆకులు (ఏడు) బియ్యం గింజలు (ఏడు) రెండూ కలిపి నూరి రోజుకు రెండుసార్లు పుచ్చుకోవాలి. 6. నేల ఉసిరిక వేరు చూర్ణాన్ని (చెంచాడు) బియ్యం కడుగునీళ్ళతో (గ్లాసు) కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 7. అడ్డరసము ఆకుల రసాన్ని (అరకప్పు) పంచదార చేర్చి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి.

ఔషధాలు: చంద్రకళారసం, అశోకారిష్టం, లోధ్రాసవం, ప్రవాళపంచామృతం, బొలబద్ధరసం, ప్రదరాంతకరసం, నాగకేశచూర్ణం ఇవన్నీ అధిక రుతుస్రావం ఆపటానికి ఉపయోగపడే ఆయుర్వేద ఔషధాలు. వీటిని వైద్యసలహామేరకు వాడుకోవాలి.