చలికాలంలో నీటికి దూరంగా ఉంటారు చాలామంది. నీరు తాగాలన్నా బద్ధకమే. చాలామంది వేడిగా కాఫీలు, టీలు తాగుతూ గడిపేస్తారు. కానీ శరీరానికి తగినంత నీరు కచ్చితంగా అవసరం. 


ఆరోగ్యంగా ఉండటానికి నీటి అవసరం చాలావుంది. అయితే నీటి అవసరాన్ని, ఉపయోగాన్ని గుర్తించక చాలామంది నిర్లక్ష్యంతో అనారోగ్యానికి గురి అవుతున్నారు. శరీర నిర్మాణంలో 60 నుండి 70 శాతం నీటితో కూడి వుంది. కండరాలలో కూడా 70 శాతం నీరు వుంటుంది. గట్టిగా ధృడంగా ఉండే ఎముకలలో కూడా మూడవవంతు నీరు ఉంటుంది. రక్తంలో కూడా ఎక్కువశాతం నీరు  వుంటుంది. ముఖ్యంగా మెదడు కణాలలో 70 శాతం వరకూ నీరు ఉంటుంది. మానవ శరీరానికి మన ఊహకు మించిన ప్రాధాన్యత నీటికి ఉంది. సరిపడినంత నీరు  ఉండకుండా లోపిస్తే శరీరంలో అనేక మార్పులు కలుగుతాయి. ఏ వైద్యుని సలహా అడిగిన నీరు బాగా త్రాగటం చాలా అవసరమనే విషయాన్ని చెప్తారు.


ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే రెండు గ్లాసులు వెచ్చటి నీరు త్రాగడం అలవాటు చేసుకుంటే మలవిసర్జనకు ఎంతగానో దోహదం చేస్తుంది. ఎన్నో మందులకన్నా ఈ పద్ధతి చాలా చక్కగా పని చేస్తుంది. వెచ్చటి నీరు అలవాటులేనివారు, క్రమబద్ధంగా రోజుకు కొంచెము కొంచెముగా అలవాటు చేసుకుంటూ రెండు గ్లాసులు త్రాగ గలిగేంతవరకూ అలవాటు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.


రాత్రి అలాగే ఉంచిన  నీరు రెండు గ్లాసులు ఉదయాన్నే త్రాగితే వాత, పిత్త, కఫరోగములు నశిస్తాయి. రాత్రి పడుకునేముందు రెండు గ్లాసులు నీరు త్రాగితే ఉదర రోగములు, ఆర్మమొలలు, వాపులు, నేత్ర వ్యాధులు తగ్గిపోతాయి. . 


ప్రతిఒక్కరూ నీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అవసరము. అవి ఏంటంటే… 


ప్రతి ఉదయం నిద్ర లేవగానే రెండు గ్లాసులు నీరు త్రాగడం మంచిది. ఉదయం అల్పాహారానికి, మధ్యాహ్నం భోజనానికి మధ్యలో రెండు గ్లాసులు త్రాగాలి. భోజనం చేస్తున్న సమయంలో మధ్యలో ఎక్కువగా నీరు త్రాగకూడదు. మధ్యాహ్న భోజనానికి, రాత్రి భోజనానికి మధ్య సమయంలో రెండు గ్లాసుల నీరు త్రాగడం అవసరం. నిద్రపోయేముందు మళ్ళీ రెండు గ్లాసుల నీరు త్రాగడం మంచిది. ఇలా ప్రతిరోజు 8 గ్లాసుల నీరు తీసుకోవడంవల్ల శరీర క్రమంలో మార్పులు కలుగకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.


నీటి ద్వారా సామాన్య వ్యాధుల నివారణ ఎలా సాధ్యమంటే… 


జలుబు, దగ్గు, ఉబ్బసం వ్యాధులకు కాచిన నీరు ఎక్కువగా త్రాగడం, ఆవిరిపీల్చడం వలన రిలీఫ్ చేకూరుతుంది.


బెణుకులు, వాపులకు, వేడినీటి కాపడం పెట్టడం వలన తగ్గుతాయి. ముక్కులు బిగిసినప్పుడు ఉప్పునీటిని ముక్కుతో పీల్చాలి.


గొంతు నొప్పికి, వేడినీటిలో ఉప్పుకలిపి గొంతులో పోసుకుని పుక్కిలించడం వలన బాధ తగ్గుతుంది. మలబద్ధకంతో బాధపడేవారు పడుకునే ముందు, ఉదయం లేవగానే నీరు తాగితే సమస్య తగ్గుతుంది.


దురదలు, మంటలు ఏర్పడినప్పుడు చన్నీటి కాపడం పెడితే ఉపశమనం కలుగుతుంది.


కాచిన నీరు తాగుతూ, శరీర అవయవాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా  అంటువ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు.


జ్వర తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు చల్లని నీటిలో శుభ్రమైన గుడ్డను తడిపి నుదుటిమీద వుంచితే తీవ్రత తగ్గుతుంది.


ఇలా  నీటితో లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి నీటికి దూరం  ఉండకండి.


                                      ◆నిశ్శబ్ద.