టైప్ 1 లేదా టైప్ 2 డయాబెటిస్.. ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రమాదం.!

మధుమేహం అనేది వేగంగా పెరుగుతున్న ఒక వ్యాధి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, భారతదేశంలో మధుమేహ రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ వ్యాధి బారిన 10 కోట్లకు పైగా యువకులు ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. ఒక్కసారి మధుమేహం వచ్చిందంటే.. దాన్ని నయం చేయలేము. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే తప్ప దాన్ని నియంత్రణలో ఉంచుకోలేం. మధుమేహంలో రెండు రకాలు ఉన్నాయి. టైప్ 1 , టైప్ 2 గా మధుమేహాన్ని పరిగణిస్తారు. అయితే వీటిలో ఏ రకం ఎక్కువ ప్రమాదకరం.. దీని గురించి వివరంగా తెలుసుకుంటే..
టైప్ 1 మరియు టైప్ 2 డయాబెటిస్ మధ్య తేడా..
టైప్ 1 డయాబెటిస్..
టైప్ 1 డయాబెటిస్‌లో, క్లోమం ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయడం పూర్తిగా ఆపేస్తుంది, దీనివల్ల రోగి ప్రతిరోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవలసి వస్తుంది.
టైప్ 2 డయాబెటిస్..
టైప్ 2 డయాబెటిస్‌లో, శరీరం ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది, కానీ ఆ ఇన్సులిన్ సరిగ్గా ఉపయోగపడదు. ఈ పరిస్థితిని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. దీర్ఘకాలం పాటు ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది.
ఏది ఎక్కువ ప్రమాదకరమైనది?
రక్తంలో చక్కెర స్థాయిలను ఎక్కువ కాలం నియంత్రించకపోతే మధుమేహం ప్రమాదకరంగా మారుతుంది. ఈ నియంత్రణ లేకపోవడం వల్ల కళ్ళు, మూత్రపిండాలు, గుండె, మెదడు , ఇతర అవయవాలకు గణనీయమైన నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది.
టైప్ 1 డయాబెటిస్‌లో, ఇన్సులిన్ తీసుకోకపోవడం వల్ల డయాబెటిక్ కీటోయాసిడోసిస్ అనే తీవ్రమైన పరిస్థితి వచ్చే ప్రమాదం పెరుగుతుంది, ఇది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది.
టైప్ 2 మధుమేహం సంవత్సరాల తరబడి ఎలాంటి లక్షణాలు లేకుండా ఉండవచ్చు. మూత్రపిండాలు, కళ్ళు, గుండె లేదా నరాలు వంటి ఇతర అవయవాలపై మధుమేహం ప్రభావం చూపినప్పుడు చాలా మందికి టైప్ 2 డయాబెటిస్ బయటపడుతుంది.
టైప్ 2 మధుమేహం నియంత్రణ..
వైద్యుల ప్రకారం, టైప్ 2 మధుమేహాన్ని నియంత్రించడం వల్ల దాని ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
ప్రతిరోజూ వ్యాయామం చేయాలి, బరువును అదుపులో ఉంచుకోవాలి, సమతుల్య ఆహారం తీసుకోవాలి,
తగినంత నిద్రపోవాలి, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి.
టైప్ 1 డయాబెటిస్‌ను నియంత్రణ..
జీవనశైలి మార్పుల ద్వారా టైప్ 1 మధుమేహాన్ని నియంత్రించలేము. టైప్ 1 మధుమేహానికి ఇన్సులిన్ ఇంజెక్షన్లు తప్పనిసరిగా తీసుకోవాలి.
*రూపశ్రీ.




